ఆటో డ్రైవర్ కుమారుడు.. ఇంటర్ లో 592 మార్కులు

పిల్ల‌వాడు పుట్టాడ‌ని ఆనందం కాదు వాడు ఎంతో ప్ర‌యోజ‌కుడు అయ్యాడ‌ని మ‌హదానందం  అన్నాడు త‌న కొడుకు గురించి  ఓ తండ్రి.  విద్యార్ధిగా త‌న కొడుకు ఎంతో అభివృద్ధి సాధించాడ‌ని ఉప్పోంగి పోతు న్నాడు ఈ మ‌హారాష్ట్ర అకోలాకి చెందిన ఆటో డ్రైవ‌ర్‌.  త‌న కొడుకు 12వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల్లో ఉత్తీర్ణుడయ్యా డు.  అదో  చెప్ప‌లేని ఆనందం. అంత‌కుమించిన‌దేమిటే మార్కులు 600కి గాను 592 మార్క‌లు సాధించాడు. అది  అత‌ని అంతులేని ఆనందానికి కార‌ణం. పైగా ఆ ఆటోడ్రైవ‌ర్ త‌న కొడుకు మార్కుల లిస్ట్‌ను త‌న మొబైల్లో  పెట్టి ఆటో ఎక్కిన అంద‌రికీ చూపించి తెగ మురిసిపోతున్నాడు.  వికాస్ అరోరా  అనే వ్య‌క్తి  ఆ మార్కుల లిస్ట్‌ను నెట్‌లో పెట్టి మరింత ప్ర‌చారం చేసాడు. అంతే  45,500 మంది ఫాలో అయ్యారు.  అంతేకాదు  అంద‌రూ శుభాకాంక్ష‌లు చెబుతూ అత‌న్ని ఆనందంలో ముంచెత్తు తున్నారు.  కొంద‌ర‌యితే ఆ పిల్ల‌వాడు పెద్ద చ‌దువులు చ‌ద‌వాల‌నుకుంటే అందుకు త‌గిన సాయం అంది స్తాన‌ని కూడా మెసేజ్‌లు పెడుతున్నారు. చ‌దువుకునేవాడికి  తెలివి, చ‌ద‌వాల‌న్న ప‌ట్టుద‌ల వుంటే  చాలు ప‌రిస్థితులు వాటంత‌ట అవే అనుకూలిస్తాయి.   ఇటువంటి మాట‌లు విన‌వ‌చ్చు, యాడ్స్ చూడ‌వచ్చు.  కానీ ఇది   వాస్త‌వం.  రాష్ట్ర ప్ర‌భుత్వాల మాట‌లు, మ‌ద్ద‌తులు ఎలా వున్నా, స‌మాజంలో మ‌నసున్న‌మారాజులు ఇంకావున్నారు. వాళ్ల‌లో ఒక్క‌రిద్ద‌ర‌యినా ఇలాంటి ఉత్త‌మ విద్యార్దుల‌కు ఆర్ధిక మ‌ద్ద‌తునిచ్చి ఆదుకుంటే నిజంగానే భ‌వి ష్యత్తులో  ఆ విద్యార్ధులు ఉన్న‌త స్థాయికి చేరుకోగ‌ల‌రు.  ప్ర‌భుత్వాలు త‌మ గొప్ప‌ల‌కు క్రీడాకారుల‌కు భారీ  నజరానాలు, భూములు ఇచ్చేయ‌డం కాకుండా  ఇలాంటి వారిని ఉత్సాహ‌ప‌రిచి  త‌మకు  అంద‌రూ స‌మాన‌మే అన్న‌ది నిరూపించుకోవాలి.   విద్యారంగం అభివృద్ధి గురించి వుప‌న్యాసాలు దంచ‌డంకాకుండా  అస‌లు పాఠ‌శాల‌లు, ముఖ్యంగా గ్రామా ల్లో పాఠ‌శాల ప‌రిస్థితుల‌ను ఒక్క‌సారి మ‌న‌స్పూర్తిగా చూసి వాటిని స‌వ్యంగా న‌డుస్తున్న‌ది లేనిదీ ప‌రి శీలిం చి వాటిని మెరుగుప‌ర‌చాలి.  రాష్ట్రం ఏద‌యినాస‌రే, గ్రామీణ ప్రాంతాల్లో  బ‌డులు దారుణంగానే  వుంటు న్నాయ‌న్న‌ది చాలాకాలం నుంచి విన‌బ‌డుతున్న నివేదిక‌ల గోల‌. పాఠశాల చ‌దువులు ఎలాంటి అడ్డం కులు లేకుండా సాగేట్టు ప్ర‌భుత్వాలు పూనుకుంటేనే మరింత మంది మట్టిలో మాణిక్యాల్లాంటి  విద్యార్ధులు వెలుగులోకి వ‌స్తారు.  బ‌డులకు రంగులు వేయ‌డం, బ‌ల్ల‌లు ఇచ్చామ‌ని కాకుండా ఉపాధ్యాయులు త‌గినంత మంది అందుబాటులో వున్నారా లేదా, మీడియాల విష‌యంలో గ‌ట్టి నిర్ణ‌యాలు తీసుకోవ‌డం, ప్రాథ‌మిక విద్య‌లో పిల్లల‌కు తెలుగు, ఇంగ్లీషుమాధ్యమాల విష‌యంలో స్ప‌ష్టత‌నీయ‌డం, విద్యార్థులను ప్రోత్సహించడానికి   అధికారులు పూను కోవాలి. 

ఇంటర్ ఫలితాల్లో బాలికల హవా..

తెలంగాణ ఇంటర్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను ఒకేసారి మంగళవారం విడుదల చేశారు.  ఇంటర్  ఇంటర్ ఫస్టియర్ లో 63.32 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా… సెకండ్ ఇయర్ లో 67.16 శాతం మంది పాస్ అయ్యారు. ఇంటర్ ఫలితాల్లో ఈ సారి కూడా అమ్మాయిలే పైచేయి సాధించారు. ఫస్టియర్ లో 72.33 శాతం మంది అమ్మాయిలు ఉత్తీర్ణత సాధించగా.. కేవలం 54.25 శాతం మంది అబ్బాయిలు మాత్రమే పాస్ అయ్యారు. సెకండియర్ లో 59.21 శాతం మంది అబ్బాయిలు పాస్ కాగా… 75.28 శాతం మంది బాలికలు ఉత్తీర్ణులయ్యారు. రెండు సంవత్సరాల ఫలితాల్లో అమ్మాయిల హవా కొనసాగింది. కాగా ఈ ఫలితాలలో ఫెయిలైన విద్యార్థుల కోసం ఆగస్ట్ 1 నుంచి ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని సబిత తెలిపారు. కాగా ఇంటర్ ఫలితాల విడుదలకు ముందు విడుదల తేదీలపై ఒకింత గందరగోళం నెలకొంది. ఈ రోజు, రేపు అంటూ ఇంటర్ ఫలితాలపై సామాజిక మాధ్యమాలలో వార్తలు హల్ చల్ చేశాయి. అయితే 26వ తేదీన తెలంగాణ ఇంటర్ బోర్డు 28న ఫలితాలు విడుదల చేయనున్నట్లు ప్రకటిస్తూ వదంతులను నమ్మవద్దంటూ పేర్కొంది. చెప్పినట్లుగానే మంగళవారం ఉదయం ఫలితాలు విడుదల చేసింది.

అమ్మఒడికి మంగళం.. అంచెల వారీగా తూట్లు

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అన్నిటిలోకి, ‘అమ్మఒడి’ అత్యంత ప్రతిష్టాత్మక పథకం...అలాగని ప్రభుత్వమే ప్రచారం చేసుకుంటోంది. న భూతో న భవిష్యతి, ఇలాటింటి పథకం ఇంతవరకు లేదు ఇక ముందు ఉండదు, అని వైసీపీ సర్కార్ ఫుల్ పేజీ ప్రకటనలతో ... ప్రచారం సాగించింది. అయితే, ఇప్పడు, అదే  అమ్మఒడి పథకాన్ని,  గుదిబండ పథకంగా భావిస్తోందా ? ఎదో ఒక సాగుతో, ‘అమ్మఒడి’ భారాన్ని తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తోందా? అంటే, ప్రభుత్వ వర్గాల నుంచే అవుననే సమాధానం వస్తోంది.  నిజానికి, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వం, ఓటు బ్యాంక్ రాజకీయాల్లో భాగంగా అభివృద్ధిని పక్కన పెట్టి, అప్పులు చేసిమరీ,సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసింది. సంక్షేమ పథకాలే తమను  మళ్ళీ మళ్ళీ అందలం ఎక్కిస్తాయనే భ్రమల్లో వైసీపే నేతలు తెలిపోతుంటారు. సంస్ఖేం లెక్కలు ఆ పార్టీ నాయకులు గొప్పగా చెప్పుకుంటారు. ముఖ్యమంత్రి అయితే, మీటలే మన ఓట్లు... వచ్చే ఎన్నికలలో 175 సెట్లు మనవే అనే ధీమా వ్యక్త చేసారు.  అయితే, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలు, అదుపు తప్పిన అవినీతి కారణంగా మూడేళ్ళు గడించే సరికి సర్కార్ ఖజానా ఖాళీ అయింది.   దీంతో, ప్రభుత్వం ఒక్కొక్క పథకాన్ని, ఒక్కొక్క సాకుతో నీరు గార్చే పనిలో పడింది. చివరకు, దుల్హన్ వంటి కొన్ని పథకాలకు ఔర్తిగానే మంగళ పాడేశారు. అందులో భాగంగా అమ్మఒడి పథకాన్ని అంచల వారీగా అటకెక్కించడం ఖాయని, ప్రభుత్వ అధికారులే అనుమనాలు వ్యక్తపరుస్తున్నాఋ. కొవిడ్ సాకుగా చూపి  ఒక సంవత్సరం,  పథకాన్ని వాయిదా వేశారు. ఆ తర్వాత, 75 శాతం హాజరు నిబంధన పేరుతో ‘అమ్మ ఒడి’ నిధులను 50 వేల మందికి ఎగ్గొట్టారు.  ఇక ఇప్పడు అమ్మఒడిలో నగదుకు బదులుగా ల్యాప్‌టాప్‌ ఇచ్చే విధానానికి ప్రభుత్వం స్వస్తి పలికింది. బహిరంగ మార్కెట్‌లో ల్యాప్‌టాప్‌ ధరలు పెరిగాయని పంపిణీ నిలిపివేస్తున్నామని చావు కబురు చల్లగా చెప్పింది. నిజానికి, ఒక విధంగా పిల్లలకు ల్యాప్‌టాప్‌’లు ఇవ్వడం వలన, కొంత ప్రయోజనం ఉంటుంది. అయితే, ప్రభుత్వం ఆర్థిక భారానికి వెరసి వెనకడుగు వేసింది. నిజానికి ఒక్క అమ్మఒడి పథకమే కాదు, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, సంక్షేమా పథకాలు ప్రకటించడంలో ఎంత దూకుడు చూపారో, ఇప్పడు ఒక్కొక్క పథకానికి కోతలు పెట్టడంలోనూ, అంతకంటే ఎక్కువ దూకుడు చూపుతున్నారు. ఒంటరి మహిళలకు పింఛను ఇచ్చే వయసును 35 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచి లబ్ధిదారుల సంఖ్యను లక్షల్లో తగ్గించారు. ఇలా మొత్తానికి జగన్ రెడ్డి ప్రభుత్వం, మూడేళ్ళలో  రాష్ట్రాన్ని, ఓ వంక అప్పుల ఉబిలో చేర్చింది. మరి వంక సక్షేమ పథకాలకు చెల్లు చీటీ ఇచ్చింది. అందుకే, ప్రజలు ఒక్క ఛాన్స్ సీఎంను ఎంత త్వరగా సగానంపుదామా అని, ఎదురు చూస్తున్నారు.

