ఎన్టీఆర్ 18వ వర్ధంతి
posted on Jan 18, 2014 @ 9:32AM
రాముడైనా ,కృష్ణుడైనా, రావణుడైనా, దుర్యోధనుడైనా వెండి తెర దేవుడిగా తెలుగు ప్రేక్షుకుల హృదయాల్లో సుస్ధిర స్ధానం సంపాదించుకున్న ఒకే ఒక్క నటుడు నందమూరి తారక రామారావు .నిజమైన దేవుడు ప్రత్యక్షమై వరం కోరుకో భక్తా అంటే, నువ్వు దేవుడేంటి... మా ఎన్టీవోడు లాగా లేవే అనే స్ధాయిలో ప్రజల హృదయాల్లో సుస్ధిర స్ధానం సంపాదించుకున్న తెరవేల్పు.. ఎన్టీఆర్. కథానాయకుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, రాజకీయనాయకునిగా తెలుగు సినీ ప్రతిష్ఠని, తెలుగు జాతి గౌరవాన్ని నిలిపిన యుగ పురుషుడు ఎన్.టి.ఆర్. ఈ రోజు ఆ మహానటుని వర్ధంతి సందర్భంగా ఆ తెరవేలుపును ఓ సారి స్మరించుకుందాం..
తెలుగుజాతి గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనుభావుడు.. తెలుగువారు అన్నగారు అని పిలుచుకునే ఎన్.టి.ఆర్., 1923 మే 28న కృష్ణా జిల్లా నిమ్మకూరులో జన్మించారు . నటనపై ఆసక్తితో సబ్ రిజిష్ట్రార్ ఉద్యోగాన్ని వదులుని మద్రాసు చేరుకున్నారు. ఎల్ .వి. ప్రసాద్ దర్శకత్వం వహించిన ` మనదేశం ` సినిమా తో తొలి సారిగా కెమెరా ముందు కొచ్చిన ఎన్టీఆర్ ఆ తర్వాత తెలుగు సినీరంగంలో ఎదురులేని నటుడిగా వెలుగొందారు.
ఎన్టీఆర్ సినీ జీవితాన్ని మలుపుతిప్పిన సినిమా పాతాలభైరవిఈ సినిమాతో ఒక్కసారిగా స్టార్ స్టేటస్ అందుకున్నాడు ఎన్టీఆర్.. ఆ తరువాత వరుసగా మల్లీశ్వరీ పెళ్లిచేసిచూడు, లాంటి సినిమాలతో ఎన్టీఆర్ కీర్తీ శిఖర సమానంగా ఎదిగింది.. ఇక ఆ తరువాత వచ్చిన మిస్సమ్మ చిత్రంలో ఎన్టీఆర్ నటనకు యావత్ ఆంద్ర దేశం దాసోహం అంది.
ఎన్టీఆర్ నటజీవితంలో మరో మైలు రాయి మాయాబజార్.. ఈ సినిమాలో తొలిసారిగా కృష్ణుడిగా కనిపించిన ఎన్టీఆర్ ఆ తరువాత ఏకదాటిగా 18 సార్లు అదే పాత్రను ధరించి రికార్డు సృష్టించారు.. ప్రపంచంలో మరె నటుడు ఇలా ఒకే పాత్రను అన్ని సార్లు పొషించి మెప్పించిన దాఖలాలు లేవు.. అది కేవలం ఎన్టీఆర్‌కు మాత్రమే సాధ్యమైన అద్భుత విషయం.. పాజిటివ్ పాత్రలల్లో ఏ స్థాయిలో మెప్పించారో నెగెటివ్ రోల్స్‌లోనూ అదే స్థాయిలో అలరించాడు ఎన్టీఆర్.. ముఖ్యంగా రావణాబ్రహ్మ, కీచకుడు లాంటి పాత్రల్లో ఎన్టీఆర్ నటన అమోఘం అనిర్వచనీయం..
పౌరాణికం, జానపదం, చారిత్రాత్మకం, సాంఘీకం. ఇలా ఆయన చేయని జానర్ లేదు, ఆయన పోషించని పాత్రాలేదు.. నటునిగా కొనసాగుతున్న సమయంలో ఏడాదికి 10 సినిమాలు రిలీజ్ చేస్తూ అభిమానులను అలరించేవారు ఎన్టీఆర్.. ఎన్టీఆర్ నట జీవితంలో మరో మేలి మలుపు లవకుశ.. రామునిలోని వీరత్వం మాత్రమే తెలిసిన ప్రజలకు ఆయనలో దయాగుణం బాధ లాంటి భావాలను కూడా కళ్లకు కట్టినట్టుగా చూపించాడు ఎన్టీఆర్..
హుందాగా కనిపించే పాత్రలతోనే కాదు.. బిచ్చగాడిగా, పిచ్చివాడిగా అవిటి వాడిగా ఇలా ఏ పాత్రకైన న్యాయం చేసిన అసలు సిసలు నటుడు ఎన్టీఆర్.. అందుకే ఆయన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అయ్యాడు.. అంతేకాదు హీరోగా కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్న సమయంలోనే ఓ వృద్ద పాత్రలో నటించి కూడా మెప్పించాడు ఎన్టీఆర్.. ఇక దానవీర శూరకర్ణ సినిమాలో దుర్యొధనుడి పాత్రలో ఎన్టీఆర్ నటనకు మరెవరు సాటి రారనే చెప్పాలి... అంతలా తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది ఆ పాత్ర..
భారత ఇతిహాస, చారిత్రక పాత్రల్లో ఎవరూ పోషించనన్ని పాత్రలను వెండితెరపై ఆవిష్కరించారు ఎన్.టి.ఆర్. బహుశా ఆయన పోషించని పాత్రలు వేళ్లపైనే లెక్కపెట్టవచ్చు. సాంఘిక చిత్రాల్లోనూ సినిమా సినిమాకు తన వేషధారణలో మార్పును చూపెట్టేవారు. ఇంకా చెప్పాలంటే సినిమాకో అవతారం ఎత్తేవారు. అందుకే.. ఎన్టీఆర్ తెలుగువారి గుండెల్లో సుస్థిరస్థానం ఏర్పాటు చేసుకోగలిగారు.
వెండితెర మీదను కాదు రాజకీయల్లోనూ తనదైన ముద్రను వేశారు ఎన్టీఆర్.. పార్టీని స్థాపించిన తొమ్మిది మాసాల్లోనే కాంగ్రెస్ పార్టీ లాంటి జాతీయ పార్టీని మట్టి కరిపించి తెలుగు వాడి సత్తా ఏంటో నిరూపించారు. తెలుగు ఆత్మగౌరవ నినాదంతో ప్రజలకు ముందుకు వచ్చిన ఎన్టీఆర్‌కు ఆ ప్రజలు బ్రహ్మరథం పట్టారు.. అఖండ విజయం కట్టబెట్టారు..
అందుకే తెలుగు జాతి ఉన్నంతకాలం తెలుగు మాట వినబడుతున్నంతకాలం.. తెలుగు పదం బతికున్నంత కాలం ఎన్టీఆర్ అనే పేరు ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది.. అదే ఎన్టీఆర్ అన్న మాటకు ఉన్న పవర్..