సజ్జల డైరెక్షన్ లో ఫోన్ ట్యాపింగ్ : డొక్కా
posted on Jun 5, 2024 @ 2:28PM
ఫోన్ ట్యాపింగ్ కారణంగానే బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో సున్నాకు పడిపోయింది. బిఆర్ఎస్ పార్టీ మనుగడ ప్రశ్నార్థకం చేసిన ఫోన్ ట్యాపింగ్ ఒక్క తెలంగాణకే పరిమితం కాలేదు. కెసీఆర్ అంటకాగిన జగన్ ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిందన్న ఆరోపణలు లేటెస్ట్ గా వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని ఉమ్మడి ఆంధ్ర ప్రధేశ్ రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ కేబినెట్ లో మంత్రి పదవులు నిర్వభించిన మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత డొక్కా మాణిక్యవరప్రసాద్ సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ మాదిరి ఏపీలోనూ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆయన ఆరోపించారు. వైసీపీ నేత సజ్జల ఆధ్వర్యంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నారు. "సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ప్రముఖ నేతల ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ప్రజాప్రతినిధుల ఫోన్లు, వారి వ్యక్తిగత సంభాషణలు రికార్డు చేశారు. ఫోన్ ట్యాపింగ్ ఆధారంగానే వైసీపీ సర్కార్ బెదిరింపులకు పాల్పడింది. దీనిపై వెంటనే విచారణ జరపాలి" అని డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్‌లో డొక్కా మాణిక్య వరప్రసాద్ మంత్రిగా పనిచేశారు. ఆయన హఠాన్మరణం అనంతరం కే రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో కొనసాగారు. రాష్ట్ర విభజన అనంతరం తొలి రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. 2014 సార్వత్రిక ఎన్నికల అనంతరం ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. శాసన మండలికి ఎన్నికయ్యారు. 2019లో ఎన్నికల్లో ఆయన గుంటూరు జిల్లాలోని ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి, ఓడిపోయారు. నిజానికి- డొక్కా సొంత నియోజకవర్గం తాడికొండ.