Read more!

ప్రపంచం మీద మహిళల పతాకం.. మహిళా దినోత్సవం!

మహిళ లేకపోతే ఈ భూమి మీద ప్రాణిని నవమాసాలు మోసి  కనే మార్గం లేదు. ఆడవారికే ప్రత్యేకతను తీసుకొచ్చే అంశం ఇది. ఈ సృష్టిలో ఆడ, మగ అంటూ రెండు వర్గాలున్నా.. ఏ వర్గానికి ఆ వర్గం ప్రత్యేకం. కానీ పితృస్వామ్య వ్యవస్థ కలిగిన భారతదేశంలో తరతరాలుగా స్త్రీని ఒక శ్రామికురాలిగా చూస్తున్నారు. ఆడది అంటే భర్తకు సేవ చేయడం, పిల్లల్ని కనడం, ఇంటి పనులు చేయడం, భర్తకు కోపం వచ్చినప్పుడు ఆ కోపం తీరడానికి తనొక మార్గమన్నట్టు, భర్తకు శారీరక అవసరం తీర్చే వస్తువు అయినట్టు ఇలా మహిళను ఎంతో దారుణంగా చూసేవారు. దీన్ని అధిగమించి మహిళలు ఈ ప్రపంచంలో తమకంటూ గుర్తింపు కోసం ఎంతో పోరాటం చేశారు. దీని ఫలితమే మహిళా దినోత్సవం. 

ప్రతి సంవత్సరం, మార్చి నెల మహిళల చరిత్రను ఈ ప్రపంచమంతా గొంతువిప్పి చెబుతుంది. ఈ చరిత్ర  సమకాలీన సమాజంలోని సంఘటనలను మహిళల సహకారాన్ని అందరికీ తెలుపుతుంది.  మార్చి 8న ప్రజలు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈరోజున వివిధ రంగాలలో మహిళలు సాధించిన సాంస్కృతిక, రాజకీయ, సామాజిక - ఆర్థిక విజయాలను గురించి ప్రపంచానికి పరిచయం చేస్తుంది.   పక్షపాతం, వివక్ష లేని లింగ-సమాన ప్రపంచం కోసం మహిళా దినోత్సవం  పిలుపునిస్తుంది. 

ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం ఒక్కో థీమ్ ను ఏర్పాటు చేస్తారు. ఈ ఏడాది థీమ్ ఎంబ్రేస్ ఈక్విటీ లేదా #ఎంబ్రేస్ ఈక్విటీ. "ఈక్విటీ అనేది కేవలం మాటల్లో కాదు, అది మహిళల జీవితాల్లో తప్పనిసరిగా ఉండాలి. లింగ సమానత్వం సమాజంలో భాగం కావాలి. IWD 2023 #EmbraceEquity ప్రకారం 'సమాన అవకాశాలు ఎందుకు సరిపోవు' అనే విషయం  గురించి ప్రపంచం మొత్తం మాట్లాడేలా చేయడమే ముఖ్య ఉద్దేశం.

మహిళా దినోత్సవ చరిత్ర..

అంతర్జాతీయ మహిళా దినోత్సవం మొదట ఉత్తర అమెరికా మరియు ఐరోపాలో జరుపుకునేవారు.  ఐక్యరాజ్యసమితి పేర్కొన్న విషయాలు పరిశీలిస్తే.. "మొదటి జాతీయ మహిళా దినోత్సవం ఫిబ్రవరి 28, 1909న యునైటెడ్ స్టేట్స్‌లో నిర్వహించబడింది.  దీనిని సోషలిస్ట్ పార్టీ ఆఫ్ అమెరికా 1908లో న్యూయార్క్‌లో గార్మెంట్ కార్మికుల సమ్మె గౌరవార్థం అంకితం చేసింది.  మహిళలు కఠినమైన పని, అక్కడి పరిస్థితులకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. 1917లో, రష్యాలోని మహిళలు ఫిబ్రవరిలో చివరి ఆదివారం (గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం మార్చి 8న) "బ్రెడ్ అండ్ పీస్" నినాదంతో నిరసన, సమ్మెను చేశారు. వారి ఉద్యమం చివరికి రష్యాలో మహిళల ఓటుహక్కు చట్టానికి దారితీసింది.

1945లో ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేసిన చట్టం స్త్రీ పురుషుల మధ్య సమానత్వాన్ని  ధృవీకరించే మొదటి అంతర్జాతీయ ఒప్పందంగా ప్రకటించింది, అయితే 1975లో అంతర్జాతీయ మహిళా సంవత్సరంలో మార్చి 8న మాత్రమే ఐక్యరాజ్యసమితి మొదటిసారిగా అధికారికంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంది. తరువాత డిసెంబర్ 1977లో, జనరల్ అసెంబ్లీ మహిళా హక్కులు, అంతర్జాతీయ శాంతి కోసం మహిళా దినోత్సవాన్ని సభ్యదేశాలు సంవత్సరంలో ఏ రోజునైనా పాటించాలని ఒక తీర్మానాన్ని ఆమోదించింది. చివరగా, 1977లోనే ఐక్యరాజ్యసమితి దీనిని ఆమోదించిన తరువాత, అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8న మహిళా దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా జరుపుకోవాలని ఆమోదించింది.

ఇలా పలు మార్పులు చెందుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రూపుదిద్దుకుంది. మహిళా దినోత్సవం కేవలం సంవత్సరంలో ఒకసారి జరుపుకునే ముచ్చటగా, కేవలం ఆరోజు మాత్రమే మహిళలను గౌరవించే సందర్భంగా కాకుండా ప్రతిరోజూ మహిళకు తగిన గౌరవం, మహిళల పనికి తగిన గుర్తింపు కల్పించడం ఎంతో ముఖ్యం. మీ ఇంటి ఆడవారిని మీరు గౌరవించడం మొదలుపెడితే సమాజం ఆడవారిని గౌరవిస్తుంది. అలా ఒక బాధ్యతాయుతమైన ప్రపంచం ఆడవారి చుట్టూ పెనవేసుకుపోతుంది. ఈ ప్రపంచమంతా ఆడవారి సంకల్పశక్తి అనే పతాకం రెపరెపలాడుతుంది.

మగవాడి విజయం వెనుక ఆడది ఉన్నట్టే.. ఆడదాని విజయం వెనుక మగవారి అర్థం చేసుకునే మనసు ఉండటం ప్రధానం. సమకాలీన ప్రపంచంలో ప్రతి మహిళ జీవితం యుద్ధమే.. అలాంటి మహిళలకు అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళలకు అండగా నిలబడే పురుషులకు ఆనందోత్సవ శుభాకాంక్షలు.. మీ ఆడవారి విజయం మీకు ఆనందమేగా..

                                      ◆నిశ్శబ్ద.