కిస్సూ,, ఆ డ్రెస్సూ తప్ప... ఇంకేదైనా ఓకె

      బాలీవుడ్‌ బ్యూటీ సోనాక్షిసిన్హా ఓ నిర్మాతకు నో చెప్పడానికి కారణం ఇప్పుడు అక్కడ టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌ అయింది. కిస్సింగ్‌ సీన్లు, బికినీ సీన్లు ఉన్న ఓ సినిమా ఆఫర్‌ని ఈ అమ్మడు ఛస్తే చేయను పొమ్మందట. మరి లుటేరా సినిమాలో అంతగా రణవీర్‌తో హత్తుకుని ఒత్తుకుపోయావ్‌గా అని అడిగితే... అలా ఎంతగా కిందా మీదా పడినా పర్లేదు కానీ... పెదాలు కలపమన్నా, బికినీ వేసుకోమన్నా నా వల్ల కాదని తేల్చి చెప్పేసిందట. అసలు లుటేరాలో కూడా ముద్దు సీన్‌ ఉండాల్సిందే కానీ... తానే ఒప్పుకోలేదని అందుకే దర్శకుడు ఆ శ్రుంగార సన్నివేశాన్ని మరింత ఘాటుగా చిత్రీకరించాడని వివరించింది. తన తల్లి, తండ్రి ఇంకా కుటుంబ సభ్యులంతా కలిసి చూడదగ్గ సినిమాలే తాను చేస్తానని ఈ 26ఏళ్ల బొద్దు సుందరి ప్రకటించింది. తాము చేస్తున్న ‘సెక్స్‌’పోజింగ్‌ను తప్పు పడుతున్నట్టుగా ఉన్న సోనాక్షి మాటలు విని... ప్రస్తుతం ఈ అమ్మడు నటిస్తున్న హాలిడే చిత్రంలో అక్షయ్‌తో ఎంత పవిత్రమైన సన్నివేశాలున్నాయో చూసి అప్పుడు చెబుదామని పోటీ హీరోయిన్లు కసిగా పళ్లు నూరుకుంటున్నారట.

వందకోట్లిస్తేనే... వదులుతా...

      ఇదేదో కిడ్నాప్‌, బ్లాక్‌మెయిలింగ్‌ వార్త కాదు. నిన్నటిదాకా బాలీవుడ్‌లోనే అత్యంత అందమైన అనురాగవంతమైన దంపతులుగా పేరొందిన భార్యాభర్తల మధ్య నడచిన కోల్డ్‌వార్‌కు ఫలితం. హీరో హ్రుతిక్‌రోషన్‌, ఆయన భార్య సుజానె... మధ్య ఇంతకాలం నడచిన నిశ్శబ్థయుద్ధం కాస్తా ఇటీవలే వెలుగులోకి రావడం, వీరిద్దరూ విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకోవడం... తెలిసిందే. అయితే విడాకులిచ్చేందుకు పరిహారంగా రూ.100కోట్లు తనకు ఇవ్వాలని సుజానే డిమాండ్‌ చేస్తున్నట్టు వినికిడి. ఇన్నేళ్ళ సంసారంలో తాను వ్యక్తిగతంగా కోల్పోయిన విలువైన కాలానికి ఇది ఎంతమాత్రమూ సరిపోయే మొత్తం కానప్పటికీ... ఇంతటితో సరిపుచ్చుకుంటానని సుజానె అంటోందట. పైగా పిల్లల బాగోగులకు కూడా కొంత మొత్తం అవసరం కదా అని ఆమె వాదనట. ఈ విషయంలో పెద్దలు బేరసారాలు జరుపుతున్నారట. మొత్తానికి బాలీవుడ్‌ సినిమాలకే కాదు విడాకులకూ కలెక్షన్లు బాగానే ఉన్నాయన్నమాట.

అక్కినేనివారి ‘అందగత్తె’ అదుర్స్‌...

