ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు కారణం అదికాద౦ట..!!

      హీరో ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు ప్రధాన కారణం ఆర్ధికసమస్యలేనని పోలీసులు...మీడియాలో కూడా ప్రచారం జరుగుతోంది. కాని ఆయన మాజీ మేనేజర్ మాత్రం అది అసలు సమస్యేకాదని అంటున్నాడు. ఉదయ్‌కిరణ్ ఎవరో అనుమానించారనో, అప్పులు చెల్లించలేకో, సినిమాల్లో అవకాశాలు రాలేదనో ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని చెబుతున్నాడు. ఆయనకు ఉన్న భూముల్లో ఏ స్థలం అమ్మినా అప్పులు తీరిపోతాయని అంటున్నాడు . ఆయన ఆత్మహత్య వెనుక ఫైనాన్సియర్ల ఒత్తిడి ఉందన్న వార్తల్లో వాస్తవం లేదని చెబుతున్నాడు. ఆయనకు సినిమా అవకాశాలు వచ్చినా కథ నచ్చకపోవడం వల్లే అంగీకరించలేదని..ఆత్మహత్యకు ఏదో బలమైన కారణం ఉండే ఉంటుందని అనుమానం వ్యక్తం చేశాడు.

ఏఎన్ఆర్ ఆరోగ్యపరిస్థితిపై నాగార్జున

      అక్కినేని నాగేశ్వరరావు అస్వస్థతతో బాధపడుతూ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లుగా వార్తలు రావడంతో... రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అక్కినేని అభిమానులు ఆందోళన చెందారు. ఆ తరువాత ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి, ‘అంతా సవ్యంగానే ఉన్నదని.. అస్వస్థత అంటూ మీడియాలో వస్తున్న వార్తలు పుకార్లేనని’ ఆయన మనుమడు హీరో సుమంత్‌ స్వయంగా ట్వీట్‌ చేయడంతో అభిమానుల్లో టెన్షన్‌ తగ్గింది. మరోవైపు నాగార్జున కూడా... మీడియాలో వచ్చిన వార్తలు విని కంగారు పడాల్సిన అవసరం లేదని, నాన్నగారు ఆరోగ్యంగా ఉన్నారని, బాగా కోలుకున్నారని, అన్ని విషయాలు బాగా మాట్లాడుతున్నారని, ఇప్పుడే ఆయన్ను కలిసొచ్చానని నాగార్జున వివరణ ఇచ్చారు.

ఉదయ్ కిరణ్ అంత్యక్రియలు..చిరు డౌన్..డౌన్

      తెలుగు నటుడు ఉదయ్ కిరణ్ బౌతికకాయానికి అంత్యక్రియలు నిన్న మధ్యాహ్నం ఎర్రగడ్డ స్మశానవాటికలో పూర్తయ్యాయి. తన అభిమాన నటుడిని చివరిసారిగా చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ సంధర్బంగా మెగాస్టార్ చిరంజీవికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చిరు డౌన్..డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఇండస్ట్రీలో ఉదయ్ కిరణ్ కు అవకాశాలు రాకుండా చిరు అడ్డుకున్నారని ఆరోపణలు చేశారు. అంతకుముందు ఉదయ్ కిరణ్ భౌతికకాయానికి పలువురు సినీ ప్రముఖులు నివాళులర్పించారు.   ఉదయ్ కిరణ్ ఆత్మహత్య విషయమై వెస్ట్ జోన్ డీసీపీ ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ....టీం ఆఫ్ డాక్టర్స్ ఉదయ్ కిరణ్‌ది ఆత్మహత్యే అని ప్రాథమికంగా తేల్చారని తెలిపారు. ఉరి వేసుకోవడం ద్వారా మరణించినట్లు తేలిందన్నారు. తాము పూర్తి స్థాయి నివేదిక పరిశీలించాల్సి ఉంటుందని తెలిపారు.

