చలిని జయించిన ఉల్లి :- ఉదయాన్నే ఉల్లి కోసం రైతుబజార్ల వద్ద బారులు తీరుతున్న జనం

    కేజీ ఉల్లి కోసం కిలోమీటర్ల మేర క్యూలైన్లలో గంటల తరబడి నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. బయట మార్కెట్లో ఉల్లి కొనే పరిస్థితి లేకపోవడంతో ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ ఉల్లిపాయల కోసం జనం ఉదయాన్నే కౌంటర్ల దగ్గరకు భారీగా తరలివెళ్తున్నారు. డిమాండ్ కు తగ్గ కౌంటర్లు లేకపోవటంతో కొన్ని చోట్ల తోపులాటలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే విజయనగరం జిల్లా పార్వతీపురం రైతు బజార్ లో జరిగిన భారీ తోపులాటలు జరుగుతున్నాయి.ఎముకలు కొరికే చలిని కూడా లెక్క చేయకుండా జనం ఉదయాన్నే బారులు తీరారు. కౌంటర్ ఒక్కటే కావడంతో వందల మంది జనం కౌంటర్ గేటు వెలుపల ఎదురు చూస్తున్నారు. ఒక్క సారిగా గేటు తీయడంతో లైనులో నిలబడేందుకు జనం ఎగబడ్డారు.ఈ క్రమంలోనే ఒకరి పై ఒకరు పడిపోవడంతో తొక్కిసలాట జరిగింది. చిన్నపిల్లల కూడా ఉండటంతో పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారింది. అక్కడే ఉన్నవారు కింద పడ్డ వారికి సహాయం అందించటంతో ప్రమాదం తప్పింది. సరిపడా కౌంటర్లు లేకపోవడం తోనే తొక్కిసలాట జరిగిందని అధికారులు కౌంటర్లు పెంచాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు.

ముచ్చటగా మూడు... మనసులో మాట బయటపెట్టిన జగన్

ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల ముగింపు రోజు సీఎం జగన్మోహన్ రెడ్డి... రాజధానిపై ఆటంబాంబు పేల్చారు. చివరి రోజు రాజధానిపై చర్చ చేపట్టడంతో ఏదో కీలక ప్రకటన ఉంటుందని భావించినా... ఈ రేంజ్ లో సంకేతాలు ఉంటాయని మాత్రం ఎవ్వరూ ఊహించలేదు. అధికార వికేంద్రీకరణ విధానం మంచిదంటూనే... ఏమో ఏపీకి మూడు కేపిటల్స్ రావొచ్చేమోనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు ఉండాల్సిన అవసరం కనిపిస్తోందన్నారు. విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్... కర్నూలులో హైకోర్టు... జ్యుడీషియల్ కేపిటల్... అలాగే అమరావతిలో లెజిస్లేటివ్ కేపిటల్ పెట్టుకోవచ్చంటూ సంకేతాలు వదిలారు. అయితే, రాజధానిపై వారం రోజుల్లో నిపుణుల కమిటీ రిపోర్ట్ ఇవ్వనుందని, నివేదిక అందాక... సుదీర్ఘంగా చర్చించి రాజధానిపై తుది నిర్ణయం తీసుకుంటామని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఇక, చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ జగన్... రాజధానిపై ప్రకటనకు ముందే తన బినామీలకు లీకులు ఇచ్చారని ఆరోపించారు. బాబు బినామీలంతా భూములు కొన్నాకే అమరాతిని రాజధానిగా ప్రకటించారని జగన్ అన్నారు. ఇక, రాజధాని నిర్మాణం, కనీస మౌలిక వసతుల కల్పనకు లక్షా 9వేల కోట్లు ఖర్చవుతుందని లెక్కలు కట్టారని, బాబు హయాంలో కేపిటల్ పేరుతో 5వేల 800కోట్లు ఖర్చు చేశారని... ఇంకా లక్ష కోట్లు కావాలని, ఆ డబ్బును ఎక్కడ్నుంచి తేవాలని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. మరోవైపు, రాజధానిపై సంచలన వ్యాఖ్యలు చేసిన వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు.... అభివృద్ధి, పరిపాలన ఒకేచోట కేంద్రీకృతం కావొద్దని ప్రభుత్వానికి సూచించారు. పరిపాలన, చట్టసభలు, కోర్టులు... ఇలా అన్నీ వేర్వేరు చోట ఉండాలన్నారు. తెలంగాణ ఉద్యమం నుంచి మనం పాఠాలు నేర్చుకోకపోతే... మరోసారి అలాంటి పరిస్థితి పునరావృతం అవుతుందని ధర్మాన హెచ్చరించారు.

జాతీయ రాజకీయాల వైపు మొగ్గు చూపుతున్న టీపీసీసీ చీఫ్ ఉత్తమ్!!

తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర రాజకీయాల పై పెద్దగా ఆసక్తిగా లేనట్లే కనిపిస్తున్నారు. 5 ఏళ్లుగా పని చేస్తున్న పీసీసీ నుంచి తప్పుకోవాలని ఆయన ఇప్పటికే నిర్ణయించుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే రాష్ట్ర రాజకీయాల్లో ఆయన అంటీముట్టనట్లు ఉన్నారనే చర్చ పార్టీలో మొదలైంది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన 3 నెలల వరకు ఆయన పార్టీ వ్యవహారాలకు దూరంగానే ఉండిపోయారు. కనీసం గాంధీభవన్ కి కూడా రాలేదు. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి, దాంతో మళ్ళీ కొంత యాక్టివ్ అయ్యారు. పార్లమెంట్ అభ్యర్థుల ఎంపిక ప్రచారం మీద కొంత మేరకు తన ప్లాన్స్ వర్కౌట్ చేసుకున్నారు. తాను పోటీ చేసిన నల్గొండ పార్లమెంటు నుంచి గెలిచారు. ఆ తరువాత పార్టీ కార్యాలయానికి అప్పుడప్పుడు రావడం మొదలు పెట్టారు. పార్టీ సమావేశాలు కోర్ కమిటీలకు మాత్రమే పరిమితం అవుతూ వచ్చారు. ఇక ఇంతలోనే హుజూర్ నగర్ ఉప ఎన్నికలు వచ్చేశాయి, దాంతో పూర్తిగా నియోజకవర్గానికే పరిమితమయ్యారు. ఉప ఎన్నికల్లో ఉత్తమ్ పద్మావతి ఓటమి పాలయ్యారు, అది తనకు కంచుకోట అనుకున్న హుజూర్ నగర్ లో ఓడిపోవడం జీర్ణించుకోలేకపోయారు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాల కార్యాలయానికి రావడం మానేసి అంతా ఢిల్లీకే పరిమితం అయ్యారు. పార్లమెంటు సమావేశాలు కావడంతో అక్కడే ఉంటున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. సోనియగాంధీ ఆశిస్సులతోనే రాజకీయాల్లోకి వచ్చారు ఉత్తమ్. ఆ తర్వాత పార్టీ అధిష్టానం కొంత లాయల్ గా ఉంటూ వచ్చారు. పీసీసీ చీఫ్ అయ్యాక రాహుల్ గాంధీతో సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. అటు సోనియా గాంధీ ఇటు రాహుల్ గాంధీ కోటరీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే తెలంగాణాకు జనవరి రెండో వారంలో కొత్త పీసీసీ చీఫ్ వచ్చే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపధ్యంలో ఉత్తమ రాజకీయ భవిష్యత్తు ఏంటి అన్న వాదన మొదలైంది. 5 ఏళ్ళపాటు పార్టీ వ్యవహారాలు చూసిన ఉత్తమ్ త్వరలో కేంద్ర పార్టీ వ్యవహారాల్లో వెళ్లాలనుకుంటున్నారని చర్చ జరుగుతోంది. త్వరలోనే దేశవ్యాప్తంగా పార్టీకి నూతన కమిటీలు కొత్త ప్రాధాన్య కార్యదర్శుల నియామకాలు జరగనున్నాయి. వీటితో పాటే రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ చార్జిలను కూడా నియమించే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి జాతీయ రాజకీయాల మీద ఢిల్లీ బేసెడ్ పాలిటిక్స్ మీద కన్నేశారని ప్రచారం జరుగుతోంది. ఎంపీగా ఉంటూ సోనియా రాహుల్ గాంధీలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఉత్తమ్ ఏఐసీసీలోకి వెళ్లే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం, పార్టీ ప్రధాన కార్య దర్శి పదవి దక్కించుకోవడంతో పాటు కీలకంగా పని చేయాలన్న ఆలోచనతో ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. తెలంగాణాలో  కొత్త చీఫ్ ఎంపికలో కూడా ఉత్తమ్ కీలకంగా మారే అవకాశముంది. ఇప్పటికే ఆయన పీసీసీ చీఫ్ పదవికి ఓ పేరును కూడా ప్రతిపాదించినట్లు ప్రచారం నడుస్తోంది. రాష్ట్రంలో తన మాట చెల్లుబాటు అయ్యేలా చూసుకోవడంతో పాటు ఏఐసిసిలో కూడా తనకంటూ ఓ గుర్తింపు ఉండేలా పావులు కదుపుతున్నారని తెలుస్తోంది. మొత్తానికి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పాలిటిక్స్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని ప్రచారం జరుగుతోంది.

