లైఫ్ పార్టనర్ దగ్గర ఈ తప్పులు చేయొద్దు!

ప్రస్తుతకాలంలో వివహబంధాలు చాలా పేలవంగా ఉంటున్నాయి. చిన్న చిన్న వాటికి గొడవ పడటం, ఇగో లు, మిస్ అండర్స్టాండింగ్, అనుమానాలు, ఇంకా ముఖ్యంగా కమర్షియల్ విషయాల్లో ఆర్గ్యు జరగడం,  పర్సనల్ ఇంపార్టెన్స్, పబ్లిక్ సెక్యూరిటీ ఇలా చాలా విషయాలు లైఫ్ పార్టనర్స్ మధ్య గొడవలకు దారి తీసి అవి కాస్తా విడిపోయేవరకు తీసుకెళ్తున్నాయి. ముఖ్యంగా లైఫ్ పార్టనర్ దగ్గర కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆ జాగ్రత్త అజాగ్రత్త అయితే తరువాత చాలా రిలేషన్ కోసం ఎంత ఆరాటపడినా ప్రయోజనం ఉండదు.  లైఫ్ పార్టనర్ దగ్గర ఎలా ఉంటే వాళ్ళు ఇంప్రెస్స్ అవుతారు అనే విషయాలు అన్ని చోట్లా ఉంటాయి. వాటిని ఫాలో అయ్యేవాళ్ళు కూడా చాలామందే ఉంటారు. కానీ లైఫ్ పార్టనర్ దగ్గర చేయకూడని పనులు ఏంటో చాలా తక్కువ మందికి తెలుసు. అవేంటో తెలుసుకుంటే రిలేషన్స్ బ్రేక్ అవ్వడం అంటూ ఉండదు. ఓపిక ఉండాలి! ఓపిక ఉండాలనే విషయం అందరికీ తెలిసిందేగా అనుకోవచ్చు. కానీ లైఫ్ పార్టనర్ తను చెప్పాలనుకున్న విషయాన్ని, తన ప్రోబ్లేమ్స్ ను చెప్పేటప్పుడు ఓపికగా వినాలి. నువ్వెప్పుడూ ఏదో ఒకటి చెబుతూనే ఉంటావు పో….. లాంటి మాటలు మనుషుల మధ్య చాలా దూరాన్ని పెంచేస్తాయి. ప్రతి ఒక్కరికీ తాము ఫేస్ చేసే ప్రాబ్లెమ్ పెద్దగానే కనబడుతుంది కాబట్టి ప్రోబ్లేమ్స్ గురించి చెప్పేటప్పుడు వినడం, చెప్పేసిన తరువాత ఆ ప్రాబ్లెమ్ గురించి అన్ని కోణాలలో కొంచెం వివరించి దాన్ని సాల్వ్ అయ్యేలా సలహా ఇవ్వచ్చు. అలా చేస్తే ఇద్దరి మధ్య అనుబంధం పెరుగుతుంది. స్పెండింగ్ టైమ్! కలసి ఉండే సమయం గురించి కొంచెం ఫోకస్ చెయ్యాలి ఇప్పటి జనరేషన్ వారు. ఎంత బిజీ ఉద్యోగం అయినా ఉద్యోగం పనుల్ని ఇంటికి తెచ్చి ఆ పని తాలూకూ ఎఫెక్ట్ ను ఇంట్లో కూడా చూపిస్తూ ఉంటే అన్నిటికంటే ఉద్యోగమే ఎక్కువైపోయింది లాంటి డైలాగ్స్ బాణాల్లా వచ్చేస్తాయి. ఉద్యోగం చేస్తున్నవాళ్ళు ఎవరైనా సరే ఉద్యోగాన్ని ఉద్యోగంలా చూస్తూ పర్సనల్ టైమ్ ను హాయిగా గడపాలి. అప్పుడే ప్రొఫెషన్ లైఫ్ ను, పర్సనల్ లైఫ్ ను రెండింటిని పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేసె జెంటిల్ మెన్ లేదా జెంటిల్ ఉమెన్ అవుతారు. ఓపెన్ గా ఉండాలి! కొంతమంది సీక్రెక్స్ మైంటైన్ చేస్తుంటారు. అలాంటి కపుల్స్ మధ్య అపార్థాలు చాలా తొందరగా వచ్చేస్తాయి. అవి వచ్చినంత తొందరగా తగ్గిపోయేవి కావు. పైపెచ్చు ఒకదానికొకటి ఇంకా అగ్గి రాజుకున్నట్టు పెద్ద గొడవల వైపుకు మల్లుతాయి. కాబట్టి ఎలాంటి సీక్రెట్స్ లేకుండా ఉండటం బెటర్. ఏ విషయం జరిగినా ఇద్దరూ డిస్కస్ చేసుకోవడం, ఏ గొడవ జరిగినా  ఇద్దరూ కలిసి మాట్లాడుకుని దానికి సాల్వ్ చేసుకోవడం బెటర్. కాంప్రమైజ్! జీవితమంతా కాంప్రమైజ్ లతోనే గడిచిపోవాలా లాంటి ఆవేశపు క్వశ్చన్స్ వద్దు కానీ నిజానికి చాలా బంధాలు బ్రేక్ అవ్వకుండా నిలబడేట్టు చేసే శక్తి కాంప్రమైజ్ కు ఉంది. ఇద్దరిలో ఎవరో ఒకరు ప్రాబ్లెమ్ విషయంలో కాంప్రమైజ్ అవుతూ ఉంటే ప్రోబ్లేమ్స్ ను సులువుగానే ఒక కొలిక్కి తీసుకురావచ్చు.  లోపాలు ఎత్తిచూపద్దు! లోపమనేది చాలా సహజం. శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు లోపాలు ఉన్నవాళ్లు బోలెడు. లోపం అనేది స్వీయతప్పితం కానే కాదు. అలాగని దాన్ని అదేపనిగా ఎవరూ భరించాలని అనుకోరు. కాబట్టి మానసికంగా, శారీరకంగా ఏదైనా లోపం ఉంటే  కోపంలో ఉన్నప్పుడో, వేరే పనుల అసహనంతో ఉన్నప్పుడో, వేరే వాళ్ళ మీద కోపం ఉన్నప్పుడో లైఫ్ పార్టనర్ మీద లోపాన్ని ఎట్టి చూపుతూ మాట్లాడకూడదు. అది చాలా పెద్ద బాధాకరమైన విషయంగా మారుతుంది. ఎక్స్ప్రెస్ చేయడంలో తగ్గద్దు! ప్రేమ, ఇష్టం అనేది కామన్. నిజానికి పెళ్లికి ముందు, పెళ్ళైన కొత్తలో ఉన్నట్టు కాలం గడిచేకొద్దీ ఉండదు. 90% జీవితాల్లో ఇలాగే ఉంటుంది. అయితే మనసులో ఇష్టం, ప్రేమ కలిగినప్పుడు దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఎలాంటి సంకోచం అక్కర్లేదు. అది కేవలం రొమాన్స్ ఫీలింగ్ వస్తేనే కాదు, ఏదైనా మంచి పని చేసినప్పుడో ప్రాబ్లెమ్ సాల్వ్ చేసే ఐడియా ఇచ్చినప్పుడో, గుర్తుపెట్టుకొని నచ్చిన పని, నచ్చిన వస్తువు, నచ్చిన ఫుడ్, నచ్చిన డ్రెస్ ఇలాంటివి చాలా ఉంటాయి. నచ్చినవి ఏవైనా తెచ్చినప్పుడు ప్రెసెంట్ చేసినప్పుడు, ప్రేమను, అనురాగాన్ని  వ్యక్తం చేయడంతో తగ్గొద్దు. అలాగే ప్రోబ్లేమ్స్ లో ఉన్నప్పుడు నువ్వు ఏదైనా చేయగలవు అనే ధైర్యాన్ని కూడా ఇవ్వాలి. ఇలా ఇవన్నీ ఫాలో అయితే రిలేషన్ బ్రేకప్ అనేది ఉందనే ఉండదు.                                ◆వెంకటేష్ పువ్వాడ.

మనిషిలో ఆలోచన ఎలా పెంపొందాలి??

మనిషికి జీవితంలో ఆలోకాహాన చాలా ముఖ్యమైనది. మంచిగా ఆలోచించడం, చెడుగా ఆలోచించడం ఆ మనిషి మానసిక పరిపక్వతపై ఆధారపడి ఉంటుంది. ప్రతి మనిషి ఆలోచనలో కూడా ఒక అంశం ఇమిడిపోయి ఉంటుంది. అదే ప్రేరణ. చాలామంది తమ ఆలోచనల్లో వ్యర్థమైన విషయాలు జొప్పించి ప్రేరణ కలిగించే విషయాలను అసలు తమ బుర్రలోకి రానివ్వరు. అయితే… ప్రేరణ కాని… ఆలోచన కాని అది ఇతరుల నుండి ఆశించడం చాలా పొరపాటు.  ఈ కాలంలో ఎవరికి వారే ప్రేరణ కలిగించుకోవాలి. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడటం అమాయకత్వమే అవుతుంది. మీకు మీరు ప్రేరణ కలిగించుకోవాలంటే ముందుగా మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి. మిమ్మల్ని మీరు అభిమానించుకోవాలి. మీలోని లోపాలను అవకాశాలుగా భావించుకోవాలి. ఇదంతా జరగాలి అంటే… ముందు మీ స్థాయిని, మీ పరిస్థితిని వాస్తవిక కోణంలో అంగీకరించాలి.  కులం, మతం, భాష ఏవైనా, శారీరకంగా మనిషి  పొడుగ్గా ఉన్నా, పొట్టిగా ఉన్నా, అందవికారంగా ఉన్నా, నలుపు, తెలుపు... ఎలా వున్నా భౌతిక రూపాన్ని మరియు ఆంతరంగిక మనసత్వాన్ని రెండింటిని కూడా ప్రేమించాలి. అదే మీలో ప్రేమించే, ప్రేరేపించుకునే తత్వాన్ని పెంచుతుంది. మిమ్మల్ని మీరు అనుక్షణం అభినందించుకోవాలి. కాల్లో ముల్లు గుచ్చుకుంటే కంట్లో గుచ్చుకోనందుకు సంతోషించాలి. ఒకరోజు ఇద్దరు స్నేహితులు దగ్గరలో ఉన్న పార్కుకు అలా నడకకు బయలుదేరారు. వారు అలా వెళ్లి కాస్త నడిచి ఒకచోట కూర్చున్నారు. అప్పుడు అక్కడ ఎగురుకుంటూ పోతున్న పక్షులలో ఒక పావురం  రెట్టవేసింది. వెంటనే అతను చేత్తో తుడుచుకుంటూ పక్కనున్న స్నేహితుడితో "దేవుడు ఎంత గొప్పవాడు” అన్నాడు. ఆ స్నేహితుడు ఆ మాటకు విస్తుపోయి. “మీద రెట్ట పడితే అలా అంటున్నావేమిటి?” అన్నాడు.  అప్పుడు మొదటి స్నేహితుడు “నిజంగా దేవుడికి ఎంత దూరదృష్టి కదా?" అన్నాడు మళ్ళీ. ఈసారి రెండో స్నేహితుడికి కాస్త వెర్రెత్తి   “నువ్వు చెప్పేదేమిటో నాకర్థం కావటం లేదు” అన్నాడు చిరాగ్గా.  “పక్షులకు గాలిలోకి ఎగిరే శక్తి ఇచ్చిన దేవుడు నిజంగా ఎంతో అభినందనీయుడు" అన్నాడు రుమాలుతో తుడుచుకుంటూ. రెండవ స్నేహితుడి కోపం నషాళానికి అంటించి. “నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. అసలు నువ్వనేది ఏమిటి?” అన్నాడు స్నేహితుడు చిటపటలాడుతూ. "అహా! నా ఉద్దేశ్యమేమిటంటే దేవుడు పక్షులకు మాత్రమే ఇలా ఎగిరే శక్తి ఇచ్చాడు. ఆవులకు, గేదెలకు ఎగిరే శక్తి ఇవ్వలేదు” అంటూ వాష్ బేసిన్ వైపు వెళ్ళాడు. ఆ మాట విన్న రెండవ స్నేహితుడు నోరెళ్ళబెట్టి చూస్తూ ఉండిపోయాడు. పైన చెప్పనా సంఘటనలో వేరే వ్యక్తి అయితే “అంతా నా ఖర్మ” “ఆ దిక్కుమాలిన పావురం సరిగ్గా నా మొహం మీదే వెయ్యాలా?” “ఈరోజు లేచిన వేళావిశేషం బాగాలేదు” ఏదో అవుతుందని నాకు పొద్దున్నే అనిపించింది” లాంటి మాటలు చెప్పుకుని తనకు ఏదో పెద్ద ఉపద్రవం కలిగింది అన్నంతగా ఫీలైపోయి బాధలో మునిగిపోయేవాడు. కానీ ఒక సంఘటన జరిగినప్పుడు మనకు ఇంతకంటే పెద్ద సమస్య రాలేదు కదా అని తనకు తాను చెప్పుకోవడంలో, అలా ఆలోచించడంలో ఎంతో గొప్ప పరిపక్వత ఉంటుంది. అలాంటి ఆలోచనను అందరూ పెంపొందించుకోవాలి.                                     ◆నిశ్శబ్ద.

