Read more!

పరీక్ష కాలాన్ని పరుగులు పెట్టించండి ఇలా!

క్లాస్ రూమ్ కురుక్షేత్రంగా మారిపోయే సమయం ఆసన్నమైంది. ఏడాదంతా పడ్డ శ్రమకు ఇది నిజంగా 'పరీక్షా' సమయమే. ఆ రోజు అర్జునుడు బాధతో యుద్ధమంటే విముఖత చూపాడు . అందుకే 'క్షుద్రం హృదయదౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప..” అంటాడు కృష్ణుడు, అర్జునిడితో. ముందు మనసుని దృఢపరచుకోమంటాడు. కాని ఇప్పుడు మనం పరీక్షల భయంతో ఆందోళన పడుతున్నాం. ఇలాంటి సమయంలో మనలోనే కృష్ణుడి లాంటి 'మోటివేటర్' మేల్కొనాలి. ధైర్యంగా పరీక్ష రాయించాలి... పాస్ చేయించాలి. అందుకు మానసికంగా కొంత యోగం... సాధనా యాగం అవసరం. అందుకే నాలుగు అంశాల్ని దృష్టిలో పెట్టుకుంటే మనం విజయం సాధించనట్లే.. అవి

నిర్భయం... పఠనం... మననం... లేఖనం 

నిర్భయం...

ముందు నిర్భయంగా నిలబడండి. కురుక్షేత్రంలో అర్జునుడు వెనకడుగు వేసినప్పుడు కూడా కృష్ణుడు చెప్పిందిదే. 'క్షుద్రం హృదయ దౌర్బల్యం..' అన్నాడు. ఎల్కేజీ నుంచి మనకు పరీక్షలేమీ కొత్తకాదు. గతంలో పరీక్ష ముందు మీరు పడ్డ ఆందోళనను గుర్తుచేసుకోండి. పరీక్ష రాశాక ఆ ఆందోళనకు ఎంత నవ్వుకున్నారో మననం చేసుకోండి. ఆ పరీక్షలకు ఈ పరీక్ష కూడా భిన్నమైందేమీ కాదు. మనం ఎప్పుడైతే భయం వీడి ప్రశాంతంగా ఉంటామో, మన మెదడు నిర్మలంగా పనిచేస్తుంది. కిచెన్లో నుంచి ఏది అడిగితే అది ప్రేమతో ఇచ్చే అమ్మలా మనం చదివి దాచుకున్న జవాబులన్నింటినీ మెదడు సజావుగా పరీక్షగదిలో సరఫరా చేస్తుంది. 'భయమే మరణం... నిర్భయమే జీవితం...'. కాబట్టి ముందు ధైర్యంగా ఉందాం.

పఠనం...

ముందు పరీక్ష కోసమే పఠనం అన్న భావనను విడనాడాలి. జ్ఞాన సముపార్జనలో పరీక్షలు చిన్న మజిలీయే. పరీక్షాపత్రమే పూర్తి చదువు కాదు కదా. అయితే చదివే విధానం మారాలి. ప్రతీ పాఠాన్ని కంఠోపాఠంలా కాకుండా, విశ్లేషణతో చదవాలి. అంత పెద్ద రామాయణాన్ని కూడా అర్థం చేసుకొని మూడుముక్కల్లో కీ నోట్ రాయచ్చు. 

మననం..

ఎంత చదివినా అభ్యాసం(ప్రాక్టీస్) ప్రధానం. 'అభ్యాసేన తు కౌంతేయ..' అంటాడు విజయుడితో వేణుమాధవుడు. అభ్యాసంతో ఎంతటి కఠినమైన అంశంపై కూడా ఆధిపత్యాన్ని సంపాదించవచ్చు. మనలో చాలా మంది ఎంత చదివినా  పరీక్ష దగ్గరకు వచ్చేసరికి మరచిపోవడానికి కారణం, ఈ మననం అంటే రివిజన్ లేకపోవటమే. అందుకే మనం తయారు చేసుకున్న కీనోట్ ని తరచూ రిపీట్ చేసుకుంటూ ఉండాలి. అలా చేయాలి అంటే ముందు మన మనసుని శుభ్రంగా ఉంచుకోవాలి. అనవసర విషయాల్ని ఎప్పటికప్పుడు బయటకి పంపాలి. మనసుని విలువైన వస్తువులు పెట్టుకునే ఆభరణాల పెట్టెలా సిద్ధం చేసుకోవాలి.

లేఖనం...

మనలో చాలా మందికి అన్నీ తెలిసినా ఎలా చెప్పాలో, ఎలా రాయాలో తెలీదు. ఇక్కడే మనకు సృజనాత్మకత కావాలి. ఆధునిక పరీక్షా విధానమంతా దీనిపైనే ఆధారపడి ఉంది. నీకు తెలిసిన అంశాన్ని ఎంత చెబుతున్నావన్నదే ప్రధానం. ఈ అంశాలతో పాటు అన్నింటికీ మించి మనసును కుదురుగా ఉంచుకుంటే జీవితమనే పరీక్షలోనూ విజయం సాధిస్తాం. ధ్యానం వంటి ఆధ్యాత్మిక సాధనలు ముఖ్యంగా మన ఏకాగ్రతకు పదును పెడతాయి... ఆ తరువాత పరీక్షలే కాదు ఎంతటి అలజడుల్లోనైనా మన విజయం సాధించగలం .


                                      ◆నిశ్శబ్ద.