      ఎఎన్‌ఆర్‌ ఫ్యామిలీలో అందమైన వారసులకు కొదవలేదు. అదే కోవలో ఇప్పుడు ఓ అందగత్తె కూడా సినీపరిశ్రమ వర్గాలను ఆకట్టుకుంటోందట. ముద్దొచ్చే ఆ ముద్దబంతి పేరు ‘సుమంతి’... ఈ పేరు ఎక్కడో విన్నట్టుందే అనుకుంటున్నారా? కరెక్టే. అక్కినేని నటవారసుల్లో ఒకరైన హీరో సుమంత్‌ కాస్తా అందమైన అమ్మాయిగా మారిపోయాడు. కేవలం సినిమా కోసమే సుమా. ఆయన హీరోగా నటించిన గుర్రం ఎగరావచ్చు సినిమా కోసం సుమంత్‌ ఆడవేషంలో కనిపించనున్నారు. చాలా తక్కువ మంది హీరోలకు మాత్రమే నప్పే ఆడవేషం సుమంత్‌కు అద్భుతంగా నప్పిందని, ఈ గెటప్‌ సినిమాలో హైలెట్‌ అవుతుందని సదరు సినిమా యూనిట్‌ సంబరపడుతోంది. ఈ అందమైన అమ్మాయి గెటప్‌లాగే సినిమా రిజల్ట్‌ కూడా అదిరిపోవచ్చు... సుమంత్‌ కెరీర్‌ దూసుకుపోవచ్చు.. ఏమో... గుర్రం ఎగరావచ్చు.

పాపకు దూకుడు బాగా ఎక్కువయ్యిందట...!

  మహేశ్‌బాబు "నేనొక్కడినే" చిత్రం పోస్టర్ పై రోజుకో చర్చ పెరుగుతుంది. ఆ పోస్టర్ మహిళలను కించపరచేదిగా ఉందంటూ సమంత తన ట్విటర్‌లో విమర్శించడంతో తెలుగు ఇండస్ట్రీలో ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది. పైగా సమంత మాటలను దర్శకుడు శేఖర్ కమ్ముల సమర్ధించడం వలన ఈ వివాదం మరింత ఎక్కువయ్యింది. దాంతో ఇప్పటివరకు సమంత పైన తీవ్ర ఆగ్రహంతో ఉన్న మహేష్ అభిమానులు.. శేఖర్ పై కూడా వ్యతిరేకంగా నిలుస్తున్నారు. అయితే సమంత ఈ విధంగా చేయడానికి గల కారణం..."కేవలం తనకు "1" సినిమాలో అవకాశం ఇవ్వనందుకే అని, అంతే కాకుండా.. కనీసం మహేష్ తన కొత్త సినిమా "ఆగడు"లో అయిన తనను తీసుకోలేదనే కోపంతోనే ఇలా చేస్తుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఇలాగే ఈ అమ్మడు మరికొన్ని రోజులు చేస్తే తెలుగు ఇండస్ట్రీ నుండి బ్యాగ్ సర్దుకొని తమిళనాడుకు వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడేలా ఉందని తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే మహేష్ అభిమానులందరూ కూడా ఈ అమ్మడికి పూర్తిగా వ్యతిరేకంగా మారిపోయారు. మరి ఈ అమ్మడి పరిస్థితి ఎలా ఉండబోతుందో త్వరలోనే తెలియనుంది.

రహస్యంగా చేసేసుకుందట...!

  హిందీ, తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తూ, హీరోయిన్ గా తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకున్న అందాల సుందరి సమీరారెడ్డి. అయితే ఈ అమ్మడి ఎంగేజ్ మెంట్ కార్యక్రమం ఈనెల 14న ముంబైకి చెందిన బిసినెస్ మాన్ అక్షయ్ వార్దే తో జరిగిందని తెలిసింది. వీరిద్దరి వివాహం 2014 ఫిబ్రవరిలో జరగనుందని తెలిసింది. అక్షయ్ కు మోటార్ బైక్స్ తయారు చేసే కంపెనీ ఉంది. ఇటీవలే విడుదలైన "ఓ మై గాడ్" చిత్రంలో అక్షయ్ కుమార్ నడిపిన బైక్ ను వీరి కంపెనీయే తయారు చేసింది. అయితే వీరిద్దరూ కూడా గతకొంత కాలంగా ప్రేమించుకుంటున్నారని తెలిసింది. మరి ఈ విషయాలపై సమీరా ఎలా స్పందిస్తుందో త్వరలోనే తెలియనుంది.