15వ శతాబ్దంలో కట్టిన మసీదు.. పునాదులతో సహా పెకిలించి తరలించారు

మనిషి అన్ని పనులూ అవసరం కోసమే చేయడు. అలాగని పూర్తిగా నమ్మకాలు విశ్వాసాల మేరకు నడుచుకోడు, రెండింటినీ మేళవించి జీవన ప్రయాణాన్ని కొనసాగిస్తూంటాడు. మరి ఒకవేళ ఈ రెండూ ఒకదానితో ఒకటి క్లాష్ అయితే అప్పుడు ఎలా, రెండిట్లో దేనికి ప్రయారిటీ ఇవ్వాలి, ఇటు కూటికి అటు దేవునికీ మధ్య సంఘర్షణ జరిగితే దేని వైపు నిలబడాలి ఆదిదేవుడి ఈ శరీరాన్ని పుట్టించాడు కాబట్టి పొట్టకూటిని కాదని దేవుడు వైపు నిలబడాలా లేక శరీరంలో జీవం నిలబడాలంటే తిండి కావాలి కాబట్టి కూటి కోసం పాట్లు పడాలా, సరిగ్గా ఇదే భేతాళ ప్రశ్న ఎదురైంది టర్కీలో. చాదస్తం ముస్లిం పోకడలను పక్కన బెట్టి కాస్తంత ఆధునిక భావాలను నింపుకున్న టర్కీలోని ముస్లిం సమాజం వాదోపవాదాలు సిద్ధాంత రాద్ధాంతాల జోలికి పోకుండా టెక్నాలజీ వాడింది. టర్కీ లోని టైగ్రిస్ నది పరివాహక ప్రాంతంలో ఉన్న హాసం కీప్ నగరంలో 15 వ శతాబ్దంలో కట్టిన మసీదుకు చాలా పెద్ద చరిత్రే ఉంది. అయితే కొత్తగా నిర్మిస్తున్న ఇల్స్యూడ్ డ్యామ్ కారణంగా ఈ మసీదు ఉన్న ప్రాంతం మునిగిపోతుంది. ప్రజలకు నష్ట పరిహారం ఇచ్చేసి వేరే ప్రాంతానికి తరలించేసిన ఈ మసీదుతో చిక్కొచ్చి పడింది. ఏం చెయ్యాలని ఆలోచించారు అధికారులు. అయితే ఛాందస భావాల ప్రభావానికి గురై ఏకంగా డ్యామ్ డిజైనే మార్చకుండా ఎంచక్కా మసీదుని తరలించారు. అందుబాట్లో ఉన్న హైఎండ్ టెక్నాలజీతో మసీదును పునాదులతో సహా పెకిలించి దాన్ని మరో ప్రాంతంలో ప్రతిష్టింపచేశారు చాలా సింపుల్ గా, ఇదే సమస్య ఏ ఆఫ్గనిస్థాన్ లోను లేక ఐసిస్ హుకుమ్ నడిచిన రోజులలో దాని ఏలుబడిలో ఉన్న ప్రాంతాల్లోనూ జరిగితే ఏమయ్యేదో అందరికీ తెలిసిందే కదా, ప్రజలు ఆకలితో చచ్చినా సరే దైవత్వం నిలబడాలని అవసరమైతే ఆ ఆకలి కడుపులపై కూడా తూటాలు పేల్చేవారు.

త్రిసభ్య కమిటీ ఏమననుంది?.. కుళ్ళిపోతున్న దిశ నిందితుల మృతదేహాలు

దిశ ఎన్ కౌంటర్ కేసులో హతులైన నలుగురు యువకుల మృతదేహాలు గాంధీ ఆస్పత్రి లోని మార్చురీలో కుళ్లిపోతున్నాయి. దీంతో వాటిని ఎలా భద్రపర్చాలనే అంశంపై ఆసుపత్రి వర్గాలు మల్లగుల్లాలు పడ్డాయి. డిసెంబర్ 13వ తేదీ వరకు మృతదేహాలను భద్రపరచాలని మొదట హై కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆ తర్వాత తదుపరి ఉత్తర్వులు రాకపోవడంతో ఏం చేయాలనే దానిపై ఆసుపత్రి వర్గాలు ఆలోచిస్తున్నాయి. మృతదేహాలకు ఎంబామింగ్ చేస్తే మరి కొంత కాలం వాటిని భద్రపర్చే అవకాశముంది. ఎంబామింగ్ అంటే మృతదేహం లోని రక్తనాళాల్లో ఉన్న రక్తంతో పాటు ఇతర ద్రవపదార్థాలు అన్నిటినీ తీసేసి వాటిలోకీ ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నారు. అయితే ఎన్ కౌంటర్ కారణంగా శరీరాలకు బులెట్ గాయాలు ఉండటంతో ఫ్లూయిడ్స్ లీకయ్యే అవకాశం ఉంది కాబట్టి మరింత జాగ్రత్తగా ఎంబామింగ్ చేయాల్సి ఉంటుంది. అయితే కోర్టు ఆదేశాలతో ఇవన్నీ చెయ్యాల్సి ఉంటోంది. దీంతో గాంధీ ఆసుపత్రి సిబ్బంది వేగం పెంచారు. వెంటనే ఉన్నతాధికారులకు లేఖలు రాశారు. ఆపాటికే ఆలస్యం అవడంతో వెంటనే ఆదేశాలు వెలువడ్డాయి. దిశ హంతకుల మృతదేహాలకూ వెంటనే ఎంబామింగ్ చేశారు. శవాలు చెడిపోకుండా ఇంజెక్షన్ లు ఎక్కించారు. అయితే వీరి డెడ్ బాడీకి ఎక్కించిన ఒక్కో ఇంజెక్షన్ ధర ఏడున్నర వేలు వీటి సాయంతో మరో నాలుగు రోజుల పాటు మృతదేహాలనూ చెడిపోకుండా కాపాడుకోవచ్చు. ఎందుకంటే ఎంత డీప్ ఫ్రిజ్ లో పెట్టిన ఓ శవాన్ని వారం రోజుల వరకే కుళ్లిపోకుండా చూసుకోవచ్చు. మరోవైపు రెండ్రోజుల్లో సుప్రీం కోర్టు నియమించిన త్రిసభ్య కమిటీ హైదరాబాద్ రానుంది. త్రిసభ్య కమిటీ ఓకే చెప్పిన తర్వాతే వీరి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. అప్పటి వరకు వీరి మృతదేహాలు ఇలా మార్చురీలో పడి ఉండాల్సిందే.

దేశ ద్రోహిగా ఉరికంభం ఎక్కనున్న ముషారఫ్.. ఉరిశిక్ష విధించిన పాక్

పాక్ మాజీ అధ్యక్ష్యుడు, మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ పర్వేజ్ ముషారఫ్‌కు పాకిస్తాన్‌లోని ఓ ప్రత్యేక కోర్టు ఉరిశిక్ష విధించింది. ముషారఫ్ పై దేశ ద్రోహం కేసుతో పాటు అవినీతి కేసులున్నాయి. ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్ ఈ సంచలన తీర్పును వెల్ల డించింది. ప్రస్తుతం ముషారఫ్ దుబాయిలో తలదాచుకుంటున్నారు. ముషారఫ్ వాదనలను పరిగణలోకి తీసుకోవటానికి ప్రత్యేక కమిటీ దుబాయ్ కు వెళ్లారని ఆయన తరపు న్యాయవాదులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వాన్ని కూల్చేందుకు ముషారఫ్ కుట్ర చేశారని కేసులు నమోదయ్యాయి. ఉరిశిక్ష రాజ్యాంగ విరుద్ధమని ఆయన తరపు న్యాయవాదులు అంటున్నారు. ముషారఫ్ పై వచ్చిన అభియోగాలు విచారించేందుకూ జ్యుడీషియల్ కమిషన్ వేయాలని కోరారు. ముషారఫ్ 2016లోనే దుబాయి పారిపోయారు. 2013లో నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని ప్రభుత్వం ముషారఫ్‌పై రాజద్రోహం కేసు నమోదు చేసింది. 2007లో రాజ్యాంగాన్ని కూలదోసి ఎమర్జెన్సీ పాలన విధించడంతో ఆయనపై ఈ కేసు నమోదు చేశారు. ఎమర్జెన్సీ సమయంలో అనేక మంది న్యాయమూర్తులను ఆయన ఇళ్లలలోనే నిర్బంధించారు. ఆరేళ్ల విచారణ తరువాత ప్రత్యేక న్యాయస్థానం సంచలన తీర్పును వెల్లడించింది. ముగ్గురు న్యాయమూర్తులలో ఇద్దరు ముషారఫ్ కు ఉరిశిక్షను సమర్థించారు. కాగా రాజద్రోహం కేసులో ఓ మాజీ అధ్యక్షుడికి ఉరిశిక్ష విధించడం పాకిస్తాన్ చరిత్రలో ఇదే మొదటి సారి కావడం గమనార్హం. మొత్తానికి దేశద్రోహం కేసులో ముషరఫ్ కి ఉరిశిక్ష పడడం అనే అంశం అందరికి షాక్ కి గురి చేసింది.

