Read more!

ప్రపంచానికి పరిచయమైన ఓ కొత్త పాత్ర బార్బీ..!

పిల్లలకు బొమ్మలంటే చాలా ఇష్టం. ముఖ్యంగా భారతదేశంలో బొమ్మల సాంప్రదాయం,  వాటి ఉనికి ఈనాటిదేం కాదు. దసరా పండుగలో బొమ్మల కొలువు ఒక ఎత్తైతే.. పిల్లలకు గొప్ప కాలక్షేపంగా బొమ్మల హవా అంతా ఇంతా కాదు. అయితే.. బొమ్మల  విషయంలో ప్రపంచవ్యాప్తంగా దుమారం రేపినది మాత్రం బార్బీ డాల్  అని సందేహం లేకుండా చెప్పవచ్చు. సాధారణ బొమ్మలు ఎన్నున్నా సరే.. బార్బీ డాల్ ఎవరిదగ్గరైనా ఉందంటే ఆ గొప్పదనమే వేరు. ప్రతి ఆవిష్కరణ వెనుకా ఓ  కథ, కాసింత చరిత్ర  ఉన్నట్టు బార్బీ డాల్ పుట్టుక వెనుక కూడా చరిత్రలో కొన్ని  పేజీలున్నాయి. అందులో ఉన్న విషయమేంటో తెలుసుకుంటే..

ఆడపిల్లల దగ్గర బొమ్మలంటూ ఉంటే వారిదగ్గర ఖచ్చితంగా బార్బీ డాల్ ఉంటుంది.  అయితే ఈ బార్బీ డాల్ చరిత్ర మాత్రం చాలా  ఆసక్తికరమైంది.  రూత్ హ్యాండ్లర్  బార్బీని ప్రపంచానికి పరిచయం చేశాడు. ఆడవారికే ఈర్ష్య పుట్టేలా, అందరినీ ఆకర్షించేలా బార్బీ డాల్ రూపుగదిద్దుకుంది. పొడవాటి కాళ్లు, చేతులు, ఇట్టే ఆకర్షించే కళ్లు, ఒత్తేన జుట్టు.. ఇలా ఒక ప్రత్యేకమైన జర్మన్ బొమ్మను మొదటిసారి రూత్ హ్యాండ్లర్ చూశారు. దీన్ని చూసిన తరువాత దాన్ని ప్రపంచానికి ప్రత్యేకంగా పరిచయం చెయ్యాలనే ఆలోచన పుట్టింది. అలాగే కేవలం బార్బీని  మాత్రమే కాకుండా 1961లో బార్బీకి జోడీగా  కేన్ అనే ఒక బాయ్ ఫ్రేండ్ ను కూడా ప్రపంచానికి పరిచయం చేశారు.  బార్బీని ప్రపంచానికి పరిచయం చేశాక పిల్లల నుండి యువతుల వరకు ప్రతి ఒక్కరికీ బార్బీ వ్యక్తిగత స్నేహితురాలిగా మారిపోయింది.  ప్రతి ఒక్కరి దగ్గరగా బార్బీ తమతో ఉంటే బాగుండనే కోరిక కూడా బలపడింది.  ఇలా సంవత్సరాలుగా బార్బీ డాల్ ప్రజల మనసులను తన చుట్టూ తిప్పుకుంటోంది. 

కాలంతో పాటూ బార్బీ కూడా కొత్తకొత్తగా తన రూపాలు మార్చుకుంది. రంగురంగుల దుస్తులు, వాటిని తలదన్నే జుట్టు, బోలెడు అలంకరణ వస్తువులతో మరెంతో కొత్తగా, అద్బుతంగా ముస్తాబై ప్రపంచం మీద తనకంటూ ఓ స్పెషల్ మార్క్ క్రియేట్ చేసుకుంది. ఈ ప్రత్యేకతకు గుర్తుగానే బార్బీ డాల్ ప్రపంచానికి పరిచయం అయిన రోజు గుర్తుగా ప్రతి ఏడాది మార్చి 9వ తేదీన నేషనల్ బార్బీ డాల్ డే ని జరుపుకుంటున్నారు. ఇది విదేశాల నుండి పరిచయం అయినదైనా భారతీయులకు కూడా ఎంతో దగ్గరైన బొమ్మ. భారతీయ సంస్కృతిని కూడా ఇముడ్చుకుని పిల్లలు, పెద్దలలో భాగమైపోయింది. 

ఇక ఈ బార్బీ డే ప్రత్యేకంగా పిల్లలు ఈరోజున బార్బీ డాల్ ను బహుమతిగా ఇవ్వొచ్చు. పిల్లలకు బార్బీ డాల్ చరిత్రను వివరించి చెప్పవచ్చు. కేవలం ఒక బొమ్మగా పరిచయమైన బార్బీ ప్రపంచానికి ఎంత స్పెషలో తెలియజెప్పి  వినూత్న ఆలోచనలు, సృజనాత్మకత ప్రపంచాన్ని కొత్తగా ఎలా మారుస్తాయో ఉదాహరణగా బార్బీని వారికి పరిచయం చెయ్యవచ్చు.


                         *నిశ్శబ్ద.