మనిషి డబ్బు విషయంలో ఎలా  ఉండాలంటే..

   ధనం మూలం ఇదం జగత్.. అని ఓ గొప్ప మాట చెప్పారు. ఈ ప్రపంచం ధనంతోనే నడుస్తోందన్నది ఆ మాటకు అర్థం. ధనమేరా అన్నిటికీ మూలం.. ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం అని ఓ పాట కూడా ఉంది. డబ్బు విలువ తెలుసుకోవడం మనిషి ధర్మం అన్నది  ఆ పాట వాక్యాలలో అర్థం. ప్రస్తుతకాలంలో మనిషి జీవితాన్ని డబ్బు ఎంతగా ప్రభావితం చేస్తోందో అందరికీ తెలిసిందే. చిన్న చిన్న మొత్తానికే దారుణాలకు పాల్పడుతున్నవారు ఉన్నారు. డబ్బు సులువుగా సంపాదించడానికి టెక్నాలజీని  ఉపయోగిస్తున్నారు. ఒకప్పుడు రాజ్యాల కోసం తోడబుట్టినవారిని రాజులు బలితీసుకుంటే ఇప్పటికాలంలో ఆస్తుల కోసం, పదవులకోసం రక్తం పంచుకుపుట్టిన వారి ప్రాణాలనే తీస్తున్నారు. మొత్తానికి డబ్బు ఈ ప్రపంచాన్ని ఆడిస్తోందన్నది అంగీకరించాల్సిన వాస్తవం. మనిషి చేతిలోనే రూపొందిన డబ్బు మనిషినే శాసించడం నిజంగా సిగ్గుపడాల్సిన విషయం. అందుకే మనిషి డబ్బు గురించి చర్చించాల్సిన అవసరం ఉంది. డబ్బు విషయంలో మనిషి ఎలా ఉండాలో  నిర్ణయించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. డబ్బు అవసరం.. ప్రతి ఒక్కరికీ డబ్బు అవసరమే. చేతిలో రూపాయి లేకుండా ఎక్కడా బ్రతకలేడు నేటికాలం మనిషి. కష్టపడటం, సంపాదించుకోవడం, చదువులు, జీవనం, ఆహారం,  వసతి.. ఇలా అన్నీ డబ్బుతోనే ముడిపడి ఉన్నాయి. కాబట్టి డబ్బుకు విలువ ఇవ్వడం మంచిదే. మనిషి డబ్బుకు ఇచ్చే విలువ అంతా తను సంపాదించే విధానంలోనే ఉంటుందని కొందరు అంటారు. కష్టపడి సంపాదించే వాడు ఒక్క రూపాయి వృధాగా ఖర్చు చేయాలన్నా చాలా బాధపడతాడు. ఒక్క  రూపాయి ఇతరుల చేతిలో మోసపోయినా తనను తాను సంభాళించుకోలేడు.  అయితే కష్టానికి. డబ్బుకు మధ్య ఉన్న కోణాన్ని వదిలేస్తే డబ్బును  కేవలం అవసరమైన వస్తువుగా చూడటం వల్ల అది మనిషి మీద చూపించే ప్రభావం కూడా తగ్గుతుంది. అందుకే బ్రతకడం కోసం డబ్బు సంపాదించుకోవాలి అంతే కానీ డబ్బు కోసమే బ్రతకకూడదు అని అన్నారు విజ్ఞులు. ఈజీ మనీ.. ఈ కాలంలో చాలామంది కుర్రాళ్లు ఈజీ మనీకి అలవాటు పడ్డారు. కష్టపడకుండా ఇతరుల సొమ్మును సులువుగా చేజిక్కించుకోవడం, దానితో జల్సా జీవితాలు గడపడం ఎక్కువైపోయింది. కానీ ఇలాంటి మార్గాలలో వచ్చే సొమ్ము దీర్ఘకాలం జీవితాలను నిలబెట్టదనే విషయం తెలుసుకోవాలి. కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలు ఇలాంటి పనులు చేస్తున్నారని తెలిసినా వారి మీద ఉన్న ప్రేమ కొద్దీ వారిని ఏమీ అనకుండా నిమ్మకు నీరెత్తినట్టు  ఉంటారు. ఇలాంటి వారు చేజేతులా తమ పిల్లల జీవితాలను నాశనం చేస్తున్నారని గ్రహించాలి. ప్రాధాన్యత.. డబ్బుకు గుణం అంటూ ఏమీ లేదు. దాన్ని మనిషి ఎలా   ఉపయోగిస్తే అది దానికి అనుగుణమైన ఫలితాలను మనిషికి అంటిస్తుంది. మంచి, చెడు, కోపం, అసూయ, ద్వేషం.. ఇలా పాజిటివ్.. నెగిటివ్ గుణాలను డబ్బు మనిషిలో నింపుతుంది. అందుకే డబ్బును తటస్థ వస్తువుగా చూడాలి. దాన్ని  ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలో అలా వాడాలి తప్ప డబ్బే పరమావధిగా  ఎప్పుడూ బ్రతకకూడదు. డబ్బు మనిషికి అవసరమైనదే అయినా దానికోసం అస్తమానూ ఆరాటపడే మనిషికి జీవితంలో సుఖం అనేది ఎప్పటికీ దక్కదు. అందుకే డబ్బును దానిలాగే చూడాలి. మనుషులతో కంపేర్ చేయకూడదు.                                                                              నిశ్శబ్ద.         

భయాలు అన్నీ కల్పితాలేనా?

మనిషిని భయం అనే మాట చాలా ప్రభావితం చేస్తుంది. బాగా గమనిస్తే, మన భయాలన్నిటికీ ఏదో ఒక రకంగా అజ్ఞానం కారణం అని అర్థమవుతుంది. మనకు తెలియని విషయం మనల్ని భయపెడుతుంది. తెలిసిన విషయం గురించి బాధనే లేదు. ఉదయం పూట హాయిగా స్వేచ్ఛగా తిరిగిన దారుల్లోనే, రాత్రి దీపం వెలుతురు లేకుండా తిరగాలంటే ఎంతవారికైనా గుండెలు అదురుతాయి. మన ఇళ్ళల్లోనే, చీకటి గది భయం కలిగిస్తుంది. దీన్ని బట్టి మనం అర్ధం చేసుకోవాల్సిందేమిటంటే, అజ్ఞానం భయం కలిగిస్తుంది. జ్ఞానం భయాన్ని తొలగిస్తుంది. చీకట్లో తాడును చూసి పాము అని భ్రమ పడతాం, భయపడతాం, చెమటలు కక్కేస్తాం. కానీ వెలుతురు వేసి చూస్తే అది పాము కాదు తాడు అని తెలుస్తుంది. అంత వరకూ మనం అనుభవించిన భయం మటుమాయం అవుతుంది. కాబట్టి మనకు కలిగే చిన్నచిన్న భయాల స్వరూపస్వభావాలను అర్థం చేసుకుంటే, వాటిని మించటం ఎంతో సులభం అవుతుంది. భయభావన పూర్తిగా అదృశ్యం కాకున్నా, భయభావనను మనకు లాభకరంగా వాడుకొనే వీలుంటుంది. మానసికశాస్త్రవేత్తల ప్రకారం పుట్టిన పిల్లవాడికి భయాలుండవు. అతడిలో భయాలను మనమే కలిగిస్తాం. ఈ రకమైన ఆలోచనను ప్రతిపాదించటమే కాదు, వైజ్ఞానిక పరిశోధనల ద్వారా నిరూపించిన వ్యక్తి జాన్.బి. వాట్సన్. 1920లో ఈయన వైజ్ఞానికపరిశోధనలు చేసాడు. పదకొండు నెలల ఆల్బర్ట్ అనే బాలుడిపై భయంకరమైన పరిశోధనలు చేశాడు. ఆ వయసు పిల్లల్లాగే ప్రతి విషయం పట్ల భయరహితమైన కుతూహలం ప్రదర్శించేవాడు అల్బర్ట్, అటువంటి అల్బర్ట్ దగ్గరలో పెద్ద శబ్దం చేసి భయపెట్టటం ప్రారంభించాడు వాట్సన్. ఆ తరువాత అతని ఎదురుగా ఓ ఎలుకను వదిలిపెట్టేవాడు. అల్బర్ట్ ఎలుక వైపు చూసి భయపడటం ప్రారంభించాడు. ఈ ప్రయోగం ఇలాగే కొనసాగింది. ఇంకొన్నాళ్ళకి కేవలం ఎలుకను చూస్తూనే కాదు, బొచ్చు ఉన్న ప్రతి జంతువూ అతడిలో భయం కలిగించేది. కుక్క, పిల్లి, కుందేలు  ఇలా ప్రతీదీ అల్బర్ట్ ను భయపెట్టేది.  ఈ ప్రయోగం ద్వారా పిల్లలకు భయాలు పెద్దలే కలుగజేస్తారని వాట్సన్ నిరూపించాడు. బాల్యంలో పిల్లలు నిద్ర పోకపోతే, బూచి వస్తుందని బెదిరిస్తాం. ఇది వారిలో తెలియని భయాన్ని కలిగిస్తుంది. దాంతో నిద్ర వారికొక భయకారణం అవుతుంది. అలాగే ఇచ్చింది తీసుకోకపోతే పక్క పిల్లవాడికి ఇచ్చేస్తాం, వాడొచ్చి ఎత్తుకుపోతాడు వంటి వాక్యాలతో భయపెడతాం. తాత్కాలికంగా పిల్లవాడు మనం చెప్పిన మాట విన్నా ఇటువంటి మాటలు అతడి మనసులో శాశ్వతంగా భయాలు కలిగిస్తాయి. ఎదిగిన కొద్దీ, అచేతనలోని ఈ భయాలు, తన దాన్ని ఎవరైనా ఎత్తుకు పోతారేమో, తనకు రావాల్సింది ఇతరులకి వెళ్ళిపోతుందేమోనన్న భావనలుగా రూపాంతరం చెందుతాయి. వ్యక్తిలో అభద్రతాభావాన్ని కలిగిస్తాయి. సాధారణంగా మనం కొందరిలో కొన్ని విషయాలకు వాటి స్థాయిని మించిన తీవ్రమైన స్పందనను గమనిస్తాం. పిల్లలు మట్టి ముట్టితే చాలు, చితకబాదే తల్లిదండ్రులు మనకు తెలుసు. పరిశీలిస్తే ఈ ప్రవర్తనకు కారణం, ఇప్పటి పెద్దవాళ్ళు, పిల్లలుగా ఉన్నప్పుడు, వాళ్ళు మట్టి ముట్టినప్పుడల్లా వాళ్ళ పెద్దలు బెదిరించటం, కొట్టటం వంటివి చేసేవారని తెలుస్తుంది. అందువల్ల ఇప్పుడు ఆ కారణంగానే పిల్లలు మట్టిని తాకగానే హిస్టీరియా వచ్చినట్టు ప్రవర్తించటం చూస్తాం. ఇందుకు భిన్నంగా కొందరు పిల్లలు మట్టితో ఆడుతున్నా వారి తల్లితండ్రులు పెద్దగా పట్టించుకోరు. దీనికి కారణం బాల్యంలో వాళ్ళ తల్లిదండ్రులు, వారి పెద్దవాళ్ళ ప్రవర్తన కారణం. పిల్లలు మట్టిలో ఆడటం సహజం. అందువల్ల ఏమీ కాదు. స్నానం చేయిస్తే సరిపోతుంది. అన్న రీతిలో పెద్దలు ప్రవర్తిస్తే పిల్లల్లో కూడా మట్టిలో ఆడటం తప్పు అన్న భావన కలగదు. ఇలా భయం అనేది ఏదైనా ఎవరిలో అయినా ఉందంటే దానికి కారణం దాన్ని కల్పించుకోవడమే.                                        ◆నిశ్శబ్ద.

