అంతా వైఎస్సే చేశారు... ఆయేషా కేసులో కీలక మలుపు

పన్నెండేళ్ల క్రితం దారుణంగా రేప్ అండ్ మర్డర్ కి గురైన ఆయేషా మీరా ఘటన ఇప్పటికీ తీవ్ర సంచలన సృష్టిస్తోంది. న్యాయం కోసం ఆయేషా తల్లిదండ్రులు కాళ్లరిగెలా తిరుగుతూనే ఉన్నారు. అలుపెరగకుండా పోరాడుతూనే ఉన్నారు. వైఎస్ హయాంలో ఆయేషా మర్డర్ జరగ్గా, ఆ తర్వాత ముగ్గురు ముఖ్యమంత్రులు మారిపోయారు. ప్రస్తుతం వైఎస్ తనయుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. వైఎస్ దగ్గర్నుంచి ఇప్పటివరకు మొత్తం ఐదుగురు ముఖ్యమంత్రులను కలిసినా ఆయేషాకు మాత్రం న్యాయం జరగలేదు. హైకోర్టు ఆదేశాలతో ప్రస్తుతం ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. వైఎస్ హయాంలో జరిగిన ఆయేషా రేప్ అండ్ మర్డర్ వెనుక రాజకీయ నేతల పిల్లలు ఉన్నారనే ఆరోపణలు వచ్చాయి. అందుకే, ఈ కేసు విచారణ ఇప్పటివరకూ తేలలేదని అంటారు. అయితే, ఆయేషా మీరా తల్లి షంషాద్ బేగం మొదటిసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయేషా కేసును మొత్తం మాఫీ చేసింది వైఎస్ రాజశేఖర్ రెడ్డేనని ఆరోపించారు. ఆయేషా హంతకులు అప్పటి వైఎస్ ప్రభుత్వంలోని ప్రముఖుల పిల్లలు కావడంతోనే తన కూతురికి న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇప్పుడు ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి కొత్త చట్టం అంటున్నారని... కానీ పోలీసులు, ప్రభుత్వాలు... అసలు హంతకులను పట్టుకోకుండా... తిరిగి బాధితులనే ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయేషా తల్లి మండిపడ్డారు. ఆడపిల్లలను కాపాడలేనప్పుడు ప్రభుత్వాలు ఎందుకని ఆయేషా తల్లి ప్రశ్నించారు. అంతేకాదు, మళ్లీ బ్రిటీష్ వాళ్లు వచ్చి పాలిస్తే గానీ భారత దేశం బాగుపడదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక, ఆయేషా తల్లిదండ్రులను పరామర్శించిన మందకృష్ణ మాదిగ కూడా వైఎస్ పైనే విమర్శలు చేశారు. ఆయేషా హంతకులు సంపన్నులు కాబట్టే కేసును తప్పుదారి పట్టించారని ఆరోపించారు. కులం, మతం చూడకపోతే ఆయేషా హంతకులు ఎప్పుడో దొరికేవారని, వాళ్లకు ఎప్పుడో శిక్షలు పడేవని అన్నారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జోక్యం వల్లే అసలు హంతకులు తప్పించుకున్నారని మందకృష్ణ అన్నారు.

జాతీయ పార్టీలే పోటీకి అర్హులు... లోక్ సభ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలకు చుక్కెదురు

  మోదీ సర్కార్ రెండో సారి అధికారం లోకి వచ్చిన తర్వాత అనేక విషయాల్లో దూకుడు ప్రదర్శిస్తోంది. దశాబ్దాల తరబడి వెంటాడుతున్న సమస్యల్ని సాహసోపేతంగా పరిష్కరిస్తోంది. కేవలం ఆరేడు నెలల్లోనే అనేక చారిత్రక నిర్ణయాలు తీసుకొంది. ఈ సారి లోక్ సభలో కేవలం జాతీయ పార్టీలే పోటీ చేసేలా చట్టాన్ని సవరించే ఆలోచన చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. దేశంలో అధ్యక్ష తరహా ప్రజాస్వామ్య దిశగా దేశాన్ని నడిపించడానికి ఇది తొలి మెట్టుగా భావిస్తున్నారు. ఇదే జరిగితే ప్రాంతీయ పార్టీలు రాష్ట్రాలకే పరిమితమై లోక్ సభ వైపు చూసే పరిస్థితి రాకపోవచ్చు. బిజెపి తన ఎన్నికల మానిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాల్లో చాలా వాటిని ఇప్పటికే నెరవేర్చింది. కశ్మీర్ కోసం ప్రత్యేకించిన 370 నిబంధనను రద్దు చేసింది. దాంతో పాటు 35 ఏ కూడా రద్దయింది. ట్రిపుల్ తలాక్ ను కూడా రద్దు చేసింది. అంతేకా కుండా దశాబ్దాల తరబడి నలుగుతున్న రామజన్మభూమి కేసులో కూడా సత్వర తీర్పు వచ్చేలా కేంద్రం చొరవ తీసుకుంది. ఇక కామన్ సివిల్ కోడ్ బిజెపి మ్యానిఫెస్టోలో ఉన్న అంశమే, దీని పైన కూడా త్వరలోనే మోదీ సర్కార్ దృష్టి పెట్టొచ్చు. మోదీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కారు ఎన్నికల సంస్కరణల పైనే ఫోకస్ పెడుతోందని చెప్పుకొంటున్నారు. కేవలం జాతీయ పార్టీలు మాత్రమే లోక్ సభకు పోటీ చేసేలా రాజ్యాంగ సవరణ తెచ్చే ఆలోచన చేస్తోందని ప్రచారం జరుగుతోంది. ప్రాంతీయ పార్టీలు ఆయా రాష్ట్రాల అంశాలకే పరిమితమై వీసాల జాతీయ ప్రయోజనాలపై దృష్టి సారించలేకపోతున్నాయని బీజేపీ భావిస్తోంది. దీంతో పాటు ప్రాంతీయ పార్టీల జోక్యంతో కేంద్రంలో సుస్థిర ప్రభుత్వాలు ఏర్పడి లేక పోతున్నాయని కూడా ఆ పార్టీ అభిప్రాయపడుతోంది. అయితే బీజేపీ ఏం చెప్పినా వ్యతిరేకించే కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో బీజేపీతో కలిసి నడిచే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ప్రాంతీయ పార్టీల వల్ల అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీనే ఎక్కువగా నష్టపోయింది. బిజెపి రీజినల్ పార్టీల మనుగడను ప్రశ్నార్థకం చేసే ఇటువంటి ఆలోచన చేస్తోందా అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

జాస్తి కృష్ణకిశోర్‌కి చంద్రబాబుకి లింకేమిటి?

జగన్ సర్కారు సస్పెన్షన్ వేటేసిన ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిశోర్ కి ఊరట లభించింది. అవినీతి అక్రమాలకు పాల్పడ్డారంటూ జగన్ ప్రభుత్వం.... సస్పెండ్ చేయడంతో కృష్ణకిశోర్ క్యాట్ ను ఆశ్రయించారు. దాంతో, జగన్ ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ పై క్యాట్ స్టే విధించింది. ఒకపక్క సస్పెన్షన్ వేటేయగా, మరోపక్క సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈడీబీ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ తులసిరాణి ఫిర్యాదు మేరకు జాస్తి కృష్ణకిశోర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి కోర్టుకు పంపారు. అయితే, హడావిడిగా రాత్రిపూట ఓ ఐఆర్ఎస్ అధికారిపై సీఐడీ కేసు నమోదు చేయడం.... వెంటనే ఎఫ్ఐఆర్ ను కోర్టుకు పంపడంపై ఇతర అధికారులు ఆశ్చర్యపోతున్నారు. ఇక, ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిశోర్ సస్పెన్షన్ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంటోంది. జగన్ కంపెనీలకు జరిమానా విధించారన్న అక్కసుతోనే కృష్ణకిశోర్ పై సస్పెన్షన్ వేటేసి కేసులు నమోదు చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. అయితే, చంద్రబాబు ఆరోపణలను వైసీపీ తీవ్రంగా ఖండిస్తోంది. తప్పు చేస్తే సస్పెండ్ చేయకుండా... సన్మానాలు చేస్తారా అంటూ అంబటి రాంబాబు ప్రశ్నించారు. అవినీతి ఆరోపణలు రావడంతో... పరిశ్రమలశాఖ నివేదిక ఆధారంగానే జాస్తి కృష్ణకిశోర్ పై ప్రభుత్వం చర్యలు తీసుకుందని అన్నారు. అయితే, ఇదేదో జాతీయ సమస్యలాగా చంద్రబాబు చిత్రీకరిస్తున్నారని, దీన్నిబట్టి జాస్తి కృష్ణకిశోర్ తో చంద్రబాబుకి ఉన్న లింకులేమిటో అర్ధమవుతుందన్నారు. టీడీపీ హయాంలో జాస్తి కృష్ణకిశోర్ టీడీపీకి అనుకూలంగా పనిచేయడం వల్లే... ఇఫ్పుడు చంద్రబాబు గగ్గోలు పెడుతున్నారని అంబటి మండిపడ్డారు.