విలీనం కాదు.. లీజే.. ఆర్టీసీ విషయంలో జగన్ సర్కార్ మడత పేచీ!

జగన్ వాగ్దానాలన్నీ అమలు చేస్తున్నానని చెప్పుకుంటారు. కానీ వాస్తవంగా ఆయన చేసేది అంతా జగన్మాయ మాత్రమే. అమ్మ ఒడి అన్నారు. తీరా లబ్ధిదారుల సంఖ్యను సగానికి సగం తగ్గించేశారు. ఒంటరి మహిళలకు పింఛన్ అన్నారు. అమలులోకి వచ్చే సరికి వయస్సు నిబంధనతో లబ్ధిదారుల సంఖ్యను గణనీయంగా కుదించారు. ఇలా ఏ పథకం తీసుకున్నా.. ఏ సంక్షేమం తీసుకున్నా అదే తీరు, అదే రీతి. దుల్హన్ పథకం దగ్గరకు వచ్చే సరికి గత ప్రభుత్వం ముస్లిం మహిళల వివాహానికి రూ. 50 వేలు ఇచ్చింది...తాను అధికారంలోకి వస్తే లక్ష ఇస్తానని గత ఎన్నికలకు ముందు జగన్ వాగ్దానం చేశారు. అయితే తీరా అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పడు నిధుల కొరత సాకు చూపుతూ ఆ పథకానికే మంగళం పాడేశారు. తాజాగా ఆర్టీసీ విలీనం విషయంలోనే జగన్ మాట తప్పారు. మడమ కూడా తిప్పేశారు. తాము అధికారంలోకి వస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని వైసీపీ ప్రకటించింది. జగన్ సీఎం అయిన తర్వాత సాంకేతిక సమస్యలు ఉన్నాయని కేవలం ఉద్యోగుల్ని మాత్రమే ప్రజా రవాణా శాఖ అనే కొత్త విభాగాన్ని ఏర్పాటు చేసి విలీనం చేసింది. ఆర్టీసీ మాత్రం అలాగే కొనసాగుతోంది. తాజాగా ఆర్టీసీ మొత్తాన్ని   లీజుకు తీసుకోవాలని నిర్ణయించింది.   మళ్లీ లీజు ఏమిటి? ప్రభుత్వంలో విలీనం చేయొచ్చు కదా అంటే మాత్రం సాంకేతిక సమస్యలంటూ నీళ్లు నములుతోంది జగన్ ప్రభుత్వం. అంతే కానీ ఆ సాంకేతిక సమస్యలేమిటన్నది మాత్రం చెపపడం లేదు. అయితే ఇప్పుడు హఠాత్తుగా లీజు వ్యవహారాన్ని తెరైకి తీసుకు వచ్చి  పూర్తి చేయడానికి తొందరపడుతోంది. అయితే అదేమీ ఆర్టీసీ మీద ప్రేమతో కాదు..   కేంద్రానికి జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం లేకుండా తప్పించుకోవడానికేనని అంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు. వారికి ప్రభుత్వం జీతాలు చెల్లిస్తోంది. కానీ వారు పని చేస్తోంది మాత్రం వేరే సంస్థగా ఉన్న ఏపీఎస్ ఆర్టీసీలోనే. అంటే ఆర్టీసీ ప్రభుత్వోద్యోగులుగా మారిన తమ పాత ఉద్యోగుల సేవలను వినియోగించుకుంటోందన్నమాట. అందుకు గానూ జీఎస్టీ చెల్లించాలి. ఈ జీఎస్టీని చెల్లించకుండా ఎగ్గొట్టేందుకే ప్రభుత్వం ఇప్పుడు ఆర్టీసీ  లీజు అంశాన్ని తెరమీదకు తీసుకువచ్చింది.  అయితే ఇక్కడో రహస్యం ఉంది. ఆర్టీసీని విలీనం చేసుకుంటే ఈ లీజు గొడవ ఉండదుకదా అంటే.. నిపుణులు ఏం చెబుతున్నారంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకుంటే.. ఆర్టీసీ అప్పుల భారం కూడా ప్రభుత్వానికి  విలీనం అయిపోతుంది. అదంతా ప్రభుత్వం కట్టాల్సి ఉంటుంది. అలాగే  ఆర్టీసీలో కేంద్ర ప్రభుత్వ వాటా కూడా ఉంది. అంటే విలీనానికి కేంద్రం అంగీకరించాలి. అలా కేంద్రం అంగీకారం తెలిపితే మొదట కేంద్రం చేసే పని తన వాటాను ఉపసంహరించుకోవడం. అదీ ప్రభుత్వానికి ఆర్థిక భారమే అవుతుంది. అందుకే ఈ బేడదలు.. కాదు కాదు బాధ్యతలేమీ తీసుకోకుండా లీజుతో సరిపెట్టేయాలని జగన్ సర్కార్ మాస్టర్ ప్లాన్ వేసింది.  

ప‌ది నెల్ల త‌ర్వాత న‌దిలో దొరికిన ఐఫోన్‌!

తిర‌నాళ్ల‌లో త‌ప్పిపోయిన బిడ్డ  ప‌దేళ్ల  త‌ర్వాత అనూహ్యంగా క‌ల‌వ‌డం సినిమాల్లో,  నిజ జీవితంలోనూ జ‌ర‌గవ‌చ్చు. అలా జ‌రుగుతుందా అన్న‌ది కొంద‌రి అనుమానం. జ‌రిగిన‌వి చూసిన‌వారికి  పెద్ద  వింతేమీ కాదు. కానీ  ఎవైన్ డేవిస్ కి మాత్రం జీవితాంతం ఆశ్చ‌ర్య‌క‌ర‌మే! ఎందుకంటే ఎప్పుడో ప‌ది నెల‌ల క్రితం పారేసుకున్న ఐఫోన్ హ‌ఠాత్తుగా మొన్నీ మ‌ధ్య  దొరికింది.  అదీ ఏ మాత్రం పాడ‌వకుండా!   దాన్ని మిగ్యూల్ అనే వ్య‌క్తి  న‌దిలో ప‌డ‌వ‌లో ప్ర‌యాణిస్తుంటే తెడ్డుకి ఐ ఫోన్ త‌గిలింది. దాన్ని బ‌య‌ట‌కు తీసి  అస‌లు య‌జ‌మానికి  చేర్చాడు.  దీనికంటే మ‌రీ వింతే మిటంటే,  అస‌లా ఫోన్ య‌జ‌మాని డేవిస్  ఇన్నాళ్లు ఎలా ప్ర‌శాంతంగా  వున్నాడా? అని. ఈ సంగ‌తి  విన్న నెటిజ‌న్లు వీడెవ‌డ్రా బాబూ! అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ  రోజుల్లో ఐఫోన్ అనేది మూడో చేయిగా మారిపోయింది మ‌రి! ఎందుకంటే, మిగ్యూల్ మొన్న న‌దిలో ప‌డ‌వ‌లో తిరుగు తూంటే తెడ్డుకి ఈ ఫోన్ త‌గిలిందిట‌. దాన్ని జాగ్ర‌త్త‌గా పైకి తీసేడు. అది బాగానే వుంద‌ని అనిపించింది. అందు లోకి నీళ్లు ఇంక‌లేద‌ని గ్ర‌హించాడు. ఇంటికి వెళ్ల‌గానే దానికి ఛార్జి పెట్టి చూశాడు.  అందులో చివ ర‌గా ఉప‌యోగించినది ఆగ‌స్టు 13 అని తేదీ క‌న‌ప‌డింది. అత‌ని ఆశ్చ‌ర్యానికి అంతేలేదు. కానీ  అత‌ను దాన్ని త‌ను దాచుకోవాల‌నుకోలేదు. దాని అస‌లు య‌జ‌మాని ఎవ‌రా అని ఆరా తీసి మ‌రీ అత‌నికి తీసికెళ్లి ఇచ్చాడు. ఇది  మ‌రీ  హ‌ర్ష‌ణీయం! తెల్లారుతూనే ఐఫోన్‌లో మెసేజ్‌లు, ఫోటోలు చూసుకుంటేనే గాని రోజు ఆరంభం కాని రోజులివి. ఐ ఫోన్ వుంటే లోక‌మంతా అర‌చేతిలో వున్న‌ట్టే. స్నేహితులు, బంధువులు, సినిమాలు, స‌ర‌దాలు, ఆట‌పాట‌లు ఒక‌టేమిటి యావ‌త్ లోక‌మంతా ఒక్క క్లిక్ దూరంలో సంద‌డి చేస్తాయి. ఫోన్ల కంపెనీవారికి ఎంత లాభార్జ‌న జ‌రుగుతోందో ఏమో గాని జ‌నాల‌కు ముఖ్యంగా యువ‌త‌కు మాత్రం ఐఫోన్‌తో బోల్డు కాల‌క్షేపం. చ‌దువు, వుద్యోగాల మాట ఎలా వున్నా ఇపుడంతా ఆన్‌లైన్ వ్య‌వ‌హారాలే గ‌నుక ఐ ఫోన్ అనేది జీవిత భాగ‌స్వామితో స‌మానంగా మారింది. ఇది భ‌విష్య‌త్తులో మ‌రింత పిచ్చెక్కించే ఆనందం.   ప‌ది నెల‌ల క్రితం పొర‌పాటున న‌దిలో ప‌డిపోయింద‌ని, అది దొర‌క‌ద‌ని ఆశ‌లు వ‌దులుకున్నాన‌ని డేవిస్ అన్నాడు. త‌ర్వాత ఆ ఫోన్‌లోనే మిగ్యూల్‌తో సెల్ఫీ తీసుకుని డేవిస్ నెటిజ‌న్ల‌కు అస‌లు స‌మాచారం అం దించాడు. ఇలాంటివి జ‌ర‌గ‌డం ఎక్క‌డా వినం. కానీ జ‌రిగింది. అలాగ‌ని ఖ‌రీద‌యిన ఫోన్‌లతో తిరిగేవారు జాగ్ర‌త్త‌గానే వుండాలి. ఎందుకంటే పారేసుకున్న‌పుడ‌ల్లా అంద‌రికీ మిగ్యూల్ లాంటివారు తెచ్చివ్వ‌రు!  

