పాపం ‘1’ నిర్మాతలు!
posted on Jan 13, 2014 @ 1:43PM
మహేష్‌బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మించిన ‘1’ (నేనొక్కడినే) సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై బాక్సాఫీసు దగ్గర బోల్తా కొట్టింది. దాదాపు 70 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ సినిమా గురించి ‘బోల్తాకొట్టింది’ అనే మాటను ఉపయోగించడానికి బాధగా వున్నా, ఈ సినిమా ఎందుకు తీశారో అర్థంకాక అయోమయానికి గురవుతున్న ప్రేక్షకులను చూశాక ఇలాంటి ఘాటు పదాలు పడటం న్యాయమే అనిపిస్తోంది. పైగా ఈ విషయాన్ని ఇప్పుడు కొత్తగా అంటున్నదేం కాదు. సినిమా మొదటి ఆట పూర్తయిన క్షణం నుంచే ప్రేక్షకులు, మీడియా, సినిమా వర్గాలు ముక్తకంఠంతో అంటున్న మాట ఇది.
భారీ వ్యయంతో సినిమాలు నిర్మించడంలోను, భారీ విజయాలను సాధించడంలోనూ టాలీవుడ్‌లో ‘దూకుడు’ చూపించిన 14 రీల్స్ సంస్థ ప్రస్తుతం సినిమా పరిశ్రమలోని పాకుడు రాళ్ళమీద కాళ్ళు వేసి బోర్లాపడిపోయింది. ప్రస్తుతం బాక్సాఫీసు దగ్గర పాకుతోంది. ‘వన్’ పేరుతో సినిమా తీసి ‘లాస్ట్’ అవడం ఒక విచిత్రం. ఆ విచిత్రానికి నిదర్శనంగా 14 రీల్స్ సంస్థ నిలిచింది. బాక్సాఫీసు దగ్గర సగర్వంగా నిలబడి ‘నేనొక్కడినే’ అని చాటాల్సిన సినిమా నేను థియేటర్లలో కలక్షన్లు వసూలు చేసేది ‘ఒక్క... డేనే’ అనాల్సిన పరిస్థితి వస్తే ఆ సినిమా నిర్మాతల పరిస్థితి ఊహించడానికి వీల్లేకుండా వుంటుంది. ‘1’ సినిమా మీద అందరిలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సినిమా ఏ కొద్దిగా బాగున్నా ఎక్కడికో వెళ్ళిపోయేది. అయితే సగటు ప్రేక్షకులకు ఎంతమాత్రం అర్థంకాకుండా వున్న ఈ సినిమా ఎక్కడకు వెళ్ళాలో అక్కడికే వెళ్ళిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
సినిమా రంగాన్ని ప్రస్తుతం నిర్మాతల కొరత కనిపిస్తోంది. సక్సెస్‌ల శాతం బాగా తగ్గిపోయిన సినిమా రంగానికి రావడానికి ఇప్పుడు చాలామంది జంకుతున్నారు. గతంలో వరుసగా సినిమాలు తీసిన సీనియర్ నిర్మాతలు ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాలు తీయడం అంతటి తెలివితక్కువ పని మరొకటి లేదని చేతులు ముడుచుకుని కూర్చున్నారు. కోట్లు గుమ్మరించి రూపాయలు ఏరుకోవాల్సిన రోజులొచ్చేశాయ్. ఇలాంటి స్థితిలో సినిమాలు నిర్మించడానికి ముందుకు వస్తున్న నిర్మాతను కాపాడుకోవాల్సిన బాధ్యత సినిమా రంగం మీదే వుంది. హీరోలు, దర్శకుల మీద ఆ బాధ్యత మరింత ఎక్కువగా వుంది. హీరోలు, దర్శకుల డామినేషన్ పెరిగిపోయిన ప్రస్తుత ఇండస్ట్రీలో నిర్మాత పరిస్థితి క్యాషియర్ కంటే ఘోరంగా తయారైంది. కోట్లుకు కోట్లకు డబ్బు పెట్టడం మినహా సినిమా నిర్మాణానికి సంబంధించిన ఏ విషయంలోనూ ‘వేలు’ పెట్టడాన్ని స్టార్లు, దర్శకులు సహించలేకపోతున్నారు. ‘1’ సినిమా విషయంలో నిర్మాతలకు ఎన్నో విషయాలలో ఎన్నెన్నో సందేహాలు వచ్చినప్పటికీ, వాటిని అటు హీరో గానీ, ఇటు దర్శకుడు గానీ ఎంతమాత్రం పట్టించుకోకపోవడంతో షూటింగ్ సమయంలో ప్రేక్షకపాత్ర వహించారు. ఇప్పుడు ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులు లేకపోవడంతో నెత్తీనోరు బాదుకుంటున్నట్టు సమాచారం.
పాత రోజుల్లో మూడు గంటలకు పైగా సినిమా నిడివి వుండేది. ప్రస్తుతం ఏ తెలుగు సినిమా అయినా రెండు గంటల ఇరవై నిమిషాల కంటే పది క్షణాలు ఎక్కువైనా ప్రేక్షకులు భరించలేరని అందరూ భావిస్తూ వుంటారు. ఇలాంటి టైమ్‌లో ‘1’ సినిమా ఏకంగా మూడు గంటల పాటు సా....గి ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టింది. ఈ సినిమాని నిర్మించిన సంస్థ పేరులోనే ‘14 రీల్స్’ అని వుంది. ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోకుండా దర్శకుడు సుకుమార్ 18 రీళ్ళ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. ఈ సినిమా నిడివి విషయంలో మొదటి నుంచీ నిర్మాతలు అనుమానాలు వ్యక్తం చేసినట్టు సమాచారం. సినిమా నిడివి తగ్గించు మహాప్రభో అని దర్శకుడు సుకుమార్ దగ్గర ఎంత మొత్తుకున్నప్పటికీ హీరో మహేష్ దగ్గర మాంఛి పలుకుబడి వున్న దర్శకుడు నిర్మాతల మాటని ఎంతమాత్రం ఖాతరు చేయలేదని, సినిమా నిడివి ఒక్క నిమిషం కూడా తగ్గించలేదని తెలుస్తోంది.
ఈ సినిమా ప్రేక్షకులకు దూరం కావడానికి నిడివి కూడా ప్రధాన కారణమని సినిమారంగ వ్యాపారవర్గాలు చెబుతున్నాయి. సినిమా విడుదలైన తర్వాత దర్శకుడికి జ్ఞానోదయమై 20 నిమిషాల నిడివి తగ్గించినా అప్పటికే జరగకూడని నష్టం జరిగిపోయింది. ముల్లు వెళ్ళి ఆకు మీద పడినా, ఆకు వెళ్ళి ముల్లుకు తగిలినా చివరికి ఆకే డ్యామేజ్ అయిపోతుందన్నట్టు పొరపాటు ఎవరిదైనప్పటికీ నష్టం మాత్రం నిర్మాతలు అనుభవించాల్సి వస్తోంది. ఈ సినిమా అపజయం కారణంగా నిర్మాతలు ఆర్థికంగా భారీ స్థాయిలో నష్టాలు మూటగట్టుకోవడం తప్పదని సినిమా వ్యాపారవర్గాలు అంటున్నాయి.