Read more!

నేటి యువత తెలుసుకోవలసిన ముఖ్య విషయమిదే!

శాంతి సమాజ సౌధానికి పునాదిరాళ్ళు నేటి యువతీ యువకులే! అలాంటి యువతరం నేడు మానసిక ఉద్రేకాలకు లోనై హింసా ప్రవృత్తి మార్గాన్ని అనుసరించడం బాధాకరం! ఈ రోజు సమాజంలో పాశ్చాత్య పోకడలు, భౌతిక ఆకర్షణలతో పాటు మరెన్నో పరిస్థితులు యువతను దారుణాలకు ఉసిగొల్పుతున్నాయి. ఇదే భావనతో కురుక్షేత్ర సమరంలో అర్జునుడు... 

అథ కేన ప్రయుక్తో యం పాపం చరతి పూరుషః |
అనిచ్ఛన్నపి వార్డేయ బలాదివ నియోజితః ॥ 

'పరమాత్మా! మానవుడు పాపమాచరించేందుకు అసలు హేతువేమిటి? ఇష్టం లేకున్నా కూడా మనుష్యులు ఎవరో బలవంతంగా ప్రోత్సహించినట్లు పాపం ఎందుకు చేస్తున్నారు? పాపాచరణకు కారణం బాహ్యమా? ఆంతరంగికమా? అని శ్రీకృష్ణభగవానుడిని ప్రశ్నిస్తాడు అర్జునుడు.

దీనికి సార్వకాలికమైన, సార్వజనికమైన విశ్లేషణతో ఆ జగదేకనాయకుడు అద్భుతమైన వివరణనిస్తాడు. రజోగుణం నుంచి పుట్టిన కోరిక, అది తీరనప్పుడు కలిగే క్రోధమే పాపం చేయటానికి ప్రధాన కారణాలని స్పష్టం చేస్తాడు భగవానుడు. ఈ రోజు కూడా మనం పరిశీలిస్తే 'తీరని కోరికలు; తీరకపోతే కలిగే కోపాలే' యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ రెండింటి వలన కలిగే పరిణామాలు, మనిషిని రాక్షసుడిగా మార్చేస్తున్నాయి. అందుకే మన సనాతన ధర్మం మనిషిలోనే ఉండి, మనిషికి శత్రువుగా మారి అతనిని నేరప్రవృత్తి వైపునకు మరలించే ఆరుగుణాలను 'షడ్-రిపు'గా అభివర్ణించాయి. అవి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు! ఇవన్నీ మానవుడు పుట్టినప్పటి నుంచీ మనస్సును ఆవరించి అల్లకల్లోల పరుస్తున్నా, వాటి నుంచి బయటపడే మార్గాన్ని కూడా మన సనాతన ధర్మంలో విపులంగా సూచించారు. మనిషి తలచుకుంటే ఈ కామక్రోధాలను తన అదుపులో పెట్టుకోగలడు. ఇతర జీవజాతులకు ఆ అవకాశమే లేదు. 

దురదృష్టవశాత్తూ ఆధునిక నాగరకతలో యువతీయువకులు మనస్సుకు ఈ రకమైన శిక్షణనివ్వటంలో ఘోరంగా విఫలమవుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ కింది నాలుగు అంశాల్లో తమ మానసిక సమతౌల్యాన్ని కోల్పోవటం వల్లే యథేచ్ఛగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఎంతటి నేరాలకైనా ఒడిగడుతున్నారు. అవి...

మానసిక ఉద్వేగం (emotionality)

 క్రియాశీలత (activity)

ప్రచోదనం (impulsivity)

సాంఘికంగా సర్దుబాటు (sociability) 

ఒక కోరికవైపు మనస్సు మొగ్గుచూపగానే వెంటనే అది 'ఎమోషనల్' అయిపోతోంది. దానిని ఎలాగైనా తీర్చుకోవాలన్న తపన పెరుగుతోంది. ఈ సమయంలోనే ఆ కోరిక సక్రమమైందా? కాదా? అని ఒకటికి పదిసార్లు ప్రశ్నించుకోవాలి. తరువాతే మన క్రియాశీల, ప్రచోదక శక్తులను వినియోగించుకోవాలి. అప్పుడే మనస్సు సరైన దిశలో పయనించటం అలవరచుకుంటుంది. లేనట్లయితే, కనిపించిన ప్రతి కోరికనూ మనస్సు తీర్చుకోమంటుంది. ప్రలోభాలతో ప్రమాదంలోకి పడవేస్తుంది. ముఖ్యంగా మన నడవడిక, కామ, క్రోధాలు సమాజంపై ఏ విధమైన ప్రభావాన్ని చూపుతాయో ఆలోచించుకోవాలి.

 పుట్టే  ప్రతి కోరికను తీర్చుకుంటూ దాన్ని సంతృప్తిపరచాలని ప్రయత్నించటాన్ని మించిన అమాయకత్వం మరోటి లేదు. అవి ఎంత తీర్చితే, అంతకు వందరెట్లు ఆవురావురుమంటూ వెంట పడతాయి. చివరకు మన పతనానికే కారణమవుతాయి. ఒక్కమాటలో చెప్పాలంటే విశృంఖల ఇంద్రియవాంఛలే (unrestrained sensual desires) సభ్యసమాజంలో నేరధోరణికి ప్రధాన కారణం. అందుకే ఎక్కడో ఒక దగ్గర వాటికి భరతవాక్యం పలకాలి. అందుకే భగవద్గీతలాంటి ధార్మిక సారస్వతం 'వాంఛలను అణచుకోమని' చెప్పటం లేదు. వాటిని అధిగమించి ఉన్నతమైన అంశాలపైకి మనస్సును తీసుకువెళ్ళమంటోంది. 

                                   ◆నిశ్శబ్ద.