చెప్పడానికి మనసుకు కష్టంగా ఉంది, అయినా చెప్తున్నా: జగన్మోహన్ రెడ్డి 

కరోనా కారణంగా, ఇళ్లలోనే ప్రార్ధనలు చేసుకోవలసిందిగా ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ముస్లిం సమాజానికి విజ్ఞప్తి చేశారు. జిల్లా కలెక్టర్లు, ముస్లిం మత పెద్దలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం.జగన్మోహన్ రెడ్డి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. " ఈ రంజాన్‌మాసంలో మీరంతా కూడా సహకరించి ఇళ్లల్లోనే ప్రార్థనలు చేసుకోవాలని కోరుతున్నా, మీ అందర్నీ అభ్యర్థిస్తున్నా", అని ఆయన చెప్పారు.  ప్రపంచంలో, దేశంలో ఏం జరుగుతుందో అందరికీ తెలిసిన విషయాలేననీ, కరోనా వైరస్‌ను అధిగమించేందుకు గత కొన్ని రోజులుగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామనీ చెప్పుకొచ్చిన ముఖ్యమంత్రి -ఉగాది, శ్రీరామ నవమి, గుడ్‌ ఫ్రైడే, ఈస్టర్‌ ఇళ్లల్లోనే చేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చిన విషయాన్నీ గుర్తు చేశారు. " ఇప్పుడు రంజాన్‌ కూడా వచ్చింది. ఇళ్లలోనే ఉంటూ ప్రార్థనలు చేసుకోవాల్సిన తప్పనిసరి పరిస్థితులు నెలకొన్నాయి. ఈ రంజాన్‌మాసంలో మీరంతా కూడా సహకరించి ఇళ్లల్లోనే ప్రార్థనలు చేసుకోవాలని కోరుతున్నా, మీ అందర్నీ అభ్యర్థిస్తున్నా. ఈ విషయాన్ని అందరికీ చెప్పండం," టూ ముస్లిం మత పెద్దలకు సీఎం విజ్ఞప్తి చేశారు. ఇది మనసుకు కష్టమైన మాట అయినా సరే.. చెప్పక తప్పని పరిస్థితి అని సీఎం చెప్పారు.

విందు కోసం కింగ్ కోబ్రాతో పండ‌గ చేసుకున్నారట‌!

కరోనా వైరస్ వ్యాప్తితో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లో ఉంది. లాక్ డౌన్ కారణంగా దేశంలో కొన్నిచోట్ల ఆహారం కోసం ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. లాక్ డౌన్ కారణంగా నోరు చ‌ప్ప‌బ‌డిందంటూ  కొందరు వేటగాళ్లు ఆహారం కోసం అడవిలో వేటకు వెళ్లారు. కింగ్ కోబ్రాను వేటాడారు. ఈ సంఘ‌ట‌న అరుణాచల్ ప్రదేశ్ అడువుల్లో జ‌రిగింది. విందు కోసం 12 అడుగుల పొడవైన కింగ్ కోబ్రాను వేటగాళ్ల బృందం చంపేసింది. అనంతరం కింగ్ కోబ్రా మాంసాన్ని ముక్కలుగా చేసి విందు కోసం భారీ ఏర్పాట్లు చేశారు. కోబ్రా మాంసాన్ని శుభ్రపరించేందుకు అరటి ఆకులను వేశారు. కింగ్ కోబ్రాను చంపిన వీడియో ఒకటి వైరల్ కావడంతో అధికారుల దృష్టికి వెళ్లింది. కింగ్ కోబ్రాను చంపిన వేటగాళ్ల బృందం విషపూరితమైన కింగ్ కోబ్రాను తమ భుజాలపై వేసుకుని ఫోటో స్టిల్స్ ఇచ్చారు.  వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.  తిన‌డానికి ఏమీలేక పోవ‌డంతోనే తాము ఆహారం కోసం వేటాడామ‌ని వారు చెబుతున్నారు. ఆహారం కోసం వెతుకుతూ అడవికి వెళ్లామని, అక్కడే తమకు కింగ్ కోబ్రా దొరికిందని తెలిపారు. వన్యప్రాణుల రక్షణ చట్టం కింద ఈ ముగ్గురు వేటగాళ్లపై కేసు నమోదైందని, ముగ్గురిలో ఒకరు పరారీలో ఉన్నారు. కింగ్ కోబ్రా చట్టం ప్రకారం రక్షిత సరీసృపాలు, వాటిని చంపడం బెయిల్ మంజూరు చేయలేని నేరంగా పరిగణిస్తారు. 

పోలీసులు గద్దించటంతో సత్తెనపల్లి లో గుండెపోటుతో యువకుడి మృతి

సత్తెనపల్లి పట్టణంలో పోలీస్ గట్టిగా గద్దించటం తో, యువకుడు మృతి చెందినట్టుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై పరస్పర భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. సత్తెనపల్లి వెంకటపతి కాలనీ కి  చెందిన మొహమ్మద్ గౌస్ (28), ఉదయం 9 గంటలకు నిత్యావసర సరుకుల కోసం వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగింది. అక్కడికక్కడే సృహ తప్పి పడిపోయిన మొహమ్మద్ గౌస్ ను పోలీస్ వాహనం లో హాస్పిటల్ కు తరలించగా  చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. చనిపోయిన మొహమ్మద్ గౌస్ కు పెళ్లి అయినది. ఇద్దరు చిన్న పిల్లలు సత్తెనపల్లిలో చనిపోయిన గౌస్ ముందునుండి గుండె జబ్బుతో బాధపడుతున్నాడు.బయటకు ఎందుకొచ్చావ్ అని ప్రశ్నించిన పోలీసులకు సరైన సమాధానం ఇవ్వని గౌస్. పోలీసులు గట్టిగా ప్రశ్నించడంతో భయంతో కుప్పకూలిపోయిన గౌస్. ఈ ఘటనపై శాఖపరమైన విచారణ జరుపుతున్నామని, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని  గుంటూరు ఐజి ప్రభాకర్ రావు వెల్లడించారు.  కాగా, సత్తెనపల్లిలో మృతుడి బంధువుల ఆందోళనలు ఉద్రిక్తం. శవంతో రోడ్డుపై ఆందోళనలు.సంఘటన స్థలానికి చేరుకున్న డిఎస్పీ, ఏఎస్పీలు. మృతుడి బంధువులతో చర్చిస్తున్న పోలీసు ఉన్నతాధికారులు. ఘటన పై విచారణ ప్రారంభించినట్లు ఏఎస్పీ ప్రకటన. ఈ రోజు మధ్యాహ్ననికి జిల్లా ఎస్పీకి నివేదిక అందచేస్తామన్నారు. కాగా, సత్తెనపల్లిలో ఉద్రిక్తతలపై చంద్రబాబు దిగ్భ్రాంతి. ముస్లిం యువకుడు గౌస్ మృతి చెందడంపై చంద్రబాబు దిగ్భ్రాంతి. గౌస్ పై పోలీసుల దాడిని ఖండించిన చంద్రబాబు. మందుల దుకాణానికి వెళ్లిన ముస్లిం యువకుడిపై దాడి గర్హనీయం. మృతుడి కుటుంబానికి ఎక్స్  గ్రేషియా చెల్లించి ఆదుకోవాలి.  పోలీసులు, ప్రజల మధ్య పరస్పర సమన్వయం ఉండాలి. పోలీసులు దురుసుగా వ్యవహరించరాదు. అన్నివర్గాల ప్రజలు పోలీసులకు సహకరించాలి. ఈ విపత్కర సమయంలో అందరూ బాధ్యతగా వ్యవహరించాలి. పరస్పర సహకారం, సమన్వయం, సోదరభావంతో వ్యవహరించాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆయన కోరారు.

చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ముఖ్య‌మంత్రి జ‌గ‌న్! 

