దిల్ రాజుకీ, మహేష్‌కీ క్లాష్?
posted on Jan 16, 2014 @ 1:15PM
‘1.. నేనొక్కడినే’, ‘ఎవడు’ సినిమాల రిలీజ్ సంగతేమోగానీ, ఈ సినిమాల రిలీజ్ పుణ్యమా అని స్టార్ హీరో మహేష్‌బాబు, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మధ్య క్లాష్ ఏర్పడింది. మహేష్‌బాబు హీరోగా ఓ భారీ చిత్రాన్ని నిర్మించాలని దిల్ రాజు ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నాడు. మహేష్ కూడా దిల్ రాజు నిర్మాణంలో నటించడానికి ఆసక్తిగా వున్నాడు. దీనికి సంబంధించిన ప్రయత్నాలు కూడా ఆమధ్య ముమ్మరంగా జరిగాయి. అయితే ఇద్దరికీ లేటెస్ట్ గా క్లాష్ వచ్చింది. దీనికి కారణం వీరిద్దరి సినిమాలే.
మహేష్ నటించిన ‘1’, దిల్ రాజు నిర్మించిన ‘ఎవడు’ సినిమాలు రెండు రోజుల తేడాతో ఈమధ్య విడుదలైన విషయం తెలిసిందే. రెండు భారీ సినిమాలు రెండు రోజుల తేడాతో విడుదల కావడం సినిమా వ్యాపార సూత్రాల రీత్యా సరైన పద్ధతి కాదు. రెండు సినిమాలు ఒకదానితో మరొకటి పోటీపడి రెండు సినిమాలూ నష్టపోయే ప్రమాదం వుంది. రెండు సినిమాలూ బాగున్నా రెండిటికీ కలెక్షన్లు రావు. ఒక సినిమా బాగుండి రెండో సినిమా బాగా లేకపోతే బాగాలేని సినిమా నిర్మాత నిలువునా ఆరిపోయే ప్రమాదం వుంది. ఆ ప్రమాదాన్ని ఆపాలన్న ఉద్దేశంతో మహేష్‌బాబు దిల్ రాజుని ‘ఎవడు’ సినిమా విడుదలను రెండు వారాలపాటు వాయిదా వేసుకోవాలని కోరాడని సినీ వర్గాల సమాచారం. ఎలాగూ తనతో సినిమా తీయడానికి దిల్ రాజు ఉత్సాహం చూపిస్తున్నాడు కాబట్టి తాను అడిగినదానికి దిల్ రాజు ఒప్పకుంటాడని మహేష్ భావించాడు.
అయితే దిల్ రాజు మాత్రం చాలా కూల్‌గా అలా కుదరదని చెప్పేశాడు. తన సినిమా విడుదల ఇప్పటికే చాలా ఆలస్యం అయిందని, ఇంకా వాయిదా వేసే ఉద్దేశం తనకు ఎంతమాత్రం లేదని మహేష్‌కి నిర్మొహమాటంగా చెప్పేశాడు. దాంతో మహేష్ ఇలా అయితే నేను నీతో సినిమా చేసే విషయాన్ని పునరాలోచించుకోవాల్సి వస్తుందని చెప్పాడట. నీతో సినిమా లేకపోతే పాయె నేను మాత్రం ‘1’కి పోటీగా ‘ఎవడు’ రిలీజ్ చేయడం ఖాయమని చెప్పేశాడు. అన్నట్టుగానే ఆ సినిమాకి పోటీగా ఈ సినిమాని రిలీజ్ చేశాడు. టోటల్‌గా జరిగిందేమిటంటే, ‘1’ సినిమా మీద ‘ఎవడు’ సినిమా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ఇది మహేష్ బాబుకి మరింత ఆగ్రహాన్ని తెప్పించినట్టు సమాచారం.