రామోజీరావు మృతి పట్ల చంద్రబాబు దిగ్భ్రాంతి

ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌  రామోజీరావు(88)  కన్ను మూశారు. అనారోగ్య సమస్యలతో హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో  చికిత్స పొందుతూ   శనివారం (జూన్ 8) తెల్లవారుజామున 4.50 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఫిల్మ్‌సిటీలోని   నివాసానికి ఆయన పార్థివదేహాన్ని తరలించారు. 1936 నవంబర్‌ 16న కృష్ణా జిల్లా పెదపారుపూడిలో  జన్మించిన రామోజీరావు  1974 ఆగస్టు 10న విశాఖ సాగర తీరంలో ‘ఈనాడు’ దినపత్రికను ప్రారంభించారు. అనతి కాలంలోనే ఈనాడు తెలుగువారి గుండె చప్పుడుగా మారిపోయింది.   అద్భుతమైన రామోజీ ఫిల్మ్ సిటీ  సృష్టికర్త రామోజీరావు.  రామోజీరావు మృతి పట్ల తెలుగుదుశం అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  రామోజీరావు మరణం తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందన్నారు. రామోజీ తెలుగు రాష్ట్రాలకు, దేశానికి అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. రామోజీ మృతి తీరని లోటుగా పేర్కొన్న చంద్రబాబు సమాజహితం కోసం నిలబడిన మహోన్నత వ్యక్తి రామోజీరావు అని పేర్కొన్నారు.   రామోజీరావు మృతి పట్ల మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి దేశానికి తీరని లోటని పేర్కొన్న ఆయన రామోజీ అంటే క్రమశిక్షణ, సమయపాలన, నిబద్ధతకు మారుపేరని పేర్కొన్నారు. తెలుగు భాష, సంస్కృతులకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.  

రామోజీరావు అస్తమయం!

ఈనాడు గ్రూస్ సంస్థల ఛైర్మన్ చెరుకూరి రామోజీరావు (88) అస్తమించారు. ఈనెల 5వ తేదీన ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడంతో హైదరాబాద్‌లోని ఒక ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ ఆయన శనివారం తెల్లవారుఝామున 4 గంటల 50 నిమిషాలకు కన్నుమూశారు. రామోజీ ఫిలింసిటీలోని ఆయన నివాసానికి రామోజీరావు పార్థివ దేహాన్ని తరలించారు. రామోజీరావు మృతికి ‘తెలుగువన్’ సంతాపం తెలియజేస్తోంది.  1936 నవంబర్ 16వ తేదీన కృష్ణాజిల్లాలోని పెదపారుపూడిలో చెరుకూరి వెంకట సుబ్బారావు, సుబ్బమ్మ దంపతులకు రామోజీరావు జన్మించారు. తెలుగునాట ఒక చరిత్రగా నిలిచారు. ఈనాడు లాంటి మహా మీడియా సామ్రాజ్యాన్ని నిర్మించారు. అద్భుతమైన చిత్రాలను నిర్మించారు. రామోజీ ఫిలింసిటీ లాంటి ప్రపంచ అద్భుతాన్ని నిర్మించారు. ఎన్నో లక్షల మందికి ఉపాధి కల్పించారు.

ఈనెల 19 నుంచి జగన్ కేసుల విచారణ!

ఈనెల 19 నుంచి జగన్మోహన్ రెడ్డికి బ్యాండ్ బాజా బారాత్ మొదలు కానుంది. జగన్ మీద వున్న కేసుల విచారణ ఆరోజు నుంచి సీబీఐ కోర్టు ప్రారంభించనుంది. ఇంతకాలం ముఖ్యమంత్రి హోదాలో వున్నాకాబట్టి, ప్రజాసేవలో తలమునకలైపోయి వుంటా కాబట్టి సీబీఐ విచారణకు హాజరు కాలేనంటూ జగన్ తప్పించుకుని తిరిగారు. ఇప్పుడు జగన్ మామూలు ఎమ్మెల్యే కాబట్టి, ఆయను విచారణకు హాజరయ్యేలా ఆదేశించాలని కోరుతూ సీబీఐ కోర్టులో సీబీఐ అధికారులు పిటిషన్ దాఖలు చేసే అవకాశం వుంది. మొత్తమ్మీద మేటర్ ఏంటంటే, జగన్ క్రమంగా చట్టం, న్యాయం చేతుల్లోకి ప్రవేశించబోతున్నారు. జగన్ జీవితంలో రాబోయే రోజులు ఎలా వుండబోతున్నాయో చెప్పడం కంటే, చూడడం బెటర్.

