Read more!

దుఃఖాన్ని అంతమొందించే తాళం చెవి ఎక్కడుంది?

మనిషిని కదిలించేవి భావోద్వేగాలు. ప్రేమ, బాధ, దుఃఖం, అసూయ, ద్వేషం ఇవన్నీ విభిన్నమైన భావోద్వేగాలు. అయితే వీటిలో మనిషి ఎక్కువగా ప్రేమకు, దుఃఖానికి, కోపానికి తొందరగా చలించిపోతూ ఉంటాడు. దుఃఖం మనివాహిని ఎప్పుడూ వెంటాడుతూ ఉంటుంది. రోజు మొత్తం సంతోషం ఉన్నా ఒక్క దుఃఖభరితమైన సంఘటన జరిగిందంటే చాలు మనిషి ఇక తనకు సంతోషమే లేదన్నంత బాధపడిపోతూ ఉంటాడు. 


మీకు ప్రియమైన వారు ఎవరయినా పోయినప్పుడు మీరు కన్నీళ్లు పెట్టుకుంటారు. అయితే  ఆ కన్నీళ్లు మీ కోసమా లేక చనిపోయిన వారి కోసమా? మీ కోసమే మీరు ఏడుస్తున్నారా? ఇతరుల కోసమా? నిజానికి ఇతరుల కోసం ఎప్పుడయినా ఏడ్చారా? యుద్ధక్షేత్రంలో చనిపోయిన  ఎవరికోసం అయినా ఎప్పుడైనా ఏడ్చారా? ఈ ఏడుపు అంతా మీరు ఏదో కోల్పోయారన్న భావంతోనా లేక ఒక మనిషి చనిపోయినాడే అనే చింతవల్లనా? మీ కోసం మీరు ఏడ్చినట్లయితే దానిలో అర్థం లేదు. మీరు ఆప్యాయత కురిపిస్తున్న ఒక మనిషి పోయినాడు గనుక మీరూ ఏడుస్తున్నారూ అంటే - నిజంగా అలాంటి ఆప్యాయత లేనేలేదు అన్నమాట! చనిపోయిన మీ తమ్ముని కోసం - అతని కోసమే - ఏడవండి. అతను పోయాడు గనుక మీ కోసం మీరు ఏడవడం చాల తేలిక. మీ హృదయం స్పందించింది గనుక మీరు ఏడుస్తున్నారు. కాని, అతని కోసం కాదు ఈ స్పందన. ఈ విషయం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది కదూ… మీ మీద మీకు జాలి, అనుకంప. దీనితో మీరు కరుడు కట్టుకుపోతున్నారు, మూసుకొని పోతున్నారు. దీనివల్లనే మొద్దుబారి మూర్ఖులయిపోతున్నారు.


మీ కోసం మీరు విలపిస్తూ వున్నట్లయితే అది ప్రేమ అవుతుందా? మీరు వంటరివారు అయినారు గనుక, అశక్తులయిపోయారు కనుక, మీ పరిస్థితి విచారకరం అయిపోయింది గనుక ఈ విలాపం కొనసాగుతూ వున్నదా? మీకు యీ విషయం అయితే తెలిసివస్తే  ఒక చెట్టునో స్తంభాన్నో ప్రత్యక్షంగా తట్టిచూసినంత స్ఫుటంగా అప్పుడు యీ విచారమంతా స్వయంకృతమయినదే అని అనిపిస్తుంది. 


ప్రతి మనిషికి జీవితంలో కలిగే ఎన్నో భావోద్వేగాలకు ఆలోచనలే మూలం. ఈ  ఆలోచన వల్లనే విచారం ఏర్పడుతోంది. దుఃఖం కాలానికి ఫలితం. ఒకరికి కొంత కాలం క్రితం ఒక తమ్ముడు ఉండేవాడు. ఆ తమ్ముడు ఏదో ప్రమాదంలో చనిపోయాడు. అతను చనిపోయిన తరువాత ఇతడు ఒంటరి వాడు అయిపోయాడు. ఆ తమ్ముడు ఉన్నపుడు తిట్టుకోవడానికి కొట్టుకోవడానికి, గొడవ పడటానికి బాగుండేది. కానీ అతడు పోయాక ఒంటరితనం అవరిస్తుంది. ఆ ఒంటరితనం నుండి బాధ పుడుతుంది. ఆ బాధ నుండి ఊరట కలగడం కోసం ఏడుస్తారు.   

మీరు గమనించగలిగితే, ఇలాంటివి ఏవైనా మీ హీవితంలో జరిగినప్పుడు ఇదంతా మీ అంతరంగంలో కదలాడడం చూడగలుగుతారు. పూర్తిగా సంపూర్ణంగా చూడగలరు. ఒక్క వీక్షణంలోనే. దానికోసం సమయం విశ్లేషణ వెచ్చించకండి. 'నేను, నా కన్నీళ్లు, నా కుటుంబం, నా జాతి, నా నమ్మకాలు, నా మతం' ఇలాంటి అస్తవ్యస్తమయిన సమాచారం అంతా దాని స్వరూప స్వభావాలు దాని క్షుద్రత్వం.  అన్నీ ఒక్క క్షణంలో, మీ అంతరంగంలో దర్శించుకోగలుగుతారు. మీమనసుతో కాక, హృదయంతో దానిని చూడగలిగినప్పుడు  హృదయపు లోతులలో నుంచి చూడగలిగితే  అప్పుడు మీకు దుఃఖాన్ని, విచారాన్ని  అంతమొందించగల తాళపుచెవి ఖచ్చితంగా దొరుకుతుంది. దుఃఖానికి మూలం అంతరంగంలోనే ఉందనే విషయమూ అర్థమవుతుంది.


                                      ◆నిశ్శబ్ద.