హైద‌రాబాద్ క‌రోనాకు హాట్‌స్పాట్ గా మారింది!

శుక్రవారం నాడు కొత్తగా మరో 66 కేసులు నమోదు కావ‌డంతో తెలంగాణాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 766కు చేరింది. ఇందులో 37కేసులు హైద‌రాబాద్‌కు చెందిన‌వి. హైద‌రాబాద్‌లో ఈ వైర‌స్ విల‌య‌తాండ‌వం చేస్తోంది.  గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో ఇప్ప‌ట్టి వ‌ర‌కు 409 కేసులు న‌మోదైయ్యాయి. ఇందులో 44 మంది కోలుకున్నారు. 12 మంది చ‌నిపోయారు. కరోనా పాజిటివ్‌ కేసుల్ని వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించినట్టు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌ వెల్లడించారు. కరోనా సోకిన వారిని కలిసిన వ్యక్తులకు కూడా వైద్య పరీక్షలు చేసినట్టు ఆయన తెలిపారు.  పాతబస్తీలో కరోనా వేగంగా విస్తరిస్తోందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.  పాతబస్తీలో మర్కజ్ లింకులు ఉండడం.. అలాగే ఆయా కుటుంబాల్లో ఎవరైనా వృద్ధులు చనిపోతే అంత్యక్రియలకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం కొన్ని నిబంధనలు విడుదల చేసింది. ఆ నిబంధనల ప్రకారం కేవలం ఐదుగురు మాత్రమే అంత్యక్రియలకు హాజరవ్వాలని.. కానీ ఇటీవల జరిగిన రెండు సంఘటనల్లో అంత్యక్రియలకు వారి బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో మూడు రోజుల వ్యవధిలో 50కి పైగా పాజిటీవ్ కేసులు నమోదు అయ్యాయి. పాతబస్తీలో మూడు ప్రాంతాలను అధికారులు రెడ్ జోన్లుగా ప్రకటించారు. తలాబ్ కట్ట, రమ్నస్‌పురా, అలీబాగ్.   హైద‌రాబాద్‌లో రోజురోజుకి కరోనా భాదితుల సంఖ్య పెరుగుతున్న నేప‌థ్యంలో పోలీసు వాహ‌నాల ద్వారా  కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ప్రత్యేక పరికరంతో ఫాగ్ శానిటైజేషన్ చేస్తున్నారు.  ప్రతి పోలీసు వాహనంలో ఫాగ్ శానిటైజేషన్ చేయిస్తున్నారు. దాని వలన వచ్చే మూడు నెలల వరకు ఎలాంటి బ్యాక్టీరియా వాహనాల్లోకి చేరదన్న ఉద్దేశంతో ఫాగ్ శానిటైజేషన్ నిర్ణయాన్ని తీసుకున్నారు.

