బాలీవుడ్ లో టాలివుడ్ హవా
దక్షినాది సినీ రంగం నుండి బాలివుడ్ వెళ్ళిన ఆసిన్, త్రిష, ఇలియాన, కాజల్ అగర్వాల్ వంటి అందాల భామలు అక్కడ తమ ప్రతిభను నిరూపించుకొన్న సంగతి అందరికే తెలిసిందే. త్వరలో మరో అందాల భామ సమంత కూడా బాలివుడ్ బాట పట్టనుంది. ఆమెకు ఇటీవలే బాలివుడ్ నుండి ఒక ఆఫర్ వచ్చింది. గతంలో సూపర్ హిట్ అయిన హిందీ సినిమా ‘సింగం’కు సీక్వెల్ గా నిర్మిస్తున్న ఈ సినిమాలో సమంత అజయ్ దేవగన్ తో జత కట్టబోతోంది. త్వరలోనే ఈ సినిమా షూటింగు మొదలయ్యే అవకాశం ఉంది.
ప్రస్తుతం మన తెలుగు చిత్ర పరిశ్రమ నుండి బాలివుడ్ వెళ్ళిన రామ్ చరణ్ తేజ్ ‘జంజీర్’ అనే సినిమాలో అపూర్వ లఖియా దర్శకత్వంలో నటిస్తున్నారు. దీనిని తెలుగులో ‘రుస్తుం’ అనే టైటిల్ తో విడుదల చేస్తారని సమాచారం.
తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొన్న నటుడు నానీ కూడా త్వరలో యష్రాజ్ ఫిలిమ్స్ వారు నిర్మించే ఒక తెలుగు సినిమాలో నటించబోతున్నాడు.
ఇక ప్రభుదేవా, రామ్ గోపాల్ వర్మ వంటి వారు కూడా బాలివుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొన్నారు. ఆ తరువాత బాలివుడ్ లో అడుగుపెట్టిన పూరీ జగన్నాథ్ కూడా అమితాబ్ బచ్చన్ తో తీసిన తన మొట్ట మొదటి సినిమా ‘బుడా’తో తన ప్రతిభ నిరూపించుకొన్నారు. అయితే, ఆ తరువాత ఆయన మళ్ళీ బాలివుడ్ వైపు తిరిగి చూడలేదు. కానీ, అయన ప్రతిభను మాత్రం బాలివుడ్ సరిగ్గానే గుర్తించింది. ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తున్న ‘ఇద్దరు అమ్మాయిలతో’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న, పూరీ జగన్నాథ్ ఆ సినిమా పూర్తయిన తరువాత, ఒక హిందీ సినిమాకు దర్శకత్వం వహించేందుకు అంగీకరించినట్లు బాలీవుడ్ నిర్మాత ఒకరు ఇటీవల మీడియాకు వెల్లడించారు. ప్రముఖ బాలివుడ్ అజయ్ దేవగన్ ప్రధాన పాత్ర పోషిస్తారని ఆయన తెలిపారు. ఈ సినిమా తరువాత మరో సినిమా కూడా తన బ్యానర్ లోనే నిర్మించాలను కొంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ సినిమా పూర్తీ వివరాలు త్వరలో వెల్లడిస్తామని ఆయన అన్నారు.