ప్రిన్స్ పోలీస్ స్టేషన్ రెడీ

  మహేష్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో "ఆగడు" చిత్రం తెరకెక్కుతుంది. ఈరోజు నుండి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. ఈ చిత్రంలో మహేష్ పోలీస్ పాత్రలో నటిస్తున్నాడు. ఇందుకోసమే ఇప్పటికే హైదరాబాద్ శివారులో ఒక పోలీస్ స్టేషన్ సెట్ కూడా రెడీ చేసారు. మొదటిసారిగా ఈ చిత్రం ద్వారా మహేష్ కు జోడిగా తమన్నా నటిస్తుంది. అదే విధంగా ఇప్పటివరకు అమ్మ, అత్త పాత్రలలో కనిపించిన నదియా.. ఇపుడు మహేష్ కు అక్క పాత్రలో కనిపించబోతుంది. 14రీల్స్ ఎంటర్ టైన్‌మెంట్ బ్యానర్లో అనిల్ సుంకర, గోపి ఆచంట, రామ్ ఆచంట సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.

కమెడియన్ తో రొమాన్స్ కు సిద్ధమైన త్రిష...!

  స్టార్ హీరోల నుండి యువ హీరోలందరితో కలిసి నటించిన హీరోయిన్ త్రిషకు తెలుగులో ప్రస్తుతం అవకాశాలు కరువయ్యాయి. ప్రస్తుతం తమిళంలో ఒకటి, అర చిత్రాలలో నటిస్తూ ఏదైనా సినిమా అవకాశం వస్తుందా అని ఆశగా ఎదురుచూస్తుంది. అయితే ఈ తరుణంలో అమ్మడికి ఒక భారీ రెమ్యునరేషన్ ఆఫర్ వచ్చింది. తాజాగా ప్రముఖ కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి హీరోగా పి.వి.పి. సంస్థ ఓ చిత్రాన్ని నిర్మించబోతుంది. అయితే ఈ చిత్రంలో ఓ స్టార్ హీరోయిన్ కావాలని భావించి, త్రిషను ఎంపిక చేసుకున్నారు. ఈ విషయంపై త్రిషను అడగగానే ఒప్పేసుకుంది. కానీ భారీగా రెమ్యునరేషన్ అడిగిందట. త్రిష అడిగిన పారితోషకంను ఇవ్వడానికి చిత్ర నిర్మాతలు అంగీకరించడంతో త్రిష ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది.

పెళ్లి కాకుండా కలిసి జీవిస్తే తప్పేంటి? కమల్

      నటనలో విశ్వరూపం చూపించే కమల్ హాసన్ వివాదాస్పదమైన ప్రకటనల్లోనూ అదే పంథా చూపాలనుకుంటున్నారా? ఆ మధ్య ఒకసారి ... నేను ఇష్టపడే ఇండోర్ గేమ్ సెక్స్ అని అందర్నీ ఆశ్చర్యపరిచిన ఈ దక్షిణాది 'ముద్దుల' స్టార్ ... సహజీవనం చేస్తే తప్పేంటి అంటూ ప్రశ్నించి సంచలనం సృష్టించాడు. తన భార్య, ఒకనాటి నటి సారికకు వీడ్కోలు పలికిన కమల్ కు పలువురు తారలతో సంబంధాలున్నట్టు అప్పట్లో కథనాలు వచ్చేవి. అయితే ఈ మధ్య అలాంటివేవీ పెద్దగా రావడం లేదు. ఏమిటా అంటే ... ఆయన నిన్నతినాటి గౌతమితో సెటిలైనట్టు సమాచారం. అనారోగ్యం, ఒంటరితనం వంటి సమస్యల్లో మునిగిన సమయంలో గౌతమికి కమల్ నుంచి ఆశించిన 'ఓదార్పు' లభించిందట. దీంతో నీకు నేను నాకు నువ్వు అనుకుంటూ ప్రస్తుతం కలిసి జీవిస్తున్నారట. ఈ విషయం గురించి మీడియా ఆరాతీయడంతో కమల్ "ఓ మగ, ఆడ పెళ్లి కానంత మాత్రాన కలిసి జీవించకూడదని రూలేం లేదు కదా'' అంటూ ఎదురు ప్రశ్నించాడట. మనలో మనమాట రూల్స్ ఉన్నంత మాత్రాన ఎఫైర్స్ ఆగుతాయా?