‘గెటౌట్’ అంటే గానీ బయటకి పోరా?

ఐదేళ్ళు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ ప్రభుత్వం పాతాళంలోకి పడిపోయింది. తమను నామినేట్ చేసిన ప్రభుత్వం పడిపోగానే తమ పదవులకు రాజీనామా చేయాలని కూడా తెలియని తోలుమందం బ్యాచ్ ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లుగా, డైరెక్టర్లుగా, సభ్యులుగా వున్నారు. కొర్పొరేషన్లకు నామినేట్ అయిన వాళ్ళెవరూ జగన్ ప్రభుత్వం ఖతమ్ అయిపోయిన తర్వాత తమ పదవులకు రాజీనామాలు చేయకుండా సీట్లకి ఫెవీకాల్ రాసుకుని కూర్చునే వున్నారు. కొంతమంది అంతే, తన్ని తరిమితేగాని బయటకి వెళ్ళరు. అలాంటి వాళ్ళ కోసం చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ గెటవుట్ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లకు వున్న నామినేటెడ్ ఛైర్మన్లు, డైరెక్టర్లు, సభ్యులు వెంటనే రాజీనామాలు చేయాలని ఆదేశించారు. తమకు వచ్చిన రాజీనామాలను వెంటనే ఆమోదించాలని సంబంధిత అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. 

దయనీయంగా వల్లభనేని వంశీ పరిస్థితి!

గతంలో ఇష్టం వచ్చినట్టు వాగిన వల్లభనేని వంశీ ఇంటి దగ్గరకి శుక్రవారం నాడు తెలుగుదేశం కార్యకర్తలు వెళ్ళారు. వంశీ బయటకి రావాలని, గతంలో మాట్లాడినట్టు ఇప్పుడు సవాళ్ళు విసరాలని డిమాండ్ చేశారు. అయితే వల్లభనేని వంశీ కుటుంబం ఇంట్లో లేరు. తెలుగుదేశం కార్యకర్తలు ఆయన ఇంట్లోనే వున్నారనుకుని గొడవ చేశారు. పోలీసులు వచ్చి వాళ్ళని అక్కడ నుంచి పంపేశారు. నిజానికి కౌంటింగ్ జరుగుతున్న సమయంలోనే వల్లభనేని వంశీ కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకి వచ్చేశారు. ఎన్నికల ఫలితాలు ప్రకటించకముందే ఆయన కుటుంబంతో కలసి గన్నవరాన్ని విడిచిపెట్టేసి హైదరాబాద్‌కి వెళ్ళిపోయారు.  అధికార మదంతో అప్పట్లో నోటికొచ్చినట్టు వాగారు కానీ, ప్రస్తుతం వల్లభనేని వంశీ పరిస్థితి చాలా దయనీయంగా వున్నట్టు తెలుస్తోంది. గన్నవరం వైసీపీ ఎమ్మెల్యేగా అవినీతి, అక్రమాలతో కోట్లు కోట్లు సంపాదించుకున్నారుగానీ, ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది. మనశ్శాంతి అనేదే లేకుండా పోయింది. చేసిన తప్పు, వాగిన వాగుడు మానసికంగా వేధిస్తూ వుండటంతో అది ఆరోగ్యం మీద ప్రభావం చూపించి మనిషి పూర్తిగా నిస్సత్తువగా అయిపోయారు. ఎన్నికల ప్రచారంలోనే రొప్పుతూ కనిపించారు. నామినేషన్ వేసిన సమయంలో అయితే పూర్తి నిస్సత్తువగా మారిపోయి ఒక బెంచీ మీద కూర్చుండిపోయారు. ఇప్పుడు గన్నవరంలో ఓడిపోవడంతో ఆయన ఆరోగ్యం మరింత ఇబ్బందికరంగా మారినట్టు తెలుస్తోంది. వల్లభనేని వంశీ అయితే ఢక్కామొక్కీలు తిన్నవాడు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితిని కొంతవరకైనా తట్టుకోగలుగుతున్నారుగానీ, ఆయన కుటుంబం అయితే ఈ పరిస్థితిని తట్టుకోలేకపోతున్నట్టు తెలుస్తోంది. నిన్నటి వరకు గన్నవరంలో గౌరవంగా బతికి, ఇప్పుడు సొంత ఊరిని, ఇంటిని వదిలేసి హైదరాబాద్‌లో వుండాల్సి రావడం, వంశీ ఆరోగ్యం బాగాలేకపోవడం, తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటూ వుండటం చూసి వాళ్ళు బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ఏదైనా చేసి చంద్రబాబు, భువనేశ్వరి కాళ్ళ మీద పడి అయినా ఇప్పుడున్న పరిస్థితిని మార్చుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, తనకు ఆ అవకాశం లేదని వంశీ కుటుంబ సభ్యులకు చెబుతున్నట్టు సమాచారం. 