ఒకే ఒరలో రెండు కత్తులు.. టిఆర్ఎస్ లో మున్సిపల్ రగడ మొదలైంది!!

తాజాగా ఉన్నత న్యాయస్థానంలో మున్సిపల్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ రావడంతో అధికార పార్టీ ఎన్నికల కసరత్తు మొదలు పెట్టింది. దీనిలో భాగంగానే మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ లకు సంబంధించిన అభ్యర్థుల వివరాలు అందించాలని పార్టీ అధిష్టానం ఎమ్మెల్యేలను కోరింది. ప్రతి నియోజకవర్గంలో పూర్తి బాధ్యతలను అక్కడి ఎమ్మెల్యేలకే కట్టబెట్టారు. అయితే అసలు పంచాయితీ ఇక్కడే మొదలైంది. కొన్ని నియోజక వర్గాల్లో టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేని చోట కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ లో చేరగా కొందరు ఎన్నికల సమయంలో ఇతర పార్టీల నుంచి వచ్చి టిఆర్ఎస్ టిక్కెట్ మీద గెలిచారు. దీంతో అక్కడ మాజీ ఎమ్మెల్యే వర్సెస్ తాజా ఎమ్మెల్యేల మధ్య కోల్డ్ వార్ మొదట్నుంచీ నడుస్తోంది. ప్రస్తుత మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన కసరత్తు నడుస్తున్న నేపధ్యంలో టిక్కెట్ల విషయంలో తాజా, మాజీ ఎమ్మెల్యేలకు పడటం లేదు. మావాడికి అవకాశమివ్వాలి అంటే మా వాడికి ఇవ్వాలనీ పోటా పోటీగా అభ్యర్ధులు తెరమీదకు తీసుకొస్తున్నారు. రీసెంట్ గా ఉమ్మడి పాలమూరు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో ఎంపీటీసీ ఎన్నికల సమయంలో మాజీ ఎమ్మెల్యే జూపల్లి , ప్రస్తుత ఎమ్మెల్యే హర్షవర్దన్ రెడ్డిల మధ్య గొడవ జరిగాయి. ఇప్పుడు మునిసిపల్ ఎన్నికల విషయంలో కోల్డ్ వార్ నడుస్తోంది. ఈ ఇద్దరు నేతలు తమ అనుచరులను తెరమీదకు తీసుకొస్తున్నారు. దీంతో టీఆర్ఎస్ అధిష్ఠానానికి ఇబ్బందిగా మారింది. ఉమ్మడి నల్గొండ జిల్లా కోదాడ నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి, కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన ఎమ్డీ జానీ తానే చైర్మన్ అభ్యర్థి అని ప్రచారం చేసుకుంటున్నారు. మొదటి నుంచి పార్టీలో ఉన్న నేతలకు ఇది మింగుడు పడటంలేదు, ఇదే విషయాన్ని జిల్లా పెద్దల దృష్టికి తీసుకువెళ్లారు. ఇక రంగారెడ్డి జిల్లా తాండూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి.. స్థానిక ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఎన్నికల వేళ మహీందర్ రెడ్డి నియోజక వర్గాల్లో పర్యటిస్తూ తన అనుచరులను ఉసిగొలుపుతూ ఇబ్బందులు కలిపిస్తున్నారని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. ఇలా దాదాపు వేరే పార్టీ ఎమ్మెల్యేలున్న ప్రతి నియోజకవర్గంలో ఇలాంటి సమస్యలే ఎదురు కావడంతో ముందస్తు చర్యలు ప్రారంభించారు గులాబీ బాస్. కొత్త ,పాత పంచాయతీ లేకుండా చూసి ఎన్నికల సాఫీగా జరిగేలా చూడాలని మంత్రులు ఆదేశించినట్టు తెలుస్తోంది.

గురువింద గింజ సామెతను గుర్తుచేసిన విజయసాయి ట్వీట్!!

ఎదుటి వ్యక్తిని విమర్శించడం సంగతి తరువాత.. ముందు నువ్వు ఎలా ఉన్నవో చూసుకో అని పెద్దలు చెప్తుంటారు. ఈ విషయం వైసీపీ నేత విజయసాయి రెడ్డికి తెలిసినట్టు లేదు. అందుకేనేమో ట్వీట్ చేసి మరీ నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇటీవల వైసీపీ నేతలు నారా లోకేష్ ని టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేగా గెలవలేకపోయారని విమర్శలు చేస్తున్నారు. ఆఖరికి అసెంబ్లీలో కూడా.. కొడుకుని గెలిపించుకోలేని చేతకాని సీఎం చంద్రబాబు అంటూ.. లోకేష్ ని ప్రస్తావిస్తూ రోజా విమర్శలు చేసారు. అయితే ఈ విమర్శలకి లోకేష్ కౌంటర్ ఇచ్చారు. నేను చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకొనే బ్యాచ్ కాదు. నేను కావాలనుకుంటే మా నాన్న గెలిచిన కుప్పం నుంచి పోటీ చేసి.. గెలిచానని కాలర్ ఎగరేయొచ్చు. కానీ నేను ఆ బ్యాచ్ కాదు. ఎక్కడైతే టీడీపీ బలంగా లేదో అక్కడ పోటీ చేసి గెలవాలనుకున్నా. మంగళగిరిలో 1985 నుండి టీడీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. అందుకే అక్కడ పోటీ చేసి గెలిచి చరిత్ర తిరగరాయాలనుకున్నా. ఆ దిశగా పని చేశా. కానీ ఓటమి ఎదురైంది. అయినా ప్రజలకు అందుబాటులో ఉంటున్నా అని లోకేష్ చెప్పుకొచ్చారు.  కాగా లోకేష్ వ్యాఖ్యలపై తాజాగా విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. "చరిత్ర సృష్టించేందుకే మంగళగిరిలో పోటీ చేశాడట చిట్టి నాయుడు. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేకనే కదా దొడ్డి దారిన ఎమ్మెల్సీ, మంత్రి అయింది. ఈ చరిత్ర సృష్టించాలన్న తాపత్రం ఏమిటో? రెండొందల కోట్లు వెదజల్లినా మంగళగిరిలో చిత్తుగా పరాజయం పాలయ్యావు. ఇకనైనా బడాయి మాటలు మానుకో చిట్టీ." అని విజయ సాయి ట్వీట్ చేసారు. ఈ ట్వీట్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ట్వీట్ ని ఎంజాయ్ చేస్తుండగా.. కొందరు మాత్రం విజయ సాయి పై విమర్శలు గుప్పిస్తున్నారు. "అక్కడకి నివేదో ప్రత్యేక్ష రాజకీయాల్లో పోటీ చేసి గెలిచినట్టు బిల్డప్ ఇస్తున్నావ్"... "నువ్వు ఎక్కడ పోటీ చేసి రాజ్యసభ mp అయ్యావు తాతా.. ఎన్ని సూట్ కేస్ లు మార్చితే ఎంపీ అయ్యావు చెప్పు తాతా".. అంటూ కామెంట్స్ తో విజయసాయిపై విరుచుకుపడుతున్నారు నెటిజన్లు.