ఓటు హ‌క్కు వ్య‌ర్ధంచేసుకోవ‌ద్దుః ఓవైసీ

ఉన్న‌చోట అధికార పీఠం ద‌రిదాపుల్లోకి వెళ్ల‌లేని పార్టీ నాయ‌కులు వేరే ప్రాంతాల్లో ఆవేశంగా  త‌మ పార్టీని ప్ర‌చారం చేసుకుని ప్ర‌యోజ‌నమేమిటి?  హైద‌రాబాద్‌లో వేళ్లూనుకున్న ఎంఐఎం ఇక్క‌డ పాత‌బ‌స్తీ మించి దాట‌లేని స్థితిలో వున్న‌ది. కానీ ఆ పార్టీ అధినేత  అస‌దుద్దీన్ ఒవైసీ మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో విస్తరించ‌డానికి  విశ్వ య‌త్నం చేస్తున్నారు. అక్క‌డ మొద‌టిసారిగా ఎన్నిక‌ల్లో పాల్గొంటున్న ఎంఐఎం పార్టీ  అక్క‌డి మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో గెల‌వ‌డానికి కృషి చేయాలి, అక్క‌డి ఓట‌ర్లను ఆక‌ట్టుకోవాలి. అస‌లు అంత‌కుముందు అక్క‌డి ప్ర‌జ‌ల‌కు అస‌దుద్దీన్ భావావేశం అర్ధం కావాలి.  బ‌హిరంగ స‌భ‌లో ఆయ‌న మాట్లాడుతూ  కాంగ్రెస్‌కి నూక లు చెల్లిపోయాయి, ఆ పార్టీవారికి మ‌ద్ద‌తు తెల‌ప‌డంలో ఓటును దుర్వినియోగం చేసుకోవ‌ద్ద‌ని జ‌బ‌ల్పూ ర్‌లో ఆవేశంగా మాట్లాడ‌టంలో ఐవైసీ ఓట‌ర్ల ను ఏమాత్రం ఆక‌ట్టుకుంటారో చూడాలి. పైగా బిజెపి నాయ క‌త్వంలోని కేంద్రం పైనా స‌హ‌జ రీతిలో విరు చుకుప‌డ్డారు. భార‌త స‌రిహ‌ద్దుల్లోకి చైనా సైన్యం చొచ్చుకు రావ‌డాన్ని నిలువ‌రించ‌డంలో దారుణంగా విఫ‌ల‌మ‌యింద‌ని అస‌దుద్దీన్ ఓవైసీ ఆరోపించారు.  ఇత‌ర రాష్ట్రాల్లో త‌న పార్టీని విస్త‌రించుకోవ‌డంలో  భాగంగా ఆవేశ‌పూరిత ప్ర‌సంగాలు చేసి కాంగ్రెస్‌, బిజెపీ ప‌ట్ల త‌మ విముఖ‌త‌ను చాటుకోవడంలో అక్క‌డి ఓట‌ర్లు, ప్ర‌జ‌లు న‌మ్మేస్తార‌నుకోవ‌డం వొట్టి  భ్ర‌మే అవు తుంది.  కాంగ్రెస్ పార్టీ చాలాకాలం నుంచి వున్న‌ది, బిజెపి పార్టీ నాయ‌క‌త్వంలో కేంద్రంలో ప్ర‌భుత్వం వున్నది. ఈ రెంటిని అమాంతం నోటికి వ‌చ్చిన‌ట్టు తిట్టేసి త‌న పార్టీని  గెలిపించితే  స్థానిక స్థాయి నుంచి త‌మ పార్టీవారు ప్ర‌జ‌ల‌కు చేదోడు వాదోడుగా నిలుస్తారు అన్నది ఓట‌ర్ల‌కు తెలియ‌జేసే పంథా  తిట్టుడు ప్ర‌చారంతో అవుతుందా అన్న‌ది  ఓవైసీ తెలుసుకోవాలి. హైద‌రాబాద్‌లోవ‌లె  మ‌ధ్య‌ప్ర‌దేశ్ జ‌బ‌ల్‌పూర్ లోనూ పిచ్చిగా వెన్నంటే తిరుగుతార‌ని  అనుకోవ‌డం తొంద‌ర‌పాటే అవుతుందని విశ్లేష‌కులు  అంటు న్నారు.   కేంద్రంలోని ఎన్‌డిఏ ప్ర‌భుత్వం మీద విరుచుకుప‌డుతూ, మోదీ ప్ర‌భుత్వం స‌రిహ‌ద్దు అంశాల‌ను నిర్ల క్ష్యం చేస్తున్నార‌న్నారు. దేశంలో ముస్లింలు అన్ని రంగాల్లో ముఖ్యంగా విద్యారంగంలో  వెనుక‌బ‌డి వున్నా ర‌ని  దేశంలో విద్యావ‌కాశాల పై  అఖిల భార‌త స‌ర్వే తెలియ‌జేసింద‌న్నారు. దేశంలో ముస్లింల అభివృ ద్ధికి ప్ర‌భుత్వాలు చొర‌వ‌చూపాల‌న్నారు.

సొంత పార్టీ వారే కుట్ర చేస్తున్నారు.. బాలినేని సన్సేషన్

వైకాపాలో ప్రాధాన్యత కోల్పోయి ఇబ్బందులు పడుతున్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసుల రెడ్డి తనపై సొంత పార్టీ వారే కుట్ర పన్నుతున్నారంటే సన్సేషనల్ కామెంట్స్ చేశారు. మంత్రి పదవి కోల్పోయిన తరువాత నుంచి పార్టీలో బాలినేని ప్రాధాన్యత బాగా తగ్గిపోయింది. టీడీపీ నేతలు బాలినేనిపై చేస్తున్న విమర్శలను ఖండించే విషయంలో పార్టీ వారి నుంచి ఎటువంటి సహకారం అందడం లేదు. దీంతో బాలినేని రగలిపోతున్నారు. తనను లక్ష్యం చేసుకుని తెలుగుదేశం చేస్తున్న విమర్శలకు సొంత పార్టీవారే వత్తాసుగా నిలుస్తున్నారని ఆరోపిస్తున్నారు. సొంత పార్టీలోనే తనకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందని అనుమానిస్తున్నారు. ఇదే విషయాన్ని ఆయన బహిరంగంగా వెల్లడించి సంచలనం సృష్టించారు. తనకు వ్యతిరేకంగా సొంత పార్టీవారే కుట్ర చేస్తున్నారనీ, ఇది చాలా సిగ్గు చేటైన విషయమని అన్నారు. వారెవరో తనకు తెలుసుననీ, ముఖ్యమంత్రి, పార్టీ అధినేత జగన్ కు వారిపై ఫిర్యాదు చేస్తానని ఆయన పేర్కొన్నారు. అల్లూరులో కవిత అనే మహిళ కుటుంబ కలహాలను అడ్డుపెట్టుకుని తనపై బురద జల్లారని ఆరోపించారు. తెలుగుదేశం వారితో కుమ్మక్కై వైసీపీలోని కొందరు నేతలు తనకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారని బాలినేని చేసిన ఆరోపణ వైసీపీలో కలకలం సృష్టించింది. అయితే కొందరు వైసీపీ నేతలు మాత్రం గతంలో తాను చెలాయించిన పెత్తనం కారణంగానే ఒంగోలులో వైసీపీ కార్యకర్తలు ఆయనకు దూరమయ్యారని అంటున్నారు. బాలినేనిపై కుట్ర చేయాల్సిన అవసరం వైసీపీలో ఎవరికీ లేదనీ అంటున్నారు.

వంకాయ చికెన్ తో డిన్నర్.. గురుకుల పాఠశాల విద్యార్థులకు అస్వస్థత

మైనారిటీ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజినింగ్.. 107 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలు ఫుడ్ పాయిజిన్ అవ్వడంతో 107 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలైన సంఘటన సిద్దిపేట గురుకుల పాఠశాలలో జరిగింది. సోమవారం సిద్ధిపేటలోని మైనారిటీ గురుకుల పాఠశాలలో రాత్రి డిన్నర్ లోని చికెన్ వంకాయ వండారు. అదితిన్న విద్యార్థులు వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం రాత్రి నుంచీ విద్యార్థులు బాధపడుతున్నప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు. సోమవారం ఉదయానికి పరిస్థితి తీవ్రం కావడంతో అధికారులు హుటాహుటిన అస్వస్థతకు గురైన విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని చెబుతున్నారు. గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజిన్ విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచడానికి ప్రయత్నించారు. దాంతో మంగళవారం ఉదయానికి కానీ విషయం వెల్లడి కాలేదు. తమ పిల్లలు ఆసుపత్రి పాలైనా తమకు సమాచారం అందించడంలో తీవ్ర జాప్యం చేశారని విద్యార్థుల తల్లిదండ్రులు అధికారులపై ఆరోపణ చేస్తున్నారు. 