చీర కట్టిన పోటుగాడు

  మంచు ఫ్యామిలీ అంతా కలిసి నటిస్తున్న తాజా చిత్రం "పాండవులు పాండవులు తుమ్మెదా". వరుణ్ సందేశ్, తనీష్, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. రవీనా టాండన్, హన్సిక, ప్రణీత కథానాయికలు. శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ దాదాపు పూర్తి అయ్యింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఈ చిత్రంలో మనోజ్ పోలీస్ పాత్రలో నటిస్తున్నాడు. కానీ ఒక ముఖ్య సన్నివేశం కోసం మనోజ్ చీర కట్టుకొని ఆడవారి వేషంలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ కు మంచి స్పందన వస్తుంది. జనవరిలో పాటలను విడుదల చేసి, అదే నెలలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈయనకు మూడు నెలలు కావాలంట

  అవిక, రాజ్ తరుణ్ జంటగా నటించిన తాజా చిత్రం "ఉయ్యాలా జంపాలా". విరించి వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో నిర్మాతలలో ఒకరైన నాగార్జున మాట్లాడుతూ... "ఇళయరాజా పాటల్లాగా సుతిమెత్తగా హృదయానికి హత్తుకునే సినిమా ఇది. ఎనభై ఏళ్ల క్రితం తెలుగుదనం ఉండే చిత్రలోచ్చేవి. ఆ తర్వాత అంత ఫైట్లు, డ్యాన్సులు అంటూ వేగం పెరిగిపోయింది. మళ్ళీ పాత రోజుల్ని గుర్తుచేసే విధంగా ఈ చిత్రం ఉంటుంది. నాకు నిజంగా డిసెంబర్ అచ్చొచ్చిన నెల. ఏడాదికి మూడు డిసెంబర్ లు ఉంటె బాగుండేది. ఎంచక్కా మూడు సినిమాలు విడుదల చేసుకుని ఉండేవాన్ని అని అన్నారు.

అంతర్జాతీయ చిత్రోత్సవాలకు అంతకు ముందు...!

  సుమంత్ అశ్విన్, ఈషా జంటగా కలిసి నటించిన "అంతకు ముందు ఆ తరువాత" చిత్రం ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ సౌతాఫ్రికాలో ప్రదర్శనకు ఎంపికైంది. ఈ చిత్రోత్సవాలు దక్షిణాఫ్రికాలో వచ్చే నెల రెండో వారంలో ప్రారంభమవుతాయి. పెళ్ళికి ముందు కలిసి జీవిస్తే.. పెళ్లి తర్వాత వచ్చే సమస్యలను తెలుసుకోవచ్చు అనే అంశంతో దర్శకుడు మోహనకృష్ణ తెరకెక్కించాడు. ఈ విషయం గురించి నిర్మాత మాట్లాడుతూ... "సున్నితమైన అంశంతో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాల్నీ అలరించింది. ఇప్పుడు అంతర్జాతీయ చిత్రోత్సవాలకు ఎంపికవ్వడం మరింత సంతోషాన్నిచ్చింది" అని అన్నారు.

