రేపు ముద్రగడ ఇంటికి పవన్ కళ్యాణ్?
posted on Jun 5, 2024 @ 1:27PM
పవన్ కళ్యాణ్ గెలుపుతో ముద్రగడ పద్మనాభం కాపు నాయకుడి హోదా కోల్పోయి, తన పేరును ‘ముద్రగడ పద్మనాభరెడ్డి’గా మార్చుకోవడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ప్రభుత్వ గెజిట్‌లో తన పేరు మార్చుకోవడానికి అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకున్నారు. వాటిని పూర్తి చేసి, పేరు మార్పు కోసం దరఖాస్తు చేయనున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో రేపు అంటే గురువారం నాడు ముద్రగడ పద్మనాభం ఇంటికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వెళ్ళనున్నట్టు తెలుస్తోంది.
కొన్నికొన్ని పొరపాట్లు చేసినప్పటికీ, ముద్రగడ కాపు నాయకుడిగా ఎప్పటినుంచో పోరాటం చేస్తూ వున్నారు. వైసీపీ ప్రభావంలో పడిన ఆయన ఆవేశంగా చేసిన పేరు మార్పు ప్రతిజ్ఞను పట్టించుకోవాల్సిన అవసరం లేదని, కాపు నాయకుడిగా ముద్రగడని తాను ఎప్పుడూ గౌరవిస్తానని చెప్పడం కోసం పవన్ కళ్యాణ్ ముద్రగడ ఇంటికి వెళ్తున్నట్టు సమాచారం.
పవన్ కళ్యాణ్‌ని ముద్రగడ పద్మనాభం తీవ్రంగా విమర్శిస్తున్నప్పటికీ ముడ్రగడ కుమార్తె క్రాంతి భారతి మాత్రం తండ్రి వ్యవహార శైలిని వ్యతిరేకించి, పవన్ కళ్యాణ్‌కి మద్దతును ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో కుటుంబాలను విడగొట్టడం తనకు ఇష్టం వుండదని పవన్ కళ్యాణ్ అన్నారు. అలాగే ఈసారి ఎన్నికలలో క్రాంతి భారతిని జనసేన నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా నిలబెడతానని చెప్పారు. ఈ నేపథ్యంలో ముద్రగడ పేరు మార్చుకోవడానికి సన్నాహాలు చేసుకుంటూ వుండటం పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ వయసులో ఆ పెద్ద మనిషి ప్రయత్నాలను విరమింపజేసి, ఆయన్నిశాంతపరచాలంటే తానే స్వయంగా ఆయన ఇంటికి వెళ్ళాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఈ మేరకు ముద్రగడ కుమార్తె క్రాంతి భారతికి కూడా సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది.