మోడీ-షా దృష్టికి రాజధాని వివాదం... జగన్ పై కన్నా ఘాటు వ్యాఖ్యలు
posted on Dec 25, 2019 8:12AM
ముఖ్యమంత్రి మారితే రాజధాని మారడం ఇంతవరకూ చరిత్రలో ఎక్కడా జరగలేదని.... జగన్మోహన్ రెడ్డి తన అపరిపక్వతతో పిచ్చి పనికి పూనుకుంటున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధానిని మారిస్తే... పెట్టుబడుదారులకు రాష్ట్రం మీద నమ్మకాలు పోతాయన్నారు. అమరావతి కేవలం రైతుల సమస్య కాదన్న కన్నా.... ఇది రాజధాని సమస్య అన్నారు. చంద్రబాబునో... జగన్మోహన్ రెడ్డినో చూసి రైతులు భూములివ్వలేదని... రాష్ట్ర భవిష్యత్ కోసం తమ భూములను త్యాగం చేశారని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మి రైతులు భూములిస్తే ఇఫ్పుడు నట్టేట ముంచేయడం సరికాదన్నారు. బీజేపీ... అభివృద్ధి వికేంద్రీకరణను కోరుకుంటుందే కానీ... పరిపాలనా వికేంద్రీకరణను కాదని కన్నా స్పష్టంచేశారు. ఆరు నెలల పాలనలో శాంతిభద్రతల మాటేమో కానీ... ఎవ్వరికీ నిద్ర లేకుండా చేసిన ఘనత మాత్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. కక్ష సాధింపు చర్యలు, అనుభవ రాహిత్యం, అపరిపక్వత కలిసిన జగన్ పాలనలో రాష్ట్రానికి దశదిశ లేకుండా పోయిందన్నారు. అమరావతిలో రాజధాని నిర్మాణం కోసం పదివేలకోట్లు ఖర్చు చేశారని, ఇఫ్పుడు మీ ఇష్టమొచ్చినట్లు మార్చుతామంటే ఇక్కడెవరూ చూస్తూ కూర్చోలేదని కన్నా హెచ్చరించారు. అమరావతి రైతులకు బీజేపీ అండగా ఉంటుందన్న కన్నా లక్ష్మీనారాయణ.... రాజధాని ప్రజల ఆవేదనను ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్తామన్నారు.
అయినా, విశాఖలో రాజధాని ఏర్పాటు చేయాలని ఎవరూ అడిగారని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తే రాయలసీమ అభివృద్ధి జరిగిపోయినట్లేనా అన్నారు. హైకోర్టులున్న ప్రాంతాలేవీ అభివృద్ధి చెందిన దాఖలాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. రాయలసీమ అభివృద్ధి చెందాలంటే నికర జలాలు, పరిశ్రమలను తీసుకురావాలన్నారు. రాయలసీమను ఉద్ధరించడానికి కర్నూలులో హైకోర్టు అంటున్నారని, కానీ అది సీమ నాలుక గోచుకోవడానికి కూడా పనికి రాదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. యువకుడు ముఖ్యమంత్రి కావడంతో ఏపీని ఆదర్శంగా తీర్చిదిద్దుతానుకుంటే... ఇలా అమరావతిని అంధకారంలో ముంచుతాడని ఊహించలేదంటున్నారు.