అక్కినేని పరిస్థితి విషమంగా ఉందంట...!

  కొద్దిరోజుల క్రితమే క్యాన్సర్ బారిన పడిన అక్కినేని నాగేశ్వరరావుకి శస్త్రచికిత్స కూడా జరిగినప్పటికీ కూడా ఆయన ప్రస్తుతం తీవ్ర అస్వస్థతకు గురైనట్టు తెలిసింది. ఆయన ఆరోగ్యం బాగా క్షీణించిందని సమాచారం. శస్త్రచికిత్స అనంతరం ఆయన ఆరోగ్యం ఒడిదుడుకులకు గురవుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. గతరెండురోజుల క్రితం నుంచే నాగేశ్వరరావు ఆరోగ్యం బాగోలేదని తెలిసింది. దాంతో వైద్యులను తన నివాసానికే తెప్పించుకొని వైద్య సేవలను పొందుతున్నారని సమాచారం. ఆయన కుటుంబసభ్యులు అందరూ కూడా అక్కినేనితో కొంత సమయం గడిపి వెళ్తున్నారట. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషంగా ఉందని తెలిసింది.

ఉదయ్ కిరణ్ మృతికి సినీ ప్రముఖుల నివాళి

      సినీ నటుడు ఉదయ్ కిరణ్ భౌతికకాయానికి పలువురు సినీ ప్రముఖులు నివాళులర్పించారు. సినీ ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం ఉదయ్ కిరణ్ పార్ధివదేహాన్ని ఫిలింఛాంబర్‌లో ఉంచారు. దర్శకుడు దాసరి నారాయణరావు, తనికెళ్ల భరణి, తమ్మారెడ్డి భరద్వాజ, చలపతిరావు, నటి జయసుధ, అశోక్ కుమార్, వరుణ్ సందేశ్, ఎంఎస్ రాజు, పరుచూరి వెంకటేశ్వరరావు, పరుచూరి గోపాలకృష్ణ, వెంకటేష్, సురేష్ బాబు, రామానాయుడు, శ్రీకాంత్, శివాజీ రాజా, దర్శకుడు సముద్ర, అనూప్ రూబెన్స్, కాదంబరి కిరణ్ కుమార్, బెనర్జీ తదితరులు ఉదయ్ కిరణ్కు నివాళులు అర్పించినవారిలో ఉన్నారు.   హీరో వెంకటేష్ మాట్లాడుతూ...  ''ఉదయ్ కిరణ్ లాంటి మంచి వ్యక్తి మరణించడం చాలా బాధాకరం. చిత్ర పరిశ్రమకు షాకింగ్ న్యూస్. మంచి నటుడ్ని కోల్పోయింది. ఒక విషాదకర సంఘటన. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నాను. కుటుంబ సభ్యులకు మానసిక ధైర్యాన్ని ఇవ్వాలని కోరుతున్నాను''.  

గతంలో ఆత్మహత్యకు యత్నించిన ఉదయ్ కిరణ్

      ఉదయ్‌కిరణ్ గతంలో కూడా ఆత్మహత్య యత్నించినట్లు ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడయ్యింది. ఉదయ్ ఎడమ చేతి మణికట్టుపై బ్లేడుతో కోసుకున్న పాత గుర్తులున్నట్లు నిపుణులు గుర్తించారు. రాత్రి 10:30 నుంచి 11 మధ్య ఆత్మహత్య చేసుకున్నట్లు ఉస్మానియా ఫోరెన్సిక్ డాక్టర్ అమ్మాణీ తెలిపారు. ఇంకా పోరెన్సిక్ నివేదికను పోలీసులకు అందజేయలేదని వైద్యులు చెప్పారు.మరోవైపు ఉదయ్‌కిరణ్ ఆత్మహత్యపై పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఉదయ్‌కిరణ్, విషిత కాల్‌డేటాను పోలీసులు తెప్పించి పరిశీలించినట్లు తెలుస్తోంది. విషిత ఫోన్ నుంచే ఎస్ఎంఎస్‌లు వచ్చినట్లు గుర్తించారు. ఆత్మహత్యకు ముందు స్నేహితులతో ఉదయ్ మాట్లాడినట్లు పోలీసులు నిర్దారించారు.