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు ఇలాగే పూర్తి ఆరోగ్యంతో, చిరకాలం సంతోషంగా ఉండాలని కోరుతూ ముఖ్య‌మంత్రి ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు చెప్పారు. రాజ‌కీయాల్లో అధికార ప్ర‌తిప‌క్ష స‌భ్యుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ పూరిత వాతావ‌ర‌ణం వుంటుంది. ప‌ర‌స్ప‌రం విమ‌ర్శ‌లు, ప్ర‌తివిమ‌ర్శ‌లు చేసుకుంటూ నేత‌లు వేడిపుట్టిస్తూ వుంటారు.  అయినప్పటికీ చంద్రబాబు పుట్టిన రోజు అనగానే సీఎం జగన్ స్పందించారు. తన ట్విట్టర్ ఖాతాలో ఆయనకు విషెస్ తెలిపారు. ప్రస్తుతం 71వ సంవత్సరంలోకి వెళ్తున్న చంద్రబాబు... తన పుట్టిన రోజు సందర్భంగా టీడీపీ కార్యకర్తలు, అభిమానులూ ఎలాంటి వేడుకలూ నిర్వహించవద్దని కోరారు. కరోనా లాక్‌డౌన్ అమల్లో ఉంది కాబట్టి... దాన్ని పాటిస్తూ... ప్రతి ఒక్కరూ ఇళ్లలో ఉండటమే అసలైన అభిమానం అని చంద్రబాబు చెప్పారు.  ఈ సందర్భంగా ఆయనకు రాజకీయ, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు ప్రతిపక్షంలో ఉంటూ... చంద్రబాబు... ఎంతో యాక్టివ్ రోల్ పోషిస్తూ... కరోనాపై పోరాటంలో... దేశానికీ, ఏపీకీ అండగా ఉంటున్నారని ప్రశంసిస్తూ అభిమానులు ట్వీట‌ర్ ద్వారా శుభాకాంక్ష‌లు అందిస్తున్నారు.

చంద్ర‌బాబు 42 ఏళ్ల రాజకీయ ప్రస్థానం...

పట్టుదల, క్రమశిక్షణ, సేవాతత్వం, విలక్షణాలతో అత్యున్నతమైన నాయకుడిగా చంద్రబాబునాయుడు ఎదిగారు.1978లో రాజకీయాల్లో ప్రవేశించి 2020 ఫిబ్రవరి 27 నాటికి 42ఏళ్ళు పూర్తి అయ్యాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను ఎక్కువ కాలం పాలించిన ముఖ్యమంత్రిగా, నవ్యాంధ్రప్రదేశ్‌ తొలి ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా సేవలందిస్తున్నారు. చిన్నప్పటి నుంచే చంద్ర‌బాబునాయుడికి ప్రజాసేవ పట్ల ఆసక్తి ఎక్కువ‌. చ‌దువుకునే రోజుల్లోనే చంద్రగిరిలో విద్యార్థి నాయకునిగా యువజన కాంగ్రెస్ లో చేరారు. చిత్తూరు జిల్లాలో యువనాయకుడిగా గుర్తింపు పొంది 1978లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ ఐ నుంచి పోటీ చేశారు. 20 వేల మెజార్టీతో గెలిచి విశ్వవిద్యాలయం నుంచి శాసనసభలోకి అడుగు పెట్టారు. ఏపీ డెవలప్‌మెంట్‌ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. 28 ఏళ్ల వయసులో సినిమాటోగ్రఫి, పురావస్తుశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ తరువాత సాంకేతిక విద్యాశాఖమంత్రిగా బాధ్యతలు చేప‌ట్టి నూతన కార్యక్రమాలకు నాంది పలికారు. తదనంతర పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలో చేరారు. 1984లో ఎన్టీరామారావు ప్రభుత్వాన్ని అప్రజాస్వామికంగా కూల్చివేసినప్పుడు చంద్రబాబునాయుడు సారధ్యంలో జాతీయ స్థాయిలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం చారిత్ర సృష్టించింది. ఆ తరువాత తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా, కర్షక పరిషత్‌ అధ్యకక్షుడిగా సేవలందించారు. 1989లో తెలుగుదేశం పార్టీ అధికారానికి దూరమైనప్పుడు, అసెంబ్లీని ఎన్టీఆర్‌ బహిష్కరించినప్పుడు, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబునాయుడు బాధ్యతలు చేప‌ట్టి అప్ప‌ట్టి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగ‌ట్టారు. తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయంగా ఉన్నతస్థాయికి ఎదిగి పలు సంచలనాలకు కేంద్రబిందువయ్యారు. 1994 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ మళ్ళీ విజయం సాధించి ఎన్టీరామారావు ముఖ్యమంత్రి అయ్యాడు. తెలుగుదేశం పార్టీలో ఎన్‌.టి.ఆర్ భార్య లక్ష్మీ పార్వతి జోక్యం పెరగడంతో పార్టీ వ్యవస్థాపకుడైన మామపై తిరుగుబాటు చేసాడు. తెలుగు దేశం శాసన సభ్యుల మద్దతును కూడగట్టుకొని 1995 సెప్టెంబరు 1న ముఖ్యమంత్రి పీఠం ఎక్కాడు. 160 మంది ఎమ్మెల్యేలు ఎన్టీఆర్‌పై అవిశ్వాసం ప్రకటించడంతో ఆయన స్థానంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు. అతని రాజకీయ చాతుర్యం దేశ రాజకీయాలలోనే సంచలనం కలిగించింది. అతి చిన్న వయసులోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన 17వ వ్యక్తిగా చంద్రబాబునాయుడు చరిత్రలో నిలిచారు. 1995 సెప్టెంబర్‌ 1న ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు చేప‌ట్టి రాష్ట్ర అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని అనతి కాలంలోనే ఘన విజయాలను సాధించారు. 1999లో లోక్‌సభ మధ్యంతర ఎన్నికల్లో బీజేపీతో కలిసి టీడీపీ పోటీచేసింది. 29 ఎంపీ సీట్లు సాధించి బీజేపీకి మద్దతిచ్చింది. కేంద్రంలో బి.జె.పి అధ్వర్యలోని ఎన్.డి.ఎ సంకీర్ణ ప్రభుత్వంలో రెండవ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఎన్డీయేకి 2004 వరకూ చంద్రబాబు జాతీయ కన్వీనర్‌గా ఉన్నాడు. 1996 లోక్‌సభ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలకు పెద్ద సంఖ్యలో సీట్లు వచ్చాయి. ఆ ఎన్నికలలో కేంద్రంలో ప్రధానమంత్రులను ఎంపిక చేసిన ‘కింగ్‌ మేకర్‌’గా మారాడు. కాంగ్రెసేతర పార్టీలను కూడగట్టడం, కేంద్రంలో ప్రభుత్వాలను ఏర్పరచడంలో చంద్రబాబు కీలకపాత్ర పోషించారు. చంద్రబాబు ఇతర ప్రాంతీయ పార్టీల నేతలతో సంప్రదింపులు జరిపి కేంద్రంలో మొదటిసారి కాంగ్రెస్‌, బీజేపీలు లేని తృతీయ ఫ్రంట్‌ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం చేశాడు. దీనికి బయట నుంచి దీనికి మద్దతు ఇచ్చేలా కాంగ్రెస్‌ పార్టీని ఒప్పించాడు. ఇందులో భాగంగా దేవెగౌడ ప్రధాని అయ్యారు. ఆ తర్వాత దేవెగౌడను మార్చాలని కాంగ్రెస్‌ పట్టుపట్టడంతో, తదుపరి ప్రధానిగా ఐకే గుజ్రాల్‌ ఎంపికలో చంద్రబాబు ప్రముఖ పాత్ర పోషించాడు. ఈ రెండు సందర్భాల్లో వామపక్షాలు, ఇతర ప్రాంతీయ పార్టీలను ఐక్యంగా ఉంచడానికి జాతీయ కన్వీనర్‌గా చంద్రబాబు చ‌క్రం తిప్పారు. రాష్ట్రపతిగా దళితవర్గానికి చెందిన నారాయణన్‌ ఎంపికకు చంద్రబాబు చొరవ తీసుకొన్నాడు. ఆయన తర్వాత ముస్లిం వర్గానికి చెందిన వారికి రాష్ట్రపతి పదవిని ఇవ్వాలని వాజపేయి భావించాడు. ఆ సమయంలో శాస్త్రవేత్తగా ఉన్న అబ్దుల్‌ కలాం పేరును చంద్రబాబే ప్రతిపాదించాడు. శాస్త్రవేత్తలు రాష్ట్రపతి అయితే యువతరానికి స్ఫూర్తిదాయకంగా ఉంటుందని కలాంకు నచ్చచెప్పి ఒప్పించాడు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా చేసిన కృష్ణకాంత్‌ను ఉపరాష్ట్రపతి చేయడంలో కూడా చంద్రబాబు కీలక పాత్ర పోషించాడు. బాబ్లి ప్రాజెక్టు నిర్మాణం చేపడితే ఆ నిర్మాణం ఆపాలని పెద్ద ఎత్తున ఉద్యమం చేసి మహారాష్ట్రలో అరెస్ట్‌ అయి 3 రోజులు పోలీస్‌స్టేషన్‌లో ఉన్నారు. రైతాంగాన్ని ఆదుకోవాలని ప్రభుత్వంపై ఎంత ఒత్తిడి తెచ్చినా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవడానికి ముందుకు రాకపోవడంతో 16-12-2010 నుండి 22-12-2010 వరకు 8 రోజుల పాటు అన్న పానీయాలు మరచి ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ప్రాణాలకు తెగించి చంద్రబాబు నిరవధిక నిరహారదీక్ష చేశారు. రాష్ట్ర విభజన నేప‌థ్యంలో ఏపి భవన్‌లో 6 రోజులు నిరవధిక దీక్ష చేసి తెలుగువారి సమస్యలపై జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా చేశారు. దేశ రాజకీయ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా కాళ్లు బొబ్బలెక్కినా ప్టించుకోకుండా 208 రోజులు 7 నెలలపాటు దాదాపు 2,817 కిలో మీటర్లు పాదయాత్ర చేసి ప్రజలను చైతన్యపరిచారు. 2014 ఎన్నికలలో తెలుగుదేశంపార్టీ, ఇతర పార్టీలైన భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ లతో కలసి కూటమిగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు పోటీ చేసింది. 102 స్థానాలను కైవసం చేసుకుంది. 13 జిల్లాల ఆంధ్ర ప్రదేశ్ (నవ్యాంధ్ర) కు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా పనిచేసాడు. ప్రజాభీష్టం మేరకు ప్రజా రాజధానిగా అమరావతిని ప్రకటించాడు. రైతులు చంద్రబాబుపై ఉన్న నమ్మకంతో 32వేల ఎకరాల భూములను రాజధాని నిర్మాణంకోసం ఇచ్చారు. ఇది ప్రపంచంలో ఒక రికార్డు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆ ప్రాంతం నుంచే పాలించుకోవాలనే ఉద్దేశంతో రికార్డు సమయంలో తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ భవనాలను నిర్మించారు.