కౌగిలింతలకు ఇన్ని అర్థాలున్నాయా?

కౌగిలి ఇద్దరు వ్యక్తుల మధ్య శారీరక బంధాన్ని తద్వారా మానసిక బంధాన్ని కూడా బలపరుస్తుంది. ముఖ్యంగా జీవిత  భాగస్వాములు ఒకరినొకరు కౌగిలించుకోవడం వల్ల వారి మనసులో ఉన్న విషయాలను బయటకు తెలియజేస్తుంటారు. ఒక గట్టి కౌగిలి భాగస్వాముల మధ్య ఉండే అపార్దాలను, కోపతాపాలను, పొరపొచ్చాలను మాయం చేస్తుంది. అందుకే అవకాశం దొరికినప్పుడల్లా భాగస్వాములు  కౌగిలించుకోవడం మంచిదేనని రిలేషన్ షిప్ నిపుణులు చెబుతున్నారు. అయితే కౌగిలి లోనూ రకాలున్నాయని. వాటికి బోలెడు అర్థాలున్నాయని తెలిసింది. ఇంతకీ ఎలా కౌగిలించుకుంటే ఏమర్థమో తెలుసుకుంటే.. ఎదురుగా భుజం మీద వాలి కౌగిలించుకుంటే.. ఒకరికొకరు ఎదురుగా కౌగిలించుకున్నప్పుడు జీవిత భాగస్వామి భుజం మీద తలను పెట్టుకోవడానికి ఇష్టపడితే వారు ప్రేమను ఆశిస్తున్నట్టు.  ఇద్దరి మధ్య అవగాహన, అర్థం చేసుకునే గుణం మెండుగా ఉన్నట్టు. ఇది ఒకానొక సురక్షిత భావనను అందిస్తుంది. వెనుక నుండి కౌగిలించుకుంటే.. వెనుక నుండి కౌగిలించుకోవడం వల్ల భార్య లేదా భర్త చాలా  మిస్సవుతున్నారని అర్థమట. అదే విషయాన్ని చెప్పడానికి వెనుక నుండి కౌగిలించుకుంటారట.  ఒకవేళ ఎప్పుడూ ఇలాగే కౌగిలించుకుంటూ ఉంటే ఎప్పుడూ ప్రేమను కోరుకుంటున్నారని అర్థమట. భుజాలను పెనవేసుకుని కౌగిలించుకుంటే.. భుజాలను పెనవేసుకుని కౌగిలించుకుంటే ఆ కౌగిలిలో ప్రేమ, నమ్మకం పాళ్లు ఎక్కువ ఉన్నాయని అర్థం. అలాగే ఆ భాగస్వాముల మధ్య శృంగార జీవితం కూడా బాగా ఉన్నట్టు. ఈ కౌగిలి ద్వారా ఇద్దరి మధ్య రొమాంటిక్  ఫీలింగ్ మరింత పెరుగుతుంది. గట్టి కౌగిలి.. జీవిత భాగస్వాములు ఒకరినొకరు దగ్గరగా, గట్టిగా రెండు చేతులతో కౌగిలించుకుంటే వారిద్దరూ ఒకరికొకరు దగ్గరగా ఉండాలని, ఎప్పటికీ విడిపోకూడదని కోరుకుంటున్నారని అర్థం. ఒకరినొకరు తీవ్రంగా  ఇష్టపడటం ఈ కౌగిలి  తెలుపుతుంది. ఒక చేత్తో కౌగిలించుకుంటే.. ఒక చేత్తో కౌగిలించుకుంటే రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి స్నేహ భావాన్ని సూచిస్తే.. రెండోది బహిరంగంగా కౌగిలించుకోవడం ఇష్టం లేదని తెలపడం. ఇది నిబద్దతకు, సామాజిక అవగాహనకు సంబంధించినది.                                            *నిశ్శబ్ద.  

ఫేక్ ఫ్రెండ్స్ ను ఇలా గుర్తుపట్టేయండి.!

మనం ప్రతిరోజూ చాలా మందిని కలుస్తాము.  చాలా మంది మనకు స్నేహితులు అవుతారు.  కానీ  నిజమైన స్నేహితులు అని పిలవగలిగే వారు చాలా తక్కువ. వీళ్లు మన స్నేహితులు అని భావించిన వారిలో కూడా  స్నేహితులుగా నటించే వారే చాలా మంది ఉంటారు. కానీ వాస్తవానికి వారు  స్నేహితులు కాదు, కేవలం నటిస్తారు.వీళ్లందరూ ఫేక్ ఫ్రెండ్స్..  ఇలాంటి స్నేహితులను సకాలంలో  గుర్తించకపోతే చాలా అత్యవసర సమయాల్లో  ద్రోహం చేస్తారు. అందుకే నకిలీ వ్యక్తులను ఎలా గుర్తించాలో తెలుసుకోవాలి. అలాంటి స్నేహితులు  జీవితంలో ఉంటే సున్నితంగానే వారిని దూరం పెట్టాలి. మీ కోసం ఎప్పుడూ సమయం కేటాయించరు.. తరచుగా మనకు కొంతమంది స్నేహితులు ఉంటారు.  వారి కోసం మనం అవసరమైనప్పుడల్లా సమయం కేటాయిస్తాము, కానీ నకిలీ  స్నేహితులు మన కోసం సమయం కేటాయించరు. ఎప్పుడైనా అత్యవసరం అయినప్పుడు మాత్రమే వాళ్ళు కలవడం, మాట్లాడటం జరుగుతుంది. ఆ సందర్బాలలో కూడా తమ పని నెరవేర్చుకునే దిశగానే వారి ప్రవర్తన సాగుతుంది. అనారోగ్యకర పోటీ తత్వం.. నిజమైన స్నేహితుల మధ్య పోటీ అనేది ఎప్పుడూ ఆరోగ్యకరంగా ఉంటుంది. కానీ నకిలీ స్నేహితులు  తమ స్నేహితులతో పోటీని ఆరోగ్యకరంగా కాకుండా అహంకారంతో స్వీకరిస్తారు. ఎప్పుడూ తనే నెగ్గాలనే ఆలోచనతో ఉంటారు. కొన్ని సార్లు పోటీలో గెలవడానికి స్నేహాన్ని అయినా వదలడానికి వెనుకాడరు. బాధపెట్టడం.. నకిలీ స్నేహితులు నిజాలు చెబుతున్నామంటూ తమ స్నేహితులను బాధపెడతారు. మనసు నొచ్చుకునే మాటలు మాట్లాడతారు. ఇతరుల ముందు కూడా ఏ మాత్రం సంకోచించకుండా విమర్మలు చేస్తారు. ఇలాంటి వారు లోలోపల సంతోషపడుతుంటారు.   ఒత్తిడి కలిగించడం నిజమైన స్నేహితులు స్నేహితులను వారి పరిస్థితులను అర్థం చేసుకుంటారు. కానీ నకిలీ స్నేహితులు మాత్రం తాము అనుకున్న విషయాలు, పనులు  జరగడం కోసం చాలా ఒత్తిడి చేస్తారు. తమ పనులు నెగ్గేవరకు ఎమోషనల్ బ్లాక్మెయిల్ అయినా చేస్తారు. పైపెచ్చు నీది నిజమైన స్నేహం కాదంటూ  నిందిస్తారు. డొంకతిరుగుడు.. కొంతమంది డొంకతిరుగుడు మాటలు మాట్లాడతారు.  నిజాలు చెప్పరు. దాచిపెడతారు. నిజమైన స్నేహితులు అయితే ఇలా దాచిపెట్టరు. ఎలాంటి విషయాలు అయినా సరే నేరుగా బయటకు చెబుతారు.  అదే చెడు స్నేహితులు ఇతరుల ముందు తమ స్నేహితుల గూర్చి చెడుగా చెబుతారు. వారిని నిలదీసినప్పుడు నేను చెప్పలేదంటూ వ్యతిరేకంగా మాట్లాడటం, దబాయించడం చేస్తారు.                                              *నిశ్శబ్ద.

ముగ్గురు వ్యక్తులు తోడుంటే చాలు.. జీవితంలో ఎంత కష్టమైనా అధిగమించవచ్చట..!

జీవితం ఎవరికీ వడ్డించిన విస్తరి కాదు. జీవితమనే విస్తరిలో ప్రతీది సంపాదించుకోవాల్సిందే.  ఈ ప్రయత్నంలో కష్టాలనేవి వస్తూనే ఉంటాయి. అయితే  కష్టాలకు భయపడటం తెలియని వారికి విజయాలు  ఖాయమని చాణక్యుడు చెప్పాడు. చాణిక్యుడు జీవితం గురించి, జీవితంలో ఎన్నో విషయాల గురించి చాలా స్పష్టమైన విషయాలు చెప్పాడు. మనిషి విజయం నుండి అపజయం వరకు.. మనిషి పుట్టుక నుండి మరణం వరకు ప్రభావితం చేసే అంశాలను వివరించాడు.  మనిషి గెలిచినా ఓడినా అది మనిషి  ఆలోచనపై ఆధారపడి ఉంటుంది.  దానిని ఓటమిగా అంగీకరించాలి.  కానీ  దృఢంగా అనుకుంటే ఓటమికి బదులుగా  తప్పకుండా  గెలుస్తారు. మనిషి జీవితంలో మంచి రోజులతో పాటు కష్ట సమయాలు కూడా వస్తాయి. అయితే ఈ కష్టాలను సులభంగా అధిగమించేవాడే నిజమైన యోధుడు. ముగ్గురి సాంగత్యం జీవితంలో అత్యంత ముఖ్యమైనదని, వారితో ఉండటం వల్ల ప్రతి సంక్షోభాన్ని,  సమస్యను చిరునవ్వుతో అధిగమిస్తాడని చాణక్యుడు చెప్పాడు. కష్ట సమయాల్లో  ఏ వ్యక్తులు తోడుండటం అవసరమో.. చాణక్యుడు ఇలా చెప్పాడు. తెలివైన జీవిత భాగస్వామి.. సుఖ దుఃఖాలలో నీడలా ఒకరికొకరు అండగా నిలిచే భార్యాభర్తలకు కష్టకాలంలో కూడా ఎలాంటి సమస్యలు ఎదురుకావు. కష్ట సమయాల్లో తెలివైన జీవిత భాగస్వామి తోడు ఉండటం కవచంలా పనిచేస్తుంది. సంస్కారవంతులైన అర్థం చేసుకునే భాగస్వామి సహాయంతో  ఖచ్చితంగా విజయం సాధించగలుగుతారు. సత్ప్రవర్తన కలిగిన పిల్లలు.. పిల్లలే తల్లిదండ్రులకు  గొప్ప మద్దతు. మంచిగా ప్రవర్తించే పిల్లవాడు తన తల్లిదండ్రులను ఎప్పుడూ దుఃఖానికి లోను కానివ్వడు. తల్లితండ్రుల ప్రతి చిన్నా, పెద్దా సమస్యలలోనూ, ఆపద వచ్చినప్పుడు చిన్నపాటి బాధ కూడా పడనివ్వకుండా చూసుకునే పిల్లలు చాలా మంది ఉంటారు. అలాంటి  పిల్లలు తల్లిదండ్రుల సమస్యలను తామే ముందుండి పరిష్కరిస్తారు. వ్యక్తి ప్రవర్తన.. పెద్దవారి సాంగత్యం.. ఒక వ్యక్తి  ప్రవర్తన, ఇతరులతో అతనెలా నడుచుకుంటాడనే విషయాలు  అతని విజయంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మంచి సాంగత్యం  ఆకాశమంత ఎత్తును తాకడానికి అడుగడుగునా స్ఫూర్తినిస్తుంటే, చెడ్డవారి సాంగత్యం  మేధస్సును పాడుచేసి  వినాశనపు అంచుకు తీసుకువస్తుంది. పెద్దమనుషుల సహవాసంలో జీవించడం ద్వారా జీవితం ఆనందంతో గడిచిపోతుంది.  ఆ ఇంటికి బోలెడు సంతోషాన్ని చేకూరుస్తుంది.                                      *నిశ్శబ్ద.

