రెడ్ జోన్ ప్రాంతాల్లో లాక్‌డౌన్ మినహాయింపులు వర్తించవు: నీలం సాహ్నీ
posted on Apr 18, 2020 @ 9:27PM
* మే 3 వరకూ యధావిధిగా లాక్‌డౌన్ నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయాల్సిందే
* వీసీలో జిల్లా కలెక్టర్లు ఎస్పీలు, పోలీస్ కమీషనర్లతో ఏపి సీఎస్ నీలం సాహ్ని
గ్రామీణ ప్రాంతాల్లోని గ్రీన్ జోన్ మండలాల్లో ఏఏ పరిశ్రమలను తెరిచి స్థానిక కూలీలకు ఉపాధి కల్పించాలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిఎండిఐసి,ఎసిల్ తదిదర అధికారులతో కూడిన జిల్లా స్థాయి నిర్ణయించి ఆ ప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆదేశించారు. కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై శనివారం విజయవాడ ఆర్ అండ్ బి కార్యాలయం నుండి డిజిపితో కలిసి జిల్లా కలెక్టర్లు ఎస్పీలు, పోలీస్ కమీషనర్లతో ఆమె వీడియో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ రెడ్ జోన్ మండలాలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో ఏవిధమైన లాక్ డౌన్ మినహాయింపులు వర్తించవని మే 3 వరకూ యధావిధిగా లాక్ డౌన్ నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని గ్రీన్ జోన్ మండలాల్లో మాత్రమే లాక్ డౌన్ నుండి కొన్ని మినహాయింపులు ఇచ్చి ఆయా మండలాల పరిధిలో ఉన్న కూలీలకు ఉపాధి అవకాశాలు కల్పించాల్సి ఉందని ఆదిశగా వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. కావున ఆయా మండలాల్లో ఏ పరిశ్రమలను తెరవాలో జిల్లా స్థాయి కమిటీ నిర్ణయించి ఆయా మండలాల్లో 20నుండి పరిమిత స్థాయిలో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సిఎస్ నీలం సాహ్ని కలెక్టర్లను ఆదేశించారు.మండల స్థాయి లో తహసిల్దార్,ఎంపిడిఓ, వ్యవసాయ అధికారి, ఎస్ఐ, పరిశ్రమలు, కార్మిక శాఖల అధికారులు స్థానిక ప్రజలు సామాజిక దూరాన్ని పాటిస్తూ పనులు చేసుకునేలా చూడాలని చెప్పారు.లాక్ డౌన్ నుండి మినహాయింపులు చోట్ల వ్యవసాయ,ఉపాధి పనులు, స్థానిక పరిశ్రమల్లోను, పంచాయతీ, ఆర్అండ్బి తదితర పనులుపై పరిశీలనకు గ్రామ స్థాయి కమిటీలను కూడా ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. పనులు నిర్వహించుకునే చోట్ల ప్రతి ఒక్కరూ ఆరు అడుగుల సామాజిక దూరాన్ని పాటించాలని, శానిటైజర్స్‌తో ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకోవాలని సూచించారు.రెడ్ జోన్లు, కంటొన్మెంట్ ప్రాంతాల్లో లాక్ డౌన్ నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయాలని సిఎస్ నీలం సాహ్ని జిల్లా కలెక్టర్లు ఎస్పీలు ఆదేశించారు.
ఏపి డీజీపీ గౌతం సవాంగ్ మాట్లాడుతూ లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేయడంలో జిల్లా కలెక్టర్లతో కలిసి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈనెల 20నుండి గ్రామీణ ప్రాంతాల్లో గ్రీన్ జోన్ మండలాల్లో లాక్ డౌన్ నుండి మినహాయింపులు ఇచ్చే చోట్ల తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అన్నారు. వైద్య ఆరోగ్య ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కెఎస్.జవహర్ రెడ్డి మాట్లాడుతూ కొవిద్-19 కు సంబంధించి నంబరు 28లో ఇచ్చిన ఆదేశాలను తుచః తప్పక పాటించాలని కలెక్టర్లను ఆదేశించారు.