18 ఏళ్ల క్రితం సలహా ఇచ్చిన అభిమానిని వెతికిపట్టుకున్న సచిన్

నెటిజన్ల సాయంతో ఎట్టకేలకు సచిన్ టెండూల్కర్ తన అభిమానిని కలుసుకున్నాడు. సరిగ్గా 18 ఏళ్ల కిందట పరిచయమైన ఓ అభిమానిని మళ్లీ కలుసుకున్నాడు. చెన్నైలోని తాజ్ కోరమాండల్ హోటల్లో ఓ అభిమానిని కలిశానని.. అతను ఇచ్చిన సలహా మేరకు నా మోచేతి గార్డ్ లో మార్పులు చేసుకోవడంతో నా ఆట చాలా మెరుగైంది అంటూ పాత జ్ఞాపకాలను పంచుకున్నాడు సచిన్ టెండూల్కర్. అయితే అతను ప్రస్తుతం ఎక్కడున్నాడో తెలియదని.. ఎవరికైనా తెలిస్తే అడ్రస్ ఇవ్వాలంటూ.. సోషల్ మీడియాలో రిక్వెస్ట్ పెట్టాడు. మాస్టర్ బ్లాస్టర్ నోరు తెరిచి అడిగిన తర్వాత ఇక నెటిజన్లు ఆగుతారా కొన్ని గంటల్లోనే అతడు ఎక్కడున్నాడో వెతికి పట్టేశారు. అతని అడ్రస్ ను సచిన్ కు పోస్ట్ చేశారు. సరిగ్గా 18 ఏళ్ల కిందట ఓ మ్యాచ్ కోసం స్టార్ హోటల్లో బస చేసిన సచిన్ ను ఆ హోటల్లో వెయిటర్ గా పని చేస్తున్న గురు ప్రసాద్ అభిమానిగా పరిచయం చేసుకున్నాడు. సార్ మీరేం అనుకోనంటే క్రికెట్ కు సంబంధించి ఓ సూచన చేయొచ్చా అని అడిగాడు. దానికి సచిన్ ఓకే చెప్పడంతో మీ మోచేతి గార్డు వల్ల బ్యాటింగ్ సమయంలో అసౌకర్యానికి గురవుతున్నారు అని గురు ప్రసాద్ అసలు విషయం చెప్పాడు. ఓ అభిమాని తన బ్యాటింగ్ ను అంత తీక్షణంగా గమనిస్తూ ఉండటం చూసి లిటిల్ మాస్టర్ ఆశ్చర్యపోయాడు. అభిమాని సూచన మేరకు మోచేతి గార్డ్ సైజును సచిన్ మార్చుకున్నాడు. దీంతో సచిన్ మణికట్టు కదలికల సులువు అయ్యాయి. ఆటతీరు కూడా మెరుగైంది. అయితే ఆ విషయం ఇపుడు సడన్ గా ఎందుకు గుర్తుకు రావడంతో సోషల్ మీడియాలో పాత ఫొటో పెట్టి వెతికి పట్టాలనీ రిక్వెస్ట్ పెట్టాడు సచిన్. లిటిల్ మాస్టర్ ట్వీట్ తో ఒకప్పుడు స్టార్ హోటల్లో పని చేసిన గురు ప్రసాద్ ఒక్క సారిగా పాపులర్ అయిపోయాడు. మొదటి సారి సచిన్ ను కలిసినప్పుడు ఇలా ఉన్న గురు ప్రసాద్ పద్దెనిమిదేళ్ళ తర్వాత నలభై ఆరేళ్ల వయసు పైబడే సరికి ఇదిగో ఇలా అయ్యాడు. అయితే తన సాయాన్ని సచిన్ ఇప్పటికీ గుర్తుపెట్టుకోవటానికి అభినందించారు గురు ప్రసాద్.

జగన్ ని తప్ప ఎవ్వర్నీ నమ్మనంటున్న బుట్టా రేణుక.. త్వరలో పదవి!

2014 ఎన్నికల్లో అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చిన బుట్టా రేణుక వైసీపీ నుంచి ఎంపీగా గెలిచి సంచలనం సృష్టించారు. అలాంటి బుట్టా రేణుక కొన్ని కారణాల వల్ల కొందరి ఒత్తిడి కారణంగా టిడిపిలో చేరారు. మొదట భర్తతో పాటు పార్టీలో చేరాలని వెళ్లి..తనకు జగన్ పై అభిమానంతో చేరకుండా వెనక్కి వచ్చారు. ఆమె భర్త మాత్రం టిడిపిలో చేరారు. అప్పటి నుంచి రేణుకపై ఒత్తిడి పెరిగింది. చివరకు చేసేదేమీ లేక టిడిపిలో చేరారు. టిడిపిలో చేరి అక్కడ అవమానాలు తట్టుకోలేక మళ్లీ వైసీపీలో ఎలాంటి షరతులు లేకుండా చేరి.. పొరపాటుకు క్షమాపణలు కూడా చెప్పారు.  టిడిపిలో కర్నూలు పార్లమెంట్ టికెట్ లేదా అసెంబ్లీ టికెట్ ఇస్తామని చెప్పి మోసం చేశారని ఆమె ఆవేదనను వ్యక్తం చేశారు. మళ్లీ వైసీపీలో చేరిన రేణుక పార్టీ విజయం కోసం కర్నూలు జిల్లాలో ప్రచారం చేశారు. అయితే వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెకు ఏదో ఒక పదవి వస్తుందని అందరూ భావించారు. అయితే ముందస్తుగా ఎటువంటి షరతులు లేకుండా పార్టీలో చేరిన కారణంగా పదవుల్ని అడగటానికి సంకోచిస్తున్నారు. అయినప్పటికీ బుట్టా రేణుకకు ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ ఇచ్చేందుకు జగన్ సుముఖంగా ఉన్నట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వైసిపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బుట్టా రేణుక తమ వ్యాపారంలో బిజీ అయ్యారు. హైదరాబాద్ లోని మెరిడియన్ స్కూల్ నిర్వహణను తనే స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం కొడుకు పెళ్లి వ్యవహారాల్లో బిజీగా ఉన్నారు, ఆమెకి ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ ఇచ్చే అవకాశాలున్నట్లు టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి తదితరులు హామీ ఇచ్చినట్టుగా పార్టీలో ప్రచారం జరుగుతోంది. అయితే దీని పై బుట్టా రేణుక ఎలాంటి ప్రకటన చేయడం లేదు. జగన్ ఏ బాధ్యతలు అప్పగించిన విజయవంతంగా నిర్వహిస్తానంటున్నారు. రాజకీయాల్లో ఉన్నంత వరకు జగన్ ను తప్ప మరొకరిని నమ్మను అని కుండ బద్దలు కొట్టినట్టు చెబుతున్నారు.

తెలంగాణ సీఎంగా కేటీఆర్... పట్టాభిషేకానికి సర్వం సిద్ధం!!

