నన్ను బలిపశువును చేశారు: గణేష్
ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే కాస్త చుట్టకు నిప్పిస్తావా? అని అడిగినట్లుందని బండ్ల గణేష్ వాపోతున్నాడు. “ఒకపక్క ఆదాయపన్నుశాఖ వాళ్ళు గోళ్ళూడగొట్టి మరీ కోటి రూపాయలు గుంజుకొన్నారని నేనేడుస్తుంటే, ఈ రాజకీయలేమిటి చంద్రబాబూ...” అంటూ బండ్ల గణేష్ లబలబలాడుతున్నాడు.
అసలు తనకే రాజకీయనాయకుడితో బిజినెస్ వ్యవహారాలులేవని, తానూ ఎవరికీ బినామీని కానని, తన సినిమాలన్నీ తన కష్టార్జితంతో తీసినవే తప్ప, వెనకనుండి తనకు ఎవరూ కూడా డబ్బు మూటలు అందించలేదని, ఇకనైనా తనపై బురద జల్లడం మానుకోవాలని బండ్ల గణేష్ మీడియా ద్వారా అందరికీ విజ్ఞప్తి చేసాడు. తనను అనవసరంగా రాజకీయలలోకి లాగి బలి పశువును చేసారని అన్నాడు. తనకు సినిమాలు తీయడం తప్ప రాజకీయాల గురించి అసలేమి అవగాహన లేదని, అటువంటప్పుడు తనకు తెలియని రాజకీయ వ్యక్తులతో కలిసి బిజినెస్ వ్యవహారాలు ఎందుకు చేస్తానని అతను ప్రశ్నించాడు.
అతనిపై ఆదాయపన్నుశాఖ వారు దాడిచేసిన తరువాత తెలుగుదేశం పార్టీ నేతలు వర్ల రామయ్య, దాడి వీరభద్రరావు ఆదాయపన్నుశాఖ వారిని బొత్స సత్యనారాయణ ఇళ్ళు, కార్యాలయాలపై కూడా దాడి చేయాలని కోరినప్పుడు, బొత్స సత్యనారాయణ బదులు మరి బండ్ల గణేష్ ఎందుకు ఈవిధంగా స్పందించాడో తెలియదు. తెలుగుదేశం నేతల మీడియాకెక్కి ఇంత రచ్చ చేస్తున్నా కూడా ఇంతవరకు బొత్స సత్యనారాయణ మాత్రం స్పందించలేదు. బహుశః త్వరలోనే ఆయన కూడా ఘాటుగా జవాబీయవచ్చును.