సి.ఇ.ఒ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌గా చ‌రిత్ర సృష్టించారు!

నారా చంద్రబాబు నాయుడు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి జాతీయ అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 13వ ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ (నవ్యాంధ్ర) రాష్ట్రానికి మొద‌టి ముఖ్యమంత్రి గా ప‌నిచేశారు. ప‌దేళ్ళు ముఖ్య‌మంత్రిగా, 10 ఏళ్ళు ప్ర‌తిప‌క్ష నాయ‌కునిగా ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్, యునైటెడ్ కింగ్‌డం ప్రధానమంత్రి టోనీ బ్లెయిర్ లు హైదరాబాదు వచ్చి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్ర‌బాబు నాయుడును కలిసారు.  అమెరికన్ మ్యాగజైన్ "టైమ్"కు చెందిన అపరిసిమ్‌ ఘోష్, " కేవలం ఐదు సంవత్సరాలలో, అతను గ్రామీణ వెనుకబడినతనం, పేదరికం ఉన్న ప్రాంతాన్ని, భారత దేశ కొత్త సమాచార-సాంకేతిక కేంద్రంగా మార్చాడు." అని తెలిపాడు. ఆ పత్రిక అతనిని "సౌత్ ఆసియన్ ఆఫ్ ద యియర్"గా అభివర్ణించింది.  ఇండియా టుడే నుండి "ఐ.టి ఇండియన్ ఆఫ్ ద మిలీనియం", ద ఎకనమిక్ టైమ్స్ నుండి "బిజినెస్ పర్సన్ ఆఫ్ ద యియర్", టైమ్స్ ఆసియా నుండి "సౌత్ అసియన్ ఆఫ్ ద యియర్", ప్రపంచ ఎకనమిక్స్ ఫోరం డ్రీమ్‌ క్యాబినెట్ లో సభ్యుడు వంటి పురస్కారాలతో పాటు అనేక పురస్కారాలు పొందారు.  2016 జనవరి 30 న పూణే ఆధారిత సంస్థ భారతీయ ఛాత్ర సంసద్, ఎం.ఐ.టి స్కూల్ అపహ్ గవర్నెన్స్ తో కలసి "ఆదర్శ్ ముఖ్యమంత్రి పురస్కారం". మే 2017లో "ట్రాన్స్‌ఫార్మాటివ్ ఛీఫ్ మినిస్టర్ అవార్డు పొందారు. "సి.ఇ.ఒ ఆఫ్ ఆంధ్రప్రదేశ్"గా ఆయనను పిలిచేవారు. భవిష్యత్తు అవసరాలు, సమస్యలు ముందే గుర్తించి చంద్ర‌బాబునాయుడు "విజన్ 2020" పేరుతో  ప్రణాళికను రూపొందించారు. దీనిని యు.ఎస్. కన్సల్టెంట్ మికిన్సీ అండ్ కంపెనీతో కలసి కొన్ని ప్రతిపాదనలు చేసాడు. 1995 సెప్టెంబర్‌ 1న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత   దశాబ్దాల తరబడి కార్యాలయాలకు పరిమితమైన ప్రభుత్వ ఉద్యోగులను ప్రజల వద్దకు పంపి ప్రజల వద్దకే పాలనను 1995 నవంబరు 1న ప్రారంభించారు.  ఆర్థిక అసమానతలు లేని ఆరోగ్యకరమైన, ఆనంద దాయకమైన అభ్యుదయాంధ్రప్రదేశ్‌ నిర్మాణమే కర్తవ్యంగా ఎంచుకొని 1997 జనవరి 1న జన్మభూమి కార్యక్రమాన్ని రూపొందించారు.  సాంకేతికాభివృద్ధిని అర్ధం చేసుకొని 1998లో హైటెక్‌ సిటీని ప్రారంభించి, అనతి కాలంలోనే ఐటి రంగంలో అగ్రగామిగా నిలబెట్టి ఆంధ్రప్రదేశ్‌కు ప్రపంచ స్థాయిలో గుర్తింపును తెచ్చారు.  ప్రతి ఒక్కరూ పరిశుభ్రమైన వాతావరణంలో సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలనే సదాశయంతో 1998 సెప్టెంబర్‌ 10న ‘పచ్చదనం–-పరిశుభ్రత’ కార్యక్రమంలో దాదాపు 9.36 కోట్ల మొక్కలు నాటారు. 2000 ఏప్రిల్‌-అక్టోబరు మధ్య "నీరు-మీరు" కార్యక్రమాన్ని మొదలు పెట్టి భూగర్భ నీటి మట్టం పెంపుదలకు పాటుపడ్డారు.  రైతు బజార్ల ఆవిర్భావం రాష్ట్ర చరిత్రలోనే ఒక నూతన అధ్యాయం సృష్టించారు చంద్ర‌బాబునాయుడు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి జస్టిస్‌ పున్నయ్య కమిషన్‌ ఏర్పాటు చేసాడు. బీసీలకు 33% స్థానిక సంస్థల రిజర్వేషన్లు చిత్తశుద్థితో చేపట్టారు. ప్రధానంగా నగరాలు విదేశీ పెట్టుబడులకు ప్రత్యేకంగా "ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, హెల్త్ కేర్, వివిధ ఔట్సోర్సింగ్ సర్వీసెస్" వంటి ముఖ్య విభాగాలపై ఎక్కువ దృష్టి పెట్టారు.   "బై బై బెంగళూర్, హలో హైదరాబాద్" నినాదాన్నిచ్చాడు. మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంటు సెంటర్‌ను స్థాపించారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని సీటెల్ నగరంలో ఉన్న సంస్థ తరువాత ఇది రెండవ కేంద్రం.  ఇతర ఐ.టి కంపెనీలను (ఐ.బి.ఎం., డెల్, డెలోఇట్ట్‌, కంప్యూటర్ అసోసియేట్స్ అండ్ ఓరాకిల్) హైదరాబాదులో నెలకొల్పడానికి ప్రోత్సాహాన్నందించాడు. హైదరాబాదులో పెట్టుబడులు పెట్టడానికి గ్లోబల్ సి.ఇ.ఓ లను ఒప్పించేందుకు కృషిచేసాడు. 2013-14 లో ఐటి ఎగుమతులు 10 రెట్లు పెరిగాయి.  దీని ఫలితంగా హైదరాబాదులో IT & ITES రంగాలలో 320,000 మందికి ఉపాధి లభించింది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినం ఏప్రిల్ 20 పురస్కరించుకుని తెలుగు ఒన్ త‌ర‌ఫున‌ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

