అక్కినేని మృతి... ప్రముఖులు సంతాపం
posted on Jan 22, 2014 @ 10:49AM
అక్కినేని నాగేశ్వరరావు మరణంపై ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ జగపతి ఆర్ట్స్ అధినేత , దర్శకుడు విబి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ అక్కినేనితో తన అనుబంధం విడదీయలేనిదని అన్నారు. అక్కినేని లేరనేది నమ్మలేని నిజమని ఆయన అన్నారు. ఏఎన్నార్ భౌతికకాయన్ని సందర్శించి ఆయన నివాళులు అర్పించారు. అక్కినేనితో కలిసి తాను 14 సినిమాలు చేశానన్నారు. తామిద్దరం ఒక కంచం ఒకే మంచం అనేలా ఉండేవారిమని, నాటికి… నేటికీ అక్కినేని అందరికి ఆదర్శమని ఆయన అన్నారు.
ప్రముఖ నిర్మాత రామానాయుడు మాట్లాడుతూ తెలుగు చిత్ర పరిశ్రమలో మహా వృక్షం రాలిపోయిందన్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ చిత్రపరిశ్రమకు రెండు పిల్లర్లుగా ఉండేవారని అన్నారు. అక్కినేనితో తాను తీసిన ‘ప్రేమ్ నగర్’ చిత్రం తన జీవితంలో ఓ శక్తిలా మారిందన్నారు. ఆ సినిమాతో అప్పటివరకూ తాను ఎదుర్కొన్న ఒడిదుడుకులను తట్టుకున్నట్లు చెప్పారు. అక్కినేని కుటుంబంతో బంధుత్వం కూడా ఉందని ఆయన మరణం బాధాకరమని రామానాయుడు అన్నారు. రాష్ట్ర గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, మంత్రులు ఆనం రాంనారాయణ రెడ్డి, రఘువీరారెడ్డి, డీకే అరుణ, తమిళనాడు గవర్నర్ రోశయ్య తదితరులు అక్కినేని మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు, ప్రముఖులు…. అక్కినేని భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పిస్తున్నారు.
అక్కినేని నాగేశ్వరరావు అంత్యక్రియాలు గురువారం ఎర్రగడ్డ స్మశానవాటికలో జరగనున్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈరోజు సాయంత్రం వరకూ అభిమానుల సందర్శనార్థం అక్కినేని పార్థీవ దేహాన్ని అన్నపూర్ణ స్టూడియోలో ఉంచుతారు.