తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసు.. పలువురు వైసీపీ నేతల పరార్!
posted on Jul 17, 2024 9:29AM
మంగళగిరిలోని తెలుగుదేశం ప్రధాన కార్యాలయంపై వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన దాడి కేసు విషయంలో పోలీసులు స్పీడ్ పెంచారు. దీంతో నాడు అధికారం అండతో ఇష్టారీతిగా రెచ్చిపోయిన నాటి దాడి కీలక సూత్రధారులు అజ్ణాతంలోకి వెళ్లిపోయారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే పరారయ్యారు. నాడు తెలుగుదేశం కార్యాలయంపై నాడు జరిగిన దాడిలో కీలకంగా వ్యవహరించిన వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకత్వం ఇల్లూ, వాకిలీ వదిలి ఊరు దాటేశారు. వారి ఆచూకీ ఎవరికీ తెలియని విధంగా అజ్ణాతంలోకి వెళ్లిపోయారు.
ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇంత వరకూ 12 మందిని అరెస్టు చేశారు. ఈ 12 మందిలో ఆరోగ్య కారణాలతో ఒకరికి బెయిలు లభించింది. ఇప్పటి వరకూ ఈ కేసులో 72 మందిని నిందితులుగా పోలీసులు గుర్తించారు. ముందు ముందు ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కాగా ఈ కేసుకు సంబంధించి 12 మంది గుంటూరు జిల్లా కోర్టులో యాంటిసిపేటరీ బెయిలు పిటిషన్ దాఖలు చేశారు. అలాగే ఈ దాడిలో కీలక సూత్రధారులుగా ఉన్న 8 మంది హైకోర్టులో ముందస్తు బెయిలు పిటిషన్లు దాఖలు చేసుకున్నారు. ఈ బెయిలు పిటిషన్లపై ఈ నెల 23న కోర్టు తీర్పు వెలువరించనుంది.
మొత్తం మీద తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో పలువురు వైసీపీ ముఖ్యనేతలు కీలకంగా వ్యవహరించినట్లు పోలీసుల దర్యాప్తులో తెలింది. రానున్న రోజులలో ఈ కేసులో కీలక నిందితుల అరెస్టు దిశగా పోలీసులు అడుగులు వేస్తున్నారు.