ఆరోగ్య శ్రీ కార్డులను లెక్క చేయని తెలంగాణ కార్పొరేట్ ఆస్పత్రులు

ఈ పారిశుధ్య కార్మికుడి పేరు అశోక్, హైదరాబాద్ లోని మెహిదిపట్నం ఎల్ ఐ సి కాలనీ ప్రాంతం లో నిత్యం చెత్త తీసివేసి, వీధులను పరిశుభ్రంగా ఉంచుతాడు. ఇతనికో కష్టం వచ్చిపడింది. ఇతని భార్య పేరు హేమలత. ఆమెకు మెదడు లో బ్లడ్ క్లాట్ అయినా కారణంగా , ప్రస్తుతం ఆమెను ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించాడు. సర్జరీ కి రెండు లక్షలపైమాటే ఖర్చవుతుంది. ఆ ఆస్పత్రి వాళ్లేమో ఇతని ఆరోగ్యశ్రీ కార్డును ఖాతరు చేయటం లేదు, ఆ హాస్పిటల్ మాత్రమే కాదు, ఏ కార్పొరేట్ ఆస్పత్రి కూడా ఆరోగ్యశ్రీ కార్డును అంగీకరించటం లేదు. ఎల్ ఐ సి కాలనీ వాసులందరూ తలో కాస్తా ఆర్ధిక సాయం చేశారు. కార్పొరేట్ ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ కార్డులకార్డులను అనుమతిచేలా తగిన చర్యలు తీసుకోవాలని అశోక్ తెలంగాణ ప్రభుత్వాన్ని అభ్యర్ధించాడు. ఆ పారిశుధ్య కార్మికుడు అశోక్ ఫోన్ నెంబర్: 7671905578.

ఈరోజు నుంచి అమ‌లులోకి వ‌చ్చిన లాక్‌డౌన్ మినహాయింపులు!

సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలవుతున్న నేప‌థ్యంలో కేంద్రం ప్ర‌క‌టించిన సడలింపులు ఈ రోజు నుంచి అమ‌లులోకి వ‌చ్చాయి. కరోనా ప్రభావం తీవ్రంగాలేని ప్రాంతాల్లో, ఏప్రిల్ 20వ తేదీ నుంచి అమలయ్యేలా పలు మినహాయింపులు ఇచ్చింది. 1. ఇప్పటివరకూ ఒక్క కేసు కూడా లేని 353 జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బందుల్లేకుండా జీవనోపాధి పనులు మొదలైయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ దాని అనుబంధ రంగాలు... మార్కెటింగ్‌, ఆహారశుద్ధి పరిశ్రమల కార్యకలాపాలను పూర్తిస్థాయిలో ప్రారంభానికి కేంద్రం అనుమతించింది. వీటితోపాటు మునిసిపల్‌ పరిధి బయట ఉన్న ప్రాంతాల్లోని పరిశ్రమల్లో కార్యకలాపాలకు అనుమ‌తించారు. 2. దేశంలోని 377 జిల్లాల్లో కంటెయిన్‌మెంట్‌ జోన్లు మినహాయించి మిగిలిన ప్రాంతాల్లో పనులకు వెసులుబాటు ఇచ్చారు. అన్ని వస్తువుల సరఫరాకు ఈ-కామర్స్‌ సంస్థలకు ఇటీవల మినహాయింపునిచ్చిన కేంద్రం, ఆదివారం ఈ అనుమతులను రద్దు చేసింది. ఆన్‌లైన్ బుకింగ్ ద్వారా అత్యవసర కాని వస్తువుల సరఫరా కు అనుమ‌తించ‌లేదు. అవసరమైన వాటికి మాత్రమే అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. 3. కేంద్రం మినహాయింపులు ఇచ్చినా తెలంగాణ, మహారాష్ట్ర, పంజాబ్, ఒడిశా లాంటి రాష్ట్రాలు మాత్రం లాక్‌డౌన్ ఆంక్షల్ని కొనసాగిస్తామని స్పష్టం చేశాయి. కార్యకలాపాలు పునః ప్రారంభించే సమయంలో ఎలాంటి తప్పులకు ఆస్కారం ఉండరాదని రాష్ట్రాలను కేంద్రం హెచ్చరించింది. వెసులుబాట్లు ఇచ్చిన ప్రాంతాల్లో ఇప్పుడున్న పరిస్థితిని యతాతథంగా కొనసాగించడానికి శాయశక్తులా ప్రయత్నించాలని సూచించింది. అవసరమని భావిస్తే కేంద్రం విధించిన ఆంక్షలకు అదనంగా మరికొన్నింటిని రాష్ట్ర ప్రభుత్వాలు విధించుకోవచ్చని స్పష్టం చేసింది. క్షేత్రస్థాయి పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వాలకే బాగా తెలుస్తాయి కాబట్టి అదనపు జాగ్రత్తలు, చర్యలు తీసుకొనే అధికారం వాటికే వదిలిపెట్టింది. 4. నిత్యావసరాల పంపిణీ మినహా మిగతా అన్ని కార్యక్రమాలకు రద్దు. 5. ఎవరైనా చనిపోతే అంత్యక్రియలకు 20 మందికి మించి హాజరుకాకూడదు. 6. మాల్స్, థియేటర్లు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, జిమ్స్, స్పోర్ట్ కాంప్లెక్స్‌లు, బార్స్, ఆడిటోరియంలు మూసివేస్తారు. 7. సామాజిక, రాజకీయ, క్రీడా, ఆధ్యాత్మిక కార్యక్రమాలపై నిషేధం. 8. మతప్రదేశాలలో పెద్ద ఎత్తున ప్రార్థనలపై నిషేధం. 9. ట్యాక్సీ సర్వీసులకు అనుమతి లేదు. 10. హాట్‌స్పాట్స్‌, కంటెయిన్‌మెంట్ జోన్‌లలో సాధారణ కార్యకలాపాలకు అనుమతిలేదు. హాట్‌స్పాట్స్, కంటెయిన్‌మెంట్ జోన్‌లలో కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఆరోగ్య శాఖ గతంలో సూచించిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలి. నిత్యావసరాల పంపిణీ మినహా ఇక్కడ ఎలాంటి కార్యకలాపాలు ఉండవు. 11. ఆరోగ్య కేంద్రం, ఔషధాల విక్రయాలు యధాతథంగా సాగుతాయి. ఔషధ పరిశ్రమలలో ఉత్పత్తికి అనుమతులు. 12. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వరంలోని వ్యవసాయ మార్కెటింగ్ కార్యకలాపాలు. వ్యవసాయ పరికరాలను అద్దెకు ఇచ్చే పరిశ్రమలు ఆక్వా ఉత్పత్తులు క్రయ విక్రయాలకు అనుమ‌తి. 13. బ్యాంకు కార్యకలాపాలకు అలాగే, వృద్ధాశ్రమాలు, అనాథశరణాలయాలు నిర్వహణకు ఎలాంటి ఆంక్షలు లేవు. 14. ఉపాధి హామీ పనులు, భవన నిర్మాణ పనులు.. సమీపంలో ఉన్నవారితోనే పనులు చేపట్టాలి. ఉపాధి కూలీలు మాస్క్‌లు ధరించి, భౌతిక దూరం పాటించాలి. 15.ఎరువులు, పురుగుల మందులు, విత్తనోత్పత్తి దుకాణాలు తెరుచుకుంటాయి. 16. పాల ఉత్పత్తులు, వ్యాపారాలు, పౌల్ట్రీ పరిశ్రమ, టీ, కాఫీ, రబ్బరు సాగుకు అనుమ‌తి. 17. జాతీయ రహదారులు పక్కన దాబాలు, వాహన మరమ్మత్తుల దుకాణాలకు కేంద్రం అనుమతించింది. 18. ఐటీ సంస్థల్లో 50 శాతం సిబ్బందితో పనిచేయడానికి అనుమతి. 19. ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా, డీటీహెచ్‌, కేబుల్‌ సర్వీసులు యథాతథం. 20. వివాహాలు, ఇతర శుభకార్యాలకు కలెక్టర్‌ అనుమతి తప్పనిసరి. 21. ఎలక్ట్రీషియన్లు, ఐటీ రిపేర్లు, మోటార్‌మెకానిక్స్‌, కార్పెంటర్ల సేవలకు అనుమతి 22. రక్షణ, పారామిలటరీ, ఆరోగ్య కుటుంబసంక్షేమ శాఖ, విపత్తు నిర్వహణ, ఎన్ఐ‌సీ, ఎఫ్‌సీఐ, ఎన్‌సీసీ, యువ కేంద్రాలకు ఎలాంటి ఆంక్షలు ఉండవు. 23. మంత్రిత్వ శాఖలు, ఇతర విభాగాల్లోని డిప్యూటీ సెక్రెటరీలు అంతకంటే ఎక్కువస్థాయి అధికారులు 100 శాతం హాజరుకావాలి.. మిగతా అధికారులు, ఇతర సిబ్బంది 33 శాతం వరకూ ఆఫీసులకు హాజరుకావాలి. 24. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం సహా గుట్కాలు, ఖైనీ, మద్యపానం నిషేధం. ఈ నిబంధనలు ఎవరైనా అతిక్రమిస్తే శిక్షార్హులవుతారు. 25. పనులు ప్రారంభించే భారీ పరిశ్రమలు, పారిశ్రామిక వాడలు, పారిశ్రామిక సముదాయాల ప్రాంగణాల్లోనే కార్మికులకు వసతి సౌకర్యాలు కల్పించ‌డానికి అనుమ‌తి. 26. గుట్కా, పాన్‌ మసాలాలు, నమిలే పొగాకు, సిగరెట్ల అమ్మకాలను మే 3వ తేదీ వరకు పూర్తిస్థాయిలో నిషేధం అమలవుతుంది. 27. దేశవ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లోకి వచ్చే వారంతా మాస్క్‌లు ధరించాల్సిందే. ఇందులో మినహాయింపు లేదు. పనిచేసేందుకు అనుమతించిన ప్రాంతాల్లోనూ మాస్కులు, శానిటైజర్‌ల వినియోగించాలి. థర్మల్‌ స్ర్కీనింగ్‌ యంత్రాలు తప్పనిసరి. 28. ప్రజా రవాణాకు అవకాశం లేదు. కారులో ఇద్దరు, బైక్‌పై ఒక్కరే! జిల్లాలు, రాష్ట్రాల సరిహద్దులు బంద్‌. 29. అన్ని విద్యా సంస్థలు, కోచింగ్‌ సంస్థలను మూసివేయాల్సిందే. 30.దేశీయ, అంతర్జాతీయ విమానాలన్నీ బంద్‌. రైళ్లు, మెట్రో, ప్రజారవాణాకు సంబంధించిన బస్సులు తిరగవు.

