రుషికొండలో సచివాలయం..! నెలరోజుల్లోనే తరలింపు
posted on Dec 24, 2019 @ 1:58PM
ఇంకా, ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రానే లేదు... కానీ అప్పుడే ఏపీ రాజధాని తరలింపు ప్రక్రియ మొదలైపోయింది. సీఎం జగన్ అసెంబ్లీ ప్రకటనకు ముందే విశాఖలో పరిపాలనా రాజధాని కోసం భవనాల అన్వేషణ జరిగిపోతోంది. అధికారిక ప్రకటక చేశాక నెలరోజుల్లో వీలైనన్ని కార్యాలయాలను తరలించేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఇప్పటికే భవనాల అన్వేషణ చేపట్టాలంటూ ఉన్నతాధికారుల నుంచి విశాఖ స్థానిక అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. దాంతో, ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ఏర్పాటుకు అవసరమైన భవనాల కోసం సెర్చింగ్ మొదలుపెట్టారు. అయితే, రుషికొండ ఐటీ పార్కు మిలీనియం టవర్ వన్ లో సచివాలయం ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
రుషికొండ ఐటీ పార్కు మిలీనియం టవర్ వన్ లో ప్రస్తుతం నాలుగు అంతస్తులు ఖాళీగా ఉన్నాయి. మరో నాలుగు అంతస్తుల్లో ఒక ఐటీ కంపెనీ నడుస్తోంది. ప్రస్తుతం ఇక్కడ లక్ష చదరపు అడుగుల విస్తీర్ణం అందుబాటులో ఉంది. ఇక, దీని పక్కనే మిలీనియం టవర్-2 శరవేగంగా నిర్మాణం జరుపుకుంటోంది. ఇది పూర్తయితే మరో లక్ష చదరపు అడుగుల క్యాంపస్ అందుబాటులోకి వస్తుంది. మిలీనియం టవర్స్ కి పక్కనే వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ సోదరుడు నిర్మిస్తోన్న ఐదు అంతస్తుల భవనం కూడా ఉంది. ప్రభుత్వం కోరితే దీన్ని ఇచ్చే అవకాశముంది. అలాగే, మిలీనియం టవర్స్ కి సమీపంలోనే నాలుగు ఎకరాల్లో నిర్మించిన ఐబీఎం క్యాంపస్ ఉంది. అయితే, ఐబీఎంతో చర్చించి ఆ క్యాంపస్ ను తీసుకుంటారని అంటున్నారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కంపెనీకి చెందిన 70వేల చదరపు అడుగుల క్యాంపస్ ప్లగ్ అండ్ ప్లేతో రెడీ ఉంది. దీని పక్కనే మిరాకిల్ కంపెనీ భవనం ఖాళీగా ఉంది. అలాగే, రుషికొండ ఐటీ పార్కుకు సమీపంలోనే ఆదిత్య కంపెనీ నిర్మిస్తోన్న భారీ అపార్ట్ మెంట్ దాదాపు సిద్ధమైంది. ఇందులో వందకు పైగా ప్లాట్లు ఉన్నాయి. ఆ పక్కనే విల్లాలు కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే, విశాఖ నడిబొడ్డున్న ఉన్న ఏడెకరాల విప్రో క్యాంపస్ ను కూడా తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక ఉద్యోగుల నివాసాల కోసం మధురవాడ దగ్గర సుమారు 20 ఎకరాల్లో భారీ రహదారులు, పార్కింగ్, వాకింగ్ ట్రాక్, హాస్పిటల్, కమ్యూనిటీ బిల్డింగ్స్ ... ఇలా సకల సౌకర్యాలతో నిర్మించిన హరిత ప్రాజెక్టు ఫ్లాట్లను తీసుకోవాలని భావిస్తున్నారు. అలాగే, సిరిపురం ప్రాంతంలో ఐటీ కేటాయించిన పలు భారీ భవంతులు ఖాళీగా ఉండటంతో వాటిని కూడా వినియోగించుకునేందుకు పరిశీలిస్తున్నారు. ఇన్ని భవనాలు, సదుపాయాలు ఈ ప్రాంతంలో అందుబాటులో ఉండటంతో....ఇక్కడే సచివాలయం ఏర్పాటు చేస్తారని అంటున్నారు.
మొత్తానికి, అధికారిక ప్రకటన రాకముందే విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ఏర్పాటుకు చకచకా పనులు జరిగిపోతున్నాయి. మంత్రివర్గం అధికారికంగా నిర్ణయం తీసుకోకముందే ముందస్తు ప్రకాళిక ప్రకారం అన్నీ నడిచిపోతున్నాయి. ఇప్పటికిప్పుడు భారీ భవంతులు నిర్మించే ఆలోచన ప్రభుత్వానికి లేకపోవడంతో.... ప్రస్తుతం ఉన్నవాటినే తీసుకుని నెలరోజుల్లో కార్యాలయాలను తరలించాలని భావిస్తోంది.