టీఆర్ఎస్ రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత నామినేటెడ్ పోస్టుల భర్తీపై గులాబీ నేతలను ఊరిస్తూ వస్తోంది. ఈ సారి తమకు అవకాశం వస్తుందని ఆశావహులు కొండంత ఆశతో ఉన్నారు. ఇప్పటికే కార్పొరేషన్ పదవుల్లో ఉన్న నేతలు మరోసారి తమ రెన్యువల్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇక పార్టీలో ఉద్యమ నేతలు వివిధ పార్టీల నుంచి వచ్చి చేరిన నేతలు ఎప్పుడెప్పుడు తమకు పదవులు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు. కార్పొరేషన్ పదవులను ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకే ఎక్కువ మొత్తంలో ఇస్తామని కేసీఆర్ ప్రకటించడంతో ఆశావహులు కేటీఆర్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పార్టీ కోసం తాము చేసిన సేవలని గుర్తు చేస్తూ తమ పొలిటికల్ ప్రొఫైల్ అందిస్తున్నారు. అయితే కేటీఆర్ ఆశీస్సులు ఉన్న వారికే పదవులు వస్తాయనే చర్చ టీఆర్ఎస్ లో జోరుగా సాగుతోంది. ఇక మంత్రి పదవి ఆశించి భంగపడిన నేతలు కీలకమైన కార్పొరేషన్ పదవులు లేదా పార్లమెంటరీ సెక్రెటరీ పదవులు వస్తాయన్న ఆశతో ఉన్నారు. లాబీయింగ్ ను ముమ్మరం చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొందరు నేతలకు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్ వారిలో కొద్దిమందికి విప్ పదవులు ఇచ్చి సరిపెట్టారు. రెండోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక నామినేటెడ్ పోస్టులతో పాటు దేవాలయ పాలక మండలి చైర్మన్ పోస్టులు కూడా భర్తీ చేయలేదు. వచ్చే ఏప్రిల్లో టీఆర్ఎస్ ప్లీనరీ జరగబోతోంది. ప్లీనరీని ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. ప్లీనరీకి ముందే పదవులన్నింటినీ భర్తీ చేయాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. భద్రాచలం, వేములవాడ, యాదాద్రి వంటి ముఖ్య దేవాలయాలకు పాలక మండలి ఛైర్మన్ లను నియమించాల్సి ఉంది. పార్టీలోని సీనియర్ నేతల తోనే ఈ పదవులు భర్తీ చేస్తారనే చర్చ నడుస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తగా లాభదాయక పదవి విషయంలో ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఇబ్బంది లేకుండా చేసింది. గతంలో ఆరుగుర్ని పార్లమెంటరీ సెక్రటరీలుగా నియమించిన న్యాయ చిక్కుల కారణంగా కొన్నాళ్లకే వారు పదవుల్ని వదులుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఇలాంటి చిక్కులకు ఆస్కారం లేకుండా ఆర్డినెన్స్ తీసుకురావడంతో పదవులకు ఎలాంటి ఢోకా లేకుండా పోయింది.  మరోవైపు కేటీఆర్ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఆయనకు బలమైన అనుచరగణాన్ని ఇప్పటి నుంచే కేసీఆర్ తయారు చేస్తున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు నేతలంతా ఇప్పటికే కేటీఆర్ తో సంబంధాలు కొనసాగిస్తున్నారు. కేటీఆర్ తమ బాస్ అంటూ ప్రచారం చేస్తున్నారు. ఇటీవల ఎమ్మెల్సీ కార్పొరేషన్ పదవులు అందుకున్న వాళ్ళంతా కేటీఆర్ కు అత్యంత సన్నిహితులే. మంత్రి వర్గ కూర్పులను కేటీఆర్ సూచనలనూ కేసీఆర్ పరిగణలోకి తీసుకున్నారు. దీంతో కేటీఆర్ కాబోయే సీఎం అంటూ నేతలు అభివర్ణిస్తున్నారు. ఏప్రిల్ నాటికి పదవుల భర్తీకి కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. ప్రతి ప్లీనరీలో సంచలన ప్రకటన చేసే కేసీఆర్ ఈ సారి ప్లీనరీ లోనూ కీలక ప్రకటన చేయబోతున్నారనే వాదన వినిపిస్తోంది. ప్లీనరీ వేదికగా కేటీఆర్ కు పట్టాభిషేకానికి రంగం సిద్ధం చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే మరో రెండు మూడు సార్లు తానే సీఎంనంటూ కేసీఆర్ అసెంబ్లీ సమావేశాల్లో స్పష్టం చేశారు. దీంతో త్వరలో కేటీఆర్ సీఎం అవుతారంటూ పార్టీ నేతలు చేస్తున్న ప్రచారం చర్చ నీయాంశంగా మారుతోంది. లోక్ సభ ఎన్నికలకు ముందు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించడం ద్వారా కేటీఆరే వారసుడు అని కెసిఆర్ దాదాపుగా ప్రకటించేశారు. కేంద్రంలో టీఆర్ఎస్ చక్రం తిప్పే అవకాశముంటే ఢిల్లీకి కేసీఆర్ ఇక్కడ కేటీఆర్ సీఎం అని దాదాపుగా పార్టీ ముఖ్యులకు చెప్పేశారు.అయితే అవేమీ జరగక పోవటం, కొన్ని ప్రభుత్వ పథకాలు ట్రాక్ లో పడాల్సి రావడం, స్థానిక సంస్థలుమ, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు ఉండటంతో కేటీఆర్ పట్టాభిషేకాన్ని కొన్నాళ్లు పక్కన పెట్టారు. అయితే ఇప్పుడు తెలంగాణలో ప్రతిపక్షాలకు పెద్దగా ప్రభావం చూపడం లేదనే భావన ఉన్నందున ఏడాది లోపే కేటీఆర్ ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టేందుకు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. మొత్తానికి వచ్చే ఎన్నికల నాటికి లేదా అంతకంటే ముందే ముఖ్యమంత్రి అభ్యర్థిగా కేటీఆర్ ను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

ట్వీట్ చేసింది, అరెస్ట్ అయ్యింది... గాంధీని విమర్శించిన బాలీవుడ్ నటి అరెస్ట్

  గుజరాత్ లో బాలీవుడ్ నటిని అదుపులోకి తీసుకున్నారు రాజస్థాన్ పోలీసులు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటూ ఇష్టమొచ్చింది మాట్లాడితే చిక్కుల్లో పడటం తప్పదని అంటున్నారు పోలీసులు. కొందరు సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులతో అడ్డంగా బుక్కవుతున్నారు. ఇప్పుడు అన్ని రాష్ర్టాల పోలీసులు సోషల్ మీడియాపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రత్యేక ఐటీ యాక్ట్ తీసుకొచ్చారు. హద్దులు మీరిన కామెంట్లు పోస్ట్ లు కనిపిస్తే చాలు అరెస్ట్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా ఇది స్పష్టంగా కనిపిస్తోంది. పాయల్ రోహత్గి అనే బాలీవుడ్ నటి.. చేసిన ట్వీట్ ఆమెను చెరసాల దాకా తీసుకెళ్లింది. ఇటీవల నెహ్రూ , గాంధీలను ఉద్దేశించి పోస్ట్ చేసిన వీడియో ప్రకంపనలు రేపింది. దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. నెహ్రూ, గాంధీ ఫ్యామిలీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదవడంతో ఆమెను అరెస్టు చేశారు. గుజరాత్ నుంచి రాజస్థాన్ తీసుకువెళ్ళి కోర్టులో హాజరుపరిచారు. దీంతో ఆమెకు బెయిల్ నిరాకరించిన న్యాయస్థానం ఎనిమిది రోజుల జ్యుడీషియల్ కస్టడీకి అనుమతించింది. ఇప్పుడు పాయల్ రోహత్గి వ్యవహారం ఆసక్తికరంగా మారింది. నటిగా చెప్పుకుంటున్న ఆమె ఏకంగా రాజకీయ నాయకులపై అసభ్యకర పోస్టు పెట్టడంతో ఆమె కటకటాల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాయల్ అరెస్టయినప్పటికీ ఆమె లాయర్ మాత్రం అరెస్టును తప్పుపడుతున్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ హక్కును కాలరాయడమే అంటున్నారు. ఒక పాయల్ విషయం లోనే కాదు గతంలో బెంగాల్లోనూ మమత సర్కార్ ఇలాగే వ్యవహరించింది. మమతా బెనర్జీ మీద అభ్యంతరకర మీమ్ ను పోస్ట్ చేశారంటూ బీజేపీ కార్యకర్త ప్రశాంత్ కనోజియాను జైలుకు పంపించారు. దీనిపై కేంద్రమే కదిలివచ్చింది అప్పుడు. సుమారు నెల రోజుల పాటు జైలులో ఉన్నారు ప్రశాంత్ కనోజియా.

చంద్రబాబే టార్గెట్... వైసీపీ వ్యూహమిదే? 

ఒక్కొక్కడ్ని కాదు షేర్ ఖాన్... వంద మందిని ఒకేసారి పంపించనే సినీ డైలాగ్ మాదిరిగా... టీడీపీ చంద్రబాబు కూడా ఏపీ అసెంబ్లీలో పంచ్ డైలాగ్ లు పేల్చారు. యాభై మంది కాదు... నూటా యాభై మంది ఒకేసారి వచ్చినా ఎదుర్కొగల శక్తి సామర్ధ్యాలు... సమాధానం చెప్పగల దమ్ము తనకుందంటూ అధికార పార్టీపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు ఈ మాట ఎందుకన్నారంటే... ఏపీ శాసనసభలో చంద్రబాబు టార్గెట్ గా అధికారపక్షం గేమ్ ఆడుతోంది. చంద్రబాబు మానసిక స్థైర్యాన్ని మనో బలాన్ని దెబ్బతీసేందుకు... ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొదలుకొని... కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే వరకూ అందరూ బాబే టార్గెట్ గా విరుచుకుపడుతున్నారు. సందర్భమైనా, అసందర్భమైనా ఏ అంశంలోనైనా చంద్రబాబును కార్నర్ చేస్తూ వ్యక్తిగత దూషణులకు దిగుతున్నారు. దాంతో, చంద్రబాబు ఎంతగా మనో నిబ్బరం ప్రదర్శించినా... వైసీపీ ఎమ్మెల్యేల మాటల తాలుకూ ప్రభావం టీడీపీ అధినేత ముఖంలో కనిపిస్తూనే ఉంటుంది. ప్రజల కోసమే అవమానాలన్నీ భరిస్తున్నానని చంద్రబాబు అంటుంటారు. అసెంబ్లీలో సీన్ చూస్తే నిజమే అనిపిస్తుంది. చంద్రబాబు...లేదంటే లోకేష్‌. అధికార వైసీపీ టార్గెట్ ఈ ఇద్దరే. అందుకే, టాపిక్‌ ఏదైనా, ఇద్దర్నీ టార్గెట్ చేస్తున్నారు. సీఎం జగన్ మొదలుకొని... పలువురు మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలు... చంద్రబాబుపై పర్సనల్ అటాక్ చేస్తున్నారు. కొడాలి నాని, అనిల్ కుమార్, బొత్స, బుగ్గన, పేర్ని నాని, కన్నబాబు తదితర మంత్రులు... బాబు అండ్ లోకేషే టార్గెట్ గా మాటల తూటాలు పేల్చుతున్నారు. చంద్రబాబును తిట్టడంలో పోటీ పెట్టినట్టుగా మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు నిప్పులు చెరుగుతున్నారు. అయితే, బాబుని ఈవిధంగా టార్గెట్ చేయడం వెనుక రాజకీయ వ్యూహం కనిపిస్తోంది. టీడీపీకి చంద్రబాబే బలం. ఆ బలాన్నే దెబ్బకొడితే మొత్తం పార్టీనే దెబ్బతీయొచ్చన్న వ్యూహంతోనే బాబుపై పర్సనల్ అటాక్ కి దిగుతున్నారని అంటున్నారు. బాబునే సైలెంట్ చేస్తే, ఇక మిగతా నేతలందరూ నోరు మూసుకుంటారనే స్ట్రాటజీని అమలు చేస్తున్నారు. ఇక, బాబు వయసు పైబడటంతో, భవిష్యత్ నాయకుడిగా భావిస్తున్న లోకేష్ ను టార్గెట్ చేయడం ద్వారా, అతని ఆత్మస్థైర్యం దెబ్బతీసి టీడీపీకి భవిష్యత్తే లేదనే చర్చను తెలుగుదేశం కేడర్ లోకి, అలాగే ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నదే వైసీపీ వ్యూహమని చెబుతున్నారు. మొత్తానికి బాబు అండ్ లోకేష్ ను టార్గెట్ చేయడం వెనుక... తెలుగుదేశంలో సంక్షోభం తేవడమే లక్ష్యమంటున్నారు. అయితే, గతంలో పదేళ్లపాటు గడ్డుపరిస్థితులను ఎదుర్కొన్నా తన పోరాట పటిమతో 2014లో తిరిగి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన చంద్రబాబు... ఒంటరి పోరాటంచేసైనాసరే ఈ క్లిష్ట పరిస్థితి నుంచి తెలుగుదేశాన్ని గట్టెక్కిస్తారని టీడీపీ కేడర్ భావిస్తోంది. ఇక, చంద్రబాబు కూడా తనపై జరుగుతోన్న పర్సనల్ అటాక్ ను... ప్రజల్లో సానుభూతిగా మలుచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరి, భవిష్యత్తులో ఏం జరగనుందో చూడాలి.

