ఐఏఎస్ లంటే, 'అయ్యా' ఎస్ లు కాదన్న నీలం సాహ్నీ!
posted on Apr 19, 2020 @ 7:47PM
* నిమ్మగడ్డ రమేష్ కేసులో కౌంటర్ దాఖలు విషయం లో చీఫ్ సెక్రెటరీ రోల్ ను విస్మరించడం పై విస్మయం
* తన జోక్యం లేని విషయాలపై తనను బాధ్యురాలిని చేస్తానంటే, ఒప్పుకునేది లేదన్న నీలం సాహ్నీ
ఎన్నికల కమిషనర్ పదవి కాలం కుదించడంతో బాటు మాజీ న్యాయమూర్తిని నియమించటానికి చేసిన చట్ట సవరణ ఇప్పుడు ఐ ఏ ఎస్ సర్కిల్స్ మధ్య పెద్ద అంతరానికి దారి తీసింది. రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ జారీ చేసిన 617, 618 జీవోలే చీఫ్ సెక్రెటరీ నీలం సాహ్నీకి, పంచాయతీ రాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ గోపాల కృష్ణ ద్వివేదీకి మధ్య గ్యాప్ పెరగటానికి కారణంగా తెలుస్తోంది.
కొత్తగా రిటైర్డ్ జస్టిస్ కనగరాజ్ ఎన్నికల కమిషనర్ గా నియమితులయ్యారు. అనంతరం జరిగిన పరిణామాలతో మాజీ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆర్డినెన్సు చట్టబద్ధతను ఆయన ప్రశ్నించారు. ఈ అంశానికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా రాష్ట్ర హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయడం అంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం మొత్తానికి ప్రతినిధి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అవుతారు. అయితే ఎన్నికల సంఘానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నోటీసుకు వెళ్ల కుండా నేరుగా పంచాయితీరాజ్ శాఖ కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేసినట్లు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తరపున పంచాయితీరాజ్ శాఖ కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేదీ నే జీవోలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయాల్సిన అవసరం ఏర్పడింది. కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఆదేశాలు అందగానే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేరుతో కౌంటర్ రూపొందించారని తెలిసింది.
అయితే ఈ కౌంటర్ పై సంతకం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిరాకరించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అన్ని కార్యక్రమాలు తన ప్రమేయంతో జరగనందున కౌంటర్ దాఖలు చేసే పని కూడా తాను చేయలేనని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పష్టం చేశారని అంటున్నారు. దాంతో పంచాయితీరాజ్ శాఖ కార్యదర్శి బాధ్యత తీసుకుని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తరపున రాష్ట్ర హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. తన జోక్యం లేని విషయాలపై తనను బాధ్యురాలిని చేస్తానంటే తాను అలాంటి బాధ్యతను తీసుకునేది లేదని నీలం సహానీ కరాఖండిగా చెప్పినట్లు విశ్వసనీయంగా తెలిసింది. నిజానికి, చీఫ్ సెక్రెటరీ విధుల్లో నేరుగా వేలు పెట్టడం ద్వారా, సి ఎం ఓ ముఖ్య కార్యదర్శి హోదాలో ప్రవీణ్ ప్రకాష్ ఒక్క సారిగా వార్తల్లోకి వచ్చారు. ఆ క్రమంలో జరిగిన డెవలప్మెంట్స్ దరిమిలా, ఎల్ వీ సుబ్రహ్మణ్యం చీఫ్ సెక్రెటరీ పదవి కి దూరం కావటం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత, ప్రవీణ్ ప్రకాష్, ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితంగా మెలుగుతూ వస్తుండటం వల్ల, ఆయన ప్రాధాన్యం అమాంతం పెరిగిపోవడం, సహజంగానే, చీఫ్ సెక్రెటరీ నీలం సాహ్నీ ని కొంత అసంతృప్తికి లోను చేసింది. ఒక దశలో ఆమె కేంద్ర సర్వీసులకు వెళ్ళిపోతారని కూడా ప్రచారం జరిగింది. అయినప్పటికీ, కరోనా కారణంగా ఆ ఇష్యూ మరుగున పడిపోయింది. అయితే, తాజా పరిణామాల నేపథ్యంలో, ప్రవీణ్ ప్రకాష్ మాదిరే, గోపాల కృష్ణ ద్వివేది కూడా వ్యవహరించారనే భావన ఆమెకు కలగడం ఇప్పుడు వివాదానికి అసలు కేంద్ర బిందువుగా మారింది. చీఫ్ సెక్రెటరీ ఉన్నది కేవలం సంతకాలు పెట్టడానికేనా అనే ఒక ప్రశ్న ఉత్పన్నమవుతున్న ఈ తరుణంలో, ఐ ఏ ఎస్ ల మధ్య గ్యాప్ పెరగడం కార్యనిర్వాహక వ్యవస్థ కు అంతగా మంచిది కాదనే అభిప్రాయమే సచివాలయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.