నాయిని పార్టీ మారతారా? కేసీఆర్ పై అసంతృప్తి ఎందుకు?

    నాయిని నర్సింహారెడ్డి... టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కేసీఆర్ తో కలిసి నడిచిన అతికొద్ది మందిలో ఒకరు. ఉద్యమం సమయం నుంచి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు నాయినికి మంచి ప్రాధాన్యతే దక్కింది. బహిరంగసభ అయినా, కీలక సమావేశమైనా కేసీఆర్ పక్కన కచ్చితంగా నాయిని ఉండేవారు. ఇక, తెలంగాణ ఏర్పడ్డాక కొలువుదీరిన టీఆర్ఎస్ తొలి ప్రభుత్వంలో నెంబర్ 2లాంటి హోంమంత్రి పదవికి నాయినికి కట్టబెట్టి సముచిత స్థానం కల్పించారు. నాయినిని అన్నా అని పిలుస్తూ పెద్దరికాన్ని గౌరవించేవారు. అయితే, కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక నాయిని కనుమరుగు అయ్యారు. ఏడాదిక్రితం వరకు కేసీఆర్ వెంటనడిచిన నాయిని... ఇఫ్పుడా ఎక్కడా కనిపించడం లేదు. కనీసం వాయిస్ కూడా వినిపించడం లేదు. అయితే, కేసీఆర్‌-నాయిని బంధానికి 2018లో బీటలుపడ్డాయని అంటారు. 2014 ఎన్నికల్లో పోటీ చేయకపోయినప్పటికీ, ఎమ్మెల్సీని చేసిమరీ హోంమంత్రి పదవి కట్టబెట్టారు కేసీఆర్... 2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో ముషీరాబాద్ నుంచి పోటీ చేస్తానంటే మాత్రం టికెట్ నిరాకరించారు. కనీసం తన అల్లుడు శ్రీనివాసరెడ్డికైనా ఇవ్వాలని కోరినా, కేసీఆర్ నుంచి రెడ్ సిగ్నల్ రావడంతో అప్పట్నుంచి సైలెన్స్ మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. ఇక, సెకండ్ టర్మ్ లో మంత్రి పదవి కూడా ఇవ్వని కేసీఆర్... నాయిని సేవలను పార్టీకి వాడుకుంటామని హామీ ఇచ్చారట. అయితే, పార్టీపరంగా కూడా ఇఫ్పటివరకు నాయినికి ఎలాంటి పదవీ దక్కలేదు. ఇక, ప్రస్తుతమున్న ఎమ్మెల్సీ పదవీకాలం కూడా మరో మూడు నాలుగు నెలల్లో ముగిసిపోనుంది. దాంతో, కనీసం ఎమ్మెల్సీనైనా రెన్యువల్ చేస్తారో లేదో తెలియని పరిస్థితి నాయిని ఉన్నారు. కేసీఆర్ తనను పట్టించుకోవడం లేదన్న అసంతృప్తితో ఉన్న నాయిని...పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటూ వస్తున్నారు. దాంతో, నాయిని పార్టీ మారతారేమోనన్న ప్రచారం మొదలైంది. అయితే, వయోభారంతో సతమతమవుతోన్న నాయిని... పార్టీ మారినా ప్రయోజనం లేదనే మాట వినిపిస్తోంది. నాయినికి పార్టీ మారే ఆలోచన లేదని, కానీ తన అల్లుడి రాజకీయ కెరియర్ ను చక్కదిద్దాలన్న పట్టుదల మాత్రం ఉందని సన్నిహితులు చెబుతున్నారు. అందుకే, కేసీఆర్ పై ఎంత అసంతృప్తి ఉన్నా... గట్టిగా విమర్శలు చేయలేకపోతున్నారని అంటున్నారు. ఆర్టీసీ సమ్మె సందర్భంగా మాత్రం కేసీఆర్ పై పరోక్ష విమర్శలు చేశారు. కేసీఆర్ అస్సలు యూనియన్లే వద్దంటే.... అందుకు విరుద్ధంగా నాయిని మాట్లాడారు. యూనియన్లు లేకపోతే కార్మికుల సంక్షేమం గురించి పట్టించుకునేవారే ఉండరని అన్నారు. అయితే,అవేమీ అంతగా పట్టించుకోదగ్గవి కాదంటున్నారు. మొత్తానికి, కేసీఆర్ పై పీకల్దాక అసంతృప్తి ఉన్నా... కక్కలేక మింగలేక అన్నట్లుంది నాయిని పరిస్థితి.  

టన్ను ఇసుకపై రూ.1000 పెంపు... తెలంగాణలో మొదలైన ఇసుక సంక్షోభం

ఏపీలోనే కాదు తెలంగాణ లోనూ ఇసుక బంగారమైంది. ఒక్కసారిగా ఇసుక ధరకు రెక్కలొచ్చాయి. నిన్నమొన్నిటి వరకు టన్ను రూ.1400 రూపాయలకు అటు ఇటుగా ఉన్న ఇసుక ధర అమాంతంగా రూ.1000 రూపాయల వరకు పెరిగింది. ఈ ప్రభావం నిర్మాణ రంగంపై తీవ్రంగా పడింది. ప్రభుత్వ విధానంతో పాటు మేడారం జాతర సందర్భంగా ఆంక్షలు విధించడం ఇందుకు కారణంగా చూపుతున్నారు. రాష్ట్రంలో సుమారు 23 ఇసుక రీచ్ లు ఉన్నాయి. వీటిలో 20 కి పైగా కమర్షియల్ రీచ్ లే. మిగిలినవి ఇరిగేషన్ డబుల్ బెడ్ రూమ్ లకు సంబంధించిన రీచ్ లు. ఇసుక రీచ్ లలో సుమారు 95 శాతం భూపాలపల్లి ప్రాంతం లోనే ఉన్నాయి. ఇరిగేషన్ ప్రాజెక్టులు, డబుల్ బెడ్ రూం నిర్మాణాలకు సంబంధం లేకుండా రాష్ట్రంలో నెలకు సుమారు 10 నుంచి 12 లక్షల టన్నుల ఇసుక డిమాండ్ ఉంది. అంటే ఏడాదికి 1.3 కోట్ల నుంచి 1.4 కోట్ల టన్నులు. కొత్త విధానంలో భాగంగా ఇసుకను రాష్ట్ర ప్రభుత్వమే సరఫరా చేస్తుంది. నదుల రీచ్ ల్లో ఇసుకను సేకరించి దగ్గరలోని స్టాక్ యార్డుల్లో నిలువ చేస్తున్నారు. ఆన్ లైన్ లో బుక్ చేసుకున్న వారికి అక్కడి నుంచి ఇసుకను లోడు చేస్తున్నారు. ఇసుక బుకింగ్ కు రాష్ట్రంలో సుమారు 25,000 లారీలు నమోదయ్యాయి. రైతుల సంఖ్య, రోడ్ రవాణా అన్ని లారీలకు అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో రోజుకు 2,500 నుంచి 3000 లారీలకే అవకాశమిస్తున్నారు. దాంతో ఒక్కసారి అవకాశం దక్కిన లారీకి మరో ఐదారు రోజుల పాటు బుకింగ్ చేసుకునే అవకాశం వుండటం లేదు. ధరలు పెరగడానికి ఇది ప్రధాన కారణంగా చూపుతున్నారు. అలాగే ఫిబ్రవరి మొదటి వారంలో జరిగే మేడారం జాతర కోసం రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. దాంతో రాత్రి వేళ అక్కడ లారీలకు అనుమతి ఇవ్వడం లేదు. ఫలితంగా బహిరంగ మార్కెట్ లో ధరలు భారీగా పెరిగాయి. ఇదిలా వుంటే ఇసుక సరఫరాలో త్వరలోనే సాధారణ పరిస్థితి రానుందని రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ముల్సూర్ చెబుతున్నారు. కొన్ని కారణాల రీత్యా గత వారంలో ఇసుక బుకింగ్ ను పరిమితం చేశామని ప్రస్తుతం సాధారణ రీతిలోనే బుకింగ్ కు అవకాశమిస్తున్నామని అంటున్నారు. ఏమైనా తెలంగాణ లోనూ ఇసుక ధరకు రెక్కలు రావడం నిర్మాణ రంగానికి దెబ్బగా మారింది.