చావుతప్పి కన్ను లొట్టబోయిన చందంగా పెద్దిరెడ్డి గెలుపు

ఉట్టికెగురలేనమ్మ స్వర్గానికి ఎగిరిట్లుగా ఉంది మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిస్థితి. తన సొంత నియోజకవర్గంలో విజయం కోసం చెమటోడ్చిన పెద్ది రెడ్డి కుప్పంలో చంద్రబాబును ఓడిస్తానంటూ చేసిన సవాళ్లను ప్రస్తావిస్తూ నెటిజన్లు ఓ రేంజ్ లో ఆటాడుకుంటున్నారు, వాస్తవానికి వైసీపీలో పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి కీలక నేత అనడంలో సందేహం లేదు. ఈ సారి ఎన్ఆనికలలో వైసీపీ నుంచి గెలిచిన 11 మందిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒకరు. 2019 ఎన్నికలలో వైసీపీ పార్టీ చిత్తూరు జిల్లాలో కుప్పం వినా మిగిలిన అన్ని అసెంబ్లీ స్థానాలలోనూ విజయం సాధించడం వెనుక ఉన్నది పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డే. ఆ ఎన్నికలలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు తన కుప్పం నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. చిత్తూరు జిల్లాలోని 14 నియోజవర్గాలకు గానూ 13 స్థానాలలో వైసీపీ విజయం సాధించడంతో చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి జగన్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. దీంతో స్థాయికి మించిన సవాళ్లు చేశారు పెద్ది రెడ్డి. 2024 ఎన్నికలలో కుప్పం నుంచి చంద్రబాబును ఒడిస్తానని శపథం చేశారు.   సరే 2024 ఎన్నికలు పూర్తయ్యాయి. ఫలితాలు వెలువడ్డాయి. కుప్పం నుంచి నారా చంద్రబాబును ఓడిస్తానంటూ సవాళ్లు, శపథాలు చేసిన పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి తన సొంత నియోజకవర్గం అయిన పుంగనూరు నుంచి చావు తప్పి కన్ను లొట్టబోయిన చందంగా విజయం సాధించారు. కుప్పంలో చంద్రబాబు గత ఎన్నికలలో వచ్చిన మెజారిటీ కంటే దాదాపు 18 వేల ఓట్ల పై చిలుకు మెజారిటీ సాధించారు. ఆయనకు 48వేల ఆరు ఓట్ల మెజారిటీ వచ్చింది. అదు పుంగనూరులో పెద్దరెడ్డి విజయం సాధించినా ఆయన మెజారిటీ  కేవలం 6 వేల 619 ఓట్లు మాత్రమే.  ఇక పెద్దిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి రాజంపేట లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 76071 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. రాజంపేట నియోజకవర్గంలో కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా బీజేపీ తరఫున మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేశారు. అదే  మిథున్ రెడ్డి విజయానికి కారణమైంది. రాజంపేట నుంచి తెలుగుదేశం అభ్యర్థి నిలబడి ఉంటే మిథున్ రెడ్డి కచ్చితంగా పరాజయం పాలయ్యే వారు. పోలింగ్ సరళిని బట్టి చూస్తే రాజంపేటలో పెద్ద ఎత్తున క్రాస్ ఓటింగ్ జరిగినట్లు స్పష్టమైతుంది. రాజంపేట లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ స్థానాలలో ప్రజలు తెలుగుదేశం కూటమికి ఓట్లు వేసి లోక్ సభ కు వచ్చే సరికి మిథున్ రెడ్డికి ఓటేశారు. మొత్తం మీద చంద్రబాబును ఓడిస్తానంటూ ఎగిరెగిరి పడిన పెద్దరెడ్డికి చావుతప్పి కన్నులొట్టబోయిన చందంగా పుంగనూరు నుంచి గట్టెక్కారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

శవాల మీద మరమరాలు ఏరుకోబోతున్న జగన్?

