బీఆర్ఎస్ లో నూతనోత్సాహం.. ఎందుకంటే?
posted on Feb 19, 2025 @ 2:21PM
బీఆర్ఎస్ శ్రేణులలో చాలా రోజుల తరువాత కొత్త ఉత్తేజం, ఉత్సాహం కనిపించింది. ఇందుకు కారణం సుదీర్ఘ కాలం ఫామ్ హౌస్ కే పరమితమైన ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పార్టీ కార్యాలయం తెలంగణ భవన్ కు రావడమే. బుధవారం (ఫిబ్రవరి 19)మధ్యాహ్నం ఆయన తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు.
ఈ సమావేశంలో బీఆర్ఎస్ భవిష్యత్ కార్యాచరణ, ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీకి దూరంగా ఉండటానికి కారణాలు, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటాలు తదితర అంశాలపై ఆయన క్యాడర్ కు దిశా నిర్దేశం చేశారు. అంతకు ముందు ఆయన తెలంగాణ భవన్ కు చేరుకోగానే స్వల్ప తొక్కిసలాట చోటు చేసుకుంది. సీఎం, సీఎం అని పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ కార్యకర్తలు ఒక్కసారిగా ముందుకు తోసుకు వచ్చారు. ఆ సందర్భంగా కేసీఆర్ వారిని మందలించారు. ఒర్లకండిరా బాబూ అంటూ ఒకింత అసహనం వ్యక్తం చేశారు. కేసీఆర్ అధ్యక్షతన జరిగిన విస్తృత స్థాయి సమావేశానికి పార్టీ జిల్లాల అధ్యక్షులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, నియోజకవర్గ ఇన్ చార్జ్ లు హాజరయ్యారు.