టీడీపీ కి చిక్కులు.. కొత్త పార్టీ ఆఫీసు స్థలం పై హైకోర్టు నోటీసులు

ఏపీ రాజధాని అమరావతి లోని టిడిపి ఆఫీస్ కు న్యాయపరమైన చిక్కులు ఎదురు కానున్నాయి. ప్రభుత్వ భూమిని ఆక్రమించారంటూ వైసిపి ఎమ్మెల్యే ఆర్కే హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు. దీని పై విచారణ చేపట్టిన హై కోర్టు.. ప్రభుత్వం, కలెక్టర్, టిడిపికి నోటీసులు జారీ చేసింది. ఇది అక్రమమని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపిస్తున్నారు. అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయాలంటూ హై కోర్టులో ఆయన పిటిషన్ వేశారు. ఇందులో రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి సీసీఎల్ఏ కార్యదర్శి, ఏపీసీఆర్డీఏ కమిషనర్, జిల్లా కలెక్టర్ టిడిపి అధ్యక్షుడిని ప్రతివాదులుగా చేర్చారు. వాగులు, వంకలు, చెరువులు, నదీ పరివాహక ప్రాంతాల భూముల్ని ఇతరులకు కేటాయించడం పర్యావరణ చట్టాలకు విరుద్ధం అని ఆర్కే వాదిస్తున్నారు. గుంటూరు జిల్లా ఆత్మకూరులో టిడిపి కేంద్ర కార్యాలయం ఈ నెల తొమ్మిదినే ప్రారంభించారు చంద్రబాబు. ఈ స్థలం సర్వే నెంబర్ మూడు వందల తొంభై రెండులో ఉంది. దాదాపు నాలుగు ఎకరాలున్న ఈ భూమిని టిడిపికి తొంభై తొమ్మిదేళ్ల లీజుకిస్తూ 2017లో అప్పటి ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇప్పుడు ఇదే భూమి వివాదాస్పదమవుతోంది. ఆర్కే పిటిషన్ పై విచారించిన హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.అక్రమ కట్టడం అని విమర్శిస్తున్న వైసీపీ ఏ చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.

ఆదాయం లేదంటే ఆపేయండి.. ఆర్ & బీ, ఇంజనీరింగ్ శాఖ అభివృద్ధి పనులు నిలిపివేత

తెలంగాణలో పంచాయతీ రాజ్ ఆర్ & బీ తో పాటు ఇంజినీరింగ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులు ఇక ముందుకు సాగలేని పరిస్థితి నెలకొంది. నీటి పారుదల శాఖ ప్రభుత్వ ప్రాధాన్య పథకాల పనులు మినహా ఇతర అన్ని ఇంజనీరింగ్ పనులు నిలిచిపోనున్నాయి. అత్యవసరం మినహా మిగతా ఏ పనులు చేపట్టవద్దని మౌఖికాదేశాలు ఇప్పటికే పంచాయతీ రాజ్ ఆర్అండ్బీ తదితర ఇంజనీరింగ్ శాఖల అధికారులకు చేరాయి. ముందే మంజూరు చేసి ఉన్నా కూడా ఇప్పటి వరకు పనులు చేపట్టక పోతే వాటిని కూడా ప్రారంభించవద్దని జిల్లాల అధికారులను రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు ఆదేశించారు. ఆయా ప్రభుత్వ శాఖలు విభాగాల ద్వారా మంజూరు చేసే పనులే కాదు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ తమ నియోజక వర్గాల అభివృద్ధి నిధుల కోటాతో స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్ తో చేపట్టే పనులను కూడా నిలిపి వేయాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్టు తెలుస్తోంది. వీటన్నింటిపై యథాతథ స్థితిని కొనసాగించాలన్నది ప్రభుత్వ ఆదేశాల సారాంశంగా చెబుతున్నారు. ఖజానా ఖాళీ కావడమే ఈ పరిస్థితికి కారణమనే అభిప్రాయలు వ్యక్తమౌతున్నాయి.  ఆర్ధిక పరిస్థితిని నియంత్రించుకునే దిశగా ఈ నెల పదకొండు న జరిగిన క్యాబినెట్ సమావేశంలోనే సీఎం కేసీఆర్ సూచనలు చేశారు. ఆ తర్వాత మూడు నాలుగు రోజుల్లోనే ప్రధాన శాఖల్లో పనులు నిలిచిపోయేలా నిర్ణయాలు జరుగుతున్నాయి. కొత్త పనులు చేపట్టవద్దని ఆదేశాలు క్షేత్ర స్థాయి అధికారులకు చేరాయి. కేవలం ఉపాధి హామి అత్యవసర పనులను మాత్రమే కొనసాగించాలని ఆదేశించినట్టు సమాచారం. ఉపాధి హామీ కూలీలకు ఇచ్చే వేతనంలో 90 శాతం కేంద్రమే మంజూరుచేస్తుంది. వాటిని కూడా కూలీల ఖాతాల్లోనే జమ చేస్తుంది. దాంతో ఈ పనుల నిలిపివేత సాధ్యం కాదు. కానీ ఈ పనుల్లో మెటీరియల్ కాంపోనెంట్ గా రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను కూడా వెంటనే చెల్లించే పరిస్థితి లేదు. మాంద్యం పరిస్థితులు రాష్ట్రంలో తీవ్రంగానే ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభావం తెలంగాణ పై పడిందని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆర్థికంగా మెరుగ్గా ఉన్నామని సీఎం కేసీఆర్ పూర్తి స్థాయి బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో చెప్పుకొచ్చారు. మూడు నెలలు గడవక ముందే పరిస్థితి మరింత దిగజారినట్లు తెలుస్తుంది. పక్షం రోజుల్లో మూడో త్రైమాసికం కూడా పూర్తవుతుంది. ఇప్పటికే అన్ని రకాల పన్నుల ఆదాయాలు తగ్గినట్టు అధికారుల నివేదికలు చెబుతున్నాయి.  సహజంగా ఆర్ధిక సంవత్సరం చివరి త్రైమాసికంలోనే రాబడి ఆదాయం ఎక్కువగా ఉంటుందని అంచనా. ఇందుకు ఇంకా వంద రోజులకు పైగా సమయం ఉన్నా పనులు నిలిపి వేయాలని చెప్పడం అనుమతి లేకుండా కొత్తగా ఒక్క పనిని కూడా చేపట్టవద్దని ఆదేశించడాన్ని చూస్తే చివరికి ఆశించిన స్థాయిలో ఆర్ధిక పరిస్థితులు మెరుగయ్యేలా లేవన్న అంచనాకు ప్రభుత్వం వచ్చినట్లు చెబుతున్నారు. ఇప్పటికే రోడ్ల పనులకు సంబంధించి రెండు వేల కోట్ల మేరకు బకాయిలు పేరుకుపోయినట్లు సమాచారం.అభివృద్ది పనుల కొనసాగింపు కొత్త వాటిని ప్రారంభించడం పై విధించిన అనధికార స్టేటస్ కు ఎప్పటి వరకు కొనసాగుతుందని అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆర్థిక సంవత్సరం చివరికి ఆశించిన మేర ఆదాయం సమకూరుతుందా, ఏమైనా తగ్గే అవకాశం ఉందా అన్న దానిపై ప్రభుత్వం ఉన్నత స్థాయిలో సమీక్షించిన తర్వాతే ఒక నిర్ణయానికి వచ్చే వీలుంది. ఈ నేపథ్యంలోనే ఆర్థిక పరిస్థితి చెల్లించాల్సిన బకాయిలు వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా చేపడుతున్న పనులు వాటికి అవసరమైన నిధులు తదితర అంశాలను సమీక్షించుకునేందుకు సోమవారం మరోసారి సమావేశం అవుతున్నట్టు తెలుస్తుంది. ఈ సమీక్ష తర్వాత పనుల పై మరింత స్పష్టతతో ప్రభుత్వం ముందుకెళ్లనున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి ఆదాయం పెరిగితేనే కొత్త సంవత్సరంలో పనులు ముందుకు సాగే అవకాశం ఉంది.