కాబోయే భార్యాభర్తల బంధం దృఢంగా ఉండాలంటే ఈ పనులు చెయ్యండి

ఎన్నో సంవత్సరాలు వేర్వేరు చోట్ల పెరిగిన ఇద్దరు వ్యక్తులు పెళ్లి అనే బంధంతో ఒక్కటిగా మారి ఒకేచోట నివసించడం మొదలుపెడతారు. ప్రేమ పెళ్లి అయినా, పెద్దలు కుదిర్చిన వివాహం అయినా వారిద్దరి మధ్య బంధం బలంగా ఉండాలంటే కొన్ని విషయాలు తప్పక గుర్తుంచుకోవాలి. వాటిని పాటించాలి. భార్యాభర్తల బంధం దృఢంగా ఉంటే ఆ అలవాట్లు ఏంటో తెలుసుకుంటే.. కమ్యూనికేషన్ సాధారణంగా పెళ్లిచూపులు గడిచిన తరువాత ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేస్తారు. ఆ ఎంగేజ్మెంట్ రోజే పెళ్లి డేట్ ఫిక్స్ చేస్తారు. అయితే నిశ్చితార్థానికి, పెళ్లికి మధ్య కాలంలో అమ్మాయి, అబ్బాయి మాట్లాడుకోవడం అంటే చాలామంది తప్పుగా భావిస్తారు. కానీ ఈ సమయంలో వారిద్దరూ మాట్లాడుకోవడం వల్ల ఇద్దరూ ఒకరి మనసు మరొకరు అర్థం చేసుకోగలుగుతారు. ప్రశ్నలు, సమాధానాలు.. నిశ్చితార్థం, పెళ్లి మధ్య కాలంలో అమ్మాయి లేదా అబ్బాయి తమ మనసులో ఉన్న ప్రశ్నలు అడగడం, తాము చెప్పాలనుకునే విషయాలను కాబోయే భాగస్వామితో చెప్పడం వల్ల ఒకరి మీద మరొకరికి అవగాహన, గౌరవం కలుగుతాయి. నమ్మకం.. పెళ్లికి ముందే భాగస్వాములు ఒకరిమీద మరొకరికి దృఢమైన నమ్మకం కలిగించడం చాలా ముఖ్యం. ఇది పెళ్లి తరువాత  ఇద్దరి బంధం బలంగా ఉండటానికి సహాయపడుతుంది. కుటుంబాలతో సమన్వయం.. భాగస్వాములు ఒకరి గురించి మరొకరు అర్థం చేసుకునే ఈ కొన్ని రోజుల కాలంలో కుటుంబ సభ్యుల సహకారం కూడా తీసుకోవాలి. దీనివల్ల మొత్తం కుటుంబాలు కూడా బంధుత్వంలో బలంగా ఉంటాయి. వివాహానికి సిద్దమవడం.. ఇప్పట్లో కాబోయే జంటలు ప్రతి విషయాన్ని చర్చించుకుని మరీ నిర్ణయం తీసుకుంటున్నారు. వివాహ వేడుకకు ఇద్దరూ కలసి మానసికంగా సన్నద్దమైతే వారి పర్సనల్ లైఫ్ కూడా ఆశాజనకంగా ఉంటుంది. షాపింగ్.. పెళ్లికి చేసే షాపింగ్ అబ్బాయి అమ్మాయి ఇద్దరూ కలసి చేయడం మంచిది. వారిద్దరూ ఒకరికొకరు ఎలా ఉంటే నచ్చుతారో, వారి అభిరుచులు ఏంటో ఇక్కడ తెలుస్తుంది. కాబోయే భాగస్వామికి నచ్చినట్టు ఉండాలని  వారు చేసే ప్రయత్నం కూడా ముచ్చటగా ఉంటుంది. ప్రధాన్యతలు.. పెళ్ళి అనే బంధంతో ఓ వ్యక్తి జీవితంలోకి  వచ్చిన తరువాత ఇక జీవితంలో అన్నీ భాగస్వామికి నచ్చినట్టు ఉండాలని అనుకోకూడదు. ఎవరి ప్రాధాన్యతలు వారికి ఉండాలి. ఎవరి అభిరుచులు, ఇష్టాఇష్టాలు వారికి ఉండటం మంచిదే. సందర్బాన్ని బట్టి సర్ధుకుపోవాలి కానీ పూర్తీగా వ్యక్తిగత అభిరుచులు వదలక్కర్లేదు.   ఉద్యోగం.. ఇప్పట్లో అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరూ కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. అబ్బాయిలను ఉద్యోగం మానెయ్యమని ఎవరూ చెప్పరు. కానీ చాలామంది అమ్మాయి ఉద్యోగం చెయ్యక్కర్లేదు అని అంటూ ఉంటారు. ఉద్యోగం విషయంలో ఇద్దరూ కలసి చర్చించుకోవడం మంచిది. అటు ఉద్యోగ జీవితాన్ని, ఇటు వ్యక్తిగత జీవితాన్ని ఇద్దరూ కలసి ఆరోగ్యంగా బ్యాలెన్స్ చేసుకునేలా నిర్ణయం తీసుకోవాలి. పిల్లల ఆలోచన.. ఉద్యోగం, ఇంటి బాధ్యతలు,  వ్యక్తిగత సంతోషంగా గడపడం మొదలైన విషయాల గురించి ముందుగానే చర్చించుకోవాలి. పిల్లలను కనే విషయంలో ప్లానింగ్ చేసుకుంటే ఆర్థిక సమస్యలను కూడా చక్కగా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఎందుకంటే పిల్లలకు ప్లాన్ చేసిన తరువాత చాలావరకు మహిళలు ఒకటి రెండేళ్లు అయినా ఉద్యోగానికి దూరంగా ఉండాల్సి ఉంటుంది.                                         *నిశ్శబ్ద.  

పురుషులు తమ ఆలోచనలను ఇతరులతో పంచుకోకపోవడానికి కారణం ఇదేనట!

సాధారణంగా మహిళలు తమ ఆలోచనలను అందరితో పంచుకుంటారు. అయితే తమ ఆలోచనలను ఇతరులతో పంచుకునేది పురుషులు నిరాకరిస్తారట. దీనికి కారణాలేమిటో తెలుసా? తన భావాలను ఇతరులతో బహిరంగంగా మాట్లాడగలిగే వ్యక్తి నిజానికి బలహీనుడనే అభిప్రాయం సమాజంలో ఉంది. పురుషులు ఎప్పటికీ బలహీనంగా ఉండలేరు, అందుకే ప్రతి మనిషి తనను తాను బలంగా నిరూపించుకోవడానికి తన మాటలను తన గుండెలోనే దాచుకుంటాడు.  ఈ కారణంగా తనకు నచ్చినవారి దగ్గర తనకు అవసరమైనప్పుడు మాత్రమే తన భావాలను పంచుకుంటాడు. ఎన్సో వెల్నెస్ వ్యవస్థాపకుడు, వెల్నెస్ కోచ్ అరుబా కబీర్, పురుషులు తమ భావాలను పంచుకోకపోవడానికి అనేక సామాజిక, సాంస్కృతిక,  వ్యక్తిగత కారణాలు ఉన్నాయని వివరించారు. మీ భావోద్వేగాలను చాలా కాలం పాటు అణచివేయడం వల్ల మానసిక వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తికి అవకాశాలు పెరుగుతాయి. కానీ వీటన్నింటితో సంబంధం లేకుండా, పురుషులు హేతుబద్ధత, సంప్రదాయవాదాన్ని ఇష్టపడతారు. ఎందుకంటే పురుషుల మనస్సు రాయిలా ఉంటుందని అనుకుంటారు. ఎదుటివారి ముందు తమ భావాలను చెబితే బలహీనులుగా కనిపిస్తారని భయపడతారు. కాబట్టి వారు తమ భావాలను దాచడానికి ప్రయత్నిస్తారు. పురుషులు ఇతరుల ముందు బలహీనంగా కనిపించకుండా ఉండటానికి సమర్థవంతమైన మార్గంగా భావిస్తారు. కానీ  మీ భావాల గురించి ఇతరులతో మాట్లాడటం వల్ల ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. తమ భావోద్వేగాలను ఆరోగ్యకరమైన రీతిలో వ్యక్తీకరించగలిగిన పురుషులలో ఆందోళన, డిప్రెషన్, ఇతర మానసిక ఆరోగ్య సమస్యలు తక్కువగా ఉంటాయని నిపుణులు గుర్తించారు.  మీ భావాలను ఇతరులతో పంచుకున్నప్పుడు, ఇది మీ జీవితంలోని అన్ని సంబంధాలను బలోపేతం చేసే కనెక్షన్,  నమ్మకాన్ని సృష్టిస్తుంది. మానసిక ఆరోగ్యం, భావోద్వేగాల గురించి బహిరంగంగా మాట్లాడటానికి పురుషులలో అవగాహన పెంచడం ముఖ్యం. ఇది మానసిక ఆరోగ్య నిపుణులతో చర్చించాలి. నమ్మకంగా మీ ఆలోచనలను విశ్వసనీయ స్నేహితుడు లేదా బంధువుతో పంచుకోవడం చాలా ముఖ్యం.

తండ్రి కూతుళ్ల బంధం  బలంగా ఉండాలంటే ఏం చెయ్యాలి?