పని చేయని ఫాస్టాగ్.. టోల్ గేట్ల వద్ద క్యూ కట్టిన వాహనాలు

ఫాస్టాగ్ అమలులోకి వచ్చాక వాహనదారులకు ఇక్కట్లు తప్పడం లేదు. డబ్బులు చెల్లించినా వినియోగదారులకు ట్యాగ్ లను అందజేసే పరిస్థితి కనిపించటం లేదు. కారణం కేంద్రం నుంచి ట్యాగ్ లు సరఫరా నిలిచిపోవడమే అంటున్నారు. ఫాస్టాగ్ లు అందిస్తున్న 23 బ్యాంకులు మరికొన్ని పేమెంట్ బ్యాంకులు వ్యాలెట్ సంస్థల పరిస్థితి దాదాపు ఇలాగే ఉంది. దీంతో టోల్ ప్లాజాల వద్ద వాహనదారులు తంటాలు పడుతున్నారు. దేశవ్యాప్తంగా ఫాస్టాగ్ నిబంధన ఆదివారం నుంచే అమల్లోకి వచ్చినా ఓ వైపు ఫాస్టాగ్ రీడింగ్ లో సాంకేతిక సమస్యలు మరోవైపు అవసరానికనుగుణంగా రేడియో ఫ్రీక్వెన్సీ గుర్తింపు పరికరం ఉన్న ట్యాగ్ ల సరఫరా లేకపోవడంతో పరిస్థితి రోజు రోజుకు జటిలమవుతోంది. డిమాండ్ కనుగుణంగా కేంద్ర రహదారుల శాఖ నుంచి ఫాస్టాగ్ ల సరఫరా లేకపోవడంతో ఇప్పటికిప్పుడు ఈ వ్యవస్థ అమలు దాదాపు అసాధ్యంగా మారింది. అందుకే కేంద్రం కూడా 25 శాతం ఫాస్టాగ్ లైన్లను హైబ్రిడ్ గా మారుస్తూ నెల రోజుల పాటు వాటిలో ఎలాంటి అపరాధరుసుం తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. ట్యాగ్ ల సరఫరా లేకపోడంతో దాదాపు అన్ని బ్యాంకులు ఇప్పుడు కేవలం వినియోగదారుల నుంచి ఫీజులు వసూలు చేసి రిజిస్ర్టేషన్ లు చేయడానికి పరిమితమయ్యాయి.  15 రోజుల క్రితం వరకూ ఫాస్టాగ్ లు కొనండి బాబు అంటూ బ్యాంకులు తిరిగేవి. ఇప్పుడు వినియోగదారులు ఫాస్టాగ్ ఇవ్వండి అంటూ వాటి చుట్టూ తిరుగుతున్నారు. వారికి ఇవ్వటానికి ట్యాగ్ ల స్టాకే లేదు. దీంతో ఫాస్టాగ్ రిజిస్ర్టేషన్ చార్జీలు సెక్యూరిటీ డిపాజిట్ లు వసూలు చేసి వారి పేర్లను నమోదు చేసుకుంటున్నారు. ట్యాగ్ ల సరఫరా కాగానే వారికి అందజేస్తామని చెబుతున్నారు. ట్యాగ్ ల సరఫరా కోసం ప్రతి రోజు జాతీయ రహదారుల సంస్థను కోరుతున్నామని అయినా స్పందన లేదంటున్నారు బ్యాంకు సిబ్బంది. అటు క్యాబ్ డ్రైవర్ లు కూడా దీని పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫాస్టాగ్ లేకపోతే టోల్ ప్లాజాల దాటాల్సిన ప్రాంతాల కారణంగా క్యాబ్ లు ప్రైవేటు బస్సుల బిజినెస్ దెబ్బతింటోందని వాపోతున్నారు. మరోవైపు ఫాస్టాగ్ లు తీసుకున్న వాహనదారులకు తంటాలు తప్పడం లేదు. టోల్ ప్లాజాల వద్ద ఆర్ఎఫ్ఐడీ రీడర్ లు సరిగా పని చేయడం లేదు. ఒకవేళ అవి సరిగ్గానే ఉన్న కంప్యూటర్ లోని డేటాతో అనుసంధానం చేయడంలో ఆపరేటర్లకు సరైన శిక్షణ లేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

మున్సిపల్ ఎన్నికలు.. మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్న కేటీఆర్

టీఆర్ఎస్ ప్రభుత్వం రెండో సారి అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యేలకు నిధుల సంకటం ఏర్పడింది. గతంలో నియోజకవర్గ అభివృద్ధి నిధులతో క్షేత్ర స్థాయిలో ప్రజలు కోరిన పనులు చేపట్టగలిగే వారు. పనిలో పనిగా సొంత పార్టీ ముఖ్య నేతలకి కూడా అందులోనే అన్ని సర్దుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ లో ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రోజురోజుకి దిగజారుతోంది. నియోజక వర్గ నిధులను ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేయడం లేదు. దీంతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ పార్టీ కార్యకర్తలకు ఎలా సర్ది చెప్పుకోవాలో తెలియక లోలోపల తికమకపడుతున్నారు. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఆయా మున్సిపాలిటీలో అభివృద్ధి పనుల కోసం నిధులు విడుదల చేయాలని పట్టుబడుతున్నారు. గత కొద్ది సంవత్సరాలుగా ఎటువంటి అభివృద్ధికి నోచుకోని కొన్ని నగర పంచాయతీలను మున్సిపాలిటీలుగా మునిసిపాలిటీలు కార్పొరేషన్ లుగా అప్ గ్రేడ్ చేశారు. వాటిలో పాగా వేయాలన్నది టీఆర్ఎస్ నేతల ఆలోచనగా ఉంది. అప్ గ్రేడ్ అయిన మునిసిపాలిటీలు కార్పొరేషన్లలో పలు సమస్యలు ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయని ఎమ్మెల్యేలు కేటీఆర్ దృష్టికి తెచ్చారు. ఈ నేపధ్యంలో కేటీఆర్ సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. ముందుగా అభివృద్ధి పనులు చేపట్టడం ద్వారా ఓటర్లను ఆకట్టుకోవాలన్నది టీఆర్ఎస్ పెద్దల లక్ష్యంగా ఉంది.  మున్సిపల్ ఎన్నికల పై గులాబి పార్టీ అధిష్టానం ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. ఒక్కో మున్సిపాలిటీలో ప్రధాన సమస్యలను గుర్తించాలని పార్టీ నేతలను ఆదేశించింది. రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, పారిశుధ్య పనుల పై దృష్టి కేంద్రీకరించాలని ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు కేటీఆర్ దిశా నిర్దేశం చేసినట్టు భోగట్టా. కొత్తగా చేపట్టాల్సిన పనుల విషయమై అధికారులతో మాట్లాడి శంకుస్థాపనలకు ముహుర్తాలు ఖరారు చేసుకోవాలని స్పష్టం చేశారు.ఈ తరుణంలో ఒక్కో మునిసిపాలిటీలో కనీసం 30 వరకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేపట్టే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకునే పనిలో గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు బిజీగా వున్నారు. వచ్చే ఏడాది జనవరి మూడో వారంలోనే ఎన్నికలు జరగడానికి ఆస్కారం ఉందని టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా కార్పొరేషన్ లో డివిజన్ల వారీగా అనేక మంది ఆశావహులు పోటీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఎమ్మెల్యేలు మంత్రుల చుట్టూ ఆశావహులు చక్కర్లు కొడుతున్నారు. ఒక్కో స్థానంలో టికెట్ ఆశించే వారు లెక్కకు మిక్కిలిగా ఉండటంతో అభ్యర్థుల ఎంపిక పార్టీ పెద్దలకి సంక్లిష్టంగా మారింది. దీంతో ఆ బాధ్యతను స్థానిక ఎమ్మెల్యేలకే కేటీఆర్ అప్పగించినట్టు తెలుస్తోంది.