కరోనా రోగి పారిపోయాడు! ఆచూకీ చెబితే 50వేల బహుమతి!

పారిపోయిన కరోనా రోగిని పట్టుకునేందుకు మధ్యప్రదేశ్ పోలీసులు జ‌ల్లెడ ప‌డుతున్నారు. అత‌నికి సంబంధించి బంధువుల ఇళ్ల‌న్నీ గాలిస్తున్నారు. అయినా ఆ ద‌రిద్రుడు దొర‌క‌క‌పోవ‌డంతో అత‌న్ని ప‌ట్టిచ్చిన వారికి 50 వేల రూపాయ‌ల న‌గ‌దు బ‌హుమ‌తి ఇస్తామ‌ని డీజీపీ ప్ర‌క‌టించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరానికి చెందిన జావేద్ ఖాన్‌కు జరిపిన పరీక్షల్లో కరోనా వైరస్ పాజిటివ్ అని రావడంతో అతన్ని జబల్‌పూర్ వైద్యకళాశాల ఆసుపత్రికి తరలించారు. వైద్యకళాశాల ఆసుపత్రిలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ వారి కళ్లు గప్పి కరోనా రోగి జావేద్ ఖాన్ పారిపోయాడు. ఆసుపత్రి నుంచి పారిపోయిన కరోనా రోగి ఆచూకీ చెప్పిన వారికి రూ.50వేల నగదు బహుమతి ఇస్తామని మధ్యప్రదేశ్ డీజీపీ వివేక్ జోహ్రీ ప్రకటించారు. అంతే కాదు కరోనా రోగి పారిపోయేందుకు పోలీసుల నిర్లక్ష్యమే కారణమని, ఒక స్టేషన్ హౌస్ ఆఫీసరుతో పాటు నలుగురు పోలీసు గార్డులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. పారిపోయిన కరోనా రోగిని పట్టుకునేందుకు పోలీసులు ప్ర‌త్యేక బృంధాలుగా ఏర్ప‌డి గాలిస్తున్నారు. కరోనా రోగి పారిపోయినందున స్థానిక‌ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జబల్ పూర్ జిల్లా మెజిస్ట్రేట్ భరత్ యాదవ్ హెచ్చ‌రించారు.

క‌రోనా త‌గ్గ‌డంలేదు! ఉధృతంగా ఉంది! ఇళ్ల‌కే ప‌రిమితం అవ్వండి! సి.ఎం.

రోజు రోజుకు కేసులు పెరుగుతూనే వున్నాయి. కాబ‌ట్టి మ‌రింత క‌ఠినంగా లాక్‌డౌన్ అమ‌లుచేస్తున్నాం. ఇప్ప‌ట్టికే 50 వేల వాహ‌నాల్ని పోలీసులు సీజ్ చేశారు. కాబ‌ట్టి ద‌య‌చేసి ఇళ్ల నుంచి ఎవ‌రూ బ‌య‌టికి రావ‌ద్దు. వ్యాధి త‌గ్గ‌లేదు. వైర‌స్ నియంత్ర‌ణ‌లో లేదు. మ‌రింత ఉధృతంగా వుంది కాబ‌ట్టి జాగ్ర‌త్త‌గా వుండ‌మ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ సూచించారు. ఏమైనా అవ‌స‌ర‌మైతే డ‌య‌ల్ 100కు ఫోన్ చేయండి. మీక‌ష్టాల్ని తొల‌గించ‌డానికి అధికారులు సిద్ధంగా వున్నారు. ప్ర‌జ‌లు ప్ర‌భుత్వం క‌లిసి క‌రోనాను ఎదుర్కొంటే ఈ ప్ర‌మాదం నుంచి బ‌య‌ట ప‌డ‌తాం. ఇప్ప‌ట్టి వర‌కూ ఈ వ్యాధికి మందు లేదు. ఆ విష‌యం గుర్తు పెట్టుకోమ‌ని ప్ర‌జ‌ల‌కు ముఖ్య‌మంత్రి ప‌దే ప‌దే విజ్ఞ‌ప్తి చేశారు. ఈ రోగానికి మందు లేదు. వేరే మార్గం లేదు. ఉప‌శ‌మ‌న‌చ‌ర్య‌లే. వ్య‌క్తి గ‌త నియంత్ర‌ణ పాటించ‌డం. లాక్ డౌన్ ఇంత‌కు మించిన ఆయుధం ప్ర‌స్తుతం మ‌రొక‌టి లేదు. నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించి కొన్ని దేశాలు భారీ మూల్యం చెల్లించుకుంటున్న విష‌యాల‌ను ముఖ్య‌మంత్రి ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు.    14 అంత‌స్థుల  స్పోర్స్ట్ కాంప్లెక్స్‌ను హెల్త్ డిపార్టెమెంట్‌కు బ‌దిలీ చేస్తూ క్యాబినెట్ నిర్ణ‌యం తీసుకుంది. నిమ్స్ కంటే ఎక్కువ స‌దుపాయాల‌తో కార్పొరేట్ ఆసుప‌త్రుల‌కు ధీటుగా తెలంగాణా ఇన్సిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్స్ అండ్‌ రీస‌ర్చ్ టిమ్స్‌ను తీర్చిదిద్దుతున్నామ‌ని ముఖ్య‌మంత్రి చెప్పారు. ప్ర‌స్తుతం దీన్ని క‌రోనా ప్ర‌త్యేక ఆసుప‌త్రిగా ఉప‌యోగిస్తాం. 1500 బెడ్‌ల‌ను సిద్ధం చేశాం. రేప‌టి నుంచి గచ్చిబౌలి కరోనా ఆసుపత్రి ఉప‌యోగంలోకి వ‌స్తుందని ముఖ్య‌మంత్రి చెప్పారు. రాష్ట్రంలో రోజుకు 1500 మందికి టెస్ట్‌లు చేసే స‌దుపాయం వుంది.  జూన్‌ 7వ వ‌ర‌కు ఫంక్ష‌న్ల‌కు అనుమ‌తి ఇవ్వం. కాబ‌ట్టి ఫంక్ష‌న్ హాళ్ల‌ను తాత్కాలిక గౌడ‌న్లుగా వాడుకొని రైతుల‌కు ఆదుకోమ‌ని అధికారుల‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు.  మే 7వ తేదీ వ‌ర‌కు లాక్‌డౌన్ పొడిగింపు త‌న వ్య‌క్తి గ‌త నిర్ణ‌యం కాదు. ప్ర‌భుత్వం స‌ర్వే ద్వారా ప్ర‌జ‌ల నుంచి సేక‌రించిన స‌మాచారంతో క్యాబినెట్‌లో నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ముఖ్య‌మంత్రి వివ‌రించారు.