సోషల్ మీడియాలో ఎక్కడైనా అమ్మాయిల పనులకు సంబంధించి కామెంట్లు వచ్చాయి అంటే అందులో డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ అనే కామెంట్ తప్పనిసరిగా ఉంటుంది. ప్రతి తండ్రికి తన కూతురు అంటే యువరాణితో సమానం. ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే తండ్రులు కూతుళ్లను చాలా ప్రేమగా పెంచుతారు. కూతుళ్ల గురించి నెగిటివ్ ఆలోచన లేని కుటుంబంలో గమనిస్తే తండ్రులకు కూతుళ్లకు మధ్య ఉండే బంధం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. తండ్రి అందరికంటే ఎక్కువగా తన కూతురును ప్రేమిస్తాడు. చాలామంది తండ్రులు తన కూతురిలో తమ తల్లిని చూసుకుంటారు. తండ్రులు తమ తల్లుల దగ్గర పొందిన ప్రేమను, ఆప్యాయతను తమ కూతుళ్ల దగ్గర చూపిస్తుంటారు. ఇంటికి మహాలక్ష్మి లాగా కళ తీసుకొచ్చిందనే ఆలోచన కూడా తండ్రికి తమ కూతుళ్ల మీద ప్రేమ ఎక్కువ ఉండటానికి కారణం.  అయితే తండ్రికి, కూతురికి మధ్య బంధం బలంగా మారాలంటే కింది పనులు చెయ్యాలి. కూతుళ్లు జీవితంలో దైర్యంగా ముందుకు సాగడానికి తండ్రుల మార్గదర్శనం చాలా సహాయపడుతుంది. తన తండ్రి తనకు తోడు ఉన్నాడనే భరోసా కూతురిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. తండ్రి నడవడిక, ప్రవర్తన, మనస్తత్వం ఆడపిల్లకు ప్రేరణ అవుతుంది.  పురుష సమాజం పట్ల ఆడపిల్లలో గౌరవభావం కలగడానికి తండ్రి కారకుడు అవుతాడు. తండ్రి మీద కూతురికి నమ్మకం ఎప్పుడూ నిలిచి ఉండాలంటే తండ్రి ఎప్పుడూ నిజాయితీగా ఉండాలి.  కూతురు ఆసక్తి చూపించే పనులలో తండ్రి కూడా పాలు పంచుకోవాలి.  ఇలా చేస్తే కూతురికి, తండ్రికి మధ్య బంధం చాలా దృఢంగా మారుతుంది. తండ్రులు గౌరవంగా,  మంచి విలువలతో ప్రవర్తిస్తే  కూతుళ్లు కూడా తమ ఆత్మగౌరవం,  మంచి భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. తండ్రి గౌరవాన్ని కాపాడే దిశగా ఆరోగ్యకరమైన మార్గాలలో అడుగులు వేస్తారు. తండ్రులకు, కూతుళ్లకు మధ్య బంధం బలపడాలంటే ప్రతి తండ్రి తన కూతురి కలల పట్ల నిరాశ కలిగించకూడదు. కూతురి కల సాకారం అయ్యే దిశగా ప్రోత్సహించాలి. కూతురిని ముందడుగు వేయించాలి. అప్పుడు కూతురి విజయంలో తండ్రి పాత్ర చాలా ఉంటుంది. కూతురికి తన తండ్రి పట్ల గౌరవం పెరుగుతుంది.                                             *రూపశ్రీ.

భార్యాభర్తలు కోపాన్ని మౌనంతో వ్యక్తం చేయడం మంచిదేనా?

ప్రేమ ఉన్న చోట చిన్న చిన్న తగాదాలు కూడా ఉంటాయి. ఇవి ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమను పెంచేలా పనిచేస్తాయి. అయితే ఈ చిన్న విషయాలు ఎప్పుడు ఇద్దరి బంధాన్ని పాడుచేస్తాయో కొన్నిసార్లు  గుర్తించలేము. ఒక్కొక్కరు ఒక్కో విధంగా కోపం తెచ్చుకుంటారు. కొందరు కేకలు వేస్తారు,  కొందరు మాట్లాడి  సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తారు. కోపం రిలేషన్‌షిప్‌లో విబేధాలను సృష్టిస్తుంది.  అయితే  కొంతమంది తమ  మాటల్లోనో, చర్యల్లోనో చూపించకుండా సింపుల్ గా మౌనాన్ని ఆశ్రయిస్తారు. కానీ ఇలా మౌనంగా ఉండటం అనేది కొన్నిసార్లు సంవత్సరాల బంధాన్ని కూడా విచ్చిన్నం చేస్తుందని రిలేషన్షిప్ నిపుణులు అంటున్నారు. అసలు మౌనం బంధం విడిపోవడానికి ఎలా కారణం అవుతుంది? తెలుసుకుంటే.. దంపతుల మధ్య గొడవలు వచ్చినప్పుడల్లా ఒకరు మాట్లాడటం మానేయడం తరచుగా కనిపిస్తుంది. ఇలాంటి వారిలో  కోపం ఎంతగానో పెరిగిపోతుంది.  ఇలాంటి వ్యక్తులు గొడవను పరిష్కరించడానికి ప్రయత్నం చెయ్యరు. అలాగని తిరిగి భాగస్వామితో మాట్లాడటానికి ఇష్టపడరు. ఇలా చేయడం వల్ల  భాగస్వామి హృదయం గాయపడుతుంది.  వారు ఒంటరితనం అనుభూతి చెందుతారు. దీని ప్రభావం  వైవాహిక బంధం మీద ప్రభావం చూపుతుంది. గొడవ జరిగినప్పుడు కోపాన్ని వ్యక్తం చెయ్యడానికి బదులు మౌనాన్ని ఆశ్రయించడం అనేది భావోద్వేగాలను తారుమారు చేస్తుంది.  ఇది భార్యాభర్తల బంధంలో  చాలా చెడ్డది. గొడవ జరిగిన ప్రతిసారీ ఇలాగే ప్రవర్తిస్తారేమోనని ఎదుటివారి మనసులో భయాన్ని కలిగిస్తుంది.  ఈ ఆలోచన భాగస్వామిని చాలా బాధపెడుతుంది. రిలేషన్ షిప్ లో గొడవలు వచ్చినప్పుడు సైలెంట్ గా ఉండడం మంచిది కాదు. ఇలా సైలెంట్ గా ఉండటం అనేది భాగస్వామిని అవమానపరిచినట్టే.  ఇలా మౌనంగా మాట్లాడకుండా ఉండటం  వల్ల  భాగస్వామి తనను  విడిచిపెట్టేస్తారేమో అనే భావన కలిగే అవకాశం ఉంది. మాట్లాడకుండా మౌనాన్ని ఆశ్రయించడం వల్ల ఎదుటివారి మనసులో అనేక రకాల ఆలోచనలు రావచ్చు.  ఎదుటి వారు కూడా భాగస్వామి మాట్లాడకపోవడం వల్ల అతిగా ఆలోచించి తీవ్రమైన డిప్రెషన్,  అనూహ్య నిర్ణయాలు తీసుకునే స్థితిలోకి జారుకోవచ్చు. భార్యాభర్తలు ఎప్పుడూ కుటుంబ సభ్యుల కారణంగానో, స్నేహితుల కారణంగానో,  ఆర్థిక విషయాల కారణంగానో, లేదా బయటి విషయాల కారణంగానో గొడవ పడి విడిపోవడం అనే చర్య వరకు వెళ్లకూడదు.  భార్యాభర్తలు జీవితాంతం కలిసి ఉండాల్సినవారు.  ఒకరి విషయంలో ఒకరికి మనస్పర్థలు ఉన్నా చర్చించి పరిష్కరించుకోవాలి. అలాంటిది ఇతరుల కారణంగా ఒకరితో ఒకరు మాట్లాడకపోవడం,  ఒకరిని ఒకరు వదులుకోవడం అనే చర్య వరకు వెళ్ళడం మూర్ఖత్వం. భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చినప్పుడు భాగస్వామితో మాట్లాడటం మానేయడం లేదా  మౌనంతోనే తమ నిరసన వ్యక్తం చేయడం వంటివి చేస్తుంటే అలాంటి అలవాటును వదిలేయడం మంచిది. భాగస్వాములు  సుఖ దుఃఖాలలో మీకు తోడుగా నిలిచేవారని గుర్తుంచుకోవాలి.   ఇద్దరి మధ్య మూడవ వ్యక్తి కారణంగా దూరం పెరుగుతుంటే ఆ వ్యక్తిని దూరంగా ఉంచాలి తప్ప మూడవ వ్యక్తి కోసం ఇద్దరూ గొడవ పడకూడదు. భాగస్వాములు  ప్రేమ, ఆప్యాయత, సంరక్షణ,  గౌరవం మొదలైనవాటికి అర్హులు.  ఇద్దరూ కలసి మాట్లాడుకోవడం ద్వారా  సమస్యలన్నింటినీ పరిష్కరించుకోవాలి,  దూరాన్ని తగ్గించుకోవాలి.  ఇద్దరి మధ్య అందమైన బంధాన్ని మరింత బలపరుచుకోవాలి.                                               *రూపశ్రీ.   

భార్యాభర్తల వైవాహిక జీవితం మెరుగ్గా ఉండాలంటే ఈ పనులు చేయాలట..!

జీవిత ప్రయాణంలో ప్రేమకు, పెళ్లికి ప్రత్యేక స్థానం ఉంటుంది. సాధారణంగా సింగిల్ గా ఉండటం, తల్లిదండ్రులు కుటుంబ తోబుట్టువులుతో కలసి జీవించడం వేరు..  జీవితంలోకి ఒక భాగస్వామి వచ్చాక ఆ మనిషితో జీవితాంతం ఒక దృఢమైన బంధాన్ని నిర్మించుకోవడం వేరు. వైవాహిక జీవితం ఇద్దరి మధ్య సామరస్యం, విశ్వాసం, పరస్పర గౌరవం, నమ్మకం మొదలైన వాటితో  వృద్ధి చెందుతుంది. కేవలం ఇవి మాత్రమేకాదు..   వాస్తు శాస్త్రం, పురాతన భారతీయ నిర్మాణ శాస్త్రం, ఇంటి వాతావరణం మొదలైనవి కూడా ఇంటిలో సానుకూల వాతావరణాన్ని,  భార్యాభర్తల మధ్య    ప్రేమ, నమ్మకాన్ని, ఇద్దరి సంతోషాన్ని పెంచుతాయి.  భార్యాభర్తల వైవాహిక జీవితం మెరుగ్గా ఉండటానికి శాస్త్రీయంగానూ, భారతీయ వాస్తు పరంగానూ ఎలాంటి టిప్స్ ఫాలో కావాలంటే.. భారతీయ వాస్తు శాస్త్రంలో దిక్కులకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది.  కనీసం భోజనం చేయడం నుండి నిద్రించడం వరకు ఈ దిక్కులను దృష్టిలో ఉంచుకునే చేస్తుంటారు అందరూ. వాస్తు ప్రకారం కొత్తగా పెళ్లైన జంట ఉండే గది ఉత్తరం,  దక్షిణం,  ఈశాన్యం, ఆగ్నేయ దిక్కులలో ఉండకూడదట.  ఈ దిక్కులలో ఉంటే భార్యాభర్తల మధ్య చిన్నవిషయాలలో విభేదాలు, వివాదాలు, గొడవలకు దారితీస్తాయట. భార్యాభర్తల మధ్య అన్యోన్యత,  సంతోషం, సానుకూల వాతావరణం ఉండాలంటే భార్యాభర్తల గది వాయువ్య దిశలో ఉండాలి. ఈ దిశలలో భార్యాభర్తలు నిద్రించే గది ఉంటే వారిద్దరి మధ్య ఒకరి నుండి మరొకరికి మంచి సహకారం ఉంటుంది. జీవితంలో ఎలాంటి సవాళ్లు వచ్చినా ఇద్దరూ కలసి పరిష్కరించుకోగలుగుతారు. రంగులతో  జరిగే మ్యాజిక్.. రంగులు భావోద్వేగాల మీద ,  మనిషి మానసిక స్థితి మీద ప్రభావం చూపిస్తాయి. భార్యాభర్తల మధ్య ప్రేమ, సాన్నిహిత్యం, ఇద్దరి మధ్య అవగాహన పెరగడానికి పడక గదిలో రంగులు కూడా సహాయపడతాయి.  పింక్,  ఎరుపు,  ఊదా రంగులు భార్యాభర్తల మధ్య ప్రేమను, సాన్నిహిత్యాన్ని పెంచుతాయి.మృదువుగా ఉండే పాస్టెల్ లు ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. గదిలో ఇవి ఉంచండి.. భార్యాభర్తలు నిద్రించే గదిలో కొన్ని వస్తువులు ఉంచడం వల్ల ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. పడకగది నైరుతి మూలలో ప్రేమను, బంధం మధ్య బలాన్ని తెలిపే విధంగా ఉండే పావురాల జంట బొమ్మలు లేదా ఫొటో ఫ్రేమ్ వంటివి ఉంచవచ్చు.  లేదంటే బాతుల జంటలకు సంబంధించినవి కూడా ఉంచుకోవచ్చు.  ఇవి మాత్రమే కాకుండా గదిలో ప్రశాంత వాతావరణం ఉండాలంటే పువ్వుల పెయింటింగ్ లు, ప్రశాంతమైన ప్రకృతి దృశ్యాలు, అందమైన కళాకృతులు ఉంచుకోవాలి. ఇవి మాత్రమే కాకుండా ఇంటిని, పడక గదిని చిందర వందరగా ఉంచుకోకుండా శుభ్రంగా ఉంచుకోవడం, పడక గదిలో మంచి సువాసన ఉండేలా తాజా పువ్వులు లేదా ఎయిర్ ఫ్రెషర్ లు  ఉపయోగించాలి.  ముఖ్యంగా భార్యాభర్తలు తమ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు అయిన మొబైల్ ఫోన్ లను తమ గదిలో ఉంచడం మానేయాలి. నిద్ర లేవాలనే నిబంధన ఉండే అలారం వాచ్ ను ఉపయోగించాలి.                                            *రూపశ్రీ.  

