ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చంద్రబాబు కృతజ్ఞతలు
posted on Jun 5, 2024 @ 11:26AM
ఈ ఎన్నికలలో తెలుగుదేశం కూటమికి అఖండ విజయం అందించినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మనస్పూర్తిగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. మీడియాకి కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఉండవల్లిలోని తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఈ ఐదేళ్ళ జగన్ తరహా ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని ఆయన అన్నారు. ‘‘జగన్ ప్రభుత్వ పాలనలో ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ ఎలా ఇబ్బందిపడ్డాయో చూశాం. ఎక్కడైనా గెలవాల్సింది రాజకీయ నాయకులు కాదు.. ప్రజలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అత్యున్నతంగా నిలబడలన్నదే నా ధ్యేయం. భావితరాల భవిష్యత్తు కోసం ముందుకు వెళ్ళాం. రాజకీయాల్లో ఎవరూ శాశ్వతం కాదు.. దేశం, ప్రజాస్వామ్య పార్టీలు శాశ్వతం. పార్టీలు కూడా సక్రమంగా పనిచేస్తేనే ప్రజలు ఆదరిస్తారు. ఇంత చారిత్రాత్మకమైన ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు. అమెరికాలో వుండే వ్యక్తుల కూడా వచ్చి ఎన్నికల కోసం పనిచేశారు. పక్క రాష్ట్రాలకు కూలీ పనులకు వెళ్ళిన వ్యక్తులు కూడా వచ్చి ఓటు వేశారు. తెలుగుదేశం పార్టీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఎన్నికలు ఇవి. ఎన్టీఆర్ పార్టీని స్థాపించినప్పుడు 1983లో 200 సీట్లు వచ్చాయి. ఇప్పుడు ఊహించని విధంగా ఫలితాలు వచ్చాయి. కూటమికి 55.38 శాతం ఓట్లు వచ్చాయి. 45.60 శాతం ఓట్లు టీడీపికి, 39.37 శాతం వైసీపికి వచ్చాయి’’ అని చంద్రబాబు అన్నారు.