"సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" కి సూపర్ టాక్..!
ఈ రోజు విడుదలయిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా సినీ విమర్శకులనుండి మంచి రేటింగ్ పొందింది. మహేష్ బాబు, సమంత ఒక జంటగా, వెంకటేష్, అంజలి మరో జంటగా నటించిన ఈ సినిమా నిర్మాణంలో ఉండగానే, పూర్తిస్థాయి ఫామిలీ సినిమా అని నిర్మాత దిల్ రాజు ప్రకటించడం వల్ల, వెంకటేష్, మహేష్ బాబు అభిమానులు ఎటువంటి ఫైట్లు ఆశించకుండా సినిమా చూసేందుకు వచ్చేలా చేసింది. ఇద్దరు పెద్ద హీరోలున్న సినిమాలో ఫైట్స్ ఆశించకుండా ప్రేక్షకులను సినిమా హాళ్ళకి రప్పించడంలోనే సినిమా సగం విజయం సాదించింది, ఇక మిగతాది సినిమాలో నటించిన వారందరి అద్బుతమయిన నటన, కధా, కధనం, పాటలు, కెమేరా పనితనం, మనసుకు హత్తుకొనే సన్నివేశాలు వగైరాలన్నీ కలిసి విజయవంతంచేసాయి.
ప్రతీ మధ్యతరగతి కుటుంబములో సాదారణంగా కనిపించే అంశాలనే తీసుకొని, అందరికీ తెలిసిన ఒక కధని అల్లుకొన్న దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల, దానిని వెండి తెరమీద ఆవిష్కరించిన తీరుకి నూటికి నూరు మార్కులు వేయవలసిందే. ఈ సినిమా చూసిన ప్రతీ ఒక్కరూ ఏదో ఒక పాత్రలో మమేకం అయ్యేలా చేయగలిగేడు. ప్రతీ సినిమాలో కత్తులు, తుపాకులు పట్టుకొని రక్తం చిందించే మహేష్ బాబును కాక, ఈ సినిమాలో కేవలం అతనిలో ఒక మంచి సోదరుడిని మాత్రమే చూసారు. వెంకటేష్ , ప్రకాష్ రాజ్ ఇరువురూ కూడా తమ అద్బుతమయిన నటనతో ఒక సాదారణమయిన కధకి ప్రాణం పోశారు. సినిమాలో నటించిన ఇద్దరు హీరోయిన్లూ కూడా రొటీన్ సినిమాలకు బిన్నంగా అందివచ్చిన ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొన్నారు.
సాదారణంగా కుటుంభ కధా చిత్రాలలో కనిపించే భావోద్వేగాలు ఇందులో కూడా ఉన్నపటికీ అన్నీ సమపాళ్ళలో ఉండి, ప్రేక్షకులను అలరించేయి. చాలా రోజుల తరువాత విడుదలయిన ఒక పెద్ద మల్టీ స్టార్ సినిమా అయినప్పటికీ, అనవసరమయిన ఆర్భాటాలకు, భేషజాలకు పోకుండా సినిమాకి అవసరమయినన్నిపాటలనే పెట్టి సినిమాని రక్తి కట్టించేడు దర్శకుడు.
ఇక మహేష్ బాబు ఈ సినిమా సంతకం చేసినప్పుడు, మంచి ఫాంలో ఉన్నపుడు ఇటువంటివెందుకు అని సణిగిన అభిమానులు కూడా ఇప్పుడు మహేష్ బాబులో మరో కొత్త బాబును చూసి చాలా ఆనందించేరు. అదే విదంగా, ఒక మంచి హిట్టు కోసం ఎదురు చూస్తున్న వెంకటేష్ కూడా ఈ సినిమా విజయం ఆనందం కలిగించింది.
అంతే గాకుండా, పెద్ద హీరోలు కేవలం మూస ధోరణిలో కమర్షియల్ సినిమాలకే అంకితమయి పోనవసరం లేదని ఈ సినిమా నిరూపించింది. ఒక మంచి కుటుంబ కధా చిత్రమో లేక మంచి ప్రేమ కావ్యమో తీసినా కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని ఈ సినిమా నిరూపించింది. దిల్ రాజు ముందే చెప్పినట్లు ఈ సినిమా విజయం మరనేక మంచి సినిమాలకి ప్రేరణనిస్తుందని నమ్మవచ్చును. తెలుగు ప్రజలకిష్టమయిన సంక్రాంతి పండుగ సమయంలో అచ్చమయిన తెలుగుసినిమాకు అచ్చమయిన తెలుగు పేరుపెట్టి విడుదల చేసినందుకు దర్శక నిర్మాతలకు అభినందనలు.