పీరియడ్స్ గురించి పిల్లలకూ అవగాహన కావాలి.. ఎందుకంటే!

మహారాష్ట్ర రాజధాని ముంబై నగరంలో 14 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకుంది.  ఈకాలంలో చిన్న పిల్లలు కూడా ఆత్మహత్య చేసుకోవడం కామన్ అయిపోయింది. తల్లిదండ్రులు మందలించారనో, మొబైల్ ఫోన్ ఇవ్వలేదనో, పరీక్షలు తప్పారనో ఇలా చాలా కారణాలు వింటూనే ఉన్నాం. కానీ మొదటిసారి పీరియడ్స్ సమయంలో రక్తస్రావాన్ని చూసి,  పీరియడ్స్ సమయంలో నొప్పి భరించలేక  14 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకున్న సంఘటన తాజాగా అందరినీ ఉలిక్కిపడేలా చేస్తోంది. పీరియడ్స్ ప్రతి ఆడపిల్ల జీవితంలో ముఖ్యమైన దశ. సాధారణంగా అమ్మాయిలు పీరియడ్స్ ను, పీరియడ్స్ సమయంలో నొప్పిని, ఆ సమయంలో కలిగే ఇతర ఇబ్బందులను ఎదుర్కోవడం సజహమే.  కానీ మొదటిసారి నెలసరికి లోనయ్యే బాలికలకు దీని గురించి చాలా గందరగోళం ఉంటుంది. ఇప్పటి జనరేషన్ కు తగినట్టు ఆడపిల్లలతో పాటూ మగపిల్లలకు కూడా పీరియడ్స్ అనే విషయం గురించి అవగాహన ఉండనే ఉంటుంది. కానీ వీటిని స్వయంగా అనుభవించడంలోనే ఇబ్బంది దాగుంటుంది.  దీని గురించి బాలికలకు  అవగాహన కల్పించడం చాలా ముఖ్యం.  తద్వారా బాలికలలో నెలసరి సమయాల్లో ఎదురయ్యే మానసిక, శారీరక సమస్యలను ఎదుర్కోవడం వీలవుతుంది. ముంబైలో జరిగిన ఉదంతం గురించి ప్రస్తావనలోకి వెళితే ఆత్మహత్య చేసుకున్న బాలికకు అదే మొదటిసారి పీరియడ్స్ రావడం. అంతకు ముందెప్పుడూ ఆమె తల్లి ఆమెకు పీరియడ్స్ గురించి చెప్పలేదు. పైపెచ్చు వారికి ఆర్థిక స్థోమత లేని కుటుంబం కావడంతో బాలికను పాఠశాలకు కూడా పంపలేదు. దీంతో బాలికకు తల్లి నుండి కానీ, సమాజం నుండి కానీ పీరియడ్స్ అనే విషయం గురించి అవగాహన లేదు.  14ఏళ్ళ బాలికకు మొదటిసారి రక్తస్రావం చూసి భయపడింది.  ఆమె తల్లి ఆ పాపకు అది అందరికీ సాధారణం అని వివరించి చెప్పింది. కానీ ఆ పాప  అప్పటికే రక్తస్రావం గురించి ఆందోళనలో ఉంది. పైగా తన శరీరంపై తనకు అసహ్యం కలుగుతోందని తల్లికి చెప్పింది.  కానీ కూతురు అర్థం చేసుకుంటుందని ఆ పాప తల్లి అనుకుంది. కానీ ఆ పాపకు పీరియడ్స్ వచ్చిన రెండవరోజున దారుణమైన  వార్త వినాల్సి వచ్చింది. ఆ పాప ఒత్తిడి, ఆందోళన,  తన శరీరం మీద తనకు  పుట్టిన అసహ్యం కారణంగా  ఆత్మహత్య చేసుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్త కారణంగా పీరియడ్స్ గురించి ఆడపిల్లలో అవగాహన పెరగాలని అంటున్నారు. కొందరు పీరియడ్స్ గురించి బయటకు చెప్పడానికి కూడా ఇష్టపడరని, అది బాలికల జీవితానికి చాలా చేటు చేస్తుందని అంటున్నారు. కాబట్టి బాలికలకు చిన్నవయసులోనే ఈ విషయాల గురించి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ద్వారా అవగాహన పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.                                               *నిశ్శబ్ద.  

రిలేషన్ ఏక పక్షంగా సాగుతుంటే మానసిక సమస్యలు వస్తాయా?

మానసిక సమస్యలు ఇప్పట్లో చాలా ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పటికాలం యూత్  మానసిక సమస్యలతో చాలా సతమతం అవుతున్నారు. ప్రేమ, వివాహం లాంటి బంధం ఏర్పడిన తరువాత  ఆ బంధం చాలావరకు ఏకపక్షంగా సాగుతూ ఉంటుంది.  ముఖ్యంగా వివాహంలో భార్యాభర్తలు ఇద్దరూ తమ బంధం గురించి ఆలోచించాలి. కానీ దీనికి బదులుగా భార్యాభర్తలలో ఒకరు మాత్రమే తమ బంధం నిలబడాలని తాపత్రయ పడుతున్నా,  ఒకరు మాత్రమే ఏ తప్పు జరిగినా దానికి బాధితులుగా మారుతున్నా, ఒక్కరే బంధాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా ఆ బంధంలో ఉన్న వ్యక్తి ఖచ్చితంగా మానసిక సమస్యలు ఎదుర్కొంటారని రిలేషన్షిప్ నిపుణులు అంటున్నారు. అసలు తమ బంధం నిజంగానే ఏకపక్షంగా ఉందా? దీన్ని గుర్తించడం ఎలా? తెలుసుకుంటే.. భాగస్వామితో సన్నిహితంగా ఉన్న తర్వాత కూడా  ఇద్దరి మధ్య బంధం అంత ఆరోగ్యకరంగా ఉండకపోవడం.   ఇద్దరి మధ్య ఏవైనా మాటలు ఉంటాయి. కానీ ఆ మాటల్లో ప్రేమ గురించి, ఇద్దరి మధ్య ఉన్న ఆప్యాయత, అన్యోన్యత గురించి, లేదా భవిష్యత్తు గురించి లోతైన సంభాషణలు ఏమీ ఉండవు. రిలేషన్ లో ఉన్న వ్యక్తి పైకి భాగస్వామిగా ఉన్నా ప్రతిసారీ తన భాగస్వామి హృదయం  గాయపడే విధంగా మాట్లాడటం,  తప్పులు చేయడం జరుగుతుంది.  ఇవన్నీ చేసి ఆ తరువాత   క్షమాపణలు చెప్పడం లాంటి ట్రిక్స్ ప్లే చేస్తారు. ఏకపక్షంగా సాగుతున్న రిలేషన్ లో ఉన్న వ్యక్తులు ఎప్పుడూ ఇన్ సెక్యురిటీ ఫీల్ అవుతూ ఉంటారు. లైఫ్ పార్టర్నర్ గురించి ఆందోళన చెందుతూ ఉంటారు. ఇద్దరి మధ్య బంధం పదునవ్వడానికి,  ఇద్దరి మధ్య ప్రేమ పెరగడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి తరువాత విఫలమవుతూ ఉంటారు. ఇలా జరిగితే ఏమవుతుంది?  ఏకపక్షంగా సాగే ఈ రిలేషన్ వల్ల  బంధం నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేసే భాగస్వామి ఎల్లప్పుడూ ఆందోళనకు గురవుతూ ఉంటారు.  వారి ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. తమ ప్రమేయం లేకుండా జరుగుతున్న తప్పులకు దోషులుగా మారడం వల్ల తమ మీద తమకు నమ్మకం పోవడమే కాదు..  ప్రేమ మీద నమ్మకం కూడా కోల్పోతారు. తమలో లోపాలు వెతుక్కోవడం మొదలుపెడతారు. ఇలాంటి ఏకపక్ష రిలేషన్ లు  వ్యక్తి ఆరోగ్యాన్ని చాలా దారుణంగా దెబ్బతీస్తాయి. తమ భాగస్వామి తమతో సంతోషంగా ఉంటే చాలనే  ఆలోచనల వల్ల తమను తాము దోషులుగా నిలబెట్టుకుంటారు.  ఇలా మెల్లిగా వారు బలహీనులుగా మారిపోతారు.  ఆందోళన,  నిద్రలేమి,  కళ్ల కింద నల్లని వలయాలు, ఆహారం, ఆరోగ్యం మీద శ్రద్ద లేకపోవడం వంటి వాటివల్ల ముఖం డల్ గా మారిపోతుంది.  ఇది క్రమంగా వారిని డిప్రెషన్ లోకి నెట్టివేస్తుంది.                                                              *రూపశ్రీ.

ప్రేమలో బ్రేకప్ అయ్యాక బాధపడకూడదంటే ఇలా చేయండి..!

ఈ జనరేషన్ వాళ్లకు ప్రేమ అనేది చాలా కామన్ విషయం. అది కూడా ప్రేమించడం, విడిపోవడం, ఆ తరువాత మళ్లీ ఇంకొక వ్యక్తితో ప్రేమలో పడటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ఎంతమందిని ప్రేమించినా, విడిపోయినా ప్రేమలో ఉన్నప్పుడు  ఎన్నో విషయాలు పంచుకుంటారు,  వాళ్లతో సమయం గడపడానికి ఎంతో సాహసం కూడా చేస్తారు. కష్టం, సంతోషం,  బాధ, చేదు సంఘటనలు,  చిలిపి గొడవలు, ఒకరి పట్ల ఒకరు చూపించుకున్న ఆప్యాయత ఇవన్నీ ప్రతి ప్రేమ జంట మధ్య జరిగేవే. మరికొందరు ఇంకాస్త ముందడుగు వేసి చాలా ఓపెన్ అయిపోతారు కూడా. కానీ ప్రేమ విఫలం అయ్యాక, ఇద్దరూ దూరం అయ్యాక  జరిగేది చాలా బాధాకరం. ఆ బాధ నుండి బయటపడలేక సతమతం అయ్యేవారు చాలామంది ఉంటారు.  ఈ బాధను అధిగమించడానికి ఏం చేయాలో తెలుసుకుంటే.. అంగీకారం.. విడిపోయిన తర్వాత చాలా మంది తమ భాగస్వామి తమను విడిచిపెట్టారని అంగీకరించలేరు.   పాత విషయాలలోనే చిక్కుకుపోతారు. దీనివల్ల బ్రేకప్ అయిన తరువాత కూడా  విడిపోయిన వ్యక్తి గురించే ఆలోచిస్తూ, బాధపడుతూ ఉంటారు. కానీ బ్రేకప్ అయ్యాక ఇక ఇద్దరి మధ్య  సంబంధం ముగిసిపోయిందని మనస్ఫూర్తిగా అంగీకరించాలి.   అవన్నీ వదిలిపెట్టాల్సిన విషయాలని అర్థం చేసుకుని జరగాల్సిన వాటి గుంరిచి ఫోకస్ పెట్టాలి. స్నేహితులు.. బ్రేకప్ తరువాత బాధ నుండి బయటపడానికి స్నేహితులే గొప్ప మార్గం. బెస్ట్ ఫ్రెండ్స్ తప్ప  బాధను ఎవ్వరూ అంతగా అర్థం చేసుకోరు. స్నేహితులు అందరూ ఒక్కచోట చేరితే వారితో సమయం గడుపుతూ తమ జీవితంలో బ్రేకప్ లాంటి చేదు దశ ఒకటి ఏర్పడిందనే విషయమే గుర్తుండదు. అబ్బాయిలకు అయినా అమ్మాయిలకు అయినా ఇది చక్కని మార్గం.  అందుకే బ్రేకప్ పెయిన్ మర్చిపోవడానికి స్నేహితులను కలవాలి. భవిష్యత్ లక్ష్యాలు.. ఎంతసేపు ప్రేమించిన వ్యక్తి గురించి, గతంలో వారితో గడిపిన సమయం గురించి,  జరిగిన గొడవల గురించి, విడిపోయిన సంఘటన గురించి పదే పదే తలచుకుని బాధపడటం వల్ల సమయం వృథా అవుతుందే తప్ప భవిష్యత్తుకు ఏ మాత్రం ప్రయోజనం ఉండదు.  ఒక వ్యక్తి జీవితంలో నుండి వెళ్లిపోయారని అర్థం చేసుకుని భవిష్యత్తు మీద, లక్ష్యాల మీద దృష్టి పెట్టడం మంచిది.  ఇది భవిష్యత్తును ఎంతో అందంగా మారుస్తుంది. జీవితంలో ఉన్నతంగా నిలబడేలా చేస్తుంది. సెల్ఫ్ ప్రొటెక్షన్.. చాలామంది బ్రేకప్ తరువాత ఇక బ్రతికి ఉండటం ఎందుకు అని ఆలోచిస్తారు.  వదిలేసిన వ్యక్తి లేకుండా ఎలా బ్రతకడం అని అనుకుంటారు. ఈ ఆలోచన నుండే సూసైడ్ వైపు వెళతారు. కానీ  విడిపోయిన వ్యక్తి కారణంగా ప్రాణాలు తీసుకోవడం ఎప్పటికీ సరైనది కాదు.  జీవితంలో ఎవరున్నా లేకపోయినా తనకు  తాను ఉండాలనే విషయాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి.  తన గురించి తాను కేర్ తీసుకోవాలి. తనని తాను ప్రేమించుకోవాలి. సెల్ఫ్ లవ్, సెల్ఫ్ ప్రొటెక్షన్ కలిగిన వారు ఎవరూ ఇతరుల కారణంగా చావును ఎంచుకోరు.                                  *రూపశ్రీ.