ఉదయ్ అలాంటివాడు కాదు: రేష్మా

  నటుడు ఉదయ్ కిరణ్ మరణ వార్త అందరికి కూడా ఒక పీడ కలగానే అనిపిస్తుంది. సినీపరిశ్రమలో అందరూ కూడా ఉదయ్ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. నటి రేష్మా కూడా ఉదయ్ తో ఉన్న తన గత స్మృతులను గుర్తుచేసుకుంది. వీరిద్దరూ కలిసి "జై శ్రీరామ్" అనే చిత్రంలో నటించారు. "ఆయన మరణం ఓ కలగా ఉంది. ఉదయ్ చాలా ధైర్యంగా ఉండేవారు. షూటింగ్‌లో తోటి నటీనటులతో చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. అతనితో నటించిన 'జై శ్రీరామ్" నా తొలి యాక్షన్ మూవీ. షూటింగ్ సమయంలో నా నటనలో లోటుపాట్లను గుర్తించి , నాకు చాలా మెలకువలు చెప్పేవారు. నాకు తెలిసి ఉదయ్ దంపతులు చాలా సంతోషంగా ఉండేవారు. ఆయన సినిమాలు ఫెయిల్ అవుతున్నాయనే మనస్తాపంతో చనిపోయేటంతటి పిరికివాడెం కాదు ఉదయ్. ఆయన మృతికి ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను" అని చెప్పుకొచ్చింది.

స్వగృహానికి ఉదయ్ కిరణ్ మృతదేహా౦

      హీరో ఉదయ్ కిరణ్ మృతదేహాన్ని సందర్శించేందుకు సోదరి, బావ మస్కట్ నుంచి నిమ్స్‌కు చేరుకున్నారు. అనంతరం ఆయన మృతదేహాన్ని శ్రీనగర్ కాలనీలోని స్వగృహానికి తరలించారు. అభిమానుల సందర్శనార్ధం ఆయన శరీరాన్ని ఫిల్మ్ చాంబర్ లో రేపు ఉదయం 10 గంటల నుంచి 11గంటల వరకు ఉంచుతారు. నగరంలోని ఎర్రగడ్డ స్మశానవాటికలో మధ్యాహ్నం అంత్యక్రియలు జరుగుతాయి.   మరోవైపు ఉదయ్ కిరణ్ తన కళ్ళను దానం చేశాడు. తన కళ్లను దానం చేయాలన్నది అతని కోరిక కావడంతో కుటుంబ సభ్యులు ఆ బాధ్యత నెరవేర్చారు.  ఉదయ్ కిరణ్ నేత్రాలను ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి దానం చేశారు. ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి వైద్యులు ఉదయ్ కిరణ్ నేత్రాలలోని రెటీనాను సేకరించారు.

ఉదయ్ కిరణ్ మృతదేహం..ఎవరూ రాలేదు!

      ఉదయ్ కిరణ్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది. ఉస్మానియా వైద్యులు పోస్టుమార్టం పూర్తి చేశారు. అనంతరం మృతదేహాన్ని నిమ్స్ మార్చరీకి తరలించారు. అయితే మొదట పోస్టుమార్టం పూర్తి కాగానే ఉదయ్ పార్థివ దేహాన్ని తీసుకువెళ్లేందుకు కుటుంబ సభ్యులు ఎవరూ రాకపోవడంతో అనాథ శవంలా బయట అరగంట పాటు ఉంది. ఉదయ్ భార్య తరఫున గానీ, ఉదయ్ తరఫు బందువులు ఎవరూ రాలేదు. ఉదయ్‌ను చివరి సారిగా చూసేందుకు వచ్చిన అభిమానులు ఆవేదన చెందుతూ ఆస్పత్రి సబ్బందితో వాగ్వాదానికి దిగారు. దీంతో ఉదయ్ మృత దేహాన్ని మార్చురిలో పెట్టారు. ఉదయ్ కిరణ్ సోదరి విదేశాల నుంచి రావాల్సి ఉండంతో అతని అంత్యక్రియలు మంగళవారం జరగనున్నట్లు తెలుస్తోంది.