ఓరి నీ జగన్ పార్టీ వాళ్ళ ఏశాలో.. మళ్ళీ మొదలెట్టేశారా? ఈ రాబందు పార్టీ వాళ్ళు మళ్ళీ మొదలెట్టేశారు. జలగన్న చేత మరోసారి ఓదార్పు యాత్ర చేయించడానికి ప్లాన్ చేసేస్తున్నారు. ఆ మహామేత చనిపోయిన సందర్భంగా గుండె ఆగిపోయిన వాళ్ళ కుటుంబాలని జలగన్న ‘ఓదార్పు యాత్ర’ పేరుతో పరామర్శించిన విషయం తెలిసిందే. అలాంటి ఓదార్పు యాత్ర మరోసారి నిర్వహించడానికి గ్రౌండ్ ప్రిపరేషన్ జరుగుతోంది. జగన్ అధికారం కోల్పోయేసరికి రాష్ట్రవ్యాప్తంగా చాలామంది గుండెలు వరసబెట్టి ఆగిపోయి చనిపోతున్నారట. జగన్ ఓడిపోయినట్టు ఫలితాలు వచ్చినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజూ లేత గుండెలు టపా టపా ఆగిపోయి టపా కట్టేస్తున్నారట. ఈ మేరకు భక్షి పేపర్లో డెడ్ బాడీల ఫొటోలతో సహా రోజూ న్యూస్‌లు కనిపిస్తున్నాయి. సాధారణంగా రాబందులు ఎక్కడెక్కడ శవాలు దొరుకుతాయా అని వెతుక్కుంటూ వుంటాయి. మన జగన్ పార్టీ వాళ్ళు డిట్టో రాబందుల్లాంటి వాళ్ళే. వాళ్ళు కూడా ప్రస్తుతం శవాల కోసం వెతుక్కుంటున్నారు. ఆంద్రప్రదేశ్‌లో ఎవరు చనిపోయినా, అక్కడ రాబందుల్లా వాలిపోతున్నారు. మీ శవాన్ని మేం వాడుకుంటాం.. అంత్యక్రియల ఖర్చు మొత్తం మేమే భరిస్తాం. కొంత అమౌంట్ కూడా ఇస్తాం. జగనన్న ఓడిపోయినందువల్లే గుండె ఆగి చనిపోయాడని అందరికీ చెప్పండి అని ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఓ పాతిక శవాల వరకు సంపాదించిన జగన్ పార్టీ వర్గాలు.. ఆ శవాల లిస్టు వందో, రెండొందలో అయ్యాక తమ నాయకుడిని రంగంలోకి దింపే ఆలోచనలో వున్నట్టు తెలుస్తోంది. అప్పుడు జగన్ ‘ఓదార్పు యాత్ర-2’ పేరుతో మరోసారి శవాల మీద మరమరాలు ఏరుకునే కార్యక్రమాన్ని మొదలుపెడతారని తెలుస్తోంది.

కవితకు జ్యుడిషియల్ రిమాండ్ పొడగింపు...చదువుకోవడానికి పుస్తకాలు కావాలని కోర్టుకు వినతి 

ఢిల్లీ మద్యం స్కాంలో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఇప్పట్లో బెయిల్ దొరికే అవకాశాలు కనిపించడం లేదు. కవిత  బెయిల్ కోసం దరఖాస్తు చేసి ఇన్ని రోజులైనప్పటికీ కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేయడవం లేదు. దీంతో బెయిల్ రాదని డిసైడ్ అయిపోయిన కవిత కాలక్షేపానికి పుస్తకాలు కావాలని కోర్టుకు మొదపెట్టుకుంది. కవిత వినతికి కోర్టు కూడా సానుకూలంగీసుకుంది.   కవిత జ్యుడీషియల్ రిమాండ్‌ను రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు పొడిగించింది. సీబీఐ కేసులో రిమాండ్‌ను ఈ నెల 21వ తేదీ వరకు పొడిగించింది. జైల్లో చదువుకోవడానికి తనకు పుస్తకాలు కావాలని కవిత కోర్టును కోరింది. కవిత విజ్ఞప్తికి కోర్టు ఆమోదం తెలిపింది. కవితకు జైల్లో ఎనిమిది పుస్తకాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. అంతకుముందు, మద్యం పాలసీ కేసులో కవిత పాత్రపై సీబీఐ సప్లిమెంటరీ ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది.