ముస్లింల ఆందోళన దేనికి? ఈశాన్య రాష్ట్రాల భయమేంటి?

మతాలకు అతీతంగా పౌరసత్వ సవరణ చట్టాన్ని అందరూ వ్యతిరేకిస్తున్నా... ముఖ్యంగా ముస్లింలు పెద్దఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు. ఎందుకంటే, పౌరసత్వ సవరణ చట్టం భారతీయ ముస్లింల హక్కులను నిరాకరిస్తుందనే అపోహ ఉంది. అది నిజం కానేకాదు. ఎందుకంటే, ఆ చట్టం కేవలం మూడు పొరుగుదేశాల నుంచి వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు మాత్రమే వర్తిస్తుంది. పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చే ముస్లిమేతర శరణార్థులు భారతీయ పౌరసత్వాన్ని పొందడాన్ని పౌరసత్వ సవరణ చట్టం సులభం చేస్తుంది. ఇక దేశవ్యాప్త ఎన్నార్సీ అనేది ఇప్పటికైతే ప్రతిపాదిత దశలోనే ఉంది. అది చట్టమైతే, మతంతో సంబంధం లేకుండా అక్రమ వలసదారులందరికీ అది వర్తిస్తుంది. అయితే, పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా  దేశంలో జరుగుతున్న ఆందోళనలన్నీ ఒకే రకమైనవి కాదు.   ఆందోళనలు రెండు రకాలుగా ఉన్నాయి. అందులో ఒకటి... ముస్లింలను మినహాయించినందుకు ఒక రకం ఆందోళన జరుగుతోంది. యూపీ, ఢిల్లీ, కేరళ, బెంగాల్ లో జరుగుతున్న ఆందోళనలు ముస్లింలను మినహాయించినందుకు వ్యతిరేకంగా జరుగుతున్నవే. ఇక రెండో రకం... ఈశాన్య రాష్ట్రాల్లో జరుగుతున్న ఆందోళనలు. ఈశాన్య రాష్ట్రాల్లోని ఆందోళనలు... ముస్లింలను మినహాయించినందుకు వ్యతిరేకంగా జరుగుతున్నవి కాదు. శరణార్థులుగా వచ్చే ముస్లిమేతరుల కారణంగా తమ ప్రాంతాల్లో జనాభా తీరుతెన్నులు మారుతాయని, భాషాపరంగా, సంస్కృతిపరంగా తమ హాని కలుగుతుందని, తమకు ఉపాధి అవకాశాలు సన్నగిల్లుతాయని జరుగుతున్న ఆందోళన. ఈ రెండింటినీ ఒకే రకంగా చూడలేం.  నిజానికి ఈశాన్య రాష్ట్రాల్లో పౌరసత్వ సవరణ చట్టం అమలయ్యే అవకాశమే లేదు. ఎందుకంటే, చట్టంలో ఆ మేరకు మినహాయింపు ఇచ్చారు. కాకపోతే.... గతంలో ఎన్ని చట్టాలు ఉన్నా...అసోంను అక్రమ వలసదారులు ముంచెత్తారు. పౌరసత్వ సవరణ చట్టం వల్ల కూడా అదే పరిస్థితి ఏర్పడుతుందేమోనని ఈశాన్య రాష్ట్రాలు భయపడుతున్నాయి. బంగ్లా నుంచి వచ్చే ముస్లిమేతరులు గనుక ఈశాన్య రాష్ట్రాల్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటే ...అక్కడి ప్రజలు ఇక్కట్లకు గురయ్యే అవకాశం ఉంది. అందుకే ఈశాన్య రాష్ట్రాల ప్రజలు పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా, బంగ్లా నుంచి హిందువుల వలసలు అధికమై జనాభా తీరుతెన్నుల్లో మార్పు వస్తుందని ఈశాన్య రాష్ట్రాలు భయపడుతున్నాయి. అయితే, పౌరసత్వ సవరణ చట్టం అమల్లోకి రావడంతో.....దేశంలో ఆర్టికల్ 370 రద్దు నాటి పరిస్థితి మళ్లీ ఏర్పడింది. అప్పట్లో కశ్మీర్ లో మాత్రమే ఉద్రిక్తత నెలకొంటే.... ఇప్పుడు మాత్రం ఈశాన్య రాష్ట్రాలు భగ్గుమంటున్నాయి. కొన్ని యూనివర్సిటీల్లో విద్యార్థులు తీవ్రస్థాయిలో ఆందోళనకు దిగుతున్నారు. దాంతో హింసాకాండ చోటు చేసుకుంది.  

CAB, NRCల్లో అసలేముంది? అసలు ఉద్దేశమేంటి?

పౌరసత్వ సవరణ చట్టం, నేషనల్ రిజిష్టర్ ఆఫ్ సిటిజన్స్ రెండూ విభిన్నమైనవే అయినా ఒకే నాణేనికి రెండు ముఖాల్లాంటివి. ఆరెస్సెస్ ప్రతిపాదిస్తున్న హిందూ భావనకు దోహదం చేసేవే. భారతదేశం హిందువులందరికీ మాతృభూమి అనే భావనకు అనుగుణంగానే ఈ రెండు చట్టాలు రూపుదిద్దుకున్నాయి. అసోం విషయానికి వస్తే....అక్కడ మతంతో సంబంధం లేకుండా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హిందూ, ముస్లిం, క్రిస్టియన్లు అంతా అక్రమ వలసదారులవుతారు. అదే సమయంలో ముస్లిమేతరులు మాత్రం భారత పౌరసత్వం పొందేందుకు మాత్రం వీలవుతుంది. బెంగాల్ విషయానికి వస్తే 1971 మార్చి 24 కంటే  ముందు వచ్చిన బంగ్లాదేశీయులకు అందరికీ భారత పౌరసత్వం ఇచ్చేలా 2003లోనే చట్ట సవరణ జరిగింది. తాజా చట్టసవరణతో 2014కు ముందు వచ్చిన వారందరికీ పౌరసత్వ లభించే అవకాశం కలిగింది. కాకపోతే ముస్లిమేతరులు మాత్రమే భారత పౌరసత్వం పొందే వీలుంది.  ఇక నేషనల్ రిజిష్టర్ ఆఫ్ కౌన్సిల్ ను దేశవ్యాప్తంగా అమలు చేస్తే....తాము భారతీయులమని రుజువు చేసుకోవాల్సిన అవసరం అందరిపైనా ఉన్నా.....ముస్లింలపై అది మరింత భారం మోపే అవకాశం ఉంది. అందుకు కారణం....తాము భారత పౌరులమని రుజువు చేసుకోలేకపోయిన ముస్లిమేతరులు శరణార్థులమంటూ భారత పౌరసత్వాన్ని పొందవచ్చు. ముస్లింల విషయంలో మాత్రం అలా జరిగేందుకు అవకాశం లేదు. మొత్తం మీద చూస్తే మాత్రం....పౌరసత్వ సవరణ చట్టం, నేషనల్ రిజిష్టర్ ఆఫ్ సిటిజన్స్ రెండు వేర్వేరు అంశాలే అయినప్పటికీ ఏదో విధంగా మతంతో ముడిపడినవే. ఆ కారణంగానే ఇది దేశంలో మతపరమైన వాదనలకూ దారితీస్తోంది. పౌరసత్వ సవరణ అంశం అనేది మతం ఆధారంగా ఉందనేది నిజం. పొరుగున ఉన్న మూడు దేశాల నుంచి శరణార్థులుగా వచ్చి భారతీయ పౌరసత్వం కోరే వారిని ఇది మతం ప్రాతిపదికన విభజిస్తుంది. పొరుగున్న ఉన్న ముస్లిం దేశాల్లో మతపరమైన వేధింపులకు గురయ్యే ముస్లిమేతరులు మాత్రమే పౌరసత్వ సవరణ చట్టం ఆధారంగా దేశంలో పౌరసత్వం పొందగలుగుతారు. ఇక, నేషనల్ రిజిష్టర్ ఆఫ్ సిటిజన్స్ అనేది మతం ఆధారంగా ఉండేది కాదు. ఏ మతానికి చెందిన వారైనప్పటికీ అక్రమంగా వచ్చిన వలసదారులను వెనక్కి పంపడమే దీని ఉద్దేశం.  అయితే, ఎన్సార్సీని దేశవ్యాప్తం చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెబుతున్నప్పటికీ... ఇప్పటికైతే ఇది సుప్రీం ఆదేశం మేరకు ఒక రాష్ట్రానికి మాత్రమే పరిమితమైంది. అసోంలోని అక్రమ వలసదారులను గుర్తించి, నిర్బంధించడమే దీని ఉద్దేశం. అసోం మినహా మరే రాష్ట్రానికి కూడా ప్రస్తుతం ఎన్సార్సీ వర్తించదు. అయితే, పౌరసత్వ సవరణ చట్టం మాత్రం యావత్ దేశానికి వర్తిస్తుంది. కొంతమంది ముఖ్యమంత్రులు ఈ చట్టాన్ని తమ రాష్ట్రాల్లో పాటించబోమని అంటున్నా  రాజ్యాంగరీత్యా వారి మాట చెల్లుబాటు అయ్యే అవకాశం లేదు. అన్ని రాష్ట్రాలు కూడా కచ్చితంగా ఈ చట్టాన్ని అమలు చేయాల్సి ఉంటుంది.

