వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి ఆచూకీ చెబితే తగిన బహుమతి!!
posted on Dec 26, 2019 @ 12:27PM
దేనికైనా సిద్ధం అంటూ సర్కారు తో తేల్చుకునేందుకు కొంత మంది రైతులు సిద్ధమయ్యారు. జల దీక్షలు చేపట్టారు. తాళ్లాయపాలెం లోని కృష్ణా నదిలో దిగి కొన్ని గంటల పాటు నినాదాలతో హోరెత్తించారు. చేతుల్లోని ఆకుపచ్చ జెండాలను ఊపుతూ మెడలోతు నీళ్ళల్లో గంటకు పైగా నిలబడ్డారు. వెలగపూడిలో రిలే దీక్షలు కొనసాగాయి. జగన్ కు అమరావతి అభివృద్ధి చేయడం చేతకాక పోతే మౌనంగా ఉండాలి, వచ్చే ఐదేళ్లలో ఆయన ఒక్క పనిచేయకపోయినా మా ప్లాట్లను అభివృద్ధి చేయక పోయినా మేం అడగము, రాజధానిని మాత్రం తరలించొద్దని రైతులు అర్థించారు. రాజధాని పై మంత్రుల చేసిన వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. ఎనిమిది గ్రామాలే రాజధానిలో ఉద్యమిస్తున్నాయన్న శ్రీకాకుళం జిల్లా ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యలపై మండిపడ్డారు. రేపటి రోజున విశాఖ పరిస్థితి ఇలాగే ఉంటుందన్నారు.
తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆచూకీ చెబితే తగిన బహుమతి ఇస్తామని రైతులు ప్రకటించారు. న్యాయం చేయండి అంటూ మున్సిపల్ కార్యాలయం కార్యదర్శి సీఆర్డీఏ కమిషనర్ కు రైతులు లేఖలు రాశారు. ఇంటెలిజెన్స్ పోలీసులు తనను ఫోటోలు తీయడం పై రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తుళ్లూరులో యువకులు మోదీ, అమిత్ షా మాస్కులు ధరించి రోడ్డుపైనే క్రికెట్ ఆడుతూ రాస్తారోకో చేశారు. ఒక వ్యక్తి జగన్ మాస్కు ధరించి చండ్రకులు చేత పట్టుకొని రోడ్డెక్కాడు. అక్కడ ఉన్న పోలీసులు ఆయనను అడ్డుకొని జగన్ మోసుకుని లాగేశారు. రాజధాని రైతులు శిబిరాల వద్ద క్రిస్మస్ ను జరుపుకున్నారు. సర్కార్ తన నిర్ణయం మార్చుకునేలా చేయాలంటూ మహిళలు విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. ఉద్దండరాయునిపాలెంలో జరిగిన ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లాతో పాటు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల మహిళలు పాల్గొన్నారు. నాడు మోదీ అక్కడ అందించిన పవిత్ర నీరు మట్టికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమరావతికి సారె సమర్పించారు. బుధవారం బీజేపీ రాష్ట్ర అగ్ర నేతలు ఒక బృందంగా ఏర్పడి తుళ్లూరు, మందడం, వెలగపూడి గ్రామాలకి వెళ్లి రైతులకు తమ సంఘీభావాన్ని ప్రకటించారు.
ఐక్య ఉద్యమాలతో రాజధాని తరలింపును అడ్డుకుంటామని అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ నేతలు తీర్మానం చేశారు. గుంటూరులో జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం సమావేశం జరిగింది. జేఏసీ అధ్యక్షుడు జి శాంతకుమారి మాట్లాడుతూ రాజధాని ఒక్క పార్టీకో ప్రాంతానికి సంబంధించిన అంశం కాదన్నారు. రాజధాని లోని 29 గ్రామాల్లో మొదలైన ఉద్యమం రాష్ట్ర మంతా విస్తరిస్తోంది. తూర్పు గోదావరి జిల్లాలో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు కలిసి అమరావతి కోసం బుధవారం జేఏసీగా ఏర్పడ్డాయి. ఈ కమిటీ కన్వీనర్ గా సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు పేరును ప్రకటించారు. అనంతరం మధు ఆధ్వర్యంలో జరిగిన జేఏసీ సమావేశంలో మాజీ హోమంత్రి పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, తదితర టీడీపీ నేతలు, జనసేన, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. కాకినాడ, అమలాపురం రాజమహేంద్రవరంలో జేఏసీలను ఏర్పాటు చేసి మంత్రులకు తమ డిమాండ్ ను వినిపిస్తూ వినతి పత్రాలు అందజేయాలని నాయకులు తీర్మాణించారు. కాగా రాజధాని ప్రాంత రైతులు ఈ నెల 28 వ తేదీన గుంటూరు జిల్లా బంద్ కు పిలుపునిచ్చారు.మొత్తం మీద రాజధాని అంశంతో ఏపీ మొత్తం అట్టుడుకిపోతోంది అనడంలో అలాంటి సందేహం లేదు. మరి జగన్ ఈ అంశంపైఏ నిర్ణయానికి వస్తారు అన్నది మాత్రం వేచి చూడాలి.