శ్రీ చైతన్య, నారాయణ కాలేజీల గుర్తింపు రద్దు

కార్పొరేట్ కాలేజీలకు తెలంగాణ ఇంటర్ బోర్డు షాక్  శ్రీ చైతన్య, నారాయణ జూనియర్ కాలేజీలకు తెలంగాణ ఇంటర్ బోర్డు షాకిచ్చింది. నిబంధనలు పాటించని కళాశాలపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపధ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 68 కాలేజీల గుర్తింపు రద్దు చేస్తూ మూసివేస్తున్నట్లు ఇంటర్ బోర్డు ఆయా కాలేజీలకు నోటిసులు జారీ చేసింది. ఈ 68 కాలేజీలలో శ్రీచైతన్యకు సంబంధించినవి 18, నారాయణవి 26 కళాశాలలు ఉన్నాయి. సదరు కాలేజీ యాజమాన్యాలకు ఇంటర్ బోర్డు ఈ-మెయిల్ ద్వారా సమాచారాన్ని అందించింది. గతంలో నారాయణ, శ్రీ చైతన్య కళాశాలలో అక్రమాలపై విచారణ చేపట్టి.. గుర్తింపు లేని కాలేజీలను రద్దు చేయాలనీ సామాజిక కార్యకర్త రాజేశ్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై రాష్ట్ర హైకోర్టు విచారణ చేపట్టి రాష్ట్రంలో గుర్తింపు లేని కళాశాలల వివరాలపై నివేదిక ఇవ్వాలని ఇంటర్ బోర్డును సూచించింది. అయితే మార్చి 4 నుంచి ఇంటర్ పరీక్షలు జరగనున్న నేపధ్యంలో కాలేజీలు మూసివేస్తే విద్యార్ధులపై ప్రభావం పడుతుందని.. అందుకే పరీక్షలు ముగిసిన తర్వాత గుర్తింపు లేని, నిబంధనలు పాటించిన కాలేజీలపై చర్యలు తీసుకోవడానికి అనుమతి ఇవ్వాలని ఇంటర్ బోర్డు హైకోర్టును కోరింది. వాదోపవాదనలు విన్న హైకోర్టు ఎన్‌ఓసీ లేని కాలేజీలపై చర్యలు తీసుకొని ఏప్రిల్‌ 3న తుది నివేదిక సమర్పించాలని ఆదేశించింది. కాగా, కోర్టు ఆదేశాల మేరకు తాజాగా నిబంధనలు పాటించని కాలేజీలపై ఇంటర్ బోర్డు చర్యలు తీసుకుంది.

పెద్దోళ్ళు ఏది చేసినా, `నెట్టింట' అది వైరలే మరి.. ఏటంటారు!

అది కె సి ఆర్ ఫ్యామిలీ మెంబర్ల సరదా కాబట్టి, సోషల్ మీడియా అంతా ఒకటే హల్ చల్ అవుతోంది. లాక్ డౌన్ దెబ్బకి ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయిన జుట్టుకు రిలీఫ్ ఇద్దామంటే, అదేనండీ 'కేశ సంస్కారం' చేద్దామనుకుంటే, ఒక్క సెలూన్ తెరిచి లేదాయె.. ఇంకేమి చేయాలో తెలియని ఒక పెద్ద మనిషిని ట్విట్టర్ వేదికగా కె టీ ఆర్ కు తన కేశ వేదన ను విన్నవించుకోవడం, తదనంతర నెట్టింటి సంభాషణలు మీరే చదవండి. దేశవ్యాప్తంగా మే 3 వరకు లాక్‌డౌన్‌ పొడిగించడంతో బ్యూటీపార్లర్లు, సెలూన్లు కూడా మూతపడటంతో కటింగ్, షేవింగ్ చేసుకోవడం కూడా పెద్ద ఇబ్బందిగా మారింది. లాక్‌డౌన్‌ ఎత్తేసే వరకు ఇంకా ఎన్నిరోజులు పడుతుందో..హెయిర్ కటింగ్ చేసుకోకుండా ఇంకా ఎన్నిరోజులు ఉండాలనే దానిపై ఆందోళన చెందుతున్నారు. బార్బర్‌ షాపులు, సెలూన్లు ఎప్పుడెప్పుడు ఓపెన్‌ చేస్తారా? అని చాలా మంది ఎదురుచూస్తున్నారు.  ఈ నేపథ్యంలో శరత్‌ చంద్ర అనే వ్యక్తి ఏప్రిల్‌ 20 తర్వాత సెలూన్లు ఓపెన్‌ చేసే అవకాశం ఉందా అని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. లేకపోతే..తన భార్య హెయిర్‌ కట్‌ చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తోందని తెలిపాడు. అదే జరిగితే, లాక్‌డౌన్ తర్వాత కూడా తాను ఇంటికి పరిమితం కావాల్సి వస్తుందని సరదాగా వ్యాఖ్యానించాడు. దీనిపై కేటీఆర్‌ కూడా తమాషాగా బదులిచ్చారు.  భారత క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్ కోహ్లీనే తనకు హెయిర్ కట్‌ చేయడానికి తన భార్య అనుష్క శర్మకు అవకాశం ఇచ్చాడని గుర్తు చేశారు. నువ్వెందుకు ఆ అవకాశం ఇవ్వకూడదూ? అని కేటీఆర్ బదులిస్తూ..నవ్వుతున్న ఎమోజీని జత చేశారు.  కేటీఆర్ ట్వీట్‌కు మాజీ ఎంపీ కవిత కూడా స్పందిస్తూ.. ‘అన్నయ్యా.. బాబీకి కూడా ఆ ఛాన్స్ ఇస్తున్నావా ?!  అని అడిగారు. ప్రస్తుతం ఈ సంభాషణపై నెటిజన్లు  ఆసక్తికరంగా కామెంట్లు చేస్తుండటంతో ట్విటర్‌లో వైరల్‌గా మారింది. అదండీ సంగతి.