శ్రీనివాసరెడ్డిని చంపేయండి.. గవర్నర్ ని కోరిన హాజిపూర్ బాధిత కుటుంబాలు

గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ను హాజీపూర్ బాధిత కుటుంబాలు కలిశాయి. తమ పిల్లల పై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడు శ్రీనివాసరెడ్డిని ఉరి తీయాలనివారు కోరారు. హాజీపూర్ కు బ్రిడ్జి నిర్మించాలని తమకు న్యాయం చేయాలని విన్నవించుకున్నారు. ఘటనలు వెలుగు లోకి వచ్చి ఆరు నెలలైనా నిందితుడికి శిక్ష పడకపోవటం పై బాధిత కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దిశ ఎన్ కౌంటర్ తర్వాత తమ నిరసన తీవ్రం చేశారు. న్యాయం చేయాలంటూ ఆందోళనలు చేపట్టారు. ఇవాళ గవర్నర్ ను కలిసి తమకు న్యాయం చేయాలని కోరారు.  హాజిపూర్ ఈ పేరు వింటే చాలు సైకో శ్రీనివాసరెడ్డి ఘాతుకం కళ్ళముందు కదలాడుతుంది. దిశ నిందితుల ఎన్ కౌంటర్ తర్వాత అమ్మాయిల పై దారుణాలకు తెగబడ్డ నిందితుల పరిస్థితి ఏంటి, వారి విషయంలో ఏం చేస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఒకవైపు ఎన్ కౌంటర్ పై రచ్చ జరుగుతుంటే బాధిత కుటుంబాలు మాత్రం మృగాళ్లను కాల్చి చంపాలని డిమాండ్ చేస్తున్నాయి. శ్రీనివాస్ రెడ్డి అలియాస్ సైకో శ్రీను చేసిన దారుణాలు అంత త్వరగా మరచిపోయేవి కావు అమ్మాయిలను ట్రాప్ చేయడం తర్వాత అత్యాచారానికి ఒడిగట్టడం అనంతరం హత్య చేసి పూడ్చిపెట్టడం ఏకంగా తన పొలంలోని బావినే అడ్డాగా చేసుకొని అభం శుభం తెలియని  అమ్మాయిల జీవితాలను ఛిద్రం చేశాడు. నేరం చేసి తనకేపాపం తెలీదన్నట్టు అందరిని నమ్మించాడు. కానీ అతనిలో ఉన్న సైకో కోణం కొద్ది రోజులకి వెలుగుచూసింది.  

ఉన్నావ్‌ రేప్‌ కేసులో బీజేపీ మాజీ ఎమ్మెల్యేని దోషిగా తేల్చిన కోర్టు

  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్‌ రేప్‌ కేసులో ఢిల్లీ తీస్‌ హజారీ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్‌ సింగ్ సెంగార్‌ ను దోషిగా తేల్చింది. ఈ నెల 19న శిక్ష ఖరారు చేయనున్నట్టు కోర్టు పేర్కొంది. రెండేళ్ల క్రితం ఈ కేసు నమోదుకాగా.. సుప్రీం కోర్టు చొరవతో లక్నో నుంచి ఢిల్లీ కోర్టుకు కేసు బదిలీ అయ్యింది. 2017లో కేసు నమోదు కాగా.. ఇప్పటికి కుల్దీప్ సింగ్ సెంగార్‌ను దోషిగా కోర్టు ప్రకటించింది. అన్ని సాక్ష్యాధారాలను పరిశీలించిన ఢిల్లీ కోర్టు.. మాజీ ఎమ్మెల్యేను దోషిగా తేల్చింది. పోక్సో చట్టంలోని సెక్షన్‌ 5(సీ) మరియు ఐపీసీ 376 సెక్షన్‌ కింద సెంగార్‌ను దోషిగా నిర్ధారించారు. సెంగార్‌ను దోషిగా ప్రకటిచండంతో.. ఆయన కోర్టు హాలులోనే బోరున విలపించారు.   ఉన్నావ్ రేప్ కేసు ఎన్నో మలుపులు తిరిగింది. అప్పటి బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్‌ పై కిడ్నాప్, సామూహిక అత్యాచారం ఆరోపణలు వచ్చాయి. తన దగ్గరకు పనికోసం వచ్చిన మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడటమే కాకుండా.. అనంతరం ఆమె కుటుంబసభ్యులను వివిధ రకాలుగా వేధించినట్టు ఆరోపణలు వచ్చాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు.. కుల్దీప్ సింగ్, అతనికి సహకరించిన శశిసింగ్‌పై పోక్సోతో పాటు పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. కేసులైతే నమోదు చేసారు కానీ శిక్షలు మాత్రం బాధితురాలి కుటుంబసభ్యులు అనుభవించారు. బాధితురాలి తండ్రిపై అక్రమాయుధాలు కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో ఉండగానే ఆయన ప్రాణాలు వదిలారు. గత జులైలో బాధితురాలిపై హత్యాయత్నం జరిగింది. ఆమె ప్రయాణిస్తున్న కారును ట్రక్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో బాధితురాలి బంధువులు ఇద్దరు మరణించగా.. ఆమెతో పాటు ఆమె తరపు లాయర్ కి తీవ్ర గాయాలయ్యాయి. ఇది సెంగారే చేయించాడనే ఆరోపణలు వెల్లువెత్తడంతో.. బాధితురాలికి ఢిల్లీ మహిళా కమిషన్ ఆశ్రయమిచ్చింది. సుప్రీం ఆదేశాలతో ఆమె కుటుంబానికి సీఆర్పీఎఫ్‌ బలగాలతో రక్షణ కల్పించింది. ఇటు పరిస్థితిని సమీక్షించిన సుప్రీం కేసును లక్నో బెంచ్ నుంచి ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేసింది. అంతలోనే బాధితురాలిపై మరోసారి హత్యాయత్నం జరిగింది. ఈ నెల 7న బాధితులరాలిని సజీవంగా తగులబెట్టేందుకు కొంతమంది ప్రయత్నించారు. ఈ ఘటనలో బాధితురాలు 90 శాతం కాలిపోయింది. చివరకు హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ.. ఈ నెల 8న తుదిశ్వాస విడిచింది. ఈ ఘటనలో ఇప్పటికైనా సరైన న్యాయం చేయాలనీ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మరి కోర్టు మాజీ ఎమ్మెల్యేకి ఎలాంటి శిక్ష విధిస్తుందో చూడాలి.

