విశ్వరూపం తమిళనాడులో బ్రేక్, ఆంధ్రలో విడుదల
posted on Jan 24, 2013 @ 9:30PM
కమల్ హస్సన్ అత్యంత వ్యయప్రాయసలకోర్చి నిర్మించిన విశ్వరూపం సినిమాకు ఇంత త్వరలో కష్టాలు తీరేట్లు లేవు. తమిళనాడు ప్రభుత్వం సినిమా ప్రదర్శనను రాష్ట్రంలో నిషేధం విదించడంతో హైకోర్టులో కేసువేసిన కమల్ హాస్సన్ కి అక్కడా చుక్కెదురయింది. ప్రభుత్వ ఉత్తర్వుపై స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. తదుపరి విచారణను ఈ నెల 28వ తేదికి వాయిదా వేసింది. అంటే రేపు విశ్వరూపం తమిళ్ వెర్షన్ విడుదల లేనట్లే. అయితే, ఈ నెల 26వ తేదీన స్వయంగా న్యాయస్థానం సినిమా చూసిన తరువాత ముస్లిం వర్గాలు ఆరోపిస్తున్నట్లు అభ్యంతరకర సన్నివేశాలు లేనట్లయితే సినిమా విడుదలపై ప్రభుత్వ ఉత్తర్వులపై స్టే జారిచేయవచ్చునని కోర్టువారు కమల్ హసన్ కు తెలిపారు.
తెలుగు, హిందీ భాషల్లో మాత్రం రేపు ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదల కాబోతోంది. అయితే, దీనివల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువగా ఉంటుంది. ఒకసారి తెలుగు లేదా హిందీ బాషలలో విడుదలయిన తరువాత, సినిమా బాగుంటే పైరసీ సీడీలు తమిళనాడును కూడా ముంచెత్తుతాయి. తద్వారా సినిమాకు మొదటి రెండువారాల్లో రావలసిన భారీరాబడికి గండిపడుతుంది. ఒకవేళ సినిమా బాగోకపోతే ఆ ప్రభావం తరువాత విడుదలయ్యే తమిళ్ వెర్షన్ పై కూడా తప్పక పడుతుంది. అప్పుడు ఆ సినిమా ధియేటర్ లలో ఎక్కువరోజులు నిలవకపొతే రూ.160 కోట్లతో సినిమా నిర్మించిన నిర్మాతలకి నష్టాల్లో ముంచి కోలుకోలేని దెబ్బ తీస్తుంది. ఈ సంఘటన సినిమా సిర్మాతల కష్టాలకి అద్దం పడుతోంది.