సొంత ప్రభుత్వ ఆదేశాలు బేఖాతర్.. విశాఖలో ఎంపీ సాయిరెడ్డి రక్తదానం...

ఏపీలో కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో ప్రభుత్వం రక్తదాన శిబిరాలపై నిషేధం విధించింది. స్వచ్చంద సంస్ధలు కానీ, రాజకీయ నేతలు కానీ, బ్లడ్ బ్యాంకులు కానీ రక్తదాన శిబిరాలు నిర్వహించడానికి వీల్లేదు. ఇలాంటి పరిస్ధితుల్లో వైసీపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఎంపీ విజయసాయిరెడ్డి ధిక్కరించారు. సొంత ప్రభుత్వమే కదా ఏం చేస్తుందని భావించారో ఏమో ప్రగతి భారత్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ.. వైజాగ్‌లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని విజయసాయిరెడ్డి ప్రారంభించారు. తాను కూడా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు.  అయితే ఈ మొత్తం వ్యవహారంలో విజయసాయిరెడ్డి నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో లాక్‌డౌన్ అమలులో ఉన్న కారణంగా రక్తదాన శిబిరాలనుద్దేశించి వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఈ నెల 14న ఓ ప్రకటన విడుదల చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యల్లో భాగంగా రక్తదాన శిబిరాలపై నిషేధం విధిస్తున్నట్టుగా ప్రకటనలో పేర్కొంది. అయితే తలసేమియా, సికిల్ సెల్, హీమోఫీలియా వంటి వ్యాధులతో బాధపడే వారిని దృష్టిలో పెట్టుకుని నిబంధనల్లో కొన్ని సడలింపులు చేసింది. రోగుల రక్తమార్పిడి, చికిత్స, సేవల కొరకు సంబంధిత ఆసుపత్రులకు వెళ్లడానికి వీలుగా ఆ సంస్థలు ఇచ్చిన గుర్తింపు కార్డులను, రక్తమార్పిడి అవసరాన్ని తెలిపే ఆధారాలను పోలీసులకు చూపించి అనుమతి తీసుకోవాలని తెలిపింది. రెగ్యులర్‌గా ఆసుపత్రులను సందర్శించే వీలుగా పాస్‌లను జారీ చేస్తారని ప్రకటించింది. ఆ తర్వాతే రక్తదానం చేయాలి. ఈ నిబంధనను అస్సలు పట్టించుకోలేదు. ఇక రక్తదాన శిబిరంలోనూ భౌతిక దూరం పాటించే విషయాన్ని పూర్తిగా గాలికొదిలేశారు. విజయసాయిరెడ్డి రక్తదానం చేస్తుంటే వైసీపీ నేతలు ఆయన చుట్టూ చేరి గుంపుగా నిల్చున్నారు. దీనికి తోడు వైద్య సిబ్బంది సాధారణ మాస్కులు ధరిస్తే.. విజయసాయిరెడ్డి, ఇతర వైసీపీ నేతలు ఎన్-95 మాస్కులు ధరించి ఉన్నారు.దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. కనీస నిబంధనలు పాటించకుండా ఈ విధంగా చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. బాధ్యతాయుత పదవుల్లో ఉన్నవారు ఇలా నిబంధనలకు తూట్లు పొడిస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.