కాలుష్యం, కబ్జాలు ఇక సాగవు.. మూసీ నది ప్రక్షాళన కోసం ఉద్యమిస్తున్న బీజేపీ

కాలుష్యాన్ని పారద్రోలుదాం.. మూసీ నదికి జీవం పోద్దాం అంటూ పోరు బాట పట్టింది బిజెపి. నమామి మూసీ పేరుతో ముచికుందా నది ప్రక్షాళన చేయాలంటోంది. దశల వారీగా మూసీ శుద్ధి జరిగే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పింది. హుస్సేన్ సాగర్ నీళ్లను కొబ్బరినీళ్లలా మారుస్తామన్న కేసీఆర్ హామీ మాటలకే పరిమితమైందని ఆరోపించింది కమలం పార్టీ. మూసీ నది ప్రక్షాళన కోసం నడుం బిగించింది కమలదళం. కాలుష్యం, కబ్జాల నుండి కాపాడాలంటూ కార్యక్రమాన్ని చేపట్టింది. మానవ తప్పిదాలు ప్రభుత్వాల నిర్లక్ష్యం ముచుకుందా నది కాలుష్యం బారిన పడిందని ఆరోపించింది. నమామి గంగా స్ఫూర్తితో నమామి మూసీ ఉద్యమాన్ని ప్రారంభించింది. మూసీ జన్మస్థానంలో బిజెపి నేతలు సంకల్పం తీసుకున్నారు. వికారాబాద్ జిల్లా అనంతగిరిలో మూసీ నదికి పూజలు చేసి హారతి ఇచ్చారు. మూసీ ప్రక్షాళన కోసం దశల వారీగా ఉద్యమం చేస్తామన్నారు లక్ష్మణ్. ఈ నెల పదహారు న హైదరాబాద్ లోని బాపూఘాట్ దగ్గర, ఈ నెల పదిహెడు న సూర్యాపేటలో కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. మూసీ సుందరీకరణ కాదని శుద్ధి కావాలని డిమాండ్ చేశారు. హుస్సేన్ సాగర్ నీళ్లను కొబ్బరి నీళ్ళల్లా మారుస్తామని సీఎం గొప్పలు చెప్పారని ఇంత వరకూ ఏమీ చెయ్యలేదని బీజేపీ విమర్శించింది. బిజెపి వరుస ఉద్యమాలతో ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నిస్తోంది. మద్యం షాపులకు వ్యతిరేకంగా త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించింది. మూసీ పోరాటాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేలా ప్లాన్ చేసింది కమలం పార్టీ.

టీపీసీసీ  చీఫ్ మార్పు.. ఢిల్లీలో మకాం వేసిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు

తెలంగాణ కాంగ్రెస్ లో పీసీసీ చీఫ్ మార్పు పై ఒకటే చర్చ నడుస్తుంది. కొత్త అధ్యక్షుడు ఎవరనే దానిపై ఇప్పటికే నేతల్లో చర్చలు జరిగాయి. భారత్ బచావో కార్యక్రమం కోసం ఢిల్లీకి వెళ్లిన నేతలు ఇదే అదనుగా లాబీయింగ్ మొదలు పెట్టారు. తమ అనుకూల నాయకుడికి పదవి కట్టబెట్టాలని కొందరు తంటాలు పడుతుంటే లేదు మావాడికే ఇవ్వాలని మరికొందరు అధిష్ఠానంలోని కీలక నాయకులకు చెప్పుకొనేందుకు శతవిధాలుగా ప్రయత్నించారు. సోనియగాంధీ అపాయింట్ మెంట్ కోసం పార్టీలో చాలా మంది సీనియర్ నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యే సీతక్క మాత్రం భారత్ బచావో కంటే ముందే సోనియాను కలిశారు. కాంగ్రెస్ ముఖ్య నాయకులు పీసీసీ చీఫ్ ఉత్తమ్, ఎంపీలు, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క లాంటి నాయకులంతా అక్కడే ఉండడంతో పీసీసీ చీఫ్ మార్పు పై గట్టిగానే ప్రచారం జరుగుతోంది. అధ్యక్ష పదవిని ఆశిస్తున్న వారిలో శ్రీధర్ బాబు , రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు. తాను కూడా రేసులో ఉన్నానని హడావుడి చేసిన కోమటిరెడ్డి వెంకట రెడ్డి ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్నారు. అధిష్టానం అవకాశమిస్తుందన్న ఆశతోనే నాయకులు అభిప్రాయ సేకరణ చేస్తున్నారనే ప్రచారం కొనసాగుతోంది. అయితే సోనియగాంధీ మాత్రం పార్టీ నాయకత్వం పై మార్పు ఆలోచన చేస్తారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎలాంటి చిన్న అవకాశం దొరికినా నాయకులు తమ మనసులోని మాటను అధినేత్రికి చెప్పి పని చక్కబెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

ఉల్లితో ఓవర్ నైట్ కోటీశ్వరుడైన రైతు

ఉల్లిపాయలు కొనాలనుకునే వినియోగదారుల గుండెలు అదురుతుంటే.. ఓ రైతుకు మాత్రం అవే ధరలు కోట్లకు కోట్లు ఆదాయం తెచ్చి పెట్టింది. రాత్రికి రాత్రి అతని కోటీశ్వరుడిని చేసేసింది. కర్ణాటక రాష్ట్రంలోని చిత్రదుర్గ జిల్లా దొడ్డి సిద్ధమన్నల్లికి చెందిన మల్లికార్జున 20 ఎకరాల పొలంలో ఉల్లి సాగు చేశాడు. ఈ సారి మార్కెట్ లో విపరీతమైన రేటు ఉండటంతో అతని పంట పండింది. ఇప్పటి వరకు 240 టన్నులను అమ్మితే నాలుగున్నర కోట్ల వరకు ఆదాయం వచ్చింది. అతను ఈ స్థాయిలో డబ్బు వస్తుందని కలలో కూడా ఊహించలేదు. ప్రస్తుతం మార్కెట్ లో రేటు దాదాపు రూ.200 వరకు ఉండటం కలిసొచ్చింది. చుట్టు పక్కల మరికొందరు రైతులు కూడా ఉల్లి సాగు చేసిన ఎవరికీ ఇంతలా ఆదాయం రాలేదు. దిగుబడి బాగా ఉండడం, ధర కూడా కనీవినీ ఎరుగని రీతిలో ఉండడతో మల్లికార్జున సుడి తిరిగింది. కొన్నేళ్లుగా ఉల్లి పంట మీద ఆదాయం పెద్దగా లేకపోవడంతో ఈ సారి అప్పు చేసి మరీ పెట్టుబడి పెట్టాడు. తనకు ఉన్న 10 ఎకరాల పొలంతో పాటు మరో 10 ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేశాడు. ఈ సారి దిశ తిరిగి కోట్లకు పడగలెత్తాడు. ప్రస్తుతం తన అప్పులు తీరిపోయాయని వచ్చిన డబ్బుతో ఇల్లు కొనుక్కుంటానని మల్లికార్జున చెబుతున్నాడు. అలాగే మరికొంత వ్యవసాయ పొలం కూడా కొనుక్కుంటానంటున్నాడు మల్లికార్జున్. ఏటా ఉల్లి సాగు చేసినప్పుడు దిగుబడి బాగా వచ్చిన 5 లక్షలకు మించి మిగులు ఉండదని రైతు మల్లికార్జున చెప్తున్నాడు. ఈ సారి కూడా రూ.5 నుంచి 10 లక్షల మధ్యలో మిగిలితే చాలనుకున్నానని కానీ అనూహ్యంగా పెరిగిన రేట్లతో తన కుటుంబం దశ మారిపోయిందంటున్నాడు. ఇప్పటికీ 20 లోడ్ల వరకు ఉల్లిపాయలూ అమ్మాడు, మిగతా పంటను కూడా అమ్మితే ఇంకొంచెం ఆదాయం అతని ఖాతాలో పడబోతుంది.

