ఒత్తిళ్ళకి లొంగద్దు.. ప్రొటోకాల్ ను విస్మరించొద్దు : రఘురామ
posted on Jul 1, 2022 @ 4:03PM
రఘురామకృష్ణం రాజు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. పేరుకు వైసీపీ ఎంపీయే అయినా నిత్యం సొంత పార్టీపై, ఆ పార్టీ అధినేతపై విమర్శలతో చెలరేగుతుంటారు. రచ్చబండలో తమ పార్టీ, ప్రభుత్వ తప్పిదాలను ఎండగడుతుంటారు. అలా అని పార్టీ నుంచి ఆయనను బహిష్కరించే ధైర్యం, సాహసం జగన్ చేయడం లేదు. అలాగనీ మనవాడే కదా.. ఏదో మాట్లాడుతున్నారు పోనీలే అని వదిలేయడమూ లేదు.
ఆయనపై అనర్హత వేటు వేయాలని లోక్ సభ స్పీకర్ ను చెవినిల్లు కట్టుకుని మరీ కోరుతున్నారు. అయితే ముఖ్యమంత్రిని విమర్శించడం, సొంత పార్టీ విధానాలలో తప్పులను ఎత్తి చూపడం అనర్హత కిందకు రాదని లోక్ సభ కార్యదర్శి ఇచ్చిన సమాధానంతో సంతృప్తి పడలేక గింజుకుంటున్నారు. కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారఘురామరాజు బెదరడం లేదు. అరెస్టు చేసి భౌతికంగా హింసించినా మరింత రాటు దేలారు కానీ దారికి రాలేదు. అలాంటి రఘురామ రాజుకు ఇప్పుడు తన సొంత నియోజకవర్గంలో ఆవిష్కరిస్తున్న అల్లూరి సీతారామరాజు విగ్రహం ఫలకంపై తన పేరు లేకుండా చేయడానికి సొంత పార్టీ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడాన్ని సహించ లేకపోతున్నారు.
కక్ష సాధింపు చర్యలలో భాగంగానే తన నియోజకవర్గంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేయనున్న మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహవిష్కరణ ఫలకంపై తన పేరు లేకుండా చేయడం ఎంత మాత్రం తగదని అంటున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 4న ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ ఫలకంపై తన పేరు ఉండి తీరాలనీ, బీమవరం ఎంపీగా తన పేరు ఫలకంపై ఉండటం ప్రాటోకాల్ ప్రకారం తప్పని సరి అని అంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో తన ఉనికిని లేకుండా చేయడానికి రాష్ట్రప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తున్నదని ఆయన ఆరోపిస్తున్నారు. అందుకే ఆయన కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. తన సొంత నియోజకవర్గ కేంద్రం భీమవరంలో ప్రధాని నరేంద్రమోడీ ఈ నెల 4న ఆవిష్కరించనున్న అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ ఫలకంపై తన పేరు లేకుండా చూడాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర మంత్రిత్వ శాఖ పై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని రఘురామకృష్ణం రాజు ఆ లేఖలో పేర్కొన్నారు.
తాను ఈ కార్యక్రమానికి హాజరౌతున్నట్లు ఆయనా లేఖలో పేర్కొన్నారు. ప్రొటోకాల్ నింబంధనల ప్రకారం ఫలకంపై తన పేరు ఉండాలనీ, ఎవరి ఒత్తిడులకూ లొంగి ఫలకంపై తన పేరు లేకుండా చేయవద్దని ఆయనా లేఖలో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శికి రాసిన లేఖలో పేర్కొన్నారు.