Read more!

ఎదుటివారిలో ఈ గుణాన్ని గుర్తిస్తున్నారా?

జీవితం చాలా విలువైనది. చాలా అందమైనది. ఇటువంటి విలువైన నీ జీవితం పట్ల సమాజానికి మంచి సదభిప్రాయం వుండాలి.

మనం మన వ్యక్తిగత విషయాల పట్ల ఎదుటివారి దృష్టిలో విలువలు సంపాదించాలి. జీవితంలో కష్టసుఖాలు లాభనష్టాలు అల్లుకుపోయి వుంటాయి. వాటిని అందుకుని తీరకతప్పదు. మన జీవితంలో వచ్చిన కష్టనష్టాలకు గల కారణాలను వాస్తవాలను గ్రహించాలి. మనకు వచ్చిన కష్టనష్టాలకు ఇతరులు బాధ్యులు అని వారిని నిందించకూడదు. వారే నీ కష్టాలకు బాధ్యులు అని నీవు వారి పట్ల అంచనా వేయకూడదు.

ఒకప్పుడు ఒక వ్యక్తి చాలా సంపన్నుడు. అతనికి చాలా డబ్బు వుండేది. ఆ డబ్బంతా ఏమి చేయాలో అతనికి తోచక తన స్నేహితుడిని ఈ డబ్బంతా ఏమి చేయాలో తెలియడం లేదు. ఏదైనా సలహా ఇవ్వమని కోరతాడు. అప్పుడు ఆ స్నేహితుడు ఒక సలహా ఇస్తాడు. నాకు తెలిసిన ఒక వ్యక్తి కష్టాలలో వున్నాడు. అతనికి నీవు డబ్బులు ఇస్తే అతను తన కష్టాలు తీరిన తరువాత వడ్డీతో సహా నీ డబ్బులు నీకు ఇస్తాడు. నీకు నీ డబ్బు ఇంకా రెట్టింపు అవుతుంది. తరువాత రాబోయే తరాలకు కూడా నీ డబ్బు ఉపయోగపడుతుంది. అని సలహా ఇచ్చి నీవు కూడా ఆలోచించు నేను చెప్పిన సలహా సరి అయినది అని అనిపిస్తేనే నీవు ఈ పని చేయి అని చెబుతాడు. 

స్నేహితుడు చెప్పిన సలహా సరైనది అని తన మనసుకు తోచింది. స్నేహితుడు చెప్పినట్లుగా అతను కష్టాల్లో వున్న ఆ వ్యక్తికి డబ్బును ఇచ్చాడు. కొన్ని రోజుల తరువాత స్నేహితుడు చెప్పినట్లుగా ఆ వ్యక్తి ఇతనికి వడ్డీతో సహా డబ్బులను తెచ్చి ఇచ్చాడు. స్నేహితుడు చెప్పినట్లుగా అతనికి డబ్బు రెట్టింపు అయ్యింది. అపుడు అతను స్నేహితుడిని మెచ్చుకుంటాడు. కొన్ని రోజుల తరువాత ఇతనికి బిజినెస్ చేయాలని అనిపించింది. అపుడు మరల స్నేహితుడి సలహాను కోరతాడు. అప్పుడు స్నేహితుడు రొయ్యల బిజినెస్ పెట్టమని సలహా ఇస్తాడు. కొన్ని రోజులు ఆ రొయ్యల బిజినెస్ మంచిలాభం వచ్చింది. ఇలా లాభం రావడానికి కారణం తన స్నేహితుడే అని అతడిని బాగా అభినందించాడు. 

తరువాత కొన్ని రోజులకి, ఆ రొయ్యల బిజినెస్ కి సరైన సదుపాయం లేక నష్టం వచ్చింది. ఆ స్నేహితుడు వల్ల అతను చాలా లాభాలు పొందాడు. కానీ నష్టం వచ్చేటప్పటికీ, నా స్నేహితుడు వలన నేను ఈ రొయ్యల బిజినెస్ పెట్టాను. దీనికి కారణం నా స్నేహితుడే అని అతడిని నిందిస్తాడు, అవమానపరుస్తాడు. అప్పుడు ఆ స్నేహితుడు తనకు లాభాలు వచ్చినప్పుడు మెచ్చుకున్నాడు. తనకు నష్టం వచ్చినప్పుడు మరల నన్ను నిందిస్తున్నాడు. ఎప్పుడూ ఈ వ్యక్తికి సలహా ఇవ్వకూడదు. ఇతను డబ్బుకు విలువ ఇస్తున్నాడు. మనిషికి మనిషిగా విలువను ఇవ్వడంలేదు. అని తన మనస్సులో అనుకుని అతని నుండి దూరంగా వెళ్ళిపోయాడు. 

ఇప్పుడు అతనికి సలహాలు ఇచ్చే వ్యక్తులు లేరు. నేను నిందించడం వల్లే నా స్నేహితుడు నా నుండి వెళ్ళిపోయాడు అని బాధపడి అతనిలో వున్న చెడు అభిప్రాయాలను తొలగించుకుని మనిషిగా మానవతా విలువలను పెంచుకున్నాడు. ఎప్పుడైనా మనం ఎవరి సలహా అయినా తీసుకున్నప్పుడు ఆ మనిషి చేసిన సహాయాన్ని మరిచిపోకూడదు. అలాగే ఆ మనిషి వలనే నీకు కష్టం వచ్చింది అంటే అందుకు నీవే బాధ్యుడవు. అతని వల్ల పొందిన లాభాన్ని గ్రహించాలి. అతని వల్ల వచ్చిన కష్టాన్ని నిందించకూడదు, మీలోని ఆలోచనా విధానాన్ని గ్రహించాలి, దాన్ని సరిచేసుకోవాలి.  ఎదుటివారు చెప్పారు కదా అని మీరు ఆలోచించకుండా, సరైన నిర్ణయం తీసుకోకుండా వారు చెప్పినట్లుగానే చేసి, అందువల్ల ఏదైనా కష్టం వస్తే వారే బాధ్యులు అని ఎలా నిందించగలరు? మీరే ఆలోచించండి.....

మనం మనిషిగా మానవత్వపు విలువలను సంపాదించాలంటే మొదట మనం ఎదుటివారిలో వున్న మంచిని గ్రహించాలి.

                                         ◆నిశ్శబ్ద.