బిపాసాబసు.. బాగా ఖరీదే బాసూ

      ఇప్పటిదాకా ఈ ఏడాది పెద్దగా హిట్స్‌లేని బాలీవుడ్ బ్లాక్‌బ్యూటి బిపాసాబాసుకు ఏడాది చివర్లో జరుగుతున్న వేడుకలు ఉపశమనాన్ని అందించనున్నాయి. జెవివి మారియట్‌ జుహులో జరిగే న్యూఇయర్‌ ఈవెంట్‌ కోసం ఈమె రూ.90లక్షలు వసూలు చేస్తోందట. మన టాలీవుడ్‌ విషయానికి వస్తే సమంత కొసం ఓ సంస్థ గట్టిగా ప్రయత్నిస్తోందని రూ. 80లక్షల దాకా చెల్లించడానికి సిద్దపడిందని అంటున్నారు. ఇక చార్మీ, హంసానందిని.. వంటి తారలు హైదరాబాద్లో స్పెషల్‌ నైట్‌ల కోసం ఇప్పటికే బుక్కయ్యారు. గత కొంతకాలంగా ఒక్క హిట్లు లేని చార్మి, మిర్చిపాట తప్ప చెప్పుకోవడానికి మరో సరైన సినిమా లేని హంసానందిని వంటివారే ఈ కార్యక్రమాల కోసం రూ. 10 లక్షల పైచిలుకు రెమ్యునరేషన్‌ అందుకుంటున్నారని తెలుస్తుంటే.. ఫామ్‌లో ఉన్న హీరోయిన్స్‌ సంగతి చెప్పేదేముంది.

పద్మశ్రీ పోగొట్టుకున్న బ్రహ్మి, కలెక్షన్ కింగ్

  ప్రముఖ సినీనటులు మోహన్ బాబు, బ్రహ్మానందంలు వారికి ప్రభుత్వం ప్రధానం చేసిన పద్మశ్రీ అవార్డులను అగౌరవపరచారని గత బుధవారం బీజేపి అగ్రనేత ఇంద్రసేనా రెడ్డి రాష్ర్ట హైకోర్టులో ఓ పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ పిటీషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ఈమేరకు సోమవారం ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చింది. మోహన్ బాబు, బ్రహ్మానందంలు పద్మశ్రీ బిరుదుని దుర్వినియోగం చేసి అగౌరవపర్చారని పేర్కొంటూ పద్మశ్రీ పురస్కారాలని వారం రోజుల్లోగా ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేయాల్సిందిగా కోర్టు ఆదేశించింది. ఎంతో ఉన్నతమైన పద్మశ్రీలను దుర్వినియోగం చేయడం వలన వీరిపై ఈ తీర్పు వచ్చింది. మరి ఈ తీర్పుకు వీరిద్దరూ ఎలా స్పందిస్తారో చూడాలి.

ఎవడు కోసం మరో పాట

  రామ్ చరణ్ హీరోగా నటించిన తాజా చిత్రం "ఎవడు". సినిమా విడుదల కాకుండా వాయిదాలు పడుతూ వస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సినిమా విడుదల తేది దగ్గర పడుతుండటం వలన ప్రేక్షకుల్లో హుషారు పెంచడానికి చిత్ర యూనిట్ సభ్యులు ప్రయత్నిస్తున్నారు. దీనికోసమే ఒక స్పెషల్ పాటను తెరకెక్కించనున్నారు. దేవిశ్రీప్రసాద్ ఇప్పటికే ఒక స్పెషల్ సాంగ్ ను కంపోస్ చేసాడు. త్వరలోనే ఈ పాటను చరణ్, బన్నీ, దేవిశ్రీప్రసాద్ లపై చిత్రీకరించనున్నారు. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించాడు. చరణ్ సరసన శృతిహాసన్, అమీ జాక్సన్ హీరోయిన్లుగా నటించారు. బన్నీ, కాజల్ ఓ ముఖ్య పాత్రలో నటించారు.