చంద్రబాబును రూలర్ అంటూ పొగిడిన వైసీపీ స్టార్

తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది ప్రస్తుతం జగన్ పార్టీ లోనే ఉన్నారు. ఎన్నికల ముందు నుంచి కూడా ఆయనకు సపోర్ట్ చేశారు. గెలిచిన తర్వాత వాళ్ల పంట పండింది. ఇక జగన్ తోనే తమ ప్రయాణమని జీవితా రాజశేఖర్ కూడా చాలా రోజుల నుంచి అక్కడే ఉన్నారు. పార్టీలు మారి మారి చివరికి జగన్ దగ్గరకు వచ్చి ఆగారు. ఏపీ ఎన్నికల సమయంలో వైసిపి కండువాలు కప్పుకున్న జీవితా రాజశేఖర్ జగన్ కు మద్దతుగా ప్రెస్ మీట్లు కూడా పెట్టారు. ఈ జంట ఇప్పుడు ఉన్నట్టుండి జగన్ కు హ్యాండ్ ఇచ్చేలా కనిపిస్తున్నారు. నిజంగానే ఇపుడు పార్టీ మారారేమో అనే అనుమానం వచ్చేసింది. దానికి కారణం బాలయ్య రూలర్ సినిమా ప్రీ రిలీజ్ వేడుక అనే చెబుతున్నారు.  ఈ మధ్యనే యాక్సిడెంట్ అయ్యి మళ్లీ కోలుకుని.. బాలయ్య సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు వచ్చాడు రాజశేఖర్. తన వంతుగా వచ్చి బాలయ్య సినిమాకు ప్రమోషన్ చేశాడు.  గతంలో రాజశేఖర్ నటించిన గరుడ వేగ సినిమా ట్రైలర్ లాంచ్ చేశాడు బాలయ్య. ఇప్పుడు ఈయన వేడుకకు వచ్చి లెక్క సరిచేశాడు రాజశేఖర్. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాలయ్య రూలర్ ఆయన తండ్రి కూడా ఓ రూలర్ అని పొగిడాడు రాజశేఖర్. అక్కడితో ఆగకుండా ఆయన వియ్యంకుడు కూడా ఓ రూలర్ అంటూ చంద్రబాబుని కూడా పొగిడేశాడు ఈ సీనియర్ హీరో. ఈ సినిమా సంక్రాంతి వరకూ రూల్ చేస్తూనే ఉంటుందని ఫ్యూచర్ చెప్పాడు రాజశేఖర్. అక్కడ స్టేజి పై రాజశేఖర్ చెప్పిన మాటలు బాలయ్య అభిమానులకు కిక్ ఇచ్చినా వైసిపి వాళ్లకు మాత్రం షాకిచ్చాయి. ఓ పార్టీలో ఉండి మరో పార్టీని పొగడటం ఏంటో ఆ పార్టీ నాయకుడు భజన చేయడమేంటో అంటూ వైసిపి నేతలు సీరియస్ అవుతున్నారు. తోటి హీరో కాబట్టి బాలయ్య సినిమా వేడుకకు వెళ్లడంలో తప్పు లేదని కానీ అక్కడ బాలయ్యతో పాటు అందరికీ భజన చేయాల్సిన అవసరమేంటని రాజశేఖర్ దంపతుల పై ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది.

అమరావతిలో రాజధానికి బై బై... వైసీపీ నేతల వైఖరితో వీడని కన్ఫ్యూషన్

రాజధాని పై సందిగ్ధం కొనసాగుతోంది. కొద్ది నెలల క్రితం మంత్రి బొత్స వ్యాఖ్యలతో మొదలైన గందరగోళం కంటిన్యూ అవుతోంది. రాజధాని నిర్మాణాల్లో అవినీతి జరిగిందని తమ ప్రభుత్వం త్వరలోనే క్యాపిటల్ పై తగిన నిర్ణయం తీసుకొంటుందని బొత్స చేసిన కామెంట్స్ పెను దుమారాన్ని రేపాయి. రాజధాని గెజెట్ ఎక్కడుందన్న బొత్స వ్యాఖ్యలతో తరలించడం కాయమన్న ప్రచారమూ జరిగింది. క్యాపిటల్ పనులు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి, సింగపూర్ కూడా ఒప్పందం నుంచి తప్పుకుంది. దీంతో సహజంగానే రాజధానిపై గందరగోళం ఇంకా పెరిగింది. కేంద్రం ప్రచురించిన న్యూ ఇండియా మ్యాప్ లో ముందుగా అమరావతి పేరు లేకపోవటం తరువాత చేర్చటం అంతా అయోమయం సృష్టించింది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, శాసన మండలిలో ప్రభుత్వం ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానం రాజధాని వాసుల్లో ఆశలు రేకెత్తించింది.  ఏపీ క్యాపిటల్ అమరావతినేనని మార్పు ఆలోచనే లేదని టిడిపి సభ్యులు అడిగిన ప్రశ్నలకు జవాబు ఇచ్చారు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స. దీంతో రాజధాని అమరావతినే అంటూ ప్రచారం జోరందుకుంది, అయితే ఆ సమాధానం అప్పటి వరకు ఉన్న పరిస్థితి మాత్రమేనని దానికి అనుబంధంగా ప్రశ్నలొస్తే ఇంకొంచం సమాదానం ఇచ్చేవాడినని మరో బాంబు పేల్చారు బొత్స. ప్రభుత్వం వేసిన కమిటీ నివేదిక ప్రకారమే నిర్ణయం ఉంటుందని తేల్చేశారు. పైగా అసెంబ్లీ సమావేశాలున్నాయి కాబట్టి అన్ని విషయాలూ బయటకు చెప్పలేమంటూ క్యాపిటల్ పై కన్ఫ్యూజన్ మరింతపెంచారు. ఆయనే కాదు పార్టీల నాయకులది అదే మాట, నిపుణుల కమిటీ నివేదిక తర్వాతే క్యాపిటల్ ఫైనల్ అంటున్నారు ఎంపీ విజయసాయిరెడ్డి, చీఫ్ శ్రీకాంత్ రెడ్డి. ఎప్పటికప్పుడు నేతల ప్రకటనలతో రాజధాని పై అనిశ్చితి అయితే కొనసాగుతోంది. అసలు సిఎం జగన్ మనసులో ఏముంది అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. కమిటీ నివేదికలు ఇచ్చినా ప్రభుత్వ పెద్దలు ఆలోచనలకు అనుగుణంగానే నిర్ణయం ఉంటుందని గత అనుభవాలు చెబుతున్నాయి. జగన్ ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తారో కమిటీ నివేదిక ఆధారంగా రాజధాని పై నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

