మోడీ మళ్ళీ వస్తారంటారా?
posted on Jun 5, 2024 @ 3:26PM
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన పదవికి రాజీనామా చేశారు. మళ్ళీ ఎనిమిదో తేదీన మళ్ళీ మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఇప్పటి వరకు అయితే మళ్ళీ మోడీ అనే అంటున్నారు. అయితే, ఈలోపు ఏమైనా జరగొచ్చు.
2014 ఎన్నికల్లో గెలిచినప్పుడు మోడీ వేవ్ అన్నారు. 2019 ఎన్నికల సమయంలో మోడీ మ్యాజిక్ అన్నారు. 2024 ఎన్నికల సందర్భంగా మోడీ వేవ్ గానీ, మోడీ మ్యాజిక్ గానీ కనిపించలేదు. గత రెండు ఎన్నికలలో మిత్రపక్షాలతో కలసి ఎన్నికలలో పోటీ చేసిన బీజేపీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బలం సొంతగానే వచ్చింది. ఈ ఎన్నికలలో ఎన్డీయేకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే శక్తి మిత్రపక్షాల సహకారంతోనే వచ్చింది.
మూడోసారి కూడా మోడీనే ప్రధానమంత్రి అవుతారని ప్రస్తుతానికి అయితే ప్రచారం జరుగుతోంది. బయట ఎవరికీ ఎలాంటి సందేహమూ
లేదు. అయితే రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు. మోడీ ప్రమాణ స్వీకారానికి ఇంకా మూడు రోజుల టైమ్ వుంది. ఈ మూడు రోజుల్లో ఏమైనా జరగొచ్చు. బీజేపీలోనే ఒక వర్గం బయల్దేరి మోడీ ప్రభ తగ్గిపోయింది కాబట్టి, ప్రధాన పదవిని వదులుకోవడం బెస్ట్ అని వాదన లేవదీయొచ్చు.. గడ్కరి లాంటి టక్కరిని ముందు నిలిపి ఇంటర్నల్ రాజకీయం నడపొచ్చు.
ప్రభుత్వాల ఏర్పాటు విషయంలో టక్కుటమారాలు నడిపిన కాంగ్రెస్ పార్టీ మరో్సారి రంగంలో దిగవచ్చు. బీజేపీ ప్రభుత్వం మళ్ళీ ఏర్పడాలంటే తప్పనిసరిగా మద్దతు ఇచ్చి తీరాల్సిన చంద్రబాబు, నితీష్ కుమార్‌లకు ఏదైనా ‘ప్రధాన’ ఆఫర్ ఇచ్చి, తన మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసేలా ప్రోత్సహించవచ్చు... ఎన్డీయే మిత్రపక్షాలను కూడా ఇండియా కూటమి వైపు లాక్కోవచ్చు. అప్పుడు రాజకీయ పరిస్థితే మారిపోవచ్చు.. ఏ క్షణంలో ఏమైనా జరగొచ్చు.. ఏం జరిగినా గమనించడమే మన పని!