పిల్లలు తండ్రి నుంచి మాత్రమే నేర్చుకోగల 5 విషయాలు ఇవి..!

    ప్రతి పిల్లవాడి దృష్టిలో తన తండ్రి సూపర్ హీరో.  బయట ఏ మహిళను అయినా అమ్మ అని పిలిచే వీలుంటుంది. కానీ నాన్న అని కేవలం కన్న తండ్రిని మాత్రమే పిలుస్తాం.  తల్లిదండ్రులలో ఎప్పుడూ పిల్లలకు దగ్గరగా ఉండేది,  పిల్లల బాగోగులు దగ్గరగా చూసుకునేది తల్లే. అందుకే చాలా మంది పిల్లలు తల్లితోనే చనువుగా ఉంటారు. కానీ తండ్రి బయట ఉద్యోగం చేసి భార్యా పిల్లలకు జీవితం మీద భరోసా ఇవ్వగలిగితేనే ఏ భార్య అయినా తన పిల్లలను ప్రశాంతంగా చూసుకోగలదు.  కాబట్టి ప్రతి కుటుంబం ప్రశాంతంగా ఉండటం వెనుక నాన్న కష్టం, ఆయన త్యాగం చాలా ఉంటుంది.  అయితే పిల్లలు తన తండ్రి నుండి మాత్రమే నేర్చుకోగలిగే విషయాలు కొన్ని ఉన్నాయి.  ఇవి బయట ఎవ్వరినీ చూసి నేర్చుకోలేరు.  అవేంటో ఓ లుక్కేస్తే.. బాధ్యత నుండి పారిపోకుండా ఉండటం.. చాలామంది కష్టం, బాధ,  అసౌకర్యం అనిపించగానే వాటి నుండి దూరంగా పారిపోతారు.  దానివల్ల తాము ప్రశాంతంగా ఉండగలుగుతాం అని అనుకుంటారు. కానీ తండ్రి అలా ఆలోచిస్తే భార్యాపిల్లల జీవితం తలకిందులు అవుతుంది.  తండ్రి బాధ్యతలు, కష్టాలను ఎదుర్కోవడానికి ఎప్పుడూ ఒక సైనికుడిలా సిద్దంగానే ఉంటాడు. కాబట్టే భార్యా పిల్లలు ఇంట్లో హాయిగా ఉండగలుగుతారు. బాధ్యతల నుండి పారిపోకుండా.. వాటిని  సమర్థవంతంగా మోసేది తండ్రి మాత్రమే.  ఈ లక్షణాన్ని పిల్లలు తండ్రి నుండి నేర్చుకుంటారు.  ఓ కుటుంబాన్ని మోయడం  బరువు కాదు బాధ్యత అని తండ్రి నుండి తెలుసుకుంటారు. మాట వినడం.. చాలామంది అంటూ ఉంటారు.  అమ్మ చెబుతూ ఉంటే నాన్న వింటూ ఉంటాడు అని.  కొందరు ఈ విషయంలో తండ్రులను చులకన చేయడం, జోకులు వేయడం కూడా చేస్తారు.  అయితే తండ్రి ఇలా కేవలం వినడం వల్ల తల్లిదండ్రుల మద్య రెలేషన్ ఎంత ఆరోగ్యకరంగా ఉందో అర్థమవుతుంది. కొన్నిసార్లు తండ్రి చెప్పే మాటను తల్లి, తల్లి చెప్పే మాటలను తండ్రి ఓపికగా వినడం చూసి  పిల్లలు కూడా వినడాన్ని అలవాటు చేసుకుంటారు.   ఎవరైనా ఏదైనా చెబుతున్నప్పుడు వినడం అనే లక్షణం పిల్లలను కూడా గొప్పగా తయారుచేస్తుంది. రోల్ మోడల్.. చాలామంది తల్లిదండ్రులను, తమ అవ్వ తాతలను తమ రోల్ మోడల్స్  అని పేర్కొంటూ ఉంటారు. నిజానికి ప్రతి పిల్లవాడికి తన తండ్రి రోల్ మోడల్ గా ఉండాలి. తండ్రి కుటుంబం బాధ్యత తీసుకుంటాడు. ఎవరికి ఏం కావాలన్నా చూసుకుంటాడు.  ఎవరికీ ఏ లోటు రాకుండా జాగ్రత్త పడతాడు. ఆర్ఠిక విషయాల నుండి సాధారణ సమస్యల వరకు ప్రతి దాన్ని తండ్రి ఎంతో  ఓపికగా డీల్ చేస్తాడు. అన్నింటినీ హ్యాండిల్ చేస్తాడు కాబట్టే తండ్రి కొడుకు దృష్టిలో రోల్ మోడల్ గా ఉంటాడు. నిస్వార్థం.. ప్రతి తండ్రి తన పిల్లలు గొప్పగా ఉండాలని ఆశ పడతాడు.  చదువు చెప్పించడం నుండి,  పిల్లల  అవసరాలు తీర్చడం వరకు అన్ని విషయాలలో తనకంటే తన పిల్లలు ఎక్కువ సుఖపడాలని అనుకుంటాడు.  కొన్ని సార్లు పిల్లల సంతోషం కోసం డబ్బు కూడా లెక్క చేయడు. తనకు ఏమీ లేకపోయినా భార్య, పిల్లలను సంతోష పెడితే చాలని అనుకుంటాడు. కుటుంబం విషయంలో నిస్వార్థంగా ఉండేది నాన్న మాత్రమే. ఈ లక్షణాన్ని  పిల్లలు తండ్రి నుండే స్పష్టంగా గ్రహించి అలవాటు చేసుకోగలరు. చేయడం, నేర్చుకోవడం.. ఒక మగాడు తన పిల్లల కోసం తనకు తెలియని పనిని కూడా చేయడానికి సిద్దపడతాడు. పనిని చేస్తూ నేర్చుకోవచ్చనే గుండె ధైర్యం,  ఆత్మవిశ్వాసం కేవలం తండ్రికి మాత్రమే ఉంటుంది. ఆ తండ్రి మనసులో కేవలం తన పిల్లలు, భార్యకు లోటు రాకూడదనే ఆరాటం తప్ప తను చేస్తున్నది ఎంత కష్టమైన పని అనే ఆలోచన అస్సలు ఉండదు. ప్రతి పిల్లవాడు తండ్రి నుండి ఈ లక్షణాన్ని అలవాటు చేసుకోవాలి. ఇది వారిని జీవితంలో ఏ పనిని అయినా ధైర్యంగా చేసేందుకు సహాయపడుతుంది.                                        *రూపశ్రీ.  

 ఇంటర్నెట్ అడిక్షన్ డిజార్ఢర్ గురించి తెలుసా?

నేటి ఇంటర్నెట్ యుగంలో పిల్లల నుండి పెద్ద వారి వరకు ఫోన్ లేకపోయినా, నెట్ కనెక్షన్ లేకపోయినా ఒక్క నిముషం కూడా ఉండలేని స్థితికి దిగజారిపోయారు. ఫోన్ లేకపోతే పిల్లలు అన్నం తినరు, హోం వర్క్ చెయ్యరు,  చివరకు అల్లరి చేయకుండా నిద్రపోవడానికి సిద్దం కారు.   ఇక పెద్దలు అయితే సోషల్ మీడియాకు అడిక్ట్ అయ్యి ఫేస్ బుక్, యూట్యూబ్ లో గంటలు గంటలు కాలక్షేపం చేస్తుంటారు. ఇది చాలామందిల వ్యసనంగా మారుతోంది.  ఎప్పుడూ పోన్ కు, ఇంటర్నెట్ కు అతుక్కుని ఉండేవారికి ఇంటర్నెట్ అడిక్షన్ డిజార్డర్ సమస్య ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. ఆన్‌లైన్‌లో ఎక్కువ సమయం గడపడం, బాధ్యతలను విస్మరించడం, జీవితం మీద సీరియస్ నెస్ లేకపోవడం,  జీవితంలో సమస్యలను ఎదుర్కోవడానికి బదులు వాటి నుండి తప్పించుకోవడం వంటివి చేస్తున్నారు.  ఈ సమస్య నుండి బయట పడటానికి ఏం చేయాలో వైద్యులు ఏం చెప్పారో తెలుసుకుంటే.. సమస్యను గుర్తించాలి. ఇంటర్నెట్ అడిక్షన్ డిజార్ఢర్ ని అధిగమించడంలో మొదటి దశ సమస్య ఉందని అర్థం చేసుకోవడం. మీ ఇంటర్నెట్ వినియోగ విధానాలను గమనించుకోవాలి.   ఇది  దైనందిన జీవితాన్ని, సంబంధాలను, పనితీరును  ప్రతికూలంగా  ఎలా ప్రభావితం చేస్తుందో లేదో అంచనా వేయండి. ఇంటర్నెట్ వినియోగం కోసం కొన్ని రూల్స్ ఏర్పాటుచేసుకోవాలి. ఇంటర్నెట్‌ని ఉపయోగించడం కోసం రోజులో నిర్దిష్ట సమయాలను కేటాయించుకోవాలి.  ఈ పరిమితులకు కట్టుబడి ఉండాలి. ఆన్‌లైన్‌లో  గడిపే  సమయాన్ని ట్రాక్ చేయాలి. దాన్ని నియంత్రించడంలో  సహాయపడే స్మార్ట్‌ఫోన్ యాప్‌లు లేదా బ్రౌజర్ లను ఉపయోగించాలి. ఇంటర్నెట్‌తో సంబంధం లేని హాబీలు,  కార్యకలాపాలను ఎంచుకోవాలి. పుస్తకాలు చదవడం, వ్యాయామం చేయడం, తోటపని చేయడం లేదా స్నేహితులు, కుటుంబ సభ్యులను  కలుసుకోవడం, వారితో మాట్లాడటం వంటివి చాలా ఆనందాన్ని ఇస్తాయి. ఇవి ఆలోమేటిక్ గా  ఆన్‌లైన్‌లో ఉండాలనే ప్రలోభాన్ని తగ్గేలా చేస్తాయి. ఆన్లైన్ వ్యసనాన్ని తగ్గించుకోవడానికి  స్నేహితులు, కుటుంబ సభ్యులు లేదా థెరపిస్ట్‌ను సంప్రదించండి. వారి సపోర్ట్ తీసుకోవాలి.  ఇంటర్నెట్ వినియోగం గురించి  ఆందోళనలను,  అది  జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో చర్చించాలి. కొన్నిసార్లు, ఎవరితోనైనా మాట్లాడటం వలన  సమయాన్ని ఆన్‌లైన్‌లో సమయాన్ని  సమర్థవంతంగా నిర్వహించడానికి,  కొత్త దృక్కోణాలు,  వ్యూహాలను అమలుచేయడానికి మార్గాలు దొరికే అవకాశం ఉంటుంది. పని లేదా ఏదైనా పరిశోదించడం, విశ్రాంతి, వ్యాయామం, కొత్త విషయాలు తెలుసుకోవడం వంటి వాటిపై దృష్టి పెట్టాలి. టీవి, ఫోన్, సిస్టమ్ మొదలైనవాటి  నుండి రెగ్యులర్ బ్రేక్‌ తీసుకోవాలి.   ధ్యానం లేదా మైండ్‌ఫుల్‌నెస్ వ్యాయామాలు వంటి స్వీయ-సంరక్షణ కార్యకలాపాలకు ప్రాధాన్యత ఇవ్వండి.                                                       *రూపశ్రీ.