విశాఖ కరోనా కేసుల లెక్కపై భిన్నాభిప్రాయాలు.. కావాలనే దాస్తున్నారా?

ఏపీ కొత్త రాజధానిగా ప్రభుత్వం ఎంపిక చేసిన విశాఖపట్నంలో పది రోజులుగా ఒక్క కొత్త కరోనా కేసు కూడా నమోదు కాలేదంటే నమ్మగలరా ? అవును ఇదే నిజమంటోంది వైసీపీ సర్కారు. అంతర్జాతీయ విమానాశ్రయం కలిగిన విశాఖపట్నంలోనే కరోనా తొలి నాళ్లలో కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కూడా నమోదవుతూనే ఉన్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం ఇప్పటివరకూ సాగర తీరంలో నమోదైన కేసుల సంఖ్య 20 మాత్రమే. అందులోనూ 10 మంది ఇప్పటికే చికిత్స పూర్తి చేసుకుని ఇళ్లకు వెళ్లిపోయారు. మరో పది మంది మాత్రమే ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స తీసుకుంటున్నారు. రేపోమాపో వీరిని కూడా విడుదల చేసే అవకాశముంది.  విశాఖపట్నంలో కొత్త రాజధాని రాబోతున్న నేపథ్యంలో అంత కంటే ముందే వచ్చేసిన కరోనా వైరస్ ప్రభావాన్ని ఎలా తగ్గించాలా అని ఏపీ ప్రభుత్వం ఆలోచించని రోజు లేదు. ఇప్పటికే అక్కడ విమ్స్ ప్రత్యేక కోవిడ్ 19 ఆస్పత్రితో పాటు క్వారంటైన్ చర్యలు కూడా ఘనంగా సాగుతున్నాయి. దీంతో అక్కడ నిత్యం ఒక్క కొత్త కేసు కూడా నమోదు కావడం లేదు. ఇదీ వైసీపీ ప్రభుత్వ వాదన. కానీ అక్కడ పరిస్ధితి అంత గొప్పగా ఉందా అంటే అవునని కచ్చితంగా చెప్పలేని పరిస్దితి. నిన్నటికి నిన్న కేజీహెచ్ లో పేషెంట్లకు కరోనా చికిత్స అందిస్తున్న ఐదుగురు నర్సులకు కోవిడ్ 19 లక్షణాలు కనిపించాయి. వీరికి నిబంధనల ప్రకారం రోజువారీ డ్యూటీలు చేయించాల్సి ఉండగా, అదనపు గంటలతో పాటు అదనపు రోజుల్లోనూ సేవలకు వాడుకుంటున్నారు. దింతో వీరికి కోవిడ్ 18 లక్షణాలు కనిపించినట్లు గుర్తించారు. పని చేయకపోతే ఉద్యోగాలు పోతాయన్న భయంతో నర్సులు రోజువారీ విధులకు హాజరవుతూ కరోనా బారిన పడినట్లు స్ధానికంగా ప్రచారం జరుగుతోంది. ఇదే కోవలో విశాఖ జిల్లాలోని ఇతర ప్రాంతాల్లోనూ కరోనా వైరస్ లక్షణాలతో జనం ఆస్పత్రుల్లో, క్వారంటైన్ సెంటర్లలో చికిత్స పొందుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఎక్కడా కొత్త కేసే నమోదు కాలేదని చెబుతోంది. ఇదే అంశంపై ఇవాళ మాట్లాడిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సైతం ప్రభుత్వ లెక్కలపై అనుమానాలు ఉన్నాయని స్పష్టం చేశారు. త్వరలో విశాఖకు రాజధానిని తరలించాలని భావిస్తున్న ప్రభుత్వం కావాలనే కరోనా ప్రభావాన్ని తక్కువ చేసి చూపుతోందన్న అనుమానాలను వ్యక్తం చేశారు. స్ధానికంగా జరుగుతున్న ఇతర పరిణామాలను బట్టి చూసినా ప్రభుత్వ వాదనపై అనుమానాలు తప్పడం లేదు. కానీ రాష్ట్రంలోనే కరోనా లేదని చెప్పే ప్రయత్నం చేసిన ప్రభుత్వం ఆ తర్వాత నియంత్రణ చర్యలకు దిగినట్లు.. విశాఖలోనూ పరిస్ధితి అదుపు తప్పితే అప్పుడు వాస్తవాలు ఒప్పుకోక తప్పదనే వాదన వినిపిస్తోంది. 

