విశ్వరూపంతో కమల్ హాసన్ మరో కొత్త ప్రయోగం..!
దాదాపు రూ.160 కోట్ల భారి బడ్జెట్టుతో కమల్ హస్సన్ నటించి దర్శకత్వం వహిస్తున్న ‘విశ్వరూపం’ సినిమా ఈ నెల 11వ తేదిన ప్రపంచవ్యాప్తంగా విడుదలకాబోతోంది. తమిళ్, తెలుగు మరియు హిందీ బాషలలో ఒకేసారి విడుదల అవుతున్న ఈ సినిమా పై భారి అంచానాలు ఉన్నాయి.
ఇంతవరకు అంతాబాగున్నపటికీ, తన సినిమాలతో నిత్యం ప్రయోగాలు చేసే కమల్ ఈసారి కూడా మరో ప్రయోగం చేయబోతున్నాడు. అయితే, ఈ ప్రయోగం కొందరికి మోదం, మరి కొందరికి ఖేదం కలిగిస్తోంది. ఈ సినిమాను సినిమా థియేటర్లలో విడుదలకు ఒక రోజుముందే అనగా ఈ నెల 10వ తేదీనే డి.టి.హెచ్. ద్వారా టీవీ ఛానాళ్లలో విడుదల చేయాలనే కమల్ యొక్క ఈ కొత్త ప్రయోగం సినీ పరిశ్రమని, ప్రజలను కూడా ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇదొక అద్భుత ప్రయోగం, భారతీయ సినీ పరిశ్రమకి ఒక కొత్త మలుపునిస్తుంది అని సినిమా నిర్మాతలు, దర్శకులు కమల్ ను ప్రశంశలతో ముంచచెత్తుతుంటే, మరోవైపు అయన ప్రయోగాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు తమిళనాడుకి చెందిన సినిమా పంపిణీదారులు, థియేటర్ల యజమానులు.
కేవలం రూ.1000 లతో ఇంట్లో వారే కాకుండా ఇరుగుపొరులతో సహా అందరూ సినిమాని విడుదలకి ముందే చూసేస్తే ఇక థియేటర్లకి ఎవరొస్తారు, ఎందుకు వస్తారు? అని ప్రశ్నిస్తున్నారు. అంతేగాకుండా, పైరసీదారులు సినిమాని మరింత సౌకర్యంగా కాపీలుచేసుకొని, మరింత చవకగా వీదుల్లో బెట్టి అమ్మేస్తే, ఇక సినిమా హాలుకి జనం ఎందుకు వస్తారు?అని ప్రశ్నిస్తున్నారు. తద్వారా సినిమా తొలివారం కలెక్షన్లు దెబ్బతింటే, ముందుగా నష్టబోయేది తామే తప్ప నిర్మాతలు, హీరోలు మాత్రం కారని సినిమా పంపిణీదారులు, థియేటర్ల యజమానులు వాపోతున్నారు.
తమవల్లనే ఈ స్థాయికి జేరుకొన్న కమల్ హస్సన్, ఇప్పుడు ఏరు దాటేక తెప్ప తగలేస్తున్నట్లు ఈవిదంగా తమ జీవితాలతో చెలగాటం ఆడుకోవడం సబబు కాదని వారు అంటున్నారు. అంతే గాకుండా, ఇప్పుడు కమల్ హస్సన్ చేపటిన ఈ ప్రయోగం గానీ విజయవంతం అయినట్లయితే మున్ముందు చిన్నా, పెద్ద నిర్మాతలు కూడా ఇదే దారిని అనుసరిస్తే ఇక తాము సినిమా హాళ్ళు మూసుకొని వీధినపడవలసిందే అని వాపోతున్నారు.
తమిళనాడుకి చెందిన సినిమా పంపిణీదారులు, థియేటర్ల యజమానులు కమల్ హస్సన్ ని హెచ్చరిస్తూ ఇప్పటికయినా ఈ ప్రయోగం మానుకోకపొతే, తాము విశ్వరూపం చూపించి అతని సినిమాని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సినిమా హాళ్ళలో ఎక్కడా ప్రదర్శించకుండా నిషేధం విదిస్తామని అన్నారు. గానీ, కమల్ వారివాన్ని అర్ధంలేని భయాలే అని తన ప్రయోగం అమలు చేయడానికే నిశ్చయించుకొన్నాడు.