కిట్ ఒకటే.. రేటు తేడా అంటే ఏమిటి?
posted on Apr 19, 2020 @ 8:25PM
* రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి
* విజయసాయి రెడ్డి సోషల్ మీడియా టీమ్ ఫేక్ ట్వీట్లు చేస్తోందంటూ టీ డీ పీ మండిపాటు
తెలుగు దేశం సీనియర్ నాయకుడు, ఎం ఎల్ ఏ గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ర్యాపిడ్ కిట్ల విషయం లో పాలక వై ఎస్ ఆర్ సి పి ని కడిగిపారేశారు. మొన్న పారాసిటమాల్ వేసుకుంటే చాలన్నారని, ఇప్పుడు రూ.337+ జీఎస్టీతో పక్క రాష్ట్రం కొంటే.. మనం మాత్రం రూ.730+ జీఎస్టీతో కొన్నామని, ఇంతకంటే బాధ్యతాహీనమైన నాయకత్వం ఉంటుందా అని బుచ్చయ్య ప్రశ్నించారు. అలాగే, జే ట్యాక్స్ ఎంతో, కమిషన్ ఎంతో, . థర్డ్ పార్టీ ట్యాక్స్ ఎంతో కొంచం వివరిస్తారా, అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.
కరోనా కిట్లలో 8 కోట్లు గోల్ మాల్ జరిగిన విషయమై ఇప్పటికే విపక్షాలు తీవ్ర స్వరం తో ప్రశ్నించటం తో పాటు, చత్తీస్‌గఢ్ మంత్రి ట్వీటుతో బయటపడిన జగన్ స్కామ్ గురించి, సౌత్‌కొరియా నుంచి ఏపీకొచ్చిన లక్ష ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల లో జరిగిన అవినీతి గురించి ప్రస్తావించాయి కూడా. చత్తీస్‌గఢ్ ఒక్కో కిట్ 337కి కొంటే..ఏపీ ఒక్కో కిట్ 1,200 కు కొనుగోలు చేయటం, రెండు రాష్ట్రాలూ సౌత్‌కొరియా నుంచే కిట్లు తెప్పించుకున్నాయనీ, ఒక కిట్‌కి జగన్ అండ్ టీమ్ 800 కమీషన్ కొట్టేసిందనీ విపక్షాలు ఆరోపించాయి.
కరోనా ఉందో లేదో తెలుసుకునేందుకు లక్ష ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు తెప్పించామని సీఎమ్ ప్రకటించారు. అందులో ఒక కిట్‌తో తాను టెస్టింగ్ చేయించుకుని మీడియాకి రిలీజ్ చేశారు. ఇలా పరీక్ష చేయించుకోకూడదని కేంద్రం తలంటడంతోపాటు ఏపీ సీఎం జగన్ చేసిన పనికిమాలిన పని ఇంకెవరూ చేయొద్దంటూ కేంద్ర వైద్యారోగ్య శాఖ అన్ని రాష్ట్రాలకూ నోట్ పంపింది. ఈ సందట్లోనే తెల్లారేసరికి ఒక ఫేక్ ట్వీటు రెడీ చేసి నారా లోకేశ్ చేసినట్టు ఒక ట్వీట్ వైరల్ అయిందని తెలుగుదేశం గమనించింది.
సడెన్‌గా లోకేశ్‌పై ఫేక్ ట్వీటేయడానికి కారణం అంతుబట్టక టీడీపీ సోషల్ మీడియా తలలు పట్టుకుంది. ఇంతలోనే చత్తీస్ గడ్ మంత్రి టీఎస్ సింగ్ డియో ఒక ట్వీట్ వేశారు. అదేంటంటే సౌత్ కొరియా నుంచి తాము ఒక్కో ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ రూ.337కే లెక్క 75,000 కిట్లు తెప్పించామని ట్వీట్ పెట్టారు. దేశంలోనే ఇంత తక్కువకు ఈ కిట్లు తెప్పించింది మేమేనంటూ గర్వంగా ప్రకటించారు. ఇక్కడే ఏపీలో జగన్ అండ్ గ్యాంగ్ చేసిన స్కామ్ బయటపడింది. ఏపీ ఒక్కో కిట్ రూ.1200 లెక్కన 1 లక్ష కిట్లు తెప్పించింది. చత్తీస్‌గఢ్‌కి ఏపీకి ఒక్కో కిట్‌కి మధ్య రేటు తేడా 863 రూపాయలు. జీఎస్టీ కలుపుకుంటే చత్తీస్‌గఢ్ 400కి ఒక కిట్ పడుతుంది. అంటే ఏపీ తెప్పించిన కిట్ ఒక్కో దానిపై 800 కొట్టేశారన్నమాట. ఇవి ఎవరికి చేరుంటాయో పెద్దగా చెప్పాల్సిన పనిలేదు కదా! కిట్‌కి 800 కమీషన్ లెక్కన 1 లక్ష కిట్లు అంటే 8 కోట్లకు పైగానే ఒక్క కిట్లలోనే కమీషన్ నడిచిందని టీ డీ పీ ఆరోపించింది.
ఒక పక్క కరోనా లేదంటూనే రాష్ట్రాన్ని శ్మశానం చేస్తున్నారు. తప్పుడు లెక్కలు చూపిస్తూ, కరోనా నిబంధనలంటూ ప్రత్యర్థి పార్టీలవారిపైనా, సోషల్ మీడియాపైనా కేసులు బుక్ చేస్తూ...మరో వైపు ఇలా కోట్లు కొల్లగొట్టేస్తున్నారు. ఈ విషయం బయటపడకుండా ఉండేందుకు నారా లోకేశ్ పేరుతో విజయసాయిరెడ్డి టీమ్ ఫేక్ ట్వీట్లు రెడీ చేసి సోషల్ మీడియాలో వదులుతోందని టీ డీ పీ ఆరోపిస్తోంది.