కన్నా లక్ష్మీ నారాయణ ఏపీ లో లేరా, అంటూ బొత్స సెటైర్లు!

* విశాఖలో కరోనా రావాలని చంద్రబాబు కోరుకుంటున్నారా..?కరోనా కేసులను మేం దాస్తే.. చంద్రబాబు బయటపెట్టొచ్చుగా..? ఏంటండి ఈ మాటలు: బొత్స  * ప్రజల్లో ఆందోళన పెంచే విధంగా చంద్రబాబు కామెంట్లు చేస్తున్నారు: బొత్స  * రాయపాటి ఈరోజు ఒకటి మాట్లాడతారు...తర్వాత నా భావం అదికాదంటారు....అతనేదో ఓ భావం చెబితే మనం కరెక్ట్ గా రియాక్ట్ అవ్వచ్చు కన్నా లక్ష్మీనారాయణ ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్నారా, లేరా అనే డౌట్, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు సడెన్ గా వచ్చింది.  కరోనా పై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై  శ్వేతపత్రం ప్రకటించాలని రాష్ట్ర బీ జె పి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ డిమాండ్ చేశారనే అంశాన్ని, బొత్స ముందు ప్రస్తావించగా, ఆయన పై విధంగా స్పందించారు.  " ప్రతిరోజు కరోనా నియంత్రణ చర్యలు, ఇతర అంశాలపై ప్రభుత్వం వివరాలు ఎప్పటికప్పుడు వెల్లడి చేస్తోంది. కన్నాలక్ష్మీనారయణగారు ఈ రాష్ట్రం లో లేరా", అని మంత్రి బొత్సవ్యాఖ్యానించారు. రాష్ట్రంలో వ్యవసాయరంగం,వ్యవసాయఉత్పత్తులకు ఎటువంటి ఇబ్బందిలేకుండా మధ్దతు,గిట్టుబాటుధరలు వచ్చేవిధంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని, కరోనా లాక్ డౌన్ అంశంలో కేంద్రప్రభుత్వంతో రాష్ట్ర అధికారులు సమన్వయం చేసుకుంటూ ముందుకువెళ్తున్నారని ఆయన చెప్పారు. రాష్ట్రంలో కరోనా టెస్టుల సామర్ధ్యం పెంచుకున్నాం.ఫిబ్రవరి లో 50 మందికి కూడా టెస్ట్ లు చేసే సామర్ధ్యం లేని పరిస్దితినుంచి నేడు రోజుకు 2 వేల పైబడి నిర్ధారణ టెస్టులు నిర్వహించేలా చేయగలిగామని బొత్స పేర్కొన్నారు. పది నిమిషాల్లో టెస్టు రిజల్ట్స్ వచ్చే ఎక్విప్ మెంట్  సిద్దంగా ఉంది.లక్ష కరోనా టెస్టింగ్ కిట్లను స్పెషల్ ఫ్లైట్ లో విదేశాలనుంచి తెప్పించి అందుబాటులోకి తెచ్చామన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా వాలంటరీవ్యవస్ద ద్వారా ప్రతి ఇంట్లో ఆరోగ్యపరిస్దితులు తెలుసుకుని, కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు.  రెడ్ జోన్లలో మందులు,నిత్యావసరాలు,కూరగాయలు అందిస్తున్నాం.నిత్యం ముఖ్యమంత్రి సమీక్షచేస్తూ అధికారులకు సూచనలు చేస్తున్నారని మంత్రి చెప్పారు. ఈ రకంగా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంటే చంద్రబాబు, టీడీపీ చేసే తప్పుడు ప్రచారం బాధ కలిగిస్తోందని బొత్స వాపోయారు. " పేదల ప్రాణాలతో ఆడుకోవద్దని చంద్రబాబు అంటున్నారు.