తెలంగాణ హైకోర్టు సీజే ప్రమాణ స్వీకారం.. హాజరైన సీఎం కేసీఆర్

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ మంగళవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై ఆయన చేత  సీజేగా ప్రమాణ స్వీకారం చేశారు. సీజే ప్రమాణ స్వీకారోత్సవంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. గత కొంత కాలంగా  సీఎం కేసీఆర్, రాష్ట్ర గవర్నర్ తమిళిసై మధ్య సంబంధాలు అంతంత మాత్రంగా ఉన్న సంగతి తెలిసిందే. రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య దూరం పెరిగిందనడానికి పలు సంఘటనలు సాక్షీ భూతంగా నిలిచాయి. గత కొంత కాలంగా కేసీఆర్ రాజ్ భవన్ కు వెళ్లిన దాఖలాలు లేవు. అలాగే గవర్నర్ రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో పర్యటించిన సందర్శంగా ప్రొటోకాల్ ప్రకారం ఆమె పర్యటనలలో రాష్ట్ర మంత్రులు పాల్గొన లేదు. ఈ విషయమై గవర్నర్ బహిరంగంగా తన అసంతృప్తిని వెళ్లగక్కిన సందర్భాలూ ఉన్నాయి. సమ్మక్క సారలమ్మ జాతరలో కానీ, యాదాద్రి సందర్శన సమయంలో కానీ గవర్నర్ కు ప్రొటో కాల్ ప్రకారం మర్యాదలు జరగలేదన్న ఆరోపణలు ఉన్నాయి. కాగా చాలా కాలం తరువాత సీజే ఉజ్జల్ భుయాన్ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి రాజ్‌భవన్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్  సిబ్బందికి అభివాదం చేస్తూ రాజ్‌భవన్‌లోకి ఎంటర్ అయ్యారు. సీఎంతో పాటు.. మంత్రులు, ఉన్నతాధికారులు   ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

వైసీపీ పాలనంతా పన్నుల వాత...పథకాల కోత.. చంద్రబాబు

జగన్ పాలన అంతా పన్నుల వాత, పథకాల కోత చందంగా సాగుతోంది. జగన్ సర్కార్ మూడేళ్ల పాలనలో ప్రజలపై ఒక వైపు పన్నులతో వాతలు పెడుతూ, మరో వైపు సంక్షేపథకాలకు కోతలు పెట్టడంగానే సాగిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. ప్రజలకు అందే సంక్షేమ పథకాలకు నిబంధనల చట్రాదలు బిగించి కోతలు పెట్టి వాటిలో కూడా డబ్బులు మిగుల్చు కోవడమే జగన్ సర్కార్ లక్ష్యంగా కనిపిస్తున్నదన్నారు. పార్టీ ముఖ్య నేతలతో జరిగిన సమావేశంలో  ఆయన   చెత్త నుంచి ప్రతి దానిపై పన్నువిధిస్తూ ప్రజలకు ఆర్థిక వాతలు పెడుతోందని విమర్శించారు. అమ్మ ఒడిపథకంలో 52వేల మంది లబ్ధిదారులను తొలగించడాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. అలాగే ఒంటరి మహిళల పింఛన్ అర్హత వయస్సును 50 ఏళ్లకు పెంచి లక్షలలో లబ్ధిదారుల సంఖ్యను తగ్గించేశారన్నారు. ప్రజా రాజధాని అమరావతి నిర్మాణానికి ఒక్క ఇటుక కూడాఇవ్వని జగన్ కు ఆ భూములను అమ్మే హక్కు ఎవరిచ్చారన్నారు. మూడేళ్లుగా అమరావతిని నిర్లక్ష్యం చేసి, అభివృద్ధిని నీరు గార్చి.. అప్పట్లో తాను ఉద్యోగుల కోసం నిర్మించిన భవనాలను ఇప్పుడు ప్రైవేటు సంస్థలకు లీజుకు ఇస్తామంటూ జగన్ సర్కార్ చెప్పడం సిగ్గు చేటన్నారు.   డబ్బులు పంచినా, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పోటీలో లేకున్నా ఆత్మకూరు ఉఫ ఎన్నికలో  వైసీపీకి ఓట్లు పెరగకపోవడమే జగన్ సర్కార్ పై ప్రజలలో పెల్లుబుకుతున్న  తీవ్ర వ్యతిరేకతకు నిదర్శనమని చంద్రబాబు పేర్కొన్నారు.    తన హయాంలో నాణ్యమైన విద్యను అందించడంలో 3వ స్థానంలో ఉన్న రాష్ట్రం జగన్ మూడేళ్ల పాలనలో 19వ స్థానానికి పడిపోయిందనీ, టెన్త్, ఇంటర్   పరీక్షల్లో ఫెయిలై 19 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారనీ, ఆ పాపం పూర్తిగా జగన్ సర్కార్ దేనని విమర్శించారు.  . సొంత బ్రాండ్లతో జగన్ ప్రజల ప్రాణాలు హరిస్తున్నారు. మద్యం నాణ్యతపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దుల్హన్ పథకం కింద పేద ముస్లిం మైనార్టీ యువతులకు టీడీపీ ఇచ్చిన రూ.50 వేల సాయాన్ని రూ.లక్షకు పెంచుతానని హామీ ఇచ్చి జగన్ ఇప్పుడునిధుల్లేక ఆ పథకాన్నే  నిలిపివేశామని హైకోర్టులో చెప్పడం ఆయన మోసకారి తనానికి నిలువెత్తు నిదర్శనమని విమర్శించారు.    .

రాజ్ భవన్ కు కేసీర్.. సయోధ్యకు శ్రీకారం?

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ఈరోజు (మంగళవారం) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్‌భవన్‌లో మంగళవారం ఉదయం 10.05 గంటలకు గవర్నరు తమిళిసై సౌందరరాజన్‌ ఆయనతో ప్రమాణం చేయించనున్నారు.అయితే,గత కొంత కాలంగా, గవర్నర్ తమిళిసై ముఖ్యమంత్రి కేసేఆర్ మధ్య దూరం పెరిగిన నేఫ్యంలో, ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరుపై మొదట అనుమానాలు వ్యక్తమైనా, చివరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారోత్సవణికి ముఖ్యమంత్రి కేసీఆర్ జహారవుతారని, ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టం చేసింది. ముఖ్యమంత్రితో పాటుగా మంత్రులు, ఉన్నతాధికారులు సైతం కార్యక్రమంలో పాల్గొననున్నట్లు సమాచారం. అయితే సంవత్సర కాలం పైగా, గవర్నర్ ను కలిసేందుకు ఇష్టపడని ముఖ్యమంత్రి ఇప్పుడు కూడా, అనివార్యంగానే,రాజ్ భవన్ లో అడుగు పెడుతున్నారని, రాష్ట్ర హై కోర్టు కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి, ప్రమాణ స్వీకార  కార్యక్రమానికి హాజరవుతున్నారని అంటున్నారు. ప్రొటోకాల్‌ ప్రకారం హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి ముఖ్యఅతిథిగా హాజరుకావాల్సి ఉంటుంది, అందుకే ముఖ్యమంత్రి రాజ్ భవన్  వెళుతున్నారని, అధికార పార్టీ నాయకులు అంటున్నారు.  అది చాలావరకు నిజమే అయినా,  ఇటీవల కొంత కాలంగా, గవర్నర్, ముఖ్యమంత్రి మధ్య, మంచు కరుగుతోందని రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య దూరం తర్గుతోందని వార్తలు వినిపిస్తున్న నేపధ్యంలో, ఇప్పడు ఇది ఆ దిశగా పడుతున్న తొలి అడుగు కావచ్చనే ఉహాగానాలు కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. గవర్నర్’తో విభేదాల కారణంగా, ముఖ్యమంత్రి మంత్రి వర్గ విస్తరణ వంటి కొన్ని కీలక నిర్ణయాలను చాల కాలంగా వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. అయితే ఇప్పుడు, కొన్ని అనివార్య పరిస్థితులు ఏర్పడిన నేపధ్యంలో ముఖ్యమంత్రి ఒకడుగు ముదుకేసి గవర్నర్’తో సయోధ్య కోరుకుంటున్నారని అంటున్నారు.  ఈటల రాజేందర్ రాజీనామా చేసిన నేపధ్యంలో అయన స్థానంలో, అదే ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాష్’ను మంత్రి వర్గంలోకీ తీసుకుంటారని అప్పట్లో గట్టి ప్రచారం జరిగింది. అందుకే ఆయన చేత ఎంపీ పదవికి రాజీనామా చేయింఛి, ఎమ్మెల్సీ చేశారని ప్రచారం జరిగింది. అప్పటినుంచి, మంత్రివర్గ విస్తరణ పై ఉహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే గవర్నర్’తో విభేదాలే కారణంగా మంత్రివర్గ విస్తరణ అప్పటి నుంచి వాయిదా పడుతోందని అయితే, ఇప్పుడు ముందస్తు ఎన్నికలకు వెళ్ళే ఆలోచనలో ఉన్న ముఖ్యమంత్రి, ఎన్నికలకోసం మంత్రి వర్గంలో కొన్ని మార్పులు చేర్పులు చేయాలనే నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణ అంటే గవర్నర్’ అనుమతి తీసుకొనక తప్పుదు. అంతే కాదు, ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలన్నా, అసెంబ్లీ రద్దుకు గవర్నర్ ఆమోదం తప్పనిసరి. మరోవంక, మహారాష్ట్ర పరిణామాల నేపధ్యంలో ముఖ్యమంత్రి వ్యూహాత్మకంగా అయినా,  వెనకడుగు వేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.  అందుకే ముఖ్యమంత్రి రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య దూరాన్ని తగ్గించేందుకు, ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాజ్యాంగ పదవిలో ఉన్న ఒక మాజీ కేంద్ర మంత్రితో పాటుగా, కరీంనగర్ జిల్లాకు చెందిన మరో కీలక నేత ఒకరు ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు పావులు కదుపుతున్నట్లు తెలిసింది. అందుకే, ముఖ్యమంత్రి ఆ దిశగా తొలి అడుగు  వేశారని, ప్రోటోకాల్ ఒట్టి సాకు మాత్రమే అంటున్నారు. ఈ సందర్భంగా ప్రధాని రాష్ట్ర పర్యటనల సందర్భంగా ముఖ్యమంత్రి ప్రోటోకాల్ నిబంధనలను పాటించని విషయాన్ని గుర్తు చేస్తున్నారు. సో.. ఈ సయోధ్యకు శ్రికరంగానే భావించవలసి ఉంటుందని అంటున్నారు.