సిట్ కార్యాలయం నుంచి కీలక ఫైళ్లు గల్లంతు?

సిట్ కార్యాలయం నుంచి కీలక ఫైళ్లు గల్లంతు అయ్యాయా అంటే ఔననే సమాధానం వస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెలువడడానికి ముందే.. అంటే ఎగ్జిట్ పోల్స్ వచ్చిన వెంటనే ఎందుకైనా మంచిదని అధికారులు కీలక ఫైళ్లను మాయం చేసినట్లు  సమాచారం. స్కిల్ కేసుతో సంబంధమున్న  కేసుల్లో ఫైళ్లు మాయం చేశారని పోలీసులకు ఫిర్యాదు అందింది.   రాజధాని, ఇసుక, మద్యం, స్కిల్ కేసుల ఫైళ్లలోని కొన్ని పేపర్లు మాయం చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరికొన్ని పత్రాలు తీసుకువెళ్లేందుకు ప్రయత్నం చేశారు. సమాచారాన్ని  కొంతమంది పోలీస్ అధికారులే తెలుగుదేశం కీలక నేతలకు చేరవేశారు.  దీంతో వెంటనే సిట్ కార్యాలయానికి తాళం వేసి ఉన్నతాధికారులు పోలీస్ కాపలా పెట్టారు. సిట్‌తో పాటు ఇతర బాధ్యతల నుంచి వెంటనే కొల్లి రఘురామిరెడ్డిని ఉన్నతాధికారులు తప్పించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలోనే స్కిల్ కేస్‌లో హెరిటేజ్ పత్రాలను సిట్ అధికారులు తగులబెట్టిన సంగతి తెలిసిందే.   ఇలా ఉండగా ఏపీ ఫైబర్‌నెట్ కార్యాలయంలో  ఫైల్స్ గల్లంతు అని గురువారం (జూన్ 6) పెద్ద ఎత్తున వార్తలు వినవచ్చాయి. వెంటనే పోలీసులు ఫైబర్ నెట్ కార్యాలయానికి చేరుకుని తనిఖీలు నిర్వహించారు. ఫైళ్లేమీ మాయం కాలేదని నిర్ధారించారు.  ఇప్పటికే పలు కీలక కార్యాలయాల్లో ఈ ఆఫీస్ లాగిన్ ఐడీలను పోలీసులు డిజేబుల్ చేశారు. తాజాగా సీట్ ఆఫీసులో ఫైళ్ల గల్లంతు వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. అన్నిటికీ మించి ఫైళ్ల గల్లంతు సమాచారం పోలీసుల నుంచే రావడంతో సమగ్ర దర్యాప్తు చేసి నిజాలను నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. 

చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రజనీకాంత్?

ఈనెల 12న జరగబోయే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ఒక స్పెషల్ గెస్ట్ రాబోతున్నట్టు తెలుస్తోంది. ఆయన మరెవరో కాదు... ‘సూపర్‌స్టార్’ రజనీకాంత్. రజనీకాంత్‌కి చంద్రబాబు నాయుడు అంతే ఎంతో అభిమానం. ఎన్టీఆర్ అంటే ఎంతో గౌరవం. చంద్రబాబు నాయుడుకు వున్న చాలా తక్కువమంది మనసుకు దగ్గరైన మిత్రులలో రజనీకాంత్ ఒకరు. ప్రతి ఏడాది రజనీకాంత్ పుట్టినరోజుకు చంద్రబాబు తప్పనిసరిగా ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవం విజయవాడలో జరిగినప్పుడు రజనీకాంత్ ముఖ్య అతిథిగా హాజరై చంద్రబాబుతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న విషయం తెలిసింది. చంద్రబాబు నాయుడు మళ్ళీ అధికారంలోకి రావాలన్న ఆకాంక్షను ఆ సందర్భంలో రజనీకాంత్ వ్యక్తం చేశారు. అప్పుడు జగన్ కేబినెట్‌లో వున్న ఏపీ మంత్రులు రోజా, అంబటి రాంబాబు, కొడాలి నాని తదితరులు గ్రామసింహాల్లాగా రజనీకాంత్ మీద విరుచుకుపడి ఇష్టమొచ్చినట్టు మాట్లాడారు. పాపం రజనీకాంత్ జగన్ గురించి ఎక్కడా ప్రస్తావించకపోయినా ఈ మూకలు ఆయన్ని తిట్టిపోశాయి. వీళ్ళందరికీ ఆయన ఆ తర్వాత ఒక కార్యక్రమంలో ఇన్‌డైరెక్ట్.గా పంచ్‌లు ఇచ్చారు. ఇదంతా అలా వుంచితే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడం రజనీకాంత్‌కి ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్న అంశం. దాంతో ఆయన చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు అవుతారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తెలుగుదేశం నాయకులు అందరూ రజనీకాంత్ తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కో్రుకుంటున్నారు. అభిజ్ఞవర్గాల కథనం ప్రకారం, రజనీకాంత్ చంద్రబాబు ప్రమాణ స్వీకార మహోత్సవానికి వస్తారని తెలుస్తోంది.