సూటిగా ఆయనను అడుగుతున్నాను. హైదరాబాదులో కూర్చొన్న చంద్రబాబుకు,ఆయన కుమారుడికి ఏపీలో ఏం జరుగుతుందో తెలియడం లేదు. మీకున్న ఛానల్స్,పత్రికలు రాజకీయకోణంలో ఆలోచన చేస్తున్నారు తప్పితే మరేం చేయడంలేదు.దేశంలో కరోనా టెస్ట్ లు అత్యధికంగా చేస్తున్న ఐదారు రాష్ట్రాలలో ఏపి ఉందా... లేదా... ఇది వాస్తవం కాదా," అని బొత్స ప్రశ్నించారు. వాస్తవాలు తెలుసుకోకుండా విమర్శలు చేయడం సరి కాదు.పరీక్షల విషయంలో ఏపీ మిగిలిన రాష్ట్రాలకంటే ముందంజలోనే ఉంది. చంద్రబాబు మాట్లాడుతున్నమాటలు దివాళాకోరు రాజకీయాలు కాదా... .ఇక్కడ పొరపాట్లు జరిగాయని చెప్పండి. లోటుపాట్లుంటే సరిదిద్దుకుంటాం.. కానీ అడ్డగోలుగా రాష్ట్రంలో ఏమీ జరగడంలేదు.. ఏం చేయడం లేదంటూ విమర్శలు చేయడం సరికాదన్నారు. విశాఖలో కరోనా పరీక్షలు చేయడం లేదని....వాస్తవాలు చెప్పడం లేదని ఎందుకంటే.... రాజధానిని అక్కడకు తరలిస్తారని, ఆ ఎఫెక్ట్ పడుతుందనే దిశగా టీడీపీ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.  " హైదరాబాదులో పాజిటీవ్ కేసులున్నాయని తెలంగాణ రాజధానిని మార్చేస్తారా..?...ముంబైలో పాజిటీవ్ కేసులున్నాయని మహారాష్ట్ర రాజధానిని మార్చేస్తారా..?మీకు ఆలోచన ఉందా...భాధ్యతఉందా...మీరు మనుషులా...విమర్శలు చేసే ముందు అర్ధం ఉండక్కర్లేదా..? కరోనా కేసులు దాచేస్తే.. ఎంత ప్రమాదమో మాకు తెలీదా..? ప్రతి అంశాన్ని సూక్ష్ణస్దాయిలో పరిశీలన చేసి సిఎం నిర్ణయాలు తీసుకుంటున్నారు," అని బొత్స తీవ్ర స్వరంతో చెప్పారు.  మీ నేతలకు ఏమైంది బుధ్ది....విశాఖలో రెండు మెడికల్ కాలేజీలు ఉన్నాయి.పెద్ద పెద్ద ఆస్పత్రులు పది ఉన్నాయి.అక్కడ ఉన్నవాటిని స్టాండ్ బైలో పెట్టాం.అత్యవసరపరిస్థితులు వచ్చినా తట్టుకునేవిధంగా కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకుందని కూడా మంత్రి వివరించారు. పేషంట్లకు ఎలా చికిత్స అందించాలి.ఎంతమంది డాక్టర్లు ఉండాలి అనే ఇతర అంశాలను సైతం పరిగణనలోనికి తీసుకుని ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. శాంపిల్ లెక్కలు చెబుతుంటే ఈ లెక్కలకు ఆ లెక్కలకు పొంతనలేదంటూ మాట్లాడుతున్నారు.ఇదేమైనా ఆర్దికలెక్కలా...ఏ ఒక్కరికైనా సరే ఆరోగ్యానికి సంబంధించిగాని,క్వారంటైన్ సెంటర్లలో ఇబ్బందులు ఉంటే అవి మాకు చెప్పండని కూడా బొత్స సూచించారు.