యథా సీఎం.. తథా మినిస్టర్.. గాలిలో మేడలు కడుతున్న అంబటి

అవధానాలలో అప్రస్తుత ప్రసంగి అని ఒకరుంటారు. అవధానం రంజుగా సాగుతుండగా.. అప్రస్తుత ప్రశ్నలు వేస్తూ అవధాని దృష్టిని మరల్చడానికి ప్రయత్నిస్తుంటారు. సరిగ్గా అంబటి రాంబాబు అలాంటి అప్రస్తుత ప్రసంగాలు చేయడంలో దిట్ట. తన వ్యాఖ్యలు, విమర్శలతో లేనిపోని వాదనలకు తావిచ్చే యత్నం చేస్తారు. తద్వారా అసలు విషయం పక్కకు పోతుందన్నది ఆయన ఉద్దేశం. విజయవాడలో జరిగిన వైసీపీ సమావేశంలో కూడా ఆయన అలాంటి ప్రస్తావనే తీసుకు వచ్చారు.   ఇష్టారీతిన దబాయించడం.. తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లనడంలో ముఖ్యమంత్రి జగన్ అడుగుజాడల్లో నడుస్తున్న మంత్రులలో అంబటి రాంబాబు ముందువరుసలో ఉంటారనడంలో సందేహం లేదు. మంత్రిగా తన శాఖపై ఏ మాత్రం అవగాహన లేని అంబటి పోలవరంపై చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. పోలవరంపై ప్రశ్నించిన జర్నలిస్టును మీడియా సమావేశం నుంచి బయటకు పంపిన ఘనత అంబటిది. అటువంటి అంబటి తాజాగా రానున్న ఎన్నికలలో ఏపీలో 175కు 175 స్థానాలలోనూ వైసీపీ విజయం ఖాయమన్నధీమా వ్యక్తం చేశారు. దీనిని పరిశీలకులు అంబటి పగటి కలల ప్రసంగంగా అభివర్ణిస్తున్నారు. ఆయన ఇదేదో కార్యకర్తలలో ఉత్సాహం నింపడానికో, క్యాడర్ ను కార్యోన్ముఖులను చేయడానికో అయితే అర్ధం చేసుకోవచ్చు. కానీ ఆయనీ మాటలు మాట్లాడిన వేదిక.. ఆ వేదికపై ప్రస్తావించిన అంశాలూ చూస్తుంటే.. ఆయన భ్రమలలో ఉన్నారనీ, గాలిలో కట్టిన ఇంద్రభవనాల్లో నివసిస్తున్నారనీ అనిపించక మానదు. వైసీపీ ప్లీనరీ సన్నాహకాలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా నిర్వహిస్తున్న సమావేశాలలో భాగంగా విజయవాడలో జరిగిన సమావేశంలో అంబటి మాటలు కోటలు దాటేశాయి. గడప గడపకూ కార్యక్రమానికి జనం బ్రహ్మరథం పట్టారని చెప్పారు. పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీలన్నిటినీ అధికారంలోకి వచ్చిన తరువాత నెరవేర్చారని అంబటి అన్నారు. కానీ ఆయనీ మాటలు చెప్పిన రోజే అమ్మ ఒడి లబ్ధిదారుల సంఖ్యలో బాగా కోతపెట్టినట్లు జగన్ శ్రీకాకుళంలో ప్రకటించారు. కరోనా కల్లోలం నుంచి రాష్ట్రం బయటపడిందంటే అది జగన్ చలవేనని కూడా సలవిచ్చారు.   గడప గడపకూలో జనం నిరసన సెగలు, సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర తుస్సు మన్న సంగతిని ఉద్దేశ పూర్వకంగా విస్మరించారు. తెలుగుదేశం మహానాడుకు వచ్చిన స్పందన గురించిన ప్రస్తావనే లేదు. జనం ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలనూ, మంత్రులనూ సమస్యలపై నిలదీస్తున్న విషయాన్ని పట్టించుకోనే లేదు. ముఖ్యమంత్రి అన్నారు కనుక తాను కూడా మొత్తం 175 స్థానాలలో విజయం సాధిస్తామని ఓ ప్రకటన చేసేశారు అంబటి.

ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు.. కొడాలి నాని ఇలాకాలో ఉద్రిక్తత

ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేసి కోర్టులో చీవాట్లు తిన్నా వైసీపీకి బుద్ధి రాలేదు. తాజాగా గుడివాడ సమీపంలోని బొమ్మలూరులో ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు పూసి తమ అరచకానికి హద్దులే లేవని వైసీపీ మరోసారి రుజువు చేసుకుంది. కృష్ణా జిల్లా గుడివాడలో అధికార వైసీపీ కార్యకర్తల అరాచకానికి హద్దు లేకుండా పోతోంది. తాజాగా బొమ్మలూరులో ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు పూసారు. చంద్రబాబునాయుడు బొమ్మలూరుకు కిలోమీటర్ దూరంలో ఉన్న అంగులూరులో జరగనున్న మహానాడుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు రానున్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం శ్రేణులు ఉత్సాహంగా మహానాడు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో బొమ్మలూరులో ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ శ్రేణులు తమ పార్టీ రంగులు పూసి వికృతానందం పొందారు. ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు పూయడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బొమ్మలూరు చేరుకున్న తెలుగుదేశం నేతలు ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులను తుడిచేసి పాలాభిషేకం చేశారు. అనంతరం మళ్లీ పసుపు రంగు వేశారు. తెలుగుదేశం మహానాడుకు ముందు ఉద్రిక్తతలు రెచ్చగొట్టేందుకే వైసీపీ ఇటువంటి వికృత చేష్టలకు పాల్పడుతోందని ఎమ్మెల్పీ బచ్చుల అర్జునుడు, పిన్నమనేని వెంకటేశ్వరరావు ఆరోపించారు.  కాగా ఈ సంఘటన జరిగిన కొద్ది సేపటికే వైసీపీ నేతలకు తెలుగుదేశం కార్యకర్తలపై దాడికి దిగారు. దీంతో బొమ్మలూరులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొడాలి నాని దిగజారుడు రాజకీయాలకు ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు వేడయం మరో తాజా తార్కానమని ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు విమర్శించారు. మహానాడు బ్యానర్లు కనిపించకుండా వైసీపీ నేతల ఫ్లెక్సీలు పెడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నది చాలక ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు వేడయం దుర్మార్గానికి పరాకాష్ట అని విమర్శించారు. బుధవారం ( ఈనెల 29)న గుడివాడలో తెలుగుదేశం మహానాడు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో గుడివాడలో పసుపు పండుగ వాతావరణం నెలకొంది. ఎక్కడ చూసినా తెలుగుదేశం జండాలు, బ్యానర్లతో గుడివాడ మొత్తం పసుపు మయం అయిపోయినట్లుగా వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలోనే అక్కసుతో వైసీపీ నేతలు తెలుగుదేశం బ్యానర్లకు అడ్డంగా వైసీపీ నేతల బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అది చాలదన్నట్లు ఏకంగా ఎన్టీఆర్ విగ్రహానికే వైసీపీ రంగులు పూశారు. దీంతో తెలుగుదేశం శ్రేణులు మండి పడుతున్నాయి. గుడివాడ మహానాడు కొడాలి నాని పతనానికి నాంది కానుందని చెబుతున్నారు.   ఎన్టీఆర్ ప్రాతినిధ్యం వహించిన గుడివాడలో జరిగే మహానాడును విజయవంతం చేసేందుకు  తెలుగుదేశం కార్యకర్తలు కంకణం కట్టుకుని   పని చేస్తున్నారు.

కాంగ్రెస్ కు కేసీఆర్ సరెండర్?