ఆధిక్యంలో తీన్మార్ మల్లన్న...బిఆర్ఎస్ కు మరో షాక్

  నల్గొండ-వరంగల్-ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్‌లో బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఎలిమినేషన్ అయ్యారు. ఇప్పటి వరకు 42 మంది అభ్యర్థులు ఎలిమినేషన్ అయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డి మధ్య పోటీ నెలకొంది. ప్రేమేందర్ రెడ్డి ఎలిమినేషన్ తర్వాత తీన్మార్ మల్లన్నకు 1,23,709 ఓట్లు రాగా, రాకేశ్ రెడ్డికి 1,04,846 ఓట్లు వచ్చాయి. తీన్మార్ మల్లన్న 19వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.బిజెపి అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి ఎలిమినేట్ అయ్యారు. గెలిచే అవకాశాలు తీన్మార్ మల్లన్నకు పుష్కలంగా ఉన్నాయి. 

ఎన్డీయేలోకి మరిన్ని చేరికలు.. సమాజ్ వాదీ పార్టీలో భారీ చీలిక!

ఎన్నికల ఫలితాలు వచ్చి నాలుగు రోజులు పూర్తయ్యిందో లేదో అప్పుడే ఇండియా కూటమి భాగస్వామ్యపక్షాలలో చీలికలు, జంపింగులు ఆరంభమయ్యాయి. ఎన్డీయే కూటమి బొటాబొటీ మెజారిటీతో గట్టెక్కిన నేపథ్యంలో కూటమి భాగస్వామ్య పక్షాల మద్దతుపైనే పూర్తిగా ఆధారపడే పరిస్థితి ఏర్పడిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజా పరిణామాలతో బీజేపీ కంపర్ట్ బుల్ పొజిషన్ లోకి వెడుతున్నట్లుగా భావించాల్సి ఉంటుంది. శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గం ఎన్డీయేలో చేరికకు చర్చలు ప్రారంభించింది. ఇప్పటికే ఉద్ధవ్ థాక్రే ఢిల్లీ చేరుకుని మోడీ, అమిత్ షాలతో భేటీ అయ్యారు. ఉద్ధవ్ థాక్రే వర్గం శివసేన 9 ఎంపీ స్థానాలలో విజయం సాధించింది. మరో వైపు ఉత్తర ప్రదేశ్ లో బీజేపీ ఆధిపత్యానికి గండి కొట్టిన సమాజ్ వాదీ పార్టీలో భారీ చీలికకు తెరలేచింది. ఆ పార్టీకి చెందిన 18 మంది ఎంపీలు ఎన్డీయేకు మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. వీరు ఈ మేరకు బీజేపీ అగ్రనాయకత్వంతో చర్చలు జరుపుతున్నారు.  విశేషమేమిటంటే అయోధ్య నుంచి సమాజ్ వాదీ పార్టీ తరఫున విజయం సాధించిన ఎంపీ కూడా ఎన్డీయేకే మద్దతు పలుకుతున్న వారిలో ఉన్నారు. మొత్తం మీద బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు పూర్తిగా ఒకటి రెండు పార్టీల మీద ఆధారపడే పరిస్థితి లేకుండా ఉండేందుకు  ఈ పరిణామాలు దోహదం చేస్తాయి. 