ఉదయ్ కిరణ్ ని తొక్కేశారా?..మీకే తెలుసు: తేజ

      ఉదయ్ కిరణ్ ఆత్మహత్యపై అతని గురువు తేజ స్పందించారు. ఉదయ్ కిరణ్ ని ఇండస్ట్రీలో తొక్కేశారా అని ఆయన్ని ప్రశ్నంచగా.. ఈ విషయం తనకంటే మీడియాకే బాగా తెలుసు అని ఆయన నర్మగర్భంగా సమాధానమిచ్చారు. ఉదయ్ కిరణ్ మరణవార్తను నమ్మలేకపోయాని, ఇది కాదు అనిపిస్తే బాగుండేదని దర్శకుడు తేజ అన్నారు. ఉదయ్ మరణవార్తను స్నేహితులు ఫోన్ చేసి చెప్పడంతో షాక్ గురైనట్లు దర్శకుడు తేజ తెలిపారు. సినిమాలు లేకపోవడం వల్ల డిప్రెషన్‌లో ఉన్నాడన్నారు. తనవల్ల సినిమాల్లో పైకి వచ్చిన వ్యక్తి ఇలా చనిపోవడం బాధాకరమన్నారు. ఉదయ్ కిరణ్ చాలా మంచి వ్యక్తి అని, తనకు ఎన్ని సమస్యలు తలెత్తినా ఎవరినీ దూషించలేదని తెలిపారు. ఉదయ్ కిరణ్ మరణం చాలా బాధించిందని తేజ చెప్పారు.

మహేష్ '1నేనొక్కడినే' హైదరాబాద్ ధియేటర్స్

      ప్రిన్స్ మహేష్ '1నేనొక్కడినే' సంక్రాంతి కానుకగా జనవరి 10న భారీగా రిలీజ్ చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్ లో మొదటిరోజు రికార్డ్ లెవల్లో షోలు ప్రదర్శించనున్నారని సమాచారం. ఈ సినిమా తన కెరీర్లో ఇదొక ల్యాండ్ మార్క్ సినిమా అవుతుందని మహేష్ బాబు స్వయంగా వెల్లడించారు. ఇందులో క్రితి సానన్ జర్నలిస్టు పాత్రలో కనిపించనుంది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈచిత్రంలో నాజర్, అను హుస్సేన్, షాయాజీ షిండే, ప్రదీప్ రావత్, కెల్లీ దోర్జీ, విక్రమ్ సింగ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సుకుమార్ డైలాగులు, మహేష్ బాబు పెర్ఫార్మెన్స్, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు హైలెట్ కానున్నాయి.   '1నేనొక్కడినే' హైదరాబాద్ ధియేటర్స్ లిస్ట్:    

ఉదయకిరణ్ ఆత్మహత్యకు ఆర్థిక సమస్యలు కారణమా?

      ప్రముఖ సినీ నటుడు ఉదయకిరణ్ ఆత్మహత్యకు ఆర్థిక సమస్యలు ప్రధాన కారణమా? గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు చిత్ర పరిశ్రమలో సరైన హిట్, మంచి ఆఫర్లు లేని ఉదయ్ ఆర్థిక ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడా? అంటే అతని సన్నిహితులు, తండ్రి మాత్రం...తమకు తెలిసినంత వరకు అతడికి ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదన్నారు. అతడికి కోట్ల రూపాయలు ఆస్తులున్నాయని ఆయన తండ్రి చెబుతున్నారు. అతని ఆస్థి దుర్వినియోగం చేస్తున్నాననే తనని దూర౦గా పెట్టాడని.. ఆరేడేళ్లుగా మామధ్య మాటల్లేవని తండ్రి వివికె మూర్తి అన్నారు. ఉదయ్‌కి పెళ్లైన విషయమే తనకు తెలియదన్నారు. కొడుకు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని కూడా ఆయన వ్యాఖ్యానించారు.

