ఎన్నికల కోడ్ కు అంబటి కొత్త భాష్యం.. అజ్ణానమా? అతి తెలివా?
posted on Feb 19, 2025 @ 1:45PM
మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు.. తన అమోఖమైన వాదనా పటిమతో జగన్ గుంటూరు మిర్చియార్డ్ పర్యటనను సమర్ధించుకున్నారు. ఇందు కోసం ఆయన ఎన్నికల నియమావళికి సైతం కొత్త భాష్యం చెప్పారు. ఎన్నికల కోడ్ అనేది కేవలం ఎన్నికలలో పోటీ చేసే పార్టీలూ, అభ్యర్థులకు మాత్రమే వర్తిస్తుందని సెలవిచ్చారు. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా ఆ ఎన్నికలలో పోటీలో లేని వైసీపీకి ఆ కోడ్ వర్తించదని అంబటి రాంబాబు వాదిస్తున్నారు.
వాస్తవానికి ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులో ఉంది. కృష్ణా గుంటూరు గ్రడ్యుయూట్ కాన్సిట్యుయెన్సీ ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో ఎన్నికల నియమావళి అమలులో ఉంది. ఆ కారణంగానే రాష్ట్ర ఎన్నికల సంఘం వైసీపీ అధినేత జగన్ గుంటూరు మిర్చియార్డ్ సందర్శనకు అనుమతి నిరాకరించింది. అయినా ఆయన ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించి వేలాది మందితో ప్రదర్శనగా మిర్చియార్డ్ కు వెళ్లి హల్ చల్ చేశారు. రాజకీయ ప్రసంగం చేశారు. చంద్రబాబు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించేశారు.
అలా నియమావళిని ఉల్లంఘించి జగన్ గుంటూరులో పర్యటించడానికి ఎన్నికల కోడ్ కు సంబంధం లేదంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు అంటున్నారు. ఎక్కడైనా సరే ఎన్నికల కోడ్ అనేది ఎన్నికలలో పోటీ చేసే పార్టీలకే వర్తిస్తుందనీ, పోటీకి దూరంగా ఉన్న పార్టీలకు కాదనీ భాష్యం చెప్పి తన అజ్ణానాన్ని నిస్సిగ్గుగా బయటపెట్టుకున్నారు. ఎన్నికలు జరిగే ప్రాంతం మొత్తానికి ఎన్నికల కోడ్ అమలులో ఉంటుంది. ఫలానా రాజకీయ పార్టీ పోటీలో లేదు కనుక ఆ పార్టీకీ, ఆ పార్టీ వ్యక్తులకు అది వర్తించకుండా మినహాయింపు లేదు. సభలూ, సమావేశాలు నిర్వహించకూడదు, బ్యానర్లు, ఫ్లెక్సీలు కట్టకూడదు. అనుమతి లేకుండా ప్రదర్శనలు నిర్వహించకూడదు. ఈ విషయం కూడా తెలియకుండానే అంబటి రాంబాబు గతంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేశారా? అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.