మే 3 వరకూ ప్రార్ధన మందిరాలు తెరుచుకోవు: లవ్ అగర్వాల్

ఈ నెల 20 తర్వాత కూడా ‘కరోనా ’హాట్ స్పాట్స్ లోని కంటైన్ మెంట్ జోన్లలో ఎలాంటి మినహాయింపులు ఉండబోవని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్  తెలిపారు. ఢిల్లీలో ఈరోజు ఏర్పాటు చేసిన సంయుక్త సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆ జోన్లలో సినిమా హాల్స్, షాపింగ్ కాంప్లెక్స్ లు, ప్రార్థనా మందిరాలు మే 3 వరకూ తెరచుకోవని స్పష్టం చేశారు. ‘కరోనా కేసులు తక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే కొన్ని రకాల మినహాయింపులు ఉంటాయని అన్నారు. గడచిన 28 రోజుల్లో పుదుచ్చేరిలోని మహి, కర్ణాటకలోని కొడగులో కొత్తగా ‘కరోనా’ కేసులు నమోదు కాలేదని చెప్పారు. గడచిన పద్నాలుగు రోజుల్లో మరో 54 జిల్లాల్లో కూడా ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని చెప్పారు. ‘కరోనా’ బాధితులను కాపాడేందుకు తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్న  వైద్య బృందాలకు రాష్ట్ర ప్రభుత్వాలు భద్రత కల్పించాలని సూచించారు. ‘కరోనా’ నివారణ వ్యాక్సిన్ అభివృద్ధికి చర్యలు ముమ్మరం చేశామని, ఇందుకు సంబంధించిన అభివృద్ధి పరిశీలనకు నిపుణుల కమిటీ ఏర్పాటు చేశామని చెప్పారు. నిబంధనల ప్రకారమే వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ జరుగుతాయని తెలిపారు. గత ఇరవై నాలుగు గంటల్లో దేశంలో కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1334 అని, 27 మంది మృతి చెందారని చెప్పారు. దీంతో, దేశంలో మొత్తం నమోదైన కేసుల సంఖ్య 15,712కి చేరిందని అన్నారు. ఇప్పటి వరకే ‘కరోనా‘ బారినపడి కోలుకున్న వారి సంఖ్య 2,231 మంది కాగా, 507 మంది మృతి చెందారు.

ప్రజా ఖజానాకు మేము కాపలాదారులం: ఆళ్ళ నాని 

ర్యాపిడ్‌ కిట్ల కొనుగోలు పారదర్శకం గానే జరిగిందనీ, ఎక్కడ తక్కువ రేటుకు ఇచ్చినా ఆ రేటు మాత్రమే చెల్లించేలా షరతు, ఆ మేరకే చెల్లింపులు కూడా జరుగుతాయనే డెప్యూటీ ముఖ్యమంత్రి ఆళ్ళ నాని స్పష్టం చేశారు. అన్ని పత్రాలనూ బయటపెట్టాం, తప్పుడు ప్రచారాలు చేసేవారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని, అసత్య ప్రచారాలతోనే టీడీపీ రాజకీయం చేస్తోందని అయన విరుచుకు పడ్డారు. ప్రజల ఖజానాకు మేం కాపలాదారులమనీ, దోపిడీదారు కాబట్టే చంద్రబాబుకు అలాంటి  ఆలోచనలు వస్తున్నాయనీ, ప్రజలు చీత్కరించుకుంటున్నా చంద్రబాబు కుటిలరాజకీయలు మానడంలేదని ఆళ్ల నాని విమర్శించారు.   అతితక్కువ కాలంలోనే రాష్ట్రంలో 9 ల్యాబులను ఏర్పాటు చేసుకోగలిగామని,  మరో వారంరోజుల్లో మొత్తంగా 12 ల్యాబులు పనిచేస్తాయని ఆయన చెప్పారు. ట్రూనాట్‌కిట్ల ద్వారా, ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్ల ద్వారా కోవిడ్‌ –19 పరీక్షలు రోజుకు 17,500 వరకూ చేసే సామర్థ్యానికి మనం అతితక్కువ కాలంలో చేరుకుంటున్నాం. కోవిడ్‌ –19 నివారణా చర్యల్లో ఇది అత్యంత కీలకమైన అంశం. మన రాష్ట్ర వైద్యారోగ్య సిబ్బంది అకుంఠిత శ్రమ కారణంగా ప్రతి 10 లక్షల జనాభాకు టెస్టుల నిర్వహణలో దేశంలోనే రెండో స్థానానికి చేరుకున్నామని ఆయన పేర్కొన్నారు.   ఈ పక్రియను మరింత ముందుకు తీసుకెళ్లడానికి, జన సమూహంలో వైరస్‌ వ్యాప్తిని గుర్తించడానికి రాష్ట్ర ప్రభుత్వం ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్స్‌ కోసం గత కొన్ని రోజులుగా విశ్వప్రయత్నాలు చేస్తోందన్నారు.  210 దేశాల్లో, సుమారు 24 లక్షల మంది వైరస్‌ బారినపడ్డారు. ఈ పరిస్థితుల్లో ర్యాపిడ్‌ టెస్టు కిట్స్‌కు అమాంతమైన డిమాండ్‌ నెలకొంది. వీటిని తయారుచేస్తున్న దేశాల్లో కూడా వైరస్‌ వ్యాప్తి ఉండడం వల్ల వీటిని తెప్పించడం అత్యంత ప్రయాసతో కూడిన వ్యవహారంగా మారింది. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో కూడా వైద్య ఆరోగ్యశాఖ కొరియా కంపెనీ నుంచి లక్ష కిట్స్‌ను త్వరగా తెప్పించుకోగలిగింది. అన్ని రాష్ట్రాలకంటే ముందుగా ఇవి మనకు చేరాయి. అంతేకాక జిల్లాలకు ఈ కిట్స్‌ పంపిణీకూడా ప్రారంభం అయ్యింది. ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత నిస్తూ... ప్రభుత్వం, అధికారులు చేసిన విశేష ప్రయత్నాలు వల్ల మన రాష్ట్రానికి ఈ కిట్స్‌ చేరాయన్నారు.  ర్యాపిడ్‌ టెస్టు కిట్స్‌ ఎవరి నుంచి కొనుగోలు చేయాలన్న దానిపై కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని భారతీయ వైద్య పరిశోధక మండలి (ఐసీఎంఆర్‌) వివిధ కంపెనీలకు అనుమతులు ఇచ్చింది. ఐసీఎంఆర్‌ అనుమతి పొందిన కంపెనీలు తమతమ కొటేషన్లను సంబంధిత డీలర్ల ద్వారా ఆయా రాష్ట్రాలకు సమర్పించినట్టే మన రాష్ట్రానికి కూడా సమర్పించాయి. ఐసీఎంఆర్‌ కూడా అవే కంపెనీలనుంచి కొనుగోలు ప్రారంభించిందని చెప్పారు. కొటేషన్లు సమర్పించిన తర్వాత ఎంత త్వరగా ఇవ్వగలరు? ధర ఎంత అని రాష్ట్ర ప్రభుత్వం ఒకటి రెండు సార్లు పరిశీలించుకుని కొరియన్‌ కంపెనీ ఎస్‌.డి.బయో సెన్సర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నుంచి కొనగోలును ఖరారు చేశామన్నారు.   రాష్ట్ర ప్రభుత్వం 7 వ తారీఖున (జీఎస్టీకాకుండా) ఒక్కో కిట్‌కు రూ. 730ల చొప్పున 2 లక్షల కిట్లకు పర్చేజ్‌ ఆర్డర్‌ జారీచేయడం అయ్యింది. ప్రస్తుతం కోవిడ్‌–19 నివారణా చర్యలకోసం ఉపయోగిస్తున్న వైద్య పరికరాలు, అలాగే వ్యాధి నిర్ధారణ, వ్యాప్తిని తెలుసుకునేందుకు వినియోగిస్తున్న టెస్టు కిట్స్‌కు సంబంధించి మార్కెట్‌ ధరల్లో నిరంతరం హెచ్చు తగ్గులున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజల ఖజానాకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా పర్చేజ్‌ ఆర్డర్‌లో ఒక షరతును క్లాజు రూపంలో పెట్టిన విషయాన్నీ కూడా డెప్యూటీ సి ఎం గుర్తు చేశారు. ఈ క్లాజు ప్రకారం... సదరు కంపెనీ ఎక్కడైనా తక్కువ ధరకు అమ్మినా, లేదా తన అనుబంధ సంస్థలద్వారా ఇంతకంటే తక్కువ ధరకు విక్రయించినా, ఆ డిఫరెన్స్‌ మొత్తాన్ని తుది బిల్లునుంచి మినహాయించుకుంటామని స్పష్టంగా పేర్కొన్నామని వివరించారు.