వైసీపీకి మాజీ మంత్రి రావెల్ కిషోర్ రాజీనామా

సార్వత్రిక ఎన్నికల ముందు వివిధ పార్టీల నుంచి వైసీపీ లీడర్లు పెద్ద సంఖ్యలో చేరారు. ఎన్నికల ఫలితాల తర్వాత టిడిపి క్లీన్ స్వీప్ చేయడంతో  తెలుగు దేశంలో చేరే వారి సంఖ్య ఎక్కువవుతుంది.  మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు వైసీపీకి గుడ్‌బై చెప్పారు. తన‌ రాజీనామా లేఖ‌ను ఆ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌కు పంపించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న టీడీపీ అధినేత చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు. తాను డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఆశయాలకు కట్టుబడి పనిచేశాన‌ని.. 2014లో త‌న‌కు చంద్రబాబు రాజకీయంగా అవకాశం ఇచ్చి ప్రోత్సహించారని గుర్తు చేసుకున్నారు. 2014లో ఏపీలో తొలి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసేందుకు అవకాశం కల్పించిన టీడీపీ బాస్‌కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.  మరోవైపు మంద కృష్ణమాదిగ 40 ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్నారని, ఇప్పుడు ఆ అంశం ముగింపున‌కు వచ్చిందని భావిస్తున్నాన‌ని రావెల అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, చంద్రబాబు ఇద్దరూ వర్గీకరణకు మద్దతు తెలిపారని, అందుకే వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాన‌ని స్పష్టం చేశారు. సామాజిక సేవ చేస్తూనే.. వర్గీకరణ అంశం కోసం త‌న వంతు ప్ర‌య‌త్నం చేస్తాన‌న్నారు. దానికి అనుకూలంగా ఉన్న పార్టీలో చేరే విషయాన్ని ఆలోచిస్తానని తెలిపారు. ఇదిలాఉంటే.. 2014 ఎన్నికల్లో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన రావెల కిశోర్‌బాబు.. చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. అయితే 2019 ఎన్నికల ముందు జనసేనలో చేరి ఆ పార్టీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కొన్ని రోజులకే ఆయన బీజేపీలో చేరారు. ఆ తర్వాత ఆ పార్టీకి కూడా రాజీనామా చేసిన ఆయన.. కేసీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. కొంత కాలం తర్వాత బీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పి.. వైసీపీలో చేరారు. ఇప్పుడు ఆ పార్టీకి కూడా రావెల కిషోర్‌బాబు రాజీనామా చేశారు.

బూమ్ బూమ్ బీరు బాబాయ్ ఇంట్లో సోదాలు!

ఆంధ్రప్రదేశ్ మందుబాబుల గొంతుల్లో దాదాపు విషం లాంటి ‘బూమ్ బూమ్ బీరు’ పోసి వేలాది మంది చనిపోవడానికి కారణమైన ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ వాసుదేవరెడ్డి నివాసంలో సీఐడీ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడాలోని ఆయన నివాసంలో శుక్రవారం ఉదయం నుంచి వివిధ పత్రాలను సీఐడీ పోలీసులు తనిఖీ చేస్తున్నారు. జగన్ దుర్మార్గ పాలనలో మద్యం దోపిడీ పర్వం వాసుదేవరెడ్డి ఆధ్వర్యంలోనే జరిగిందనే ఆరోపణలు వున్నాయి. వైసీపీ హయాంలో ఈయన హవా నడిపించారు. నూతన మద్య విధానం పేరుతో వైసీపీకి లాభం చేకూరే విధంగా భారీ స్థాయిలో ‘బూమ్ బూమ్’ లాంటి మద్యాన్ని సరఫరా చేశారని వాసుదేవరెడ్డి మీద ఫిర్యాదులు వున్నాయి. ఏపీ మద్యం దుకాణాల్లో జే బ్రాండ్ మద్యం అమ్మకాలు జరపడంలో వాసుదేవరెడ్డి కీలక వ్యక్తి.

ఎన్డీయే ఎంపీల భేటీలో స్పీచ్ అదరగొట్టిన చంద్రబాబు!