ఖంగుతిన్న స్పీకర్.. ఎంపీల ఫుడ్ సబ్సిడీతో సంవత్సరానికి రూ.17 కోట్ల భారం

  పార్లమెంటు క్యాంటీన్ లో భారీ రాయితీ పై తింటూ వచ్చారు మన ఎంపీలు. ఇటీవల పార్లమెంట్ ఖర్చుల పై ఆరా తీస్తే క్యాంటీన్ ఖర్చు చూసి స్పీకర్ ఆశ్చర్యపోయారు, ఏటా కోట్లాది రూపాయల చెల్లిస్తున్నారు. అందుకే రాయితీకి గుడ్ బై చెప్పాలను నిర్ణయించారు. వచ్చే పార్లమెంటు సమావేశాల నుంచి ఎంపీలకు రాయితీపై ఫుడ్ సర్వ్ చేయరు. అసలు ధర ఎంత ఉంటే అంత చెల్లించాల్సిందే. పార్లమెంట్ క్యాంటీన్ లో ఎంపీల ఫుడ్ సబ్సిడీ భారం ఏటా రూ.17 కోట్లకి చేరింది. గత ఐదేళ్లలో రూ.60 కోట్ల 70 లక్షల వరకు ప్రభుత్వం చెల్లించింది. ఇంత ఖర్చా అని ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టింది. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా అన్ని రాజకీయ పార్టీల నేతలతో సబ్సిడీ పై అభిప్రాయాలు తీసుకున్నారు. అందరి ఏకాభిప్రాయంతో పార్లమెంటు క్యాంటీన్ లో అసలు ధరలకే ఫుడ్స్ చేయాలని నిర్ణయించారు. దీంతో వచ్చే సమావేశాల్లో ఎంపీలకూ భోజనం బిల్ భారీగానే పడనుంది. పార్లమెంటులో ఎంపీలు ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసిన మధ్యాహ్న భోజనం ఆరగించిన చెల్లించేది చాలా తక్కువ. చికెన్ బిర్యానీ తినాలంటే బయట రెండు వందల వరకు ఖర్చు అవుతుంది. కానీ మన ఎంపీలు పార్లమెంటు క్యాంటీన్ లో జస్ట్ అరవై రూపాయలు చెల్లిస్తే చాలు టేస్టీ బిరియాని ముందుండేది. ఒక్క బిర్యానీనే కాదు మటన్ కర్రీ కూడా కేవలం నలభై ఐదు రూపాయలే. భోజనమైతే రూ.7 రూపాయలు, తందూరి చికెన్ రూ.60 రూపాయలకే సాగుచేసేవారు. ఇదే ఫుడ్ అసలు ధర రూ.350 కు పై మాటే. 2015 లోనే పార్లమెంట్ క్యాంటీన్ లో ఎంపీలకు సబ్సిడీ ఫుడ్ అందించడం పై పెద్దెత్తున విమర్శలొచ్చాయి. 90 శాతానికి పైగా ఎంపీలు ఆర్థికంగా కోటీశ్వరులే, కనీస భోజనానికి కూడా డబ్బులు చెల్లించలేని స్థితిలో ఉన్నారా అంటూ విమర్శలు కూడా వచ్చాయి. సోషల్ మీడియాలో పేద ఎంపీలంటూ సెటైర్ లు వినిపించాయి. దీంతో డిసెంబర్ 2015 లో అప్పటి లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటన ఒకటి విడుదల చేశారు. పార్లమెంట్ లోని క్యాంటీన్ లాభనష్టాల పై పనిచేయదన్నారు. అయినా అసలు దరకే సర్వ్ చేసేలా చూస్తామన్నారు. అయితే అది పూర్తి స్థాయిలో అమల్లోకి రాలేదు. తాజాగా శీతాకాల సమావేశాల్లో స్పీకర్ చొరవతో ఇప్పుడు ఆచరణలోకొచ్చింది.  

కొమురవెల్లి మల్లన్న ఆలయం పక్కన శ్మశానవాటిక నిర్మాణాన్ని అడ్డుకుంటున్న భక్తులు

కొమురవెల్లి మల్లన్న , సిద్దిపేట జిల్లాకే తలమానికంగా వెలుగొందుతున్న ప్రముఖ శైవక్షేత్రం. ప్రతి సంవత్సరం 10 కోట్లకు పైగా ఆదాయం సమకూరుతున్నాయి. ఆలయ అభివృద్ధి పై సీఎం కేసీఆర్ , జిల్లా మంత్రి హరీశ్ రావు కూడా ప్రత్యేక దృష్టి సారించారు. ఇలా అన్ని బాగానే ఉన్న సమయంలో మల్లన్న స్వామికి మల్లన్న భక్తులకు కొత్త సమస్య వచ్చిపడింది.ఆలయానికి అతి సమీపంలో సర్వే నెంబర్ 223లోని ప్రభుత్వ స్థలంలో జనావాసాల మధ్య శ్మశానవాటికను నిర్మించాలని నిర్ణయించారు అధికారులు , స్థానిక నాయకులు. శ్మశానవాటిక నిర్మాణానికి ఎంపిక చేసిన స్థలం దేవాలయానికి 400 మీటర్ల దూరంలో ఉంది. స్వామి వారి బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులు ఆ ప్రదేశంలో తాత్కాలిక గుడారాలు వేసుకొంటారు. స్వామి వారికి పట్నాలు, బోనాలు సమర్పిస్తారు. ఆ కారణంగా మల్లన్న భక్తులు ఇటు గ్రామ ప్రజలు శ్మశానవాటికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.ఇదే స్థలంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తలపెట్టిన గెస్ట్ హౌస్ నిర్మాణానికి మంత్రి హరీష్ రావు భూమి పూజ కూడా చేశారు. 2 కోట్లతో రోడ్డు నిర్మాణం కూడా చేపట్టారు. ఈ విషయాన్ని యాదవ సంఘం నేతలు మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకువచ్చారు. స్మశాన వాటిక ఏర్పాటు కోసం ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించాలని జిల్లా కలెక్టర్ కు హరీశ్ రావు సూచించారు. మంత్రి సూచనలతో ఆలయ సమీపం లో కాకుండా డంపింగ్ యార్డు దగ్గర శ్మశానవాటికను నిర్మించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. మంత్రి, కలెక్టర్ మాటలు కూడా లెక్క చేయకుండా స్థానిక నేతలు భూ రికార్డులు మాయం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆలయ సమీపంలోని దాసరి గుట్ట దగ్గర శ్మశానవాటికను నిర్మించాలని పట్టుదలగా ఉన్నారు. ధార్మిక సంస్థలు మాత్రం ఆగమశాస్త్రం ప్రకారం దేవాలయానికి దూరంగా శ్మశానవాటిక నిర్మించాలంటున్నారు. దేవాలయ కాలనీ వాసులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్ని కులాల వారికి శ్మశానవాటికలు ఉన్నాయని.. కొత్తగా మరొకటి ఎందుకని జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాలు అందజేశారు. భక్తుల మనోభావాలను గౌరవించి శ్మశానవాటికను ఆలయ అధికారులు స్థానిక నాయకులు వేరే స్థలంలో నిర్మిస్తారనే అంటున్నారు గులాబీ కార్యకర్తలు.

జనసేనా లేక వైసీపీనా?.. రాపాక వైఖరితో సతమతమవుతున్న కార్యకర్తలు

  తూర్పు గోదావరి జిల్లాలో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. జనసేన ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ వేస్తున్న అడుగులు వైసీపీలో కలకలం రేపుతున్నాయి. వైసీపీకి ఆయన దగ్గరవుతున్నారని.. త్వరలో చేరుతారని ప్రచారం జోరుగా జరుగుతుంది. దీంతో రాజోలు నియోజక వర్గాల్లో వైసీపీ శ్రేణులు అప్రమత్తమవుతున్నాయి. రాపాక రాకుండా అడ్డుకునేందుకు మంత్రాంగం నడుపుతున్నారు. ఈ మధ్య జనసేన ఎమ్మెల్యే రాపాక జగన్ కు సన్నిహితంగా ఉంటున్నారు. దీనికి తోడు నియోజకవర్గానికి ఇన్ చార్జ్ గా ఉన్న బొంత రాజేశ్వర్ రావును కాదని అమ్మాజీకి పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడంపైనా బొంతు వర్గం భగ్గుమంటోంది. రాజోలు నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు ఎవరికీ అంతుబట్టడం లేదు. అటు రాపాక ఇటు అమ్మాజీ మధ్య గతంలో పోటీ చేసి ఓడిపోయిన ఇన్ చార్జి బొంతు పరిస్థితి అయోమయ స్థితిలో పడింది. అయితే పార్టీలో తనకు ప్రాధాన్యత తగ్గిందన్న వార్తలను బొంతు రాజేశ్వరరావు అంగీకరించడం లేదు. కేవలం ప్రభుత్వ కార్యక్రమాల్లో మాత్రమే రాపాక పాల్గొంటున్నారని పార్టీతో సంబంధం లేదంటున్నారు. రాజోలు రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. నిన్నటి వరకు కూడా జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు పార్టీ వీడుతున్నారంటూ కొన్ని ఆరోపణలొచ్చాయి. అలాగే జనసైనికులు కూడా ఆందోళన చెందుతున్నారు. కానీ రాజకీయాలు యూటర్న్ చేసుకున్నాయి. వైసీపీ ఇన్ చార్జ్ బొంతు రాజేశ్వరరావుని పక్కన పెట్టారంటూ కూడా రాజేశ్వరరావు అనుచరులూ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి.

