తెలంగాణను ముంచెత్తనున్న భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక
posted on Jul 17, 2024 @ 12:15PM
తెలంగాణను భారీ వర్షాలు ముంచెత్తనున్నాయివ. వాతావరణ శాఖ ఈ మేరకు హెచ్చరిక జారీ చేసింది. బుధవారం (జులై 17) నుంచి మూడు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గురువారం (జులై 18)న భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంవలోనే పలు జిల్లాలలకు ఆరెంజ్ అలర్ట్, మరి కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కుమురంభీం ఆసిఫాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, ములుగు, ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశా లున్నాయనీ, నిజామాబాద్, సూర్యాపేట, వరంగల్, ఆదిలాబాద్, నిర్మల్, నల్గొండ, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దని ప్రజలకు సూచించింది.
ఆదిలాబాద్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెంకుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో పలు చోట్ల 11 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. వాతావరణ శాఖ హెచ్చరికతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. మరో వైపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.