రాష్ట్రపతి ఎన్నికలు తెరాస నిజ రూపాన్ని బయట పెట్టాయా? ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి సరెండర్ అయ్యారా? అంటే అవుననే అంటున్నారు, రాజకీయ విశ్లేషకులు.  ఇంతవరకు కేసీఆర్, కేటీఆర్, అదే విధంగా ఇతర మంత్రులు, తెరాస నాయకులు కాంగ్రెస్ పార్టీని, పార్టీ అధ్యక్షురాలు సోనియా  గాంధీ, రాహుల్ గాంధీని దుమ్మెత్తి పోశారు. అంతే కాకుండా , జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్నిఅంగీకరించేది లేదని, స్వయంగా కేసీఆర్, కేటీఅర్ అనేక సందర్భాలలో సప్ష్టమైన ప్రకటనలు చేసారు.  కాంగ్రెస్ పార్టీని పనికిమాలిన పార్టీ, దిక్కుమాలిన నాయకత్వం అని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చేతకాని తనం వల్లనే, దేశంలో  బీజేపీ తిరుగులేని శక్తిగా ఎదుగిందని తండ్రీ కొడుకులు  తిట్టని రోజు లేదు. అయితే,  కాంగ్రెస్ పార్టీ పేరెత్తితేనే అంతల కస్సుమనే కేసీఆర్, ఇప్పుడు రాష్ట్రపతి పదవికి కాంగ్రెస్ పార్టీ కేంద్ర బిందువుగా ప్రతిపక్ష పార్టీలు నిలబెట్టిన ఉమ్మడి అభ్యర్ధి, యశ్వంత్ సిన్హాకు మద్దతు ప్రకటించారు. కేవలం మద్దతు ఇవ్వడమే కాకుండా, మంత్రి కేటీఅర్ తో పాటుగా అరడజను మంది వరకూ పార్టీ ఎంపీలు, సిన్హా నామినేషన్ పత్రాలపై సంతాకాలు చేసారు. నామినేషన్ కార్యక్రమలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీతో చెట్టపట్టాలేసుకుని కనిపించారు.ఇవన్నీ , చూస్తుంటే, అదే అన్జిపిస్తోందని, రాజకీయ పరిశీలకులు అంటున్నారు. జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే, కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పే ఆలోచనకు స్వస్తి చెప్పి, కాంగ్రెస్ కు సరెండర్ అయిపోయారని, అంటున్నారు.   నిజానికి కేసీఆర్, ఇంచు మించుగా సంవత్సర కాలంగా, జాతీయ  రాజకీయాలపైనే దృష్టిని  కేంద్రీకరించారు. కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా, ప్రాంతీయ పార్టీలను కూడగట్టి ఫెడరల్ ఫ్రంట్ వేర్పాటు చేసేందుకు, చాలా చాలా ప్రయత్నాలు చేశారు. దేశమంతా తిరిగి, అనేక  రాష్ట్రాల ముఖ్యమంత్రులను, ప్రాంతీయ పార్టీల నాయకులను కలిసి చర్చలు జరిపారు. అయితే ఆ ప్రయత్నాలు ఏవీ ఫలించక పోవడంతో కావచ్చును, కొత్తగా జాతీయ పార్టీ తెర మీదకు తెచ్చారు. ఆ దిశగా, కొంత కసరత్తు కూడా చేశారు. ఇంకా ఆ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెపుతున్నారు. అయితే అది కూడా ముడిపడే అవకాశం లేదని తేలడంతో ... పక్షం రోజుల క్రితం కాంగ్రెస్ ఉన్న కూటమితో చేతులు కలిపేది లేదని ప్రకటించిన కేసీఆర్, అదే కూటమితో చేతులు కలిపారు. యశ్వంత్ సిన్హా నామినేషన్ కార్యక్రమలో కేటీఆర్ పాల్గొన్నారు.  దీంతో తెరాస, కాంగ్రెస్ సంబంధాలపై రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. ఓవైపు రాష్ట్రంలో కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ నేతల మధ్య మాటాల యుద్ధం జరుగుతుంటే.. ఇంకోవైపు ఆ రెండు పార్టీలు రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా కలిసిపోవడంపై అనేక అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. నిజానికి, చాలా కాలంగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు తెరాస, బీజేపీ అవిభక్త  కవలలని ఆరోపిస్తున్నారు . గతంలో  కేంద్ర ప్రభుత్వం  తీసుకున్న కీలక నిర్ణయాలను తెరాస సమర్ధించిన విషయాన్నీ గుర్తు చేస్తూ, తెరాస, బీజేపీ షాడో ఫైటింగ్ చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు. మరో వంక బీజేపీ నాయకులు  కాంగ్రెస్, తెరాస జోడీ పై అవే ఆరోపణలు చేస్తున్నారు. బయటకు  తిట్టుకున్నా కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ ఒకటేనని బీజేపీ నేతలు అరిపిస్తున్నారు. అదే విషయాన్ని బలంగా జనాల్లోకి తీసుకెళ్తోంది. పైగా.. కాంగ్రెస్‌ నేతలకు ఓట్లేస్తే, ఆ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో ఉండరని, ఇందుకు సంబంధించి కళ్ళముందున్న అనుభవాల ఆధారంగా  ఆలోచించుకోవాలని ప్రజలను కోరుతున్నారు. గత ఎన్నికల్లో, అంతకు ముందు ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ మీద గెలిచిన ఎమ్మెల్యేలలో మూడొంతుల మంది తెరాసలో చేరారని గుర్తు చేస్తున్నారు.  నిజానికి, రాష్ట్రంలో తెరాసకు ప్రధాన ఎన్నికల రాజకీయ ప్రత్యర్ధి కాంగ్రెస్ పార్టీనే, అయినా, ఇంతవరకు కేసేఆర్ ఎప్పడూ కూడా కాంగ్రెస్ పార్టీని రాజకీయ ప్రత్యర్ధిగా భావించలేదు. కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలిచినా, హస్తం పార్టీ ఎమ్మెల్యేలు  పిలవకుండానే తెరాసలో చేరతారనే విశ్వాసంతో, కాంగ్రెస్ పార్టీని ఒక ఫ్రెండ్లీ పార్టీగానే చూస్తు వచ్చారు. కానీ, ఇప్పడు, థర్డ్ ఫోర్సుగా బీజేపీ తెర మీదకు రావడం, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఏకంగా ముఖ్యమంత్రి పీఠానికే ఎసరు పెట్టడంతో, కేసీఆర్వ్యూ హం మార్చుకుంటున్నారని అంటున్నారు. అవసరం అనుకుంటే కాంగ్రెస్ పార్టీ తో ప్రత్యక్ష  పొత్తుకు కూడా వెనకాడక పోవచ్చని   అంటున్నారు.

51 వేల మందికి ‘అమ్మ ఒడి’ ఎగనామం!

దేవుడి స్క్రిప్ట్ అలా ఉంది. నేనేం చేయగలను అంటూ జగన్ అమ్మ ఒడిపై చేతులెత్తేశారు.  రాష్ట్రంలో అమ్మ ఒడి పథకానికి 51 వేల మందిని దూరం చేసేశారు. పైగా ఇందులో నా తప్పేమీ లేదు... మీ పిల్లల హాజరు 75శాతం లేదు.. అది మీ తప్పేనంటూ నెపం తల్లుల మీదకు నెట్టేశారు. ఒక విధంగా 51 వేల మంది అమ్మలను అమ్మఒడి పథకానికి దూరం చేయడం ద్వారా  జగన్ తనకు చాతకాదని బహిరంగంగా ఓప్పుకున్న సందర్భమింది. రాష్ట్రంలో  51 వేల మంది అమ్మలకు అమ్మఒడి ఇవ్వడం లేదని జగన్ బహిరంగంగా అంగీకరించారు. అయితే వారు అమ్మ ఒడికి దూరం కావడానికి మాత్రం తను కారణం కాదని అంటున్నారు.  విద్యార్థుల హాజరు శాతం 75 లేకపోవడం వల్లే  ఆ  తల్లులందరికీ అమ్మ ఒడి ఇవ్వలేదని సాకు చెబుతున్నారు. ఇది ఎంత వరకూ సమంజసమనే   ప్రశ్న పలువురి నుంచి వస్తోంది. రాష్ట్రంలో ఈ  సారి 51 వేల అమ్మలకు అమ్మ ఒడి ఎగ్గొట్టినట్టు ఏ మాత్రం సంకోచం లేకుండా జగన్ చెప్పడాన్ని పలువురు గర్హిస్తున్నారు. శ్రీకాకుళం పర్యటనలో భాగంగా సీఎం జగన్ స్థానిక కోడి రామ్మూర్తి స్టేడియంలో అమ్మ ఒడి పథకం మూడో విడత కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 75 శాతం హాజరు ఉండాలని అమ్మ ఒడి జీవోలోనే  పొందుపర్చామని చెప్పారు. ఆ జీఓ ప్రకారం 51 వేల మంది తల్లుల పిల్లల హాజరు శాతం నిర్దేశించిన దాని కంటే తగ్గిందని, అందుకే వారికి అమ్మ ఒడి అందించ లేదని చెప్పుకొచ్చారు. పైగా భవిష్యత్ లో మళ్లీ ఇలాంటి పరిస్థితి తెలత్తకూడదంటే తల్లులు తమ పిల్లల్ని బడికి పంపాలంటూ సలహా పారేశారు.  జగన్ చెప్పిన ప్రకారమే చూసుకుంటే.. అంత మంది విద్యార్థులకు హాజరు శాతం ఎందుకు తగ్గింది? వారంతా ఎందుకు పాఠశాలలకు హాజరు కాలేదు? అనే విషయాన్ని సమీక్షించాల్సిన ఆవశ్యకత ప్రభుత్వానికి లేదా? అని రాజకీయ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.   ఒక పక్కన కరోనా వచ్చి విద్యా సంస్థలు సరిగా నడవలేదు. ఆన్ లైన్ తరగతుల పేరుతో ఎందరో విద్యార్థులు ఇళ్ల నుంచే క్లాసులకు హాజరయ్యారు. గత విద్యా సంవత్సరం పాఠశాలలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. బయటికి వెళ్తే   ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని ఆందోళనకర పరిస్థితుల్లో విద్యార్థుల హాజరు శాతం తగ్గిన మాట వాస్తవమే కావచ్చు. దొరికిందే సందు అనే విధంగా ఎప్పుడు ఏ వంక దొరికితే..   హామీల లబ్ధిదారుల సంఖ్యను కుదించేద్దామా అన్న  రీతిలో జగన్  సర్కార్ వ్యవహరిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే విద్యార్థుల హాజరు శాతం నెపంతో వేలాది మంది తల్లులను అమ్మ ఒడి పథకాకి జగన్ సర్కార్ దూరం చేసిందని పలువురు విమర్శిస్తున్నారు. పథకాలను ఎగ్గొట్టే దురాలోచన చేస్తూనే.. అమ్మ ఒడి పథకంపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని జగన్ ఆరోపించడంలోని ఔచిత్యాన్ని ప్రశ్నిస్తున్నారు. అమ్మ ఒడి పథకాన్ని విమర్శించే వారిలో ఒక్కరైనా.. పిల్లల్ని చదివించే తల్లులకు ఒక్క రూపాయి అయినా ఇచ్చారా? అని ఆయన ప్రశ్నించడాన్ని తప్పుపడుతున్నారు. స్కూలుకు తమ పిల్లల్ని పంపించే తల్లులకు అమ్మ ఒడి అందిస్తామని హామీ ఇచ్చింది జగన్ అయితే.. విమర్శకులు డబ్బులు ఇచ్చారా? అని అనడంమేమిటని అంటున్నారు.    తన హామీలకు కోతలు పెట్టేందుకు, ఎగ్గొట్టేందుకు దారులు తానే వెదికిన జగన్ రెడ్డి ఇప్పడు ‘అంతా మీరే చేశారు’అన్న రీతిలో విద్యార్థులు, వారి తల్లులపైనే నెపం నెట్టేయడం దారుణం అంటున్నారు. అంత మంది తల్లులకు అమ్మ ఒడి ఎగ్గొట్టడమే కాకుండా.. ‘తనకు ప్రజల అండ ఉన్నంత వరకు ఎవరూ తన వెంట్రుక కూడా పీకలేరం’టూ మరోసారి తన అక్కసును, అసహనాన్ని బహిరంగంగా వెళ్లగక్కడం విస్మయానికి గురిచేస్తోందంటున్నారు. ఇప్పుడు అమ్మ ఒడి పథకం డబ్బులు ఎగ్గొట్టడమే కాకుండా.. ‘తల్లికి కూడు పెట్టనోడు.. పినతల్లికి గాజులు చేయించాడు’ అన్న చందంగా పేద విద్యార్థుల కోసం బైజూస్ యాప్ తీసుకొచ్చామంటున్నారు. 4.7 లక్షల మంది 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ లు ఇస్తారట. ఉన్నది పీకేసి లేనిది ఇవ్వడం అంటే ఇదేనేమో అంటున్నారు.