అర్ధరాత్రి నుంచి పెరగనున్న టోల్ ఫీ!

ఈ అర్ధరాత్రి నుంచి కొత్త టోల్ రేట్లు అమలులోకి రానున్నాయి.  లైట్ మోటార్, కమర్షియల్ వాహనాలపై రూ. 5 పెరుగుదల కాగా, బస్సు, ట్రక్కులపై రూ.10 పెంపు, 3 నుంచి 6 భారీ యాక్సిల్ వాహనాలపై రూ.15 పెరుగుదల ఉంటుంది.  7 యాక్సిల్స్ దాటిన వాహనాలపై రూ.20 పెంపు . టోల్ ఫీజు బాదుడు మళ్లీ మొదలుకానుంది. కరోనా లాక్‌డౌన్ వల్ల గత నెల 25 నుంచి టోల్ ఫీజును రద్దు చేశారు. ఈ నెల 20 నుంచి చాలా రంగాలకు లాక్ డౌన్ నుంచి సడలింపు ఇవ్వడంతో తిరిగి టోల్ ఫీజు వసూలు చేయనున్నారు. ఈమేరకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ.. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్ఏఐ)ను కోరింది. ఏప్రిల్ 20 నుంచి టోలు వసూళ్లు ప్రారంభించాలని పేర్కొంది. దీనిపై సరుకు రవాణా వాహనదారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. లాక్ డౌన్ వల్ల ఇప్పటికే నష్టపోయామని, టోల్ ఫీజును తాము భరించలేమంటున్నారు. ఫీజు నుంచి తమకు మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుని, తమకు ఉపశమనం కల్పించాలని అఖిల భారత మోటారు ట్రాన్స్‌పోర్టు కాంగ్రెస్ (ఏఐఎంటీసీ) కోరింది. అయితే లాక్ డౌన్ వల్ల తమకూ భారీ నష్టాలు వచ్చాయంటున్న ఎన్‌హెచ్ఏఐ, రోడ్లను నిర్వహించే ప్రైవేటు కంపెనీలు వారి వినతిని పట్టించుకునే అవకాశం లేదు.

ఈ నెల కూడా ఉద్యోగుల వేత‌నాల్లో కోత‌!

ఏప్రిల్ నేల‌ వేత‌నాల్లో కూడా మార్చి నెల‌లానే జీతాల్లో కొత కొన‌సాగుతుంద‌ని ముఖ్య‌మంత్రి చెప్పారు. పెన్ష‌న‌ర్ల‌కు 75 శాతం ఇవ్వాల‌ని క్యాబినెట్‌లో నిర్ణ‌యించారు. డాక్ట‌ర్ల‌కు, పారిశుద్ధ్యకార్మికుల‌కు గ‌త నెల‌లో ఇచ్చిన‌ట్లుగానే ఈ నెల కూడా ప్రోత్స‌హాకాలు ఇవ్వ‌డంతో పాటు పోలీసుల‌కు కూడా 10 శాతం సి.ఎం. గిఫ్ట్‌గా ఇవ్వాల‌ని క్యాబినెట్‌లో నిర్ణ‌యించిన‌ట్లు ముఖ్య‌మంత్రి తెలిపారు. అద్దెకు ఉండే వారి వ‌ద్ద నుంచి మార్చి, ఏప్రిల్‌, మే ఈ మూడు నెల‌ల అద్దెల‌ను వ‌సూలు చేయ‌వ‌ద్దు. ఆ త‌రువాత నెల‌ల్లో వాయిదా ప‌ద్ద‌తిలో వ‌సూలు చేసుకోమ‌ని ముఖ్య‌మంత్రి ఆదేశించారు. పెనాల్టీ లేకుండా ప్రాప‌ర్టీ ట్యాక్స్ చెల్లించ‌డానికి ప్ర‌భుత్వం అనుమ‌తించింది. ప్రైవేట్ విద్యాసంస్థ‌లు ఒక్క పైసా ఫీజు కూడా పెంచ‌డానికి వీలులేద‌ని, నెల వారీగా ట్యూష‌న్ ఫీజు మాత్ర‌మే వ‌సూలు చేసుకోమ‌ని ముఖ‌మంత్రి ఆదేశించారు. స్కూల్ యాజ‌మాన్యాలు అతిగా వ్య‌వ‌హ‌రిస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని సి.ఎం. హెచ్చ‌రించారు. తెల్ల‌రేష‌న్ కార్డు హోల్డ‌ర్ల‌కు మ‌ళ్లీ మ‌రోసారి 12 కేజీల బియ్యంతో పాటు 1500 రూపాయ‌లు  ఇస్తామ‌ని ముఖ్య‌మంత్రి భ‌రోసా ఇచ్చారు.

మే 7 వ‌ర‌కు స్విగ్గీ, జొమాటోల‌పై బ్యాన్! విమాన ప్ర‌యాణీకులెవ‌రూ రావ‌ద్దు!

కంటైన్‌మెంట్‌లో వున్న ప్ర‌జ‌లు నిబంధ‌న‌లు పాటించాల‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌రోసారి ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. విమాన స‌ర్వీసులు వున్న 7వ తేదీ వ‌ర‌కు ఎవ‌రూ తెలంగాణాకు రాకండి. ఎందుకంటే ట్యాక్సీ వుండ‌దు. హోట‌ల్స్ కూడా వుండ‌వు. క‌నుక ఎవ‌రూ కూడా విమాన ప్ర‌యాణీకులు మే 7వ తేదీ వ‌ర‌కు తెలంగాణాకు రావ‌ద్ద‌ని సి.ఎం. విజ్ఞ‌ప్తి ఇచ్చారు. ఈ లాక్‌డౌన్‌లో ఎవ‌రూ ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకోకుండా స్విగ్గీ, జొమాటోల‌ను తెలంగాణాలో బ్యాన్ చేస్తున్న‌ట్లు సి.ఎం. ప్ర‌క‌టించారు. ప‌ది పదిహేను రోజులు పిజ్జా తిన‌క‌పోతే ప్రాణం పోదు. బ‌య‌టి నుంచి తినుబండారాలు తెప్పించుకోవ‌ద్ద‌ని సి.ఎం. విజ్ఞ‌ప్తి చేశారు. పండుగ‌లు, ప్రార్థ‌న‌లు ఇళ్ల‌కే ప‌రిమితం కావాలి. సామూహిక ప్రార్థ‌న‌ల‌ను అనుమ‌తించ‌మ‌ని ముఖ్య‌మంత్రి హెచ్చ‌రించారు. అన్నీ ఆల‌యాల‌ను మూసివేశాం. ఎవ‌రికీ మిన‌హాయింపులు లేవు. ఏ మ‌తంలోనూ సామూహిక కార్య‌క్ర‌మాల‌ను అనుమ‌తించ‌మ‌ని సి.ఎం. స్ప‌ష్టం చేశారు.

ఏపీ లో ఎక్కడి ప్రభుత్వ ఉద్యోగులు అక్కడే!