విపత్తు సమయంలో ఏపీ సీఎం ముందుచూపు

* బీమాలో ప్రభుత్వం వాటా వెంటనే చెల్లింపు * రూ. 400 కోట్ల బీమా చెల్లింపునకు జగన్ నిర్ణయం * గత ఏడాది నవంబర్‌ నుంచి క్లెయిమ్‌లను పరిష్కరించని ఎల్‌ఐసీ * ఇప్పటికే పలుమార్లు ప్రధాన మంత్రి సీఎం లేఖలు * ప్రధానమంత్రి నుంచి ఎల్‌ఐసీకి లేఖ * అయినా పరిష్కారానికి నోచుకోని బీమా క్లెయిములు * దీనికోసం పోరాటం కొనసాగిస్తూనే ప్రభుత్వ వాటాను నేరుగా బీమాదారులకు చెల్లించాలని సీఎం నిర్ణయం * రేపటి నుంచి (శనివారం) చెల్లింపులకు నిర్ణయం * ఎల్‌ఐసీ ఇవ్వకుంటే.. మిగిలిన మొత్తాన్ని కూడా రాష్ట్రఖజానానుంచే ఇవ్వాలని సీఎం ఆదేశం విపత్తు సమయంలో  ఏపీ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. బీమా క్లెయిములు ఎల్‌ఐసీ మంజూరుచేయకున్నా ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన వాటాను వెంటనే మంజూరు చేయాలని ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ నిర్ణయించారు. గడచిన నవంబర్‌ నుంచి పరిష్కారం కాని క్లెయిముల కుటుంబాలకు వెంటనే చెల్లింపులు చేయాలని ఆదేశించారు. ఈమేరకు శనివారం ( రేపటి ) నుంచి డబ్బులను ఆయా కుటుంబాలకు అందించడానికి అధికారులు ప్రయత్నాలు ముమ్మరంచేశారు. ఈఎస్‌ఐ, పీఎఫ్‌ లాంటి సదుపాయాల్లేని వారు, కూలిపనులు చేసుకునేవారు, చిన్న  జీతాలతో నెట్టుకు వస్తున్న వారు, చిన్నచిన్న పనులు చేసుకునేవారు  సహజమరణం చెందినా, లేదా ప్రమాదవశాత్తూ మరణించినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఎల్‌ఐసీ కలిసి బీమాను అందించేవి. వయస్సుల వారీగా, సహజ మరణానికి ఒక తరహా బీమా, ప్రమాదవశాత్తూ మరణిస్తే మరో రకమైన బీమాను చెల్లించేవి. అయితే గడచిన నవంబర్‌ నుంచి ఈ క్లెయిములు పరిష్కారం నిలిచిపోయింది. ఈ అంశంపై వెంటనే దృష్టిపెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి  4 సార్లు లేఖ రాశారు. ప్రధాని మోదీకూడా ఎల్‌ఐసీకి లేఖరాశారు. అయినా సరే ఇప్పటివరకూ క్లెయిమ్‌లను మంజూరుచేయలేదు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. సహజ మరణాలవల్లో, ప్రమాదాల వల్లో పెద్ద దిక్కును కోల్పోయిన ఆయా కుటుంబాలకు అండగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. క్లెయిమ్‌ల మంజూరు కోసం పోరాటం చేస్తూనే, దానితో ఆగిపోకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటా సుమారు రూ. 400 కోట్లు ఇవ్వాలని నిర్ణయించారు.  ఒకవేళ బీమా సంస్థ తాను ఇవ్వాల్సిన దాన్ని చెల్లించకున్నా.., బీమా సంస్థ ఇవ్వాల్సిన మొత్తాన్నికూడా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచే చెల్లించాలని సీఎం  నిర్ణయించారు. కరోనా లాంటి విపత్తు నెలకొన్న పరిస్థితుల్లో, ప్రభుత్వం ఆదాయం పడిపోయిన సమయంలోకూడా ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు.

