ఆర్ నారాయణమూర్తి కి అస్వస్థత
posted on Jul 18, 2024 @ 11:00AM
పీపుల్ స్టార్ ఆర్.నారాయణమూర్తి బుధవారం అస్వస్థతకు గురయ్యారు. దాంతో.. ఆయన్ని వెంటనే హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గత కొంత కాలంగా ఆర్.నారాయణమూర్తి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కాగా.. నారాయణమూర్తి ఉన్నట్లుండి అస్వస్థతకు గురై.. ఆస్పత్రిలో చేరడంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థిస్తున్నారు. పలువురు సినీ ప్రముఖులు కూడా ఆర్.నారాయణమూర్తి ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు కాగా, తన గురించి అభిమానులు ఆందోళన చెందుతున్న విషయం తెలుసుకున్న ఆర్.నారాయణమూర్తి స్పందించారు.
ప్రస్తుతం నిమ్స్ లో చికిత్స పొందుతున్నానని, దేవుడి దయతో వేగంగా కోలుకుంటున్నానని తెలిపారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్నారు. అభిమానులు ఆందోళన చెందవద్దని, పూర్తిగా కోలుకున్న తర్వాత అన్ని వివరాలు వెల్లడిస్తానని ఆర్.నారాయణమూర్తి తెలిపారు.