విజయవాడలో నివసిస్తూ చుట్టుపక్కల ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్న వారు పనిచేస్తున్న చోటే ఉండాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం శాఖాపరమైన ఉత్తర్వులు జరీ చేసింది. నగరంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. బయటి ప్రాంతాలకు వైరస్ వ్యాప్తి చెందకుండా ఉద్యోగులకు ఆంక్షలు విధించింది. పనిచేసే ప్రాంతాల్లోనే వసతి ఏర్పాట్లు చేసుకోవాలని, సోమవారం నుండి నగరంలోకి అనుమతించబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది.  మే 3వ తేదీ వరకు ఆంక్షలు కొనసాగుతాయని అన్ని శాఖల ఉద్యోగులకు ప్రభుత్వం సమాచారం ఇచ్చింది.

తెలంగాణాలో మే 7వ తేదీ వ‌ర‌కు లాక్‌డౌన్ పొడిగింపు!

తెలంగాణాలో సంపూర్ణ లాక్‌డౌన్ అమ‌లు అవుతుంది. ఏప్రిల్ 20వ తేదీ నుంచి కేంద్రం ప్ర‌క‌టించిన‌ స‌డ‌లింపులు తెలంగాణాలో అనుమ‌తించమ‌ని ముఖ్య‌మంత్రి కేసిఆర్ స్ప‌ష్టం చేశారు. ఏప్రిల్ 30 వ‌ర‌కు తెలంగాణా ప్ర‌భుత్వం లాక్‌డౌన్ కొన‌సాగాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. ఆ త‌రువాత కేంద్రం మే 3వ తేదీ వ‌ర‌కు వుండాల‌ని చెప్పింది. అయితే ప్ర‌స్తుత ప‌రిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని స‌ర్వేలు చేయించాం. 92 శాతం లాక్‌డౌన్ పొడిగించాల‌ని వ‌చ్చింది. ఈ అభిప్రాయాల్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణాలో లాక్‌డౌన్‌ను మే 7వ తేదీ వ‌ర‌కు పెంచాల‌ని ఈ రోజు స‌మావేశ‌మైన తెలంగాణా క్యాబినెట్ నిర్ణ‌యించిన‌ట్లు ముఖ్య‌మంత్రి కేసీఆర్ తెలిపారు. గ‌తంలో వున్న నిబంధ‌న‌లే వుంటాయ‌ని సిఎం తెలిపారు.

ర్యాపిడ్ టెస్ట్ కిట్ల కొనుగోలులో అక్రమాలు జరగలేదు: కాటంనేని భాస్కర్ 

ర్యాపిడ్ కిట్ల కొనుగోళ్ల అక్రమాలు జరిగాయన్న ఆరోపణలను వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ కాటం నేని భాస్కర్ ఖండించారు. దక్షిణ కొరియాకు చెందిన కంపెనీ నుంచి కరోనా ర్యాపిడ్ కిట్లను ఏపీ దిగిమతి చేసుకుందని, దక్షిణ కొరియా కంపెనీకి చెందిన మ్యానుఫాక్చర్ యూనిట్ మన దేశంలో ఉందని ఆయన చెప్పారు. మనం ఆర్డర్ ఇచ్చే నాటికి దేశంలోని ఆ కంపనీ మ్యానుఫాక్చరింగ్ యూనిట్టుకు అనుమతి రాలేదన్నారు. ఇండియాలోని ఆ కంపెనీ యూనిట్ నుంచి చత్తీస్ ఘడ్ కొనుగోలు చేసిందని, ఏ రాష్ట్రానికైనా తక్కువ ధరకు ఇస్తే అదే ధర ఇస్తామని తమ ఒప్పందంలో ఉందని కాటంనేని భాస్కర్ చెప్పుకొచ్చారు. కాబట్టి చత్తీస్ ఘడ్ రాష్ట్రం చెల్లిస్తున్న ధరనే చెల్లిస్తామని, భవిష్యత్తులో ర్యాపిడ్ కిట్ ధర రూ. 50కే పడిపోతుందని కూడా ఆయన అన్నారు.  కరోనా బాధితుడికి.. ఆ వైరస్ ఎక్కడ నుంచి సోకిందో తెలియకుంటే కమ్యూనిటీ ట్రాన్సిమిషన్ ఉన్నట్టే అని ఆయన స్పష్టం చేశారు. సుమారు 40 కేసుల్లో వైరస్ ఎక్కడి నుంచి సోకిందో ట్రేస్ కావడం లేదని, మెడికల్ షాపుల నుంచి సమాచారం సేకరిస్తున్నామని చెప్పారు. దగ్గు, జలుబు, జ్వరానికి ఎవరికైనా  మందులిస్తే వారి వివరాలు చెప్పాలని మెడికల్ షాప్ కీపర్లను కోరామన్నారు. కొన్ని నెలల్లో వాక్సిన్ వచ్చే అవకాశం ఉందని, కరోనాకు మందులు.. వాక్సిన్ వచ్చేంత వరకు జాగ్రత్తగా ఉండాల్సిందేనని కాటంనేని భాస్కర్ సూచించారు. ప్రస్తుతం టెస్టుల సంఖ్య 5 వేలుగా ఉందని, ఎనిమిది ల్యాబులు ఉన్నాయి.. ట్రూనాట్ పరికరాల ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్నామని, చైనా నుంచి వచ్చే కిట్ల విషయంలో ఆ దేెశం విధించిన కొన్ని నిబంధనలు అడ్డుగా ఉన్నాయని, త్వరలో 10-12 వేల మేర టెస్టుల సామర్ద్యం పెంచుకుంటామని చెప్పారు.

కేంద్రం ప్ర‌క‌టించిన‌ స‌డ‌లింపులు తెలంగాణాలో అనుమ‌తించం!

ఈ రోజు కూడా 18 మందికి పాజిటివ్ వ‌చ్చింది. దీంతో పాజిటివ్ వ‌చ్చిన వారి సంఖ్య‌ 858 మంది. ఇప్ప‌ట్టి వ‌ర‌కు 21 మంది మృతి చెందారు. 186 మంది పూర్తిగా కోలుకున్నారు. 651 మంది చికిత్స పొందుతున్నారు. తెలంగాణాలో నాలుగు జిల్లాల్లో అస‌లు కేసులే న‌మోదు కాలేదు. దేశంలో డ‌బుల్ కావ‌డానికి 8 రోజులైతే. తెలంగాణాలో 10 రోజుల‌కు పేషంట్ల సంఖ్య డ‌బుల్ అయింది. మిలియ‌న్ మందిలో దేశంలో 254 మందికి టెస్ట్ చేస్తుంటే తెలంగాణాలో 375 మందికి టెస్ట్ చేస్తున్నామ‌ని ముఖ్య‌మంత్రి కేసిఆర్ చెప్పారు. ప్రారంభంలో మెడిక‌ల్ స‌దుపాయాలు త‌క్కువ‌గా ఉండేవి. ఇప్పుడా ప‌రిస్థితి లేదు. పూర్తి స్థాయిలో అవ‌స‌ర‌మైన మెడిక‌ల్ స‌దుపాయ‌లు, కిట్స్‌, మాస్క‌లు, ఎక్విప్‌మెంట్ పూర్తి స్థాయిలో వుంది. అవ‌స‌ర‌మైన మందులన్నీ అందుబాటులో వున్నాయి. ముఖ్యంగా గ‌ర్భిణీల‌కోసం అమ్మ ఒడి వాహ‌నాల్ని సిద్ధంగా వుంచాం. త‌ల‌సేమియా పేషంట్ల‌కు ర‌క్త కొర‌త లేకుండా చూసుకుంటున్నాం. ప్ర‌స్తుతం 42 దేశాలు సంపూర్ణ లాక్‌డౌన్ పాటిస్తున్నాయి. చైనా 77 రోజులు లాక్ డౌన్ పాటించిన విష‌యాన్ని ముఖ్య‌మంత్రి కేసిఆర్ ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు. తెలంగాణాలోనూ లాక్‌డౌన్ కొన‌సాగుతోంది. మే 3వ వ‌ర‌కు కేంద్రం ప్ర‌క‌టించింది. అయితే కేంద్రం కొన్ని విష‌యాల్లో స‌డ‌లింపులిచ్చింది. అయితే తెలంగాణాలో వున్న ప‌రిస్థితుల‌ను దృష్టిలో పెట్టుకొని ఎలాంటి స‌డ‌లింపుల‌కు తెలంగాణాలో అనుమ‌తించ‌రాద‌ని క్యాబినెట్ లో నిర్ణ‌యించిన‌ట్లు ముఖ్య‌మంత్రి ప్ర‌క‌టించారు.