భార్యాభర్తలను మరింత దగ్గర చేసే మార్గాలు ఇవే..!

ప్రతి జంట జీవితం పెళ్లితో ఎంతో సంతోషంగా మొదలవుతుంది.  పెళ్లి తరువాత హనిమూన్ జరిగేవరకు అదొక ప్రపంచంలో ఉంటారు. ఆ తరువాత మెల్లగా వృత్తి, కుటుంబ బాధ్యతలలో పడిపోతారు. ఉద్యోగ ఒత్తిడులు, కుటుంబ బాధ్యతల కారణంగా భార్యాభర్తల మధ్య దగ్గరితనం కాస్త తగ్గడం మామూలే. ఇది అలాగే దీర్ఘకాలం కొనసాగితే భార్యభర్తలు ఇద్దరూ వేర్వేరు వ్యక్తులలా  ఫీల్ అయ్యే పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. అంతేకాదు..  ఇద్దరి మద్య ఉండే బంధం బలహీనం అవుతుంది.  అలా కాకుండా భార్యాభర్తలు ఎప్పుడూ కొత్తగా పెళ్లైనవారిలా  సంతోషంగా సంతోషంగా ఉండాలంటే ఈ కింది పనులు తప్పక చెయ్యాలి. టైం స్పెండ్ చేయాలి.. రోజువారీ జీవితం హడావిడిలో భాగస్వామితో  సమయాన్ని గడపడంలో చాలామంది  నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇద్దరి మధ్య వ్యక్తిగత బంధాన్ని, చనువును పునరుద్ధరించుకోవడానికి ఒకరికొకరు ప్రత్యేక సమయాన్ని కేటాయించుకోవాలి. సాధారణ రోజుల్లో రాత్రి సమయాలు, వారాంతపు సెలవులు లేదా రాత్రి పూట ఇద్దరూ కలసి వంట చేయడం, ఇద్దరూ కలసి భోజనం చేయడం, ఇద్దరూ కలసి షాపింగ్ చేయడం,  పరధ్యానంగా ఉండకుండా ఒకరిని ఒకరు సంతోష పెట్టడం చేయాలి.   ఆశ్చర్యం.. భాగస్వాములు చేసే చిన్న పనులు ఇద్దరి మధ్య సాన్నిథ్యాన్ని నిలివి ఉంచుతాయి.  ఒకరి పట్ల మరొకరికి ఎంత ప్రేమ ఉందో తెలిసేలా చేస్తాయి.  ఒకరికొకరు సర్ప్రైజ్ ఇచ్చుకోవడం ఇద్దరి మధ్య బందాన్ని చాలా బలపరుస్తుంది.  ఇవి పెద్ద పెద్దవి కానక్కర్లేదు.  భర్త ఆఫీసు నుండి ఇంటికెళ్తూ బార్యకు నచ్చింది తీసుకెళ్లడం,  భార్యకు నచ్చిన వంటకం నేర్చుకుని తయారు చేయడం వంటివి చేస్తే.. భార్య భర్త లంచ్ బాక్స్ లో అతనికి నచ్చిన ఆహారాన్ని పెట్టడం నుండి అతని ఆఫీసు ఒత్తిడిని అర్థం చేసుకుని అతనికి సహకరించడం వరకు చాలా ఉంటాయి. కమ్యూనికేషన్.. చాలామంది మధ్య గొడవలు వచ్చేది, ఇద్దరి మధ్య దూరం పెరిగేది కమ్యూనికేషన్ సరిగా లేకపోవడం వల్లనే.  భార్యాభర్తలు ఇద్దరూ ఓపెన్ గా మాట్లాడుకుంటే ఏ సమస్యలు అయినా పరిష్కారం అవుతాయి. ఒకరి ఆలోచనలు,  ఒకరి ఆందోళనలు, ఒకరి అభిరుచులు, ఆశయాలు ఇలా ప్రతి ఒక్కటీ ఒకరితో మరొకరు చెప్పుకుని చర్చించుకోవడం వల్ల ఇద్దరి మధ్య అవగాహన పెరుగుతుంది. ఇది ఇద్దరి మధ్య బంధాన్ని లోతుగా పెంచుతుంది. ప్రయత్నాలు.. కొత్త పని చేయడం ఎప్పుడూ సరదాగా ఉంటుంది.  భార్యాభర్తలకు ఇద్దరికీ కొత్తగా ఉన్న పనిని ఇద్దరూ కలసి చేయడం, ఇద్దరూ కలసి దాన్ని నేర్చుకోవడం వల్ల ఇద్దరికీ ఒకరి సహకారం మరొకరికి అందుతుంది.  ఇది ఇద్దరూ జీవితాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో ఇన్ డైరెక్ట్ గానే చెబుతుంది. అంతే కాదు..  ఏదైనా పనిలో భాగస్వామి తోడైతే ఆ పని చేయడంలో ఉండే వ్యత్యాసం కూడా అర్థమవుతుంది. థ్యాంక్స్ చెప్పాలి.. రోజువారి పనులలో  ఒకరి సహాయం మరొకరు తీసుకుంటూ ఉంటారు.  ఒకరి సమస్యలు మరొకరు ఆలోచించి పరిష్కరించుకుంటూ ఉంటారు. చిన్న విషయమైనా సరే.. థ్యాంక్స్ చెప్పడం, ఒకరి పట్ల మరొకరికి ఉన్న ప్రేమను వ్యక్తం చేయడం, ఒకరిని మరొకరు పొగుడుకోవడం వంటివి ఇద్దరి మధ్య ఎమోషనల్ బాండింగ్ ను మరింత దృఢంగా మారుస్తాయి. ఇద్దరూ ఒకరి పట్ల మరొకరు గౌరవంగా ఉండేలా చేస్తాయి.                                    *రూపశ్రీ.

ఇలా చేశారంటే చాలు అరటిపండ్లు ఎన్ని రోజులైనా తాజాగా ఉంటాయ్..!

   అరటిపండ్లు పేదవాడికి కూడా అందుబాటు ధరలో ఉండే పండు. ఉపవాసాలు ఉండే వారి నుండి భోజనం తరువాత ఏదైనా పండు తినాలనుకునే వారి వరకు చాలామంది అరటిపండ్లు తినడానికే మొగ్గు చూపుతారు.  రోజూ ఓ అరటిపండు తినాలని చాలామందికి  ఉంటుంది. కానీ అరటిపండ్లు తెచ్చిన రెండు రోజులకే నల్లగా మారి కుళ్లిపోతుంటాయి. ఇలాంటి పండ్లు తినబుద్ది కాదు.  కానీ మార్కెట్లో మాత్రం అరడజను నుండి డజను మాత్రమే కొనుగోలు చేయగలం.  అరటిపండ్లు కొన్న తరువాత ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉండాలన్నా..  వాటిని తాజాగా తినాలన్నా ఈ కింది టిప్స్ పాటిస్తే సరిపోతుంది. అరటిపండ్లు తాజాగా ఉండాలన్నా,  త్వరగా నల్లబడకుండా ఉండాలన్నా వాటిని కొనుగోలు చేసేటప్పుడు ఎక్కడా నల్లగా లేకుండా ఉన్నవే ఎంచుకోవాలి.   కొనుగోలు  చేస్తున్న పండ్లలో ఏదైనా ఒక పండు   మెత్తగా లేదా నల్లగా ఉన్నట్టు కనిపించినా  వాటిని కొనకూడదు.  ఎందుకంటే ఇలాంటి పండ్లు ఉంటే ఆ పండ్ల మొత్తాన్ని నిల్వ చేసినప్పుడు అవి త్వరగా పాడైపోతాయి.  అరటిపండ్లను అమ్మేవారు పండ్లను ప్లాస్టిక్ కవర్ లో ఇస్తుంటారు.  వాటిని ఇంటికి తీసుకువచ్చిన వెంటనే  కొనుగోలు చేసిన ప్లాస్టిక్ కవర్ ను తొలగించాలి. అరటిపండ్లు వచ్చిన సంచిలో  ఇథిలీన్ వాయువు పేరుకుని ఉంటుంది.  పండ్లను కవర్ లోనే అలాగే ఉంచితే..  అరటిపండు పండే ప్రక్రియ వేగం పెంచుతుంది. అందుకే  అరటిపండ్లను ఇంటికి తీసుకువచ్చి వేరొక కవర్ లోకి మార్చాలి. అరటిపండ్లు నల్లగా, మెత్తగా కాకుండా ఉండాలంటే అరటి పండ్ల తొడిమ  భాగాన్ని ప్లాస్టిక్‌ కవర్ తో కవర్ చేయాలి. ఇలా చేస్తే ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. . దీనివల్ల అరటిపండు త్వరగా పండదు, తాజాదనం అలాగే ఉంటుంది. అరటి గుత్తి కాండంపై ప్లాస్టిక్ కవర్ ను  కప్పే బదులు ఒక్కో అరటి కాండం విడివిడిగా చేసి వాటిమీద కప్పి ఉంచినా  అరటి పండు పక్వానికి వచ్చే ప్రక్రియ మందగిస్తుంది. అరటిపండ్లు ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి. అరటిపండ్లు మాత్రమే కాకుండా ఇతర పండ్లు కూడా ఎథిలీన్ వాయువును విడుదల చేస్తాయి.  పండ్లు అన్నీ ఒక్కచోట ఉండటం వల్ల చాలా  పక్వానికి గురయ్యేది ఇందుకే. అందుకే అరటిపండ్లను ఇతర పండిన పండ్లతో ఉంచడం మానుకోవాలి. అరటిపండ్లను విడిగా ఉంచితే అవి త్వరగా పండవు,  తాజాగా ఉంటాయి. అరటిపండ్లను ఫ్రిజ్‌లో ఉంచే బదులు గది ఉష్ణోగ్రత వద్ద ఉంచాలి. ఒక గిన్నెలో అరటిపండ్లను తలక్రిందులుగా ఉంచాలి. అరటిపండ్లను ఏ కంటైనర్ లో అయినా పెట్టి గట్టిగా నొక్కి ఉంచకూడదు. దాని బదులు వాటిపై  గాలి ఉండే విధంగా వాటిని నిల్వ చేయాలి. అరటిపండ్లను అంగళ్లలో అమ్మే వారిలాగా హుక్ కు వేలాడదీయబడం వల్ల  అవి తొందరగా పక్వానికి లోను కావు.  వీటికి గాలి బాగా తగులుతూ ఉంటుంది కాబట్టి అవి తొందరగా పక్వం చెందవు.                                            *రూపశ్రీ.