యాదాద్రి పర్యటనకు కేసీఆర్.. దేవాలయ అభివృద్ధి పనుల పురోగతిపై పరిశీలన

నేడు యాదాద్రిలో పర్యటించనున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. దేవాలయ అభివృద్ధి పనులను పర్యవేక్షించడానికి సీఎం స్వయంగా యాదాద్రికి వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా ఉదయం 11 గంటలకు గుట్టకు చేరుకుంటారు. బాలాలయంలో స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం పునర్ నిర్మాణం పరిసరాల అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించనున్నారు. ఉత్తరాయణ పుణ్యకాలంలో ఉద్ఘాటన ముహుర్తం నిర్ణయిస్తామని ఆగస్టు 17 న పర్యటన సందర్భంగా సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కనీవినీ ఎరుగని రీతిలో మహా సుదర్శన నారసింహ యాగం నిర్వహిస్తామని తెలిపారు. ఆలయ నిర్మాణానికి సంబంధించి సలహాలు సూచనలు ఇచ్చారు. ప్రధాన ఆలయం లోపల బయట ఆ మేరకు పనులు జరిగాయా లేదా అని నేడు పరిశీలించనున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ వైదిక, ఆగమశాస్త్రాల ప్రకారం లోపాలను క్షుణ్ణంగా పరిశీలించి అవకాశాలున్నట్లు అధికారులు చెబుతున్నారు. దాదాపు 100 ఎకరాల్లో 1000,108 యజ్ఞ కుండాలతో మహాసుదర్శన యాగ క్రతువుకు అనువైన స్థలంగా గండి చెరువు ప్రాంతాన్ని ఎంపిక చేశారు. ఆ ప్రాంతం అక్కడికి చేరుకునే రహదారుల ఎంపిక దేశ విదేశాల నుంచి వచ్చే మాఠాధిపతులు పీఠాధిపతులుతో పాటు ఆధ్యాత్మిక గురువులకు బస వసతి ఏర్పాట్లను స్వయంగా పరిశీలించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ముఖ్య అతిథులకు ఉద్దేశించిన ప్రెసిడెన్షియల్ సూట్ నిర్మాణ పురోగతి భక్తులకు ప్రయాణ వసతి ఏర్పాట్లను పరిశీలించనున్నారు. కొండ చుట్టూ నిర్మాణంలో ఉన్న ఆరు వరుసల రహదారి పురోగతి నిర్వాసితుల పునరావాసం తదితర అంశాలపైనా ఆరా తీసే అవకాశాలున్నాయి. ఆలయ ఉద్ఘాటన మహాసుదర్శన యాగం ఏర్పాట్ల పై అధికారులకు దిశా నిర్దేశం చేస్తారని భావిస్తున్నారు. కాగా ఉద్ఘాటనకు ముహూర్తం పై చిన జీయర్ స్వామితో సంప్రదింపులు జరిపి తుది నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని ఆలయ వర్గాలు చెబుతున్నాయి.

ఆర్టీసీ పై క్లారిటీ లేదు... జీతభత్యాలు..కార్మికుల విలీనంపై స్పష్టత ఇవ్వని ఏపీ ప్రభుత్వం

  ఏపీలో ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ పై కీలకమైన ముందడుగు పడటంతో ఆ సంస్థ అధికారులు , కార్మికులు సిబ్బందిలో హర్షాతిరేకాలు మొదలయ్యాయి. ప్రతి నాలుగేళ్లకు ఒకసారి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు పెంచాలంటూ సమ్మెలు చేసే కార్మికులు ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ ఉద్యోగులు అవుతున్నారు. రవాణామంత్రి పేర్ని నాని అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడతారన్న వార్తల నేపథ్యంలో 52,000 మంది ఉత్కంఠగా ఎదురు చూశారు. ఎట్టకేలకు సభలోకి బిల్లు రావడం ఆమోద ముద్ర కూడా పడటంతో వారి ఆనందానికి అవధుల్లేవు. అయితే పాత పెన్షన్ విధానం ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు ఇతర సౌకర్యాలపై బిల్లులో స్పష్టత లేకపోవటంతో ప్రశ్నలు సంధిస్తున్నారు. ఏపీఎస్ ఆర్టీసీలో అధికారులు , సిబ్బంది కార్మికులు అందరూ కలిపి 51,700 మంది ఉన్నారు. వీరితో పాటు మరో 7,500 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బంది కూడా పనిచేస్తున్నారు. లాభనష్టాలతో సంబంధం లేకుండా ప్రతి గ్రామానికి సేవలందిస్తున్న ఈ సంస్థ డీజిల్ ధరల పెరుగుదల పన్నుల భారం పెరగడంతో ఎప్పుడూ నష్టాల బాటలోనే నడుస్తూ ఉంటుంది. ఇలాంటి సంస్థలు రాత్రింబవళ్లు కష్ట పడి పనిచేసే కార్మికులు ప్రతీ నాలుగేళ్లకోసారి జరిగే వేతన సవరణ సందర్భంగా మెరుగైన జీతభత్యాల కోసం ఆందోళన బాట పట్టక తప్పని పరిస్థితి వస్తోంది. అయితే ఈ సమస్యకు శాశ్వతంగా మంగళం పాడాలని జగన్ ప్రభుత్వం సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయించింది. అయితే కేంద్రం 31 శాతం వాటా ఇవ్వడంతోనే ఆర్టీసీ ఆవిర్భవించిందని ఏక పక్షంగా విలీనం సాధ్యం కాదని నిపుణుల కమిటీ తేల్చింది. దీంతో సిబ్బంది వరకూ విలీనం చేద్దామని ప్రభుత్వం నిర్ణయించింది. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ ఏర్పాటు చేసి 2020 జనవరి 1 నాటికి మొత్తం పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించింది. ఈ ప్రక్రియను పూర్తి చేసిన టీటీడీ ఏర్పాటు కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. దీంతో మంత్రి పేర్ని అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టారు. విలీన ప్రక్రియ మొదలైనప్పటి నుంచి కార్మికులు, సిబ్బంది, అధికారులు పలు అనుమానాలు లేవనెత్తుతున్నారు. కార్మికులు అనుమానాల్లో ప్రధానమైన అంశం పెన్షన్ ఉంటుందా లేదా అనేది. దీంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికే ఉన్న సౌకర్యాల తమకూ వర్తింపజేయాలని జీతభత్యాల వ్యత్యాసాన్ని కూడా సమానం చేయాలని కార్మిక సంఘాలు కమిటీకి లిఖిత పూర్వకంగా విజ్ఞప్తి చేశాయి. అయితే నిన్న సభ ఆమోదించిన బిల్లులో ఆ అంశాలేవీ లేవు, వారి డిమాండ్లు అలాగే మిగిలిపోయాయి. విలీన గడువు ఇంకా రెండు వారాలు మాత్రమే ఉండడంతో ఆలోపే స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వానికి కార్మికులు విన్నవిస్తున్నారు. మరోవైపు ప్రతిపక్షంలో ఉండగా పాదయాత్రలో 65 వేల మంది ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేస్తామని మాటిచ్చారని ఇప్పుడు 52 వేల మందికి మాత్రమే న్యాయం జరుగుతుందని ఔట్ సోర్సింగ్ సిబ్బంది గుర్తు చేస్తున్నారు. ముఖ్యమంత్రి పెద్ద మనసు చేసుకుని తమకు న్యాయం చేయాలని విన్నవిస్తున్నారు.