మంచు లక్ష్మి గుండెల్లో గోదారి?
ప్రముఖ నటి మంచు లక్ష్మి నటించి నిర్మించిన ‘గుండెల్లో గోదారి’ సినిమా ప్రీవ్యూ చూసిన ఆమె తండ్రి మోహన్ బాబు, ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు, ఆ సినిమా గొప్ప కలెక్షన్లు రాబట్టాక పోవచ్చునేమో కానీ, అనేక అవార్డులు మాత్రం స్వంతం చేసుకోవడం ఖాయం అని సినిమా విడుదలకు ముందుగానే జోస్యం చెప్పడం ఆ సినిమా భవిష్యత్ ఎలా ఉంటుందో తెలియజేసింది. ఊహించినట్లే, ‘గుండెల్లో గోదారి’ ఒక మంచి సినిమాగా పేరు సంపాదించుకోవడమే గాక మంచు లక్ష్మి అత్యుత్తమ నటనకు అద్దం పట్టింది.
కానీ, నాలుగు ఫైట్స్, నాలుగు డ్యాన్సులు, ఓ పది పంచ్ డైలాగులు, ఒక ఐటెం సాంగుకి అలవాటు పడిన మన తెలుగు సినిమా జీవులకి ‘గుండెల్లో గోదారి’ వంటి సినిమాలు ‘కిక్కు’ ఇవ్వలేవు, గనుక ఆ సినిమా కలెక్షన్లు కూడా అంతంత మాత్రంగానే ఉన్నట్లు సమాచారం. ఇటీవల తనికెళ్ళ భరణి తీసిన అచ్చ తెలుగు సినిమా ‘మిధునం’కు కూడా అదే పరిస్థితి. అచ్చ తెలుగు సినిమా అంటూ సీతమ్మ వాకిట్లో సిరి మల్లె చెట్టు నాటాలని ప్రయత్నించిన ఆ సినిమా నిర్మాతలు కొంచెం వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సీతమ్మ వాకిట్లో మహేష్ బాబు చేత రెండు స్టెప్పులు వేయించబట్టి ఆ సినిమా బ్రతికి బట్ట కట్టగలిగేలా చేసారు. లేదంటే వారి గుండెల్లో కూడా గోదారే పారేదేమో.
ఇక విషయంలోకి వస్తే, మంచు లక్ష్మి గుండెల్లో దుఃఖం కట్టలు తెంచుకొన్న గోదారిలా పారుతుంటే, ఆ బాధతో వైరాగ్యం పెరగడం వల్లనో లేక తెలుగు ప్రేక్షకుల మీద అలిగారో తెలియదు కానీ ఇకపై చిత్రాల్లో నటించబోనని ప్రకటించారు. సినిమా సక్సెస్ కాకపోయినా నిర్మాతలకు తప్పనిసరి తద్దినంగా మారిన సక్సెస్ మీట్‌లో మంచు లక్ష్మీ మాట్లాడుతూ తాను ఇకపై సినిమాలలో నటించడం కానీ, నిర్మించడం గానీ చేయనని ప్రకటించారు. అందువల్లే తాను ఒక్క చిత్రానికి కూడా సంతకం చేయలేదని చెప్పారు. తానూ తిరిగి అమెరికాకు వెళ్లిపోయి తన భర్త ఆనంద్‌తో కలిసి హాయిగా కాపురం చేసుకొంటూ బ్రతకాలనుకొంటునానని ప్రకటించి అందరిని ఆశ్చర్య పరిచారు.
ఇది ఆమె వ్యక్తిగత నిర్ణయం అయినప్పటికీ, ఒక మంచి నటిగా, మంచి అభిరుచి గల నిర్మాతగా పేరుపొందిన మంచు లక్ష్మి సినీ పరిశ్రమను వీడి వెళ్ళిపోవాలని అనుకోవడం సినీ పరిశ్రమే కాకుండా అటువంటి ప్రతిభావంతురాలిని ప్రేక్షకులకు కూడా దూరం చేసుకొంటున్నారని చెప్పవచ్చును.
ఇందుకు ముఖ్య కారణం సగటు ప్రేక్షకుల అభిరుచిలో వచ్చిన తీవ్రమార్పులే. ఒక సినిమాను చూసి ‘ఎంజాయ్’ చేయడానికి, అనుభూతి చెంది ఆనందించడానికి చాలా వ్యత్యాసం ఉంది. ప్రస్తుతం సగటు ప్రేక్షకుడు సినిమా తనకు అవసరమయిన ‘ఎంజాయ్ మెంటు’ ఈయగలిగితే చాలునని భావించడం వల్లనే ఇటువంటి మంచి సినిమాలు గోదాట్లో కొట్టుకు పోతున్నాయి.
అందువల్లే మంచి అభిరుచి ఉన్న దర్శక నిర్మాతలు కూడా నాలుగు పంచు డైలాగులు, నాలుగు పాటలు, నాలుగు ఫైట్సు, ఒక ఐటెం సాంగు వేసి రీళ్ళు చుట్టేస్తూ ‘మమ’ అనిపించేసి తమ జేబులు నింపుకొంటునారు. యదా ప్రజా తదా రాజా, తదా నిర్మాతః.