Read more!

జీవితంలో విజయం సాధించాలంటే విదురుడు చెప్పిన ఐదు నియమాలు ఇవే..!

మహాభారతంలో విదురుడు చాలా గొప్పవాడు.  ఆయన బుద్ది, తీక్షణత, ఆయన చెప్పిన నీతి  ప్రతి వ్యక్తి జీవితానికి గొప్ప మార్గనిర్దేశాన్ని ఇవ్వగలవు.  జీవితంలో ఎన్నో కఠినమైన సమస్యలను పరిష్కరించగలవు.  ఒక రాజుకు ఉండాల్సిన అన్ని యోగ్యతలున్నా విదురుడు రాజు కాలేకపోయాడు. మంత్రిగా, అన్నింటికి మించి శాస్త్రాలను,  నియమాలను, విలువలను ఒడిసిపట్టిన, వాటిని ఇతరులకు ఎలాంటి పక్షపాతం లేకుండా బోధించినవాడు విదురుడే.. విదురుడు చెప్పిన ఐదు నియమాలు పాటిస్తే జీవితంలో విజయానికి ఢోకా ఉండదు.. అవేంటో తెలుసుకుంటే..

మతాన్ని ఉల్లంగించే పనిని, శత్రువు ముందు తల వంచడం లాంటి పనిని ఎప్పుడూ చేయకూడదు. మరీ ముఖ్యంగా డబ్బు సంపాదించడం కోసం ఈ పనులను ఎప్పుడూ  చేయకూడదని విదురుడు తన నీతి శాస్త్రంలో పేర్కొన్నాడు.

ఇతరులను ద్వేషించేవాడు, కోపంగా ఉండేవాడు  తన జీవితం పట్ల ఎప్పుడూ  అసంతృప్తిగా ఉంటాడు.  ఎల్లప్పుడూ సందేహాస్పదంగా ఉంటాడు. అలాంటి వ్యక్తి జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉండలేడు. అందువల్ల ఈ చెడు అలవాట్లను వీలైనంత త్వరగా వదిలివేయాలి.

ఇతరులను  గౌరవించడం,  తిరిగి గౌరవాన్ని  పొందడంలో ఉత్సాహంగా లేని వ్యక్తి ఏ విషయాన్ని అంగీకరించేందుకు సుముఖంగా ఉండడు. అదే విధంగా అన్ని విషయాలలో  చాలా కోపంగా ఉంటాడు.  కానీ ఇతరులను గౌరవించడం, తను తిరిగి గౌరవాన్ని పొందే వ్యక్తి గంగానదిలా ప్రశాంతంగా ఉంటాడు. ఇతడినే విదురుడు  జ్ఞానవంతుడు అని నిర్వచించాడు.

జ్ఞానవంతుల మాదిరిగానే విదురుడు మూర్ఖుల గురించి కూడా తన నిర్వచనం ఇచ్చాడు. ఇతరులు ఆహ్వానించకుండా లోపలికి వెళ్లేవాడు, అడగకుండానే మాట్లాడేవాడు మూర్ఖుడని, అతను నమ్మదగినవాడు కాదని కూడా విదురుడు చెప్పాడు. ఇలాంటివారు పెద్ద మూర్ఖులని పేర్కొన్నాడు.

మోహము, క్రోధము, లోభము అనే మూడు విషయాలు  ఒక వ్యక్తికి నరకంతో కూడిన  బాధను  కలిగిస్తాయి. అంతేకాకుండా  ఇవి మూడు  వ్యక్తి నాశనానికి కూడా కారణం కావచ్చు. అందువల్ల, వీలైనంత వరకు ఈ మూడింటికి దూరంగా ఉండాలి.

                      *నిశ్శబ్ద.