ముర్ము కి వ్య‌తిరేకం కాదు.. కేటీఆర్‌

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌సిన్హా కు టీఆర్ఎస్  మద్దతు ఇస్తుందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశా రు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా  యశ్వంత్ సిన్హా సోమవారం నామినేషన్  వేశారు. ఆ కార్యక్రమానికి హాజరైన కేటీఆర్   విలేక‌రుల‌తో మాట్లాడుతూ,  త‌మ‌కు తోచిన విధంగా పాల‌న సాగించేవారికి, ఇత‌రుల సంగ‌తి ప‌ట్ట‌ని వారికి ఎప్పుడూ వ్య‌తిరేక‌తే ఎదుర వుతుందన్నారు. తాము అద్భుతంగా ప‌రిపాలిస్తున్నామ‌ని భ‌జ‌న చేసుకోవ‌డంలోనే బిజెపీ కాలం గ‌డుపుతోందే గాని తెలంగాణా ప్రభుత్వం అభ్య‌ర్ధ‌న‌లు బొత్త‌గా ప‌ట్టించుకోవ‌డంలేదన్న‌ది తెలంగాణ ప్రజల అభిప్రాయమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్ధిగా బిజెపీ కూట‌మి ద్రౌప‌ది ముర్మును నిల‌బెట్టింది. ఆమె ఒరిస్సా వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తు ల‌కు చెందిన మ‌హిళ అయినా   తెలంగాణా ప్ర‌భుత్వం ఆమెకు మ‌ద్ద‌తునీయ‌డానికి  నిరాక‌రించిం ది. అయితే అది ఆమె ప‌ట్ల వ్యతిరేకత కాద‌ని ఆయన స్పష్టం చేశారు. కేంద్రం ప్ర‌భుత్వం త‌మ ప‌ట్ల వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుకి నిర‌స న‌గానే ముర్ముకి మ‌ద్ద‌తు ఇవ్వ‌డంలేద‌ని కేటీఆర్ అన్నారు.  కేంద్రం గిరిజ‌న మ‌హిళ‌ను రాష్ట్ర‌ప‌తిని  చేయ‌డానికి  అంద‌రి మ‌ద్ద‌తు  కోరుతున్నారు కానీ  తెలంగాణా ప్ర‌భుత్వం తెలంగాణాలోని ఏడు గిరిజ‌న మండ‌లాల‌ను త‌మ‌కు తిరిగి ఇవ్వాల‌ని చేస్తున్న డిమాండ్‌ను మాత్రం కేంద్రం పెద్దలు ప‌ట్టించుకోవ‌డం లేదని విమర్శించారు. అలాగే అత్యంత కీల‌క‌మైన గిరిజ‌న యూనివ‌ర్సిటీ ఏర్పాటు గురించి తెలంగాణా ప్ర‌భుత్వ అభ్య‌ర్ధ‌న‌ను కూడా కేంద్రం పెడ‌చెవిన పెట్టిందన్నారు.  ఈ ప‌రిస్థితుల్లో  బిజెపి కూట‌మి నిల‌బెట్టిన అభ్య‌ర్ధికి తెలంగాణా ప్ర‌భుత్వం ఏ విధంగా మ‌ద్ద‌తునిస్తుందని ప్రశ్నించారు.  అందుకే విప‌క్షాల రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్ధి య‌శ్వంత్ సిన్హాకు టీఆర్ ఎస్ మ‌ద్ద‌తునిస్తున్నద‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.  ద్రౌపది ముర్ముపై తమకు ఎలాంటి వ్యతి రేకత లేదని, బీజేపీ నిరంకుశ వైఖరిని మాత్రమే వ్యతిరేకిస్తున్నామని కేటీఆర్ చెప్పారు. బీజేపీ అక్రమాలకు అడ్డూ అదుపూ లే కుండా పోతోందని తీవ్ర స్థాయిలో విమర్శించారు.  యశ్వంత్ సిన్హా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కేటీఆర్ తో పాటు   టీఆర్ఎస్ నేతలు నామా నాగేశ్వరరావు, డాక్టర్ రాములు, కొత్త ప్రభాకర్ రెడ్డి, డాక్టర్ రంజిత్ రెడ్డి, వెంకటేష్, రవిచంద్ర, పాటిల్ తదితరులు పాల్గొన్నారు.

వైసీపీకి భంగ‌పాటు.. బిజెపీకి ఆయాసం!

ప‌రిస్థితులు బాగోన‌పుడు వున్న‌దానితోనే సంతృప్తిప‌డాలి. వ‌చ్చేది ఎలాగూ వ‌స్తుంది గ‌నుక మ‌న స‌త్తా చూపించి ఇత‌రుల‌ను భ‌య‌పెట్టి, కానుక‌లు ఇచ్చి సాధించాల‌న్న ఆతృత‌తో సాధించేది ఏదీ గొప్ప విజ‌యం అనిపించు కోదు. ఇపుడు ఆత్మ‌కూరు ఉప ఎన్నిక‌ల విష‌యంలోనూ జ‌గ‌న్ ఆధ్వ‌ర్యంలోని వైసీపీ గెలిచినా గెలిచిన సంతృప్తి లేకుండాపోయింది. దివంగత మంత్రి మేకపాటిగౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో ఆత్మకూరు ఉప ఎన్నిక అనివార్యమైంది. సంప్రదాయంప్రకారం ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ పోటీకి  దూరంగా ఉంది. ఇక ఆది వైసీపీ, బీజేపీ, బీఎస్సీలతోపాటు మొత్తం 14 మంది బరిలో నిలిచారు. టీడీపీ బరిలో లేక పోవడంతో లక్ష ఓట్ల  మెజారిటీ వస్తుందని వైసీపీ అగ్రనాయకులు భావించారు. ఆ లక్ష్మసాదనే ధ్యేయంగా మంత్రులు, ఎమ్మెల్వేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నాయకులు ఆత్మకూరులోనే మకాం వేసి ప్రచారాన్ని ఊదరగొట్టారు.  నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల్లో మండలానికి ఓ మంత్రి, ఎమ్మెల్యేను  ఇన్ఛార్జులుగా  నియ మించారు. ఇంత చేసినా పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం, మంత్రుల  రోడ్ షోలు వెల వెల బోవ డం, తాయిలాలు వ్య‌ర్ధ‌మ‌వ‌డ‌మే మిగిలి భంగ‌పాటు త‌ప్ప‌లేదు. ఎంత‌చేసినా చివ‌రికి  82,888  ఓట్ల తో వైసీపీ గెలిచింది. పోటీలో వైసీపీకి చుక్క‌లు చూపాల‌నుకున్న బిజేపీ 19,332 ఓట్ల‌తో స‌రిపెట్టుకుంది.   2019 సార్వత్రిక ఎన్నికల్లో కేవలం రెండు వేల పైచిలుకు నోటాకు రాగా ఇప్పుడు రెండింతల ఓట్లు వేసి అభ్యర్థులందరినీ తిరస్క రించడం గమనార్హం. లక్ష మెజారిటీ కోసం సర్వశక్తులూ ఒడ్డిన వైసీపీ మంత్రు లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా  ఆత్మకూరులోనే! బసచెసినా..గతం కంటే 18 శాతం పోలింగ్ తగ్గుదల వచ్చింది. దీంతో 82.888 ఓట్ల మెజారిటీతో విక్రమ్ రెడ్డి విజయసాధించారు. 19,332 ఓట్లతో  బీజేపీ సరిపెట్టుకోక తప్పలేదు. పాల‌నాప‌ర వ్య‌తిరేక‌త ప్ర‌జ‌ల్లో వెల్లువెత్త‌డంతో వారిని సుముఖం చేసుకో వాల్సి వ‌చ్చి ఓట‌రుకు రూ.500 చొప్పున నియోజ‌క‌వ‌ర్గంలో సుమారు 80 శాతం మందికి పంచిన‌ట్లు స‌మా చారం.  ఇందుకు బాధ్యులుగావలంటీర్లు, పొదుపు వీఏవోలను నియమించు కున్నారు.ఇందుకుగాను వీరికి రూ.5 వేలు చొప్పున ముట్టజె ప్పారు. ఏదో అభివృద్ధి ప‌నుల‌కు ఇచ్చిన‌ట్టు ఇలా పంప‌కాలు చేయ‌డ మేమిటో ప్ర‌భుత్వంవారే సెల‌వియ్యాలి.  ఇక్క‌డ పెద్ద విడ్డూర‌మేమంటే.. ఆత్మ‌కూరు రైతాంగానికి బకా యిలు వెంట‌నే చెల్లించేయ‌డం. జిల్లా మొత్తం మీద ఎంతోమంది రైతులు బ‌కాయిల కోసం వేచి చూస్తుం టే, ఆత్మ‌కూరువారికి మాత్ర‌మే ఆ సౌక ర్యం వెంట‌నే క‌ల్పించ‌డం కేవ‌లం వారి ఓట్ల‌కు గాలం వేయడ మేన‌ని అర్ధ‌మ‌వుతుంది. మ‌రో వంక కాంట్రా క్ట‌ర్ల నుంచి కూడా వ్య‌తిరేక‌త రాకుండా వారికీ బిల్లులు  మం జూరు చేయ‌డం! పోనీ ఇంత‌జేశారు ల‌క్ష మెజారిటీ క‌ల నెర‌వేరిందా అంటే అది కాలేదు. అస‌లు పోలింగ్ శాత‌మే ఆశించిన స్థాయిలో పెర‌గ‌క పోవ‌డ‌మూ గ‌మ‌నార్హ‌మే.  2019 ఎన్నికలతో పోల్చితే 18 శాతం పోలింగ్ తగ్గింది. ఈ ప్రభావం మెజారిటీ పై పడింది.   ఈ ఉప ఎన్నికలో నోటాకు ఎక్కువ మంది.ఓట్లు వేశారు. 2019లో 2 వేల పై చిలుకు ఓటర్లు మాత్రమే నోటాకు ఓటు వేస్తే ఇప్పుడు 4179 మంది నోటాకు ఓటు వేసి అభ్యర్థులందరినీ తరస్క రించడం గమనార్హం. టీడీపీ పోటీలో లేకపోవడం వైసీ పీపై వ్యతిరేకతతో ఎక్కువగా నోటావైపే మొగ్గు చూపారు. బ్యాలెట్ ఓట్లలో సైతం నోటాకు మూడు ఓట్లు రావడం గమనార్హం. ఇక బిజేపీ వారి విష‌యానికి వ‌స్తే, ఆత్మ‌కూరులో గ‌ట్టిపోటీ ఇవ్వ‌డానికి ప్ర‌య‌త్నించారు. 40 నుంచీ 50 వేల ఓట్లు సాధించి రాష్ట్ర‌ పార్టీలో కొత్త వూపు తీసుకురావాల‌నుకున్నారు. అందుకు మేమేమీ త‌క్కువ  తిన్న వాళ్లం కావ‌ని హేమాహేమీల‌ను ప్ర‌చార రంగంలోకి దింపారు.  ఒక దశలో గెలు తమదేనన్నారు . అయితే వీరి అంచనాలు తలకిందులయ్యాయి. ఆ పార్టీ నాయకులు సర్వశక్తులు ఒడ్డి పోరాడినాకేవలం 19, 332 మాత్రమే సాధించగలిగారు. అయితే 2019 ఎన్నికల్లో ఈ పార్టీకి 2వేల పైచిలుకు ఓట్లు మాత్రమే దక్కాయి. ఈ మూడేళ్ల కాలంలో బీజేపీ బలపడిందని చెప్పడానికి  వీలులేని పరిస్థితి ప్రధాన ప్రతిపక్షమైన  టీడీపీ ఎన్నికల బరిలో లేదు కాబట్టి అనంతృప్తి  ఓట్లు బీజేపీకి పడ్డాయనే వాదన ఉంది. ఇక  బీఎస్సీకి  కేవలం 4, 897 ఓట్లతో సరిపెట్టుకోవాల్సివచ్చింది. ఆత్మ‌కూరు ఉప ఎన్నిక‌లో వైసీపీ విజ‌యం గ్యారంటీ అని తేలేక  బెట్టింగ్‌రాయ‌ళ్ల హ‌డావుడి  అంతా యింతా  కాకుండా పోయింది.  టిడీపీ పోటీలో లేదుగ‌నుక, ఇక్క‌డ బిజెపీకి అవకాశం లేదుగ‌నుక నిజంగానే వైసీపీ పెద్ద మెజారిటీతో  గెలుస్తుంద‌ని బెట్టింగ్ బాబులు పందాలు కాయ‌డంలో త‌ల‌మున‌క‌ల‌య్యారు.  వైసీపీ అబ్య‌ర్ధి త‌ప్ప‌కుండ ల‌క్ష మెజారిటీతో గెలుస్తాడ‌ని రెండింత‌ల ఉత్సాహంతో పందాలు కాసిన వారం తా పోలింగ్ ప్రక్రియ‌, ఫ‌లితాల ప్ర‌క‌ట‌న‌ల‌తో నీరుగారిపోయారు. అస‌లు పార్టీవారు ఆశించిన ల‌క్ష మెజా రిటీకి క‌నీసం ద‌గ్గ‌ర‌లో కూడా ఓట్లు ప‌డ‌లేదు.  పోలింగ్ ప్రక్రియపూర్తయినప్పటి నుంచి వైసీపీ మెజార్టీపై కొందరు, బీజేపీకి 15 వేలఓట్లు కూడా దాటవని మరి కొందరు బెట్టింగులు కాశారు. జిల్లాలోనే ఇతర జిల్లాల్లో సైతం బెట్టింగ్ల జోరు కొనసా గింది. పోలింముందు నుంచే కొంతమంది ఆత్మకూరు నియోజక వర్గంలోని పలు ప్రాంతాల్లో సర్వే చేసుకుని వెళ్లడం గమనార్హం. వైసీపీకి  అత్యధిక మెజార్టీ వస్తుందని కొందరు, ప‌ది వేలకు పైబడి మెజారిటీ దక్కదని మరికొందరు పందేలు కాసినవారికి ఎదురుదెబ్బ తగిలింది. 

