గుడివాడ వైసీపీ కార్యాలయం ఖాళీ.. కొడాలి కబ్జా నుంచి శరత్ థియోటర్ కు విముక్తి
posted on Jul 17, 2024 @ 11:39AM
ఆంధ్రప్రదేశ్ లో 2019 నుంచి ఐదేళ్ల పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ పాలన అంతా అరాచకమే. అధికారం అండ చూసుకుని ముఖ్యమంత్రి జగన్ సహా ఆ పార్టీ నేతలు రాష్ట్రంలో చేయని దారుణం లేదు. అధికారం ఉన్నది దోచుకోవడానికి, దాచుకోవడానికేనన్నట్లుగా వ్యవహరించారు. అదేమని ప్రశ్నిస్తే కక్ష సాధింపులకు పాల్పడ్డారు. జగన్ పాలనలో జనం నోరెత్తాలంటేనే భయపడే పరిస్థితి కల్పించారు. ఐదేళ్ల పాటు పంటి బిగువున ఆగ్రహన్ని అదిమి పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2024 ఎన్నికలలో జగన్ ను గద్దె దింపారు. అత్యంత ఘోర పరాజయాన్ని జగన్ ప్రభుత్వానికి రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చారు. సుపరిపాలన అందిస్తారన్న నమ్మకంతో తెలుగుదేశం కూటమికి అధికారం అప్పగించారు.
చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం గత ఐదేళ్లలో జగన్ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలను బయటపెడుతోంది. అదే సమయంలో గత ప్రభుత్వంలో వైసీపీ నేతల అరాచకత్వం, అహంకారం కారణంగా నష్టపోయిన బాధితులను ఆదుకుంటోంది.
వైసీపీ నేతలు దౌర్జన్యంగా చేసిన కబ్జాల నుంచి ప్రజల ఆస్తులు, భూములకు విముక్తి కలిగించి వాటిని వాటివాటి సొంతదారులకు అప్పగిస్తోంది. రాష్ట్రం నలు చెరగులా వైసీపీ దాడులూ, దౌర్జన్యాలూ, ఆక్రమణ బాధితులు కోకొల్లలుగా ఉన్నారు. చిత్తశుద్ధి, సంకల్పం ఉంటే.. కబ్జాల ఆస్తులను విముక్తి చేసి సొంతదారులకు అప్పగించవచ్చని గుడివాడ తెలుగుదేశం ఎమ్మెల్యే వెనిగండ్ల రాము చేసి చూపించారు. ఔను గుడివాడ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని కబ్జా నుంచి గుడివాడలోని శరత్ థియోటర్ కు విముక్తి కలిగించి దానిని దాని సొంత దారులకు అప్పగించారు ఆ నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యే వెనిగండ్ల రాము.
వివరాల్లోకి వెడితే.. మాజీ మంత్రి కొడాలి నాని అక్రమంగా గుడివాడలోని శరత్ థియేటర్ ను అక్రమంగా కబ్జా చేశారు. ఆ థియేటర్ యజమానులను బెదరించి శరత్ థియోటర్ ను వైసీపీ కార్యాలయంగా మార్చేశారు. అదేమని అడిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ హెచ్చరించి నోరు మూయించారు. ఇప్పుడు ప్రభుత్వం మారిన తరువాత గుడివాడ ప్రస్తుత ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రత్యేక చొరవ తీసుకుని శరత్ థియేటర్ ను దాని సొంత దారులకు అప్పగించారు. ఆ థియేటర్ లో కొనసాగుతున్న వైసీపీ కార్యాలయాన్ని ఖాళీ చేయించారు. ఆ సందర్భంగా గుడివాడ మునిసిపల్ మాజీ చైర్మన్, శరత్ ధియేటర్ యజమానుల్లో ఒకరు అయిన ఎలవర్తి శ్రీనివాసరావు ఆ థియోటర్ లో ఇచ్చిన తేనీటి విందుకు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము హాజరయ్యారు.
ఆ సందర్భంగా మాట్లాడిన వెనిగండ్ల రాము శరత్ థియేటర్ యాజమాన్యం తమకు జరిగిన అన్యాయాన్ని వివరించిన వెంటనే స్పందించానని చెప్పారు. గుడివాడలో వైసీపీ కార్యాలయం అవినీతి, అరాచకాలకు కేంద్రంగా ఏళ్ల తరబడి కొనసాగిందని వివరించారు. ఆయన చెప్పినది నిజమే.. శరత్ థియోటర్ వైసీపీ కార్యాలయంగా ఉన్న సమయంలో ఆ థియేటర్ పక్క నుంచి వెళ్లాలంటే కూడా జనం భయపడేవారు. గుడివాడ ప్రజలందరూ కూడా వైసీపీ అరాచకాల కారణంగా బాధితులైన వారే.
ఒక శరత్ థియేటర్ మాత్రమే కాదు.. అధికారం అండ చూసుకుని కొడాలి నాని అండ్ గ్యాంగ్ గుడి వాడలో పలు భూములను కబ్జా చేసింది. అలా అక్రమంగా కబ్జా చేసిన భూములన్నిటినీ వాటి వాటి సొంత దారులకు అప్పగించాల్సిన అవసరం ఉంది.కొడాలి నాని అక్రమంగా కబ్జా చేసిన 9 ఎకరాల స్థలం తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే దాని సొంతదారులకు అప్పగించింది. దీంతో ఇప్పుడిప్పుడే గుడివాడలో కొడాలి నాని బాధితులు ఒక్కరొక్కరుగా ముందుకు వచ్చి తమకు జరిగిన అన్యాయంపై ధైర్యంగా ఫిర్యాదు చేస్తున్నారు. వారి ఫిర్యాదులతో గత ఐదేళ్లుగా గుడివాడలో కొడాలి నాని సాగించిన దౌర్జనం, దాష్టికం ఏ స్థాయిలో ఉందో వెల్లడౌతోంది.