శుక్రవారం నాడు ఢిల్లీలో జరిగిన ఎన్డీయే ఎంపీల భేటీలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు ‘‘ఎన్డీయేని అధికారంలోకి తీసుకురావడానికి ప్రధాని మోడీ రాత్రింబవళ్ళు కష్టపడ్డారు. భారతదేశానికి సరైన సమయంలో సరైన నాయకత్వం మోడీ రూపంలో  వచ్చింది. ఎన్నికల ప్రచారంలో మోడీ చాలా శ్రమించారు. ఏపీలో కూడా మూడు బహిరంగసభలు, ర్యాలీలు చేశారు. ఏపీలో ఎన్డీయే 90 శాతం స్థానాలు గెలిచింది. విజనరీ వున్న నాయకుడు మోడీ కారణంగా భారతదేశం అభివృద్ధిలో ముందడుగు వేస్తోంది. దూరదృష్టి కలిగిన మోడీ ఆర్థిక వ్యవస్థను పరుగులు తీయించారు. భారతదేశం ప్రపంచంలోనే ఐదో ఆర్థిక వ్యవస్థగా ఎదిగేలా చేశారు. మేకిన్ ఇండియాతో ఆయన భారత్‌ని అభివృద్ధి పథంలో నడిపారు. ప్రపంచవ్యాప్తంగా దేశ ప్రతిష్టను ఇనుమడింపజేశారు. ఆయన నాయకత్వంలో దేశం పేదరిక రహిత దేశంగా మారుతుంది. 2047 నాటికి భారత్ ప్రపంచంలోనే నంబర్‌వన్‌గా నిలుస్తుంది’’ అన్నారు. ఈ సందర్భంగా మోడీని ప్రధానమంత్రిగా చంద్రబాబు ప్రతిపాదించారు.

జగన్ పై వైసీపీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రివోల్ట్

అధికారాంతమున చూడవలే అయ్యగారి సౌభాగ్యముల్ అన్నట్లుగా తయారైంది ప్రస్తుతం జగన్ పరిస్థితి. పార్టీ ఘోరపరాజయం తరువాత ఒక్కరొక్కరుగా వైసీపీ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు జగన్ నిర్వాకమే ఓటమి కారణం అంటూ నోరు విప్పుతున్నారు. ముందుగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా ముందుకు వచ్చి వైసీపీ ఈ స్థాయిలో అత్యంత ఘోరంగా  ఓటమి చెందడానికి పూర్తి కారణం జగనేనని మీడియా ముందుకు వచ్చి మరీ చెప్పారు. ఆ తరువాత గుడ్డు మంత్రి కూడా జగన్ మూడు రాజధానుల సర్కస్ కారణంగానే ఓటమి పాలయ్యామని కుండబద్దలు కొట్టారు. తాజాగా రాజానగరం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలైన జక్కంపూడి రాజా జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.   గత ఐదేళ్లుగా కనీసం సొంత పార్టీ ఎమ్మెల్యేలకు కూడా అప్పాయింట్ మెంట్ ఇవ్వకుండా జగన్ నిరంకుశంగా వ్యవహరించారనీ,  ఎన్నికలకు రెండు నెలల ముందు ఒక్క సంతకం కోసం కాగితాలు పట్టుకుని గేటు బయట ఎదురు చూసినా ఫలితం లేకపోయిందని చెప్పారు.  ఇప్పుడిక పార్టీలో కూడా పూర్తిగా పట్టు కోల్పోయిన జగన్ అప్పాయింట్ మెంట్ ఇస్తాను రండి మహప్రభో అన్నా ఆయనను కలిసేందుకు సొంత పార్టీ నేతలే ముందుకురాని పరిస్థితి ఏర్పడిందని పరిశీలకులు అంటున్నారు. ఇంత కాలం అంతర్గత సంభాషణల్లో మాత్రమే జగన్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన నేతలు ఇప్పుడు బాహాటంగా జగన్ తీరును ఎండగడుతున్నారు. అహంకారంతో, నియంతృత్వ పోకడలతో ఆయన మునిగిపోవడమే కాకుండా తమ రాజకీయ జీవితాన్ని కూడా ముంచేశారని విమర్శిస్తున్నారు. 

హైదరాబాద్ లో ఎల్లో అలర్ట్ ...ఉరుములు, మెరుపులతో భారీ వర్షం

మృగశిర కార్తె రోజు వర్షం పడటం రివాజు. నైరుతి రుతుపవనాలు వారం రోజుల ముందే  తెలంగాణ తాకాయి. వర్షాలు కూడా వారం రోజుల ముందు రావడంతో వాతావరణం చల్లబడింది. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ఉపరితల ఆవర్తనం, ఫియర్ జోన్ ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయని వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని... మరో 4 రోజుల్లో రాష్ట్రమంతా విస్తరిస్తాయని పేర్కొంది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదలడం, ఉపరితల ఆవర్తనం, షియర్ జోన్ ప్రభావంతో రెండు రోజుల పాటు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. శుక్రవారం జీహెచ్ఎంసీ పరిధితో పాటు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలో భారీ వర్ష సూచన ఉందని తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన ఈదురు గాలులతో వర్షం పడవచ్చునని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.