'ఐ లవ్ యూ టూ'.. భార్యకు ఉదయ్ కిరణ్ చివరి మెసేజ్

      సినీ నటుడు ఉదయ్ కిరణ్ ఆత్యహత్య చేసుకునే ముందు తన భార్యకు 'ఐ లవ్ యూ టూ' చివరి మెసేజ్ పంపించినట్లు తెలుస్తోంది. ఆత్మహత్య సమాచారం అందుకున్న పోలీసులు ఉదయ్ కిరణ్ నివాసానికి చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారు. ఉదయ్ కిరణ్ సెల్ ఫోన్ స్వాదీనం చేసుకొని...ఆయన భార్య, అత్తమామలు, అపార్టుమెంట్ వాచ్‌మెన్‌ను ప్రశ్నించారు. ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు ముందు మిత్రులకు ఎస్సెమ్మెస్‌లు చేసినట్లుగా తెలుస్తోంది. ఆయన రూమ్ లో సూసైడ్ నోట్ ఏదీ దొరకలేదన్నారు.ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఇంట్లో ఎవరూలేరని ఆపార్టుమెంట్ వాచ్‌మెన్ పోలీసులకు తెలిపాడు.

ఆత్మహత్య చేసుకున్న ఉదయ్ కిరణ్...!

  "చిత్రం" సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నటుడు ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని తన ఫ్లాట్‌లో ఉరి వేసుకుని చనిపోయినట్టు తెలిసింది. ఉదయ్ ఆత్మహత్య చేసుకోబోయే ముందు తన స్నేహితులకు ఫోన్ చేసి చెప్పినట్టు తెలిసింది. దీంతో కంగారుపడి తిరిగి కాల్ బ్యాక్ చేసినప్పటికీ ఫలితం లేకపోయిందని..వాళ్ళు ఇంటికి చేరేలోపే ఉదయ్ ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసింది. వెంటనే ఉదయ్ ను అపోలో హాస్పిటల్ కి తరలించగా... అప్పటికే ఉదయ్ మరణించారని వైద్యులు నిర్దారించారు. ఈ వార్త విని సినీ నటులు శ్రీకాంత్, తరుణ్, ఆర్యన్ రాజేష్ లతో పలువురు సినీ ప్రముఖులు హాస్పిటల్ వద్ద్దకు చేరుకున్నారు. ఈ విషయంపై హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ... "మేము విషయం తెలియగానే వెంటనే ఇక్కడికి (అపోలో) రావడం జరిగింది. అందరు కూడా ఆత్మహత్య చేసుకున్నాడని అంటున్నారు. కానీ ఉదయ్ అలా చేసుకునే వాడు కాదు. ఎన్ని కష్టాలు వచ్చిన కూడా ధైర్యంగా ఉండేవాడు. నేను ఇపుడే పోలీసులతో మాట్లాడినాను. ఇది అసలు ఎలా జరిగింది? ఎందుకు ఇలా జరిగిందో తెలియజేయాలని కోరుతున్నాను. ఎలాగైనా ఈ విషాదం గురించి తెలుసుకోవలసిన బాధ్యత మాకు కూడా ఉంది" అని అన్నారు. 2012 అక్టోబర్ 24న విశితతో ఉదయ్ వివాహం జరిగింది. అయితే ప్రస్తుతం రంగంలోకి దిగిన పోలీసులు వివిధ కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఉదయ్ సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అతని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.