చట్టాలపై జగన్ కు ఖాతరీ లేదు.. ఇదిగో మరో రుజువు!
posted on Feb 19, 2025 @ 1:12PM
చట్టాల పట్లా, నిబంధనల పట్లా, రాజ్యాంగం పట్ల తనకు ఖాతరీ లేదని జగన్ మరోసారి రుజువుచేసుకున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున గుంటూరులో మిర్చియార్డు పర్యటనకు జగన్ కు రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతి నిరాకరించింది. పోలీసు శాఖ కూడా అనుమతి లేదని స్పష్టం చేసింది. అయినా జగన్ లెక్క చేయలేదు. వేలాది మందిని వెంటేసుకుని మిర్చి యార్డుకు వెళ్లారు. ఆ సందర్భంగా వైసీపీ కార్యకర్తలు అతి చేశారు. వాస్తవానికి అనుమతి లేదు అని చెప్పిన పోలీసులు జగన్ భారీ ప్రదర్శనగా మిర్చియార్డుకు వెడుతుంటే ఎందుకు అడ్డుకోలేదు. అనుమతి లేని ప్రదర్శన చేసినందుకు ఎన్నికల సంఘం ఎలాగా కేసు పెడుతుంది అప్పుడు చూసుకుందాం అని వదిలేశారా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా కృష్ణా, గుంటూరు జిల్లాలలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సంగతి తెలిసిందే. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించడం ఎంత నేరమో తెలియదనుకోలేం. అమరావతికి కూతవేటు దూరంలో ఉన్న మిర్చియార్డులో మిర్చి రైతుల కష్టాలను చంద్రబాబు పట్టించుకోవడం లేదంటూ జగన్ ఆరోపణలు గుప్పించారు. అదే సమయంలో రైతుల కష్టాలను గాలికొదిలేసి.. చంద్రబాబు తన దృష్టినంతా వైసీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తూ రాజకీయ కక్ష సాధింపు చర్యలపైనే కేంద్రీకరించారని విమర్శించారు.
దీంతో ఇప్పడు జగన్ సీఎంగా ఉన్న సమయంలో అమరావతి రైతులను ఎంత క్షోభపెట్టారో గుర్తు చేస్తూ నెటిజనులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. అమరావతి రైతులపై అక్రమ కేసులు బనాయించిన సంగతిని గుర్తు చేస్తున్నారు. అమరావతి రైతుల పాదయాత్రపై అప్పట్లో అడుగడుగునా దాడులు చేయించిన వైనాన్ని ప్రస్తావిస్తూ అందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ముందు వాటికి బదులిచ్చి ఆ తరువాత మిర్చిరైతుల గురించి మాట్లాడమని నిలదీస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతిపక్ష హోదా లేకపోయినా, ఒిక రాజకీయ పార్టీ అధినేతగా జగన్ పోరాడడాన్ని ఎవరూ తప్పుపట్టరు.
కానీ అందుకోసం ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించడాన్నీ, చట్టాలను ధిక్కరించడాన్ని ఎవరూ సమర్ధించరు. అలా చేస్తున్న జగన్ పై చర్యలు తీసుకోకుండా కూటమి ప్రభుత్వం మిన్నకుండటం సరికాదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.