పుట్టలో వేలు పడితే చీమ కుట్టదా.. వర్షాలు పడితే రోడ్డు పాడవ్వదా.. !

ఆడలేక మద్దెలోడు అన్నట్లుంది వైసీపీ తీరు. వైసీపీ హయాంలో ఏపీలో రోడ్లు ధ్వంసం కావడానికి కారణం వర్షాలట. అదే చంద్రబాబునాయుడి హయాంలో రాష్ట్రంలో వర్షాలు పడలేదు కనుక రోడ్లు పాడు కాలేదట. చిత్తూరు జిల్లా పుంగనూరులో జరిగిన వైసీపీ సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించిన మహా రహస్యమిది. ప్లీనరీలో మంత్రి పెద్ది రెడ్డి మాట్లాడుతూ  జగన్ ప్రభుత్వం ఎన్నికల హామీలలో 95శాతం నెరవేర్చిందని చెప్పారు. అదే చంద్రబాబు హయాంలో అయితే ఇచ్చిన హామీలలో అధిక శాతం హామీలను అమలు చేయలేదని పేర్కొన్నారు. పుట్టలో వేలెడితే కుట్టనా అన్నదట చీమ.. అలాగే వర్షాలు పడితే రోడ్లు పాడవ్వవా అంటున్నారు పెద్ది రెడ్డి. కరోనా కారణంగా గత రెండేళ్లూ ప్లీనరీ జరుపుకోలేకపోయామనీ, ఈ ఏడాది జూలై 8, 9 తేదీలలో వైసీపీ ప్లీనరీ ఘనంగా జరుపుకుంటామని అన్నారు. గడపగడపకూ కార్యక్రమంలో తాను పొల్గనకపోవడంపై విపక్షాలు ఇష్టారీతిగా మాట్లాడుతున్నాయనీ, తనకు బాధ్యతలు ఎక్కువ కావడం వల్లనే గడపగడపకూ వెళ్లలేకపోయాననీ అన్నారు. అయినా తాను గడప గడపకూ వెళ్లడమెందుకు.. నేరుగా సమస్యలు తనకు తెలియజేస్తే తక్షణమే వాటిని పరిష్కరిస్తానని పెద్దిరెడ్డి చెప్పారు.  గతంలో డ్వాక్రా రుణమాఫీ అని చెప్పి చంద్రబాబు మోసం చేశారన్నారు. తన ఇన్నేళ్ల రాజకీయ ప్రస్థానంలో 95 శాతం హామీలు అమలు చేసిన ముఖ్యమంత్రి జగన్ మాత్రమేనని పెద్దిరెడ్డి అన్నారు. చంద్రబాబు హయాంలో అసలు వర్షాలు పడేవి కాదని.. అందుకే రోడ్లు పాడు అయ్యేవి కాదని మంత్రి పెద్దిరెడ్డి అభిప్రాయపడ్డారు. కానీ వైఎస్ జగన్ సీఎం అయ్యాక రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలు కురుస్తున్నాయని అందుకే రోడ్లు పాడౌతున్నాయని పెద్దిరెడ్డి వెల్లడించారు. అయినా పాడైన రోడ్లకు ఎప్పటికప్పుడు మరమ్మతులు చేపడుతున్నట్లు చెప్పారు.

ఇంత‌కంటే రెచ్చ‌గొట్టే చ‌ర్య ఉంటుందా?

త‌మ పార్టీ నిర్మాత విగ్ర‌హం వ‌ద్ద వైసీపీ ప్ర‌భుత్వం డివైడ‌ర్లు ఏర్పాటు చేసింద‌ని టిడీపీ శ్రేణులు రెచ్చి పోయారు. డివైడ‌ర్ల‌ను కాళ్ల‌తో త‌న్ని కూల్చేసిన సంఘ‌ట‌న నెల్లూరు న‌ర్త‌కీ సెంట‌ర్ లో జ‌రిగింది.  ప్ర‌ధాన ప్ర‌తి ప‌క్షం టిడీపీని రాజ‌కీయంగా ఎదుర్కొన‌లేక వైసీపీ ప్ర‌భుత్వం ఈ విధ‌మైన దుశ్చ‌ర్య‌ల‌కు పాల్ప‌డు తోందని టీడీపీ వ‌ర్గీయులు తీవ్ర‌స్థాయిలో నిల‌దీశారు. అస‌లే రాష్ట్రంలో రాజ‌కీయ ప‌రిస్థితులు అన‌నుకూలించ‌డంతో వైసీపీ ప్ర‌భుత్వం టీడీపి వ‌ర్గాల‌కు అన్ని విధాల స‌మ‌స్య‌లు క‌ల్పించాల‌న్న త‌లంపుతోనే ప్ర‌తీ చిన్న అంశాన్ని ర‌చ్చ‌చేసి వీధి పోరాటాల‌కు దిగు తున్నారు. వాస్త‌వానికి న‌ర్త‌కి  సెంట‌ర్‌లోని ఎన్టీఆర్  విగ్ర‌హం ద‌గ్గ‌ర డివైడ‌ర్ ఏర్పాటు  పార్టీ వర్గీయుల‌ను రెచ్చగొట్ట‌డానికి చేప‌ట్టిన చ‌ర్యేన‌ని న‌గ‌ర నియోజ‌క‌వ‌ర్గం టీడీపీ ఇన్ ఛార్జ్ కోటంరెడ్డి శ్రీ‌నివాసులు  ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. టిడీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లూ  రోడ్డ‌పై  బైఠాయంచారు. కార్పోరేష‌న్ అధికారుల‌ను తీవ్ర‌స్థాయి లో నిల‌దీస్తూ భారీ నినాదాలు చేశారు. పోలీసులు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని ప‌రిస్థితుల‌ను అదుపు లోకి తెచ్చారు.ఈ సందర్భంగా నెల్లూరు నగర నియోజకవర్గం టీడీపీ ఇన్ చార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ‘ఎన్టీఆర్ విగ్రహం వద్ద అడ్డంగా డివైడర్ కడితే నేనే పగలగొట్టా.. ఏం పీకుతారు?’ అంటూ సవాల్ చేశారు. ఎన్టీఆర్ విగ్రహం వద్ద రాజకీయం చేయాలని చూస్తే తీవ్ర పరిణామాలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఒక వైపున రాష్ట్ర ఖజానాలో నిధులు లేవని చెబుతున్న వైసీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ విగ్రహం వద్ద డివైడర్ ను అడ్డంగా ఎలా కడుతుందని కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ప్రశ్నించారు. నెల్లూరు కరెంట్ ఆఫీస్ వద్ద ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి అనుమతి లేదని, జిల్లా వ్యాప్తంగా అనేక  ప్రాం తాల్లో ఇష్టారాజ్యంగా వైఎస్ఆర్ విగ్రహాలు ఏర్పాటు చేశారన్నారు. నర్తకి సెంటర్లో డివైడర్ కావాలని  ఎవ రడిగారని, ఎందుకు నిర్మిస్తున్నారని కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి సూటిగా ప్రశ్నించారు.