ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతోంది ఉండవల్లీ!
posted on Feb 19, 2025 @ 11:48AM
రాజమహేంద్రవరం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ రంగులు మార్చడంలో ఊసరవెల్లిని మరపిస్తారు. వైఎస్ కు నమ్మిన బంటుగా ఉండవల్లి రాజకీయాలలో గుర్తింపు పొందారు. ఆయన ఆశీస్సులతో రాజమహేంద్రవరం నుంచి రెండు సార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. లోక్ సభ సభ్యుడిగా ఆయన రాజమహేంద్రవరం అభివృద్ధికి ఏం చేశారో తెలియదు కానీ, రాష్ట్ర విభజన తరువాత రాజకీయ సన్యాసం ప్రకటించి.. తన గురువు వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు వైఎస్ జగన్మోహనరెడ్డి శ్రేయోభిలాషిగా మిగిలిపోయారు.
ఐదేళ్ల జగన్ పాలనలో రాష్ట్రం అన్ని విధాలుగా భ్రష్టుపట్టిపోయినా, అవినీతి, అరాచకత్వం రాజ్యమేలినా.. ఉండవల్లికి చీమకూడా కుట్టలేదు. కానీ జగన్ ఇబ్బందుల్లో ఉన్న ప్రతి సారీ.. ఆయనకు మద్దతుగా మీడియా ముందుకు వచ్చి తనకు మాత్రమే సాధ్యమైన హేతురహిత వ్యాఖ్యానాలతో జగన్ తరఫున మాట్లాడే వారు. సీనియర్ రాజకీయ నాయకుడు అయి ఉండీ వాస్తవాలను గుర్తించకుండా జగన్కు అనుకూలంగా ఆయన చేసిన విశ్లేషణలూ, వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలూ నవ్వుల పాలైన సందర్భా లెన్నో ఉన్నాయి. ఆయన ప్రతిష్ట పూర్తిగా మసకబారి జనంలో క్రెడిబులిటీ కోల్పోయారు. తన రాజకీయ గురువు వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్ కు మద్దతుగా నిలవడం కోసం వాస్తవాలను ఆయన వక్రీకరించిన విధానంపై వైసీపీయులు కూడా ఒకింత అసహనానికి లోనైన సందర్భాలు కూడా ఉన్నాయి.
రాష్ట్ర విభజనను వ్యతిరేకించి రాజకీయ సన్యాసం పుచ్చుకున్న ఆయన బుద్ధిగా రాజకీయాలు మాట్లాడకుండా తన పని తాను చూసుకోకుండా తగుదునమ్మా అంటూ జగన్ కోసం వాస్తవాలను వక్రీకరించిన వైనంపై ఎన్నో విమర్శలు వెల్లువెత్తాయి. ఆయనతో పాటే రాష్ట్ర విభజనను వ్యతిరేకించి రాజకీయాలకు దూరమైన లగడపాటి.. ఆ తరువాత ఎన్నడూ రాజకీయాలపై మాట్లాడలేదు. విశ్లేషణలు చేయలేదు. కానీ ఉండవల్లి మాత్రం అందుకు భిన్నంగా జగన్ కోసం వంకర రాజకీయాలు చేస్తూనే వస్తు న్నారు. గత ఏడాది ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని, జగన్ మాజీ ముఖ్యమంత్రి అయిన తరువాత ఉండవల్లి మరింత చురుకుగా జగన్ కు మద్దతుగా మాట్లాడటం మొదలు పెట్టారు. ఇటీవలి కాలంలో ఆయన రాజకీయ సన్యాసానికి గుడ్ బై చెప్పి జగన్ కోసం వైసీపీ తీర్థం పుచ్చుకుని పొలిటికల్ గా యాక్టివ్ అవుతారన్న వార్తలు వచ్చాయి. అయితే నేరుగా జగన్ పార్టీలో చేరి తాను చేసేదేం లేదని గ్రహించిన ఉండవల్లి రాజకీయ సన్యాసాన్ని కంటిన్యూ చేస్తానంటూ బహిరంగ ప్రకటన ఇచ్చి జగన్ కు తన పరోక్ష మద్దతు కొనసాగుతుందన్న సంకేతాలిచ్చారు. అదే సమయంలో జగన్ కు ప్రయోజనం చేకూర్చడం కోసం ఇతర పార్టీల మధ్య సఖ్యతకు బీటలు వారే వ్యాఖ్యలకు తెరలేపారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఉండవల్లి కూటమి పార్టీల్లో విభేదాలున్నాయన్న అనుమానాలు జనబాహుల్యంలో కలిగించేలా వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలతో తన వంతు ప్రయత్నం చేశారు.
జనసేనాని, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై పొగడ్తల వర్షం కురిపించారు. ఆంధ్ర ప్రదేశ్ కు ఆశాజ్యోతిగా పవన్ కల్యాణ్ను అభివర్ణిస్తూ మునగచెట్టు ఎక్కించే ప్రయత్నం చేశారు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడి అందర్నీ మెప్పిస్తున్న పవన్ కల్యాణ్ ను ఒక డిఫరెంట్ పొలిటీషియన్ గా పేర్కొంటూ ఉండవల్లి తనకు మాత్రమే సాధ్యమైన లౌక్యాన్ని ప్రదర్శించారు. చంద్రబాబు కంటే పవన్ కల్యాణే మంచి నాయకుడని చెప్పడం ద్వారా తెలుగుదేశం, జనసేనల మధ్య గ్యాప్ సృష్టించి తద్వారా జగన్ కు ఏదో మేరకు రాజకీయ ప్రయోజనం చేకూర్చే ప్రయత్నం చేశారు.
పవన్ కల్యాణ్ వల్ల మాత్రమే రాష్ట్ర విభజన సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రజలు నమ్ముతున్నారనీ , విభజన హామీల సాధన కోసైం ఏం చేయాలో తాను పవన్ కు లేఖ రాశాననీ పేర్కొన్నారు. దీనిపై నెటిజనులు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. ఆయన కొత్తగా మొదలు పెట్టిన పవన్ భజన వల్ల జగన్ కు ఇసుమంతైనా ప్రయోజనం చేకూరదని అంటున్నారు. జగన్, వైసీపీ పవన్ ను టార్గెట్ చేసి వ్యక్తిత్వ హననానికి పాల్పడినప్పుడు ఉండవల్లి స్పందింలేదని గుర్తు చేస్తున్నారు.