చైనా ఆర్ధిక నైచ్యంపై కొరడా ఝుళిపించిన భారత్
* ఎఫ్ డి ఐ పాలసీకి వాణిజ్య మంత్రిత్వ శాఖ సవరణ
* చుట్టుపక్కల దేశాలు మన దేశంలో పెట్టుబడులు పెట్టాలంటే, కొత్త నిబంధనలు వర్తిస్తాయి
అంతా అనుకున్నట్టే జరుగుతోందని సంబరపడుతున్న చైనా కు -ఈ రోజు గట్టి ఎదురు దెబ్బే తగిలింది.. భారత్ లో ఆర్ధిక దురాక్రమణకు పాల్పడే కుట్రలో భాగంగా, ఇటీవల పీపుల్స్ బ్యాంక్ అఫ్ చైనా , మన హెచ్ డి ఎఫ్ సి లో పెట్టుబడులు పెంచుకున్న విషయంపై భారత్ గట్టిగా స్పందించింది. కరోనా వైరస్ వల్ల నెలకొన్ని ప్రతికూల పరిస్థితుల్లో విదేశీ సంస్థలు మన కంపెనీల్లో నేరుగా ఇన్వెస్ట్ చేయడాన్ని నియంత్రించేందుకు కేంద్రం ఎఫ్‌డీఐ పాలసీని సవరించింది. దీంతో భారత్‌తో సరిహద్దులు పంచుకునే దేశాల్లోని కంపెనీలు మన సంస్థల్లో ఇన్వెస్ట్ చేయాలంటే ముందుగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిందే. ఆటోమేటిక్ మార్గంలో దేశంలో పెట్టుబడులు పెట్టడానికి వీలు లేదు. వాణిజ్య మంత్రిత్వ శాఖ తాజాగా ఈ విషయాలు వెల్లడించింది. దీనికి సంబంధించి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పాలసీకి సవరణలు చేసింది. భారత్‌తో సరిహద్దులు కలిగిన దేశాలకు ఈ నిబంధన వర్తిస్తుందని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ లక్ష్మణ రేఖ గీసింది.
ఇప్పటికే శ్రీలంక, పాకిస్తాన్ లకు అప్పులిచ్చి, ఆ దేశాలను తన గుప్పిట్లో పెట్టుకున్న చైనా, కమ్యూనిజం నుంచి ఇంపీరియలిజం వైపు ప్రయాణిస్తూ భారత ఆర్ధిక వ్యవస్థను ప్రభావితం చేసే దిశగా ఇటీవలే పీపుల్స్ బ్యాంక్ అఫ్ చైనా ను మన మీదకు ఉసి గొల్పిన విష్యం తెలిసిందే. పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా కీలక ముందడుగు వేసింది. హెచ్ డీఎఫ్ సీ లిమిటెడ్ లో 1.75 కోట్ల షేర్లను కొనుగోలు చేసింది. మార్చి త్రైమాసికంలో ఈ కొనుగోలు ప్రక్రియ జరిగినట్టు భావిస్తున్నారు. ఇటీవల కాలంలో హెచ్ డీఎఫ్ సీ లిమిటెడ్ షేర్ల విలువ క్రమంగా పతనమవుతోంది. ఫిబ్రవరి మొదటి వారం నుంచి ఇప్పటివరకు 41 శాతం క్షీణత చవిచూసింది. అంతకుముందు జనవరి 14న 52 వారాల గరిష్ట పతనంతో హెచ్ డీఎఫ్ సీ షేర్ రూ.2,499.65 వద్ద ట్రేడయింది. ఏప్రిల్ 10 నాటికి హెచ్ డీఎఫ్ సీ షేర్ వాల్యూ రూ.1,710కి పడిపోయింది. అదే సమయంలో భారత సూచీల్లో సెన్సెక్స్ 25 శాతం నష్టపోగా, నిఫ్టీ 26 శాతం నష్టాలు చవిచూసింది. హెచ్ డీఎఫ్ సీ లిమిటెడ్ లో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) కూడా వాటాదారు కాగా, డిసెంబరు త్రైమాసికంలో తన వాటాను 4.21 శాతం నుంచి 4.67 శాతానికి పెంచుకుంది.
ఇక, తాజా లావాదేవీపై హెచ్ డీఎఫ్ సీ లిమిటెడ్ వైస్ చైర్మన్, సీఈఓ కెకీ మిస్త్రీ మాట్లాడుతూ, పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనాకు తమ కంపెనీలో 2019 మార్చి నాటికే 0.8 శాతం వాటాలున్నాయని వెల్లడించారు. ఇప్పుడా వాటాలు ఒక్క శాతాన్ని దాటాయని, ప్రస్తుతానికి హెచ్ డీఎఫ్ సీ లిమిటెడ్ లో పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా వాటా 1.1 శాతం అని వివరించారు. గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే చైనా ప్రపంచ ప్రధాన ఆర్థిక సంస్థల్లో భారీగా వాటాలు దక్కించుకుంటోంది. స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా కొనుగోళ్ల ప్రక్రియ సాగిస్తున్న చైనా ఇతర ఆసియా దేశాల్లో తన పెట్టుబడులను గణనీయంగా పెంచుకుంటోంది. ముఖ్యంగా, పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో ఇన్ ఫ్రాస్ట్రక్చర్ రంగంలోనూ, టెక్నాలజీ రంగంలోనూ భారీగా పెట్టుబడులు పెడుతోంది. అయితే, భారత్ తాజా నిబంధనలతో, పీపుల్స్ బ్యాంక్ అఫ్ చైనా తాజా గా హెచ్ డి ఎఫ్ సి లో పెట్టిన పెట్టుబడులు ఉపసంహరించుకొవలసి రావచ్చు. పాత ఎఫ్‌డీఐ పాలసీ ప్రకారం భారత్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే బంగ్లాదేశ్, పాకిస్తాన్ కంపెనీలకు మాత్రమే ప్రభుత్వం అనుమతి అవసరం అయ్యేంది. సవరించిన ఎఫ్‌డీఐ పాలసీతో చైనాకు కూడా ఈ రూల్ వర్తిస్తుంది. హెచ్‌డీఎఫ్‌సీలో ఇటీవలో చైనా బ్యాంక్ 1.01 శాతం కొనుగోలు డీల్‌కు కొత్త రూల్స్ వర్తించవని వాణిజ్య వర్గాలు పేర్కొంటున్నప్పటికీ, ఆ సవరణ దిశగా భారత్ ముందడుగు వేసే అవకాశాలున్నాయి.