హైబ్రీడ్ లైన్లతో తాత్కాలిక ఉపశమనం... నెలరోజుల తర్వాత మాత్రం బాదుడే..

జాతీయ రహదారులపై దేశవ్యాప్తంగా ఫాస్టాగ్ అమల్లోకి వచ్చింది. నేషనల్ హైవేస్ పై వాహనదారులు టోల్ చెల్లించడానికి ఈ ఫాస్టాగ్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. రేడియో ఫ్రీక్వెన్సీ గుర్తింపు పరికరం ద్వారా ఈ విధానం పనిచేస్తోంది. అయితే, ఫాస్టాగ్ విధానంలోకి వాహనదారులు ఇంకా మారకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాహనదారులు నగదు చెల్లించడానికే ఆసక్తి చూపడంతో టోల్ గేట్ల దగ్గర భారీ ట్రాఫిక్ జామ్స్ ఏర్పడుతున్నాయి. ఫాస్టాగ్ కు అధిక లైన్లు ఏర్పాటు చేయడం... అలాగే నగదు చెల్లింపు లైన్లను కుదించడంతో టోల్ గేట్ల దగ్గర పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. అయితే, ఫాస్టాగ్ విధానంలోకి మారడానికి ఇప్పటికే తగినంత సమయమిచ్చి, ఒకట్రెండుసార్లు గడువు పొడిగించినా, అధిక వాహనదారులు ఇంకా కొత్త విధానంలోకి మారకపోవడంతో తాత్కాలిక ఉపశమనంగా టోల్ గేట్ల దగ్గర హైబ్రీడ్ లైన్లను ఏర్పాటు చేశారు. ఈ హైబ్రీడ్ లైన్లలో ఫాస్టాగ్ రహిత వాహనాలకు ఎలాంటి పెనాల్టీలు లేకుండా సాధారణ టోల్ వసూలు చేస్తారు. అయితే, ఈ హైబ్రీడ్ లైన్లు కూడా కేవలం నెలరోజులు మాత్రమే పనిచేస్తాయని, అప్పటిలోపు ఫాస్టాగ్ లోకి మారాలని, ఒకవేళ మారకపోతే ఫాస్టాగ్ లేని వాహనాలకు రెట్టింపు ఫీజు ఉంటుందని కేంద్రం ప్రకటించింది. రేడియో ఫ్రీక్వెన్సీ పరికరం ద్వారా వాహనదారుల నుంచి ఆటోమేటిక్‌గా టోల్ వసూలు విధానం అమల్లోకి రావడంతో కేవలం ఐదే ఐదు సెకన్లలో టోల్ గేటును దాటి వెళ్లిపోతున్నారు. దాంతో, ఫాస్టాగ్ విధానంలోకి మారిన వాహనదారులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. కానీ, ఫాస్టాగ్ విధానంలోకి మారని వాహనదారులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే, అధికశాతం వాహనదారులు ఫాస్టాగ్ లోకి మారలేదని గుర్తించిన కేంద్రం... మరో నెలరోజులపాటు ఉపశమనం కల్పిస్తూ టోల్‌గేట్ల దగ్గర హైబ్రీడ్ లైన్ సౌకర్యం కల్పించింది.

సామాన్యులపై మరో పిడుగు..! పెనుభారం మోపేందుకు కేంద్రం అడుగులు

చలికాలంలోనూ ధరలు మండిపోతుంటే... సామాన్యులపై మరింత పెనుభారం మోపేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఒకవైపు ఆర్ధిక మందగమనం... మరోవైపు వినిమయశక్తి పడిపోవడంతో... పన్ను ఆదాయ లోటును పూడ్చుకునేందుకు అడుగులు వేస్తోంది. జీఎస్టీ రేట్లను పెంచేందుకు రంగం సిద్ధంచేస్తోంది. ప్రస్తుతమున్న జీఎస్టీ స్లాబ్స్‌ను కుదించి... రేట్లను పెంచేందుకు రెడీ అవుతోంది. ఇప్పుడున్న 5, 12, 18, 28 శాతం జీఎస్టీ స్లాబ్స్ ను, మూడింటికి కుదించి ...8, 18, 28 శాతం చొప్పున అమలు చేయాలని భావిస్తోంది. కేంద్రం ఆశించినస్థాయిలో జీఎస్టీ ఆదాయం రాకపోవడంతోనే ఈ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే, ఈ ఆర్ధిక సంవత్సరంలో జీఎస్టీ ఆదాయం అనుకున్నదాని కంటే 40 శాతం తగ్గింది. ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు 5లక్షల 26వేల కోట్ల ఆదాయం వస్తుందని బడ్జెట్‌లో అంచనా వేయగా... కేవలం 3లక్షల 28వేల 365కోట్లు మాత్రమే వచ్చింది. ఇలా 2017 నుంచి ఇప్పటివరకు నిర్దేశించుకున్న లక్ష్యాలను కేంద్రం అందుకోలేకపోతోంది. అయితే, కనిష్ట పన్ను స్లాబు 5శాతాన్ని 8శాతానికి పెంచితే అదనంగా 3వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందని కేంద్రం అంచనా వేస్తోంది. కానీ, ఈ స్లాబ్ రేటును పెంచితే నిత్యవసర ధరలు మరింత పెరుగుతాయని అంటున్నారు. ముఖ్యంగా ఆహారోత్పత్తులు, సామాన్యులు వినియోగించే వస్తువుల ధరలు భారీగా పెరగడం ఖాయమంటున్నారు. అలాగే, జీఎస్టీ ఆదాయం పెంచుకునేందుకు హెల్త్ కేర్ రంగాన్ని 18పర్సంటేజ్ స్లాబ్‌లోకి చేర్చే అవకాశం కనిపిస్తోంది. దాంతో, సామాన్యులపై పెనుభారం పడుతుందని చెబుతున్నారు. అలాగే, మొబైల్స్ ఫోన్స్ పైనా జీఎస్టీ రేట్లు పెంచాలని కేంద్రం చూస్తోంది.  ఆర్ధిక మందగమనంతోపాటు మార్కెట్లో గిరాకీ తగ్గిన కారణంగా జీఎస్టీ వసూళ్లు పడిపోయాయి. దాంతో, జీఎస్టీ ఆదాయం భారీగా పడిపోవడమే కాక, పలు రాష్ట్రాలకు పన్ను పరిహారం చెల్లింపులు పెండింగ్ లో పడ్డాయి. మరోవైపు, ఆదాయం కోసం జీఎస్టీ రేట్లు పెంచాలని పలు రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి. దాంతో, అదనపు ఆదాయం కోసం జీఎస్టీ రేట్లు పెంచడం తప్ప మరో మార్గం లేదని మోడీ సర్కారు భావిస్తోందని అంటున్నారు. ప్రస్తుతమున్న నాలుగు స్లాబులను మూడింటికి కుదించడంతోపాటు రేట్లు పెంచడం... అలాగే జీఎస్టీకి అదనంగా విధించే సుంకాన్ని కూడా పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అంటే, ప్రస్తుతమున్న 5 పర్సంటేజ్ స్లాబ్‌ను 3శాతం పెంచి 8 చేయడం... అలాగే, 12శాతం స్లాబ్‌ను ఎత్తివేసి... దాన్ని 18లో విలీనం చేయనున్నారు. ఇక, చివరిదైన 28శాతం స్లాబ్‌‌ను యథాతథంగా ఉంచి సెస్‌ పెంచనున్నారు. కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన డిసెంబర్ 18న జరగనున్న జీఎస్టీ మండలి సమావేశంలో స్లాబ్స్ కుదింపు... రేట్ల పెంపుపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.