దీక్షా రాజ‌కీయాలతో వేడిపుట్టిస్తున్న నేత‌లు!

ఓ వైపు కరోనా కేసులు విప‌రీతంగా పెరిగిపోతున్నాయి. మ‌రో వైపు రాజ‌కీయ నాయ‌కులు రాజ‌కీయాలు చేయ‌డానికి కారణాలు వెతుక్కుంటున్నారు. ముఖ్యంగా విపక్ష టీడీపీ, సీపీఐ పార్టీల నేతలు కరోనా సాయం పేరిట ఎవరి ఇళ్ళలో వారు ధర్నాలు, దీక్షలంటూ కూర్చుని ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజకీయాలను రక్తికట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. క‌రోనా స‌మ‌యంలోనూ రాజకీయ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ ప్ర‌చారం చేసుకుంటూ బిజీగా గ‌డ‌ప‌డానికే ఏపీ నేత‌లు ఉత్సాహం చూపుతున్నారు. వీరి నినాదం ఒక్క‌టే పేద‌ల‌కు ఆర్థిక స‌హాయం చేయాలి. క‌రోనాను వెంట‌నే నియంత్రించాలి. ఇదే రాజ‌కీయం. విశాఖ, గుంటూరు, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో టీడీపీ, సీపీఐ నేతలు దీక్షలు నిర్వహించారు. వీరిలో కొందరు పేదలకు కరోనా సాయం కింద 5 వేల నుంచి 10 వేల రూపాయల దాకా ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేస్తే మరికొందరు అఖిల పక్ష సమావేశాలు నిర్వహించి, కరోనా నియంత్రణ చర్యలను వేగవంతం చేయాలని విఙ్ఞప్తి చేశారు. ఆర్థిక సాయం పేరిట నిరాహార దీక్షలకు దిగుతున్నారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా నాగ జగదీశ్వర రావు తన ఇంట్లోనే 12 గంటలపాటు నిరాహార దీక్ష చేశారు. రేషన్ కార్డు ఉన్నా, లేకపోయినా పేదలందరికీ 5000 రూపాయలు ఇవ్వాలని, అన్నా క్యాంటీన్లు తెరిచి పేదలకు టిఫిన్, భోజనం అందించాలని, కరోనా వైరస్‌పై పోరాడుతున్న డాక్టర్లు, నర్సులు, పోలీసులు, ఇతర అధికారులందరికీ నాణ్యమైన రక్షణ కిట్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. క్వారెంటైన్ పీరియడ్ పూర్తి చేసిన ప్రతి ఒక్క పేదకు 10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. విజయవాడ సీపీఐ కార్యాలయంలో ఆ పార్టీ నేతలు ముప్పాళ్ళ నాగేశ్వరరావు, జంగాల అజయ్, మాల్యాద్రి నిరాహారదీక్షకు కూర్చున్నారు. లాక్ డౌన్ నేపద్యంలో ఒక్కో పేదవాడికి 10 వేలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ దీక్షలను ప్రారంభించిన ఏపీ సీపీఐ కార్యదర్శి రామకృష్ణ వీరి దీక్షలను ప్రారంభించారు. లాక్ డౌన్ కారణంగా ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, జాతీయ స్థాయిలో మోదీ అందరితో మాట్లాడుతూ కరోనా నియంత్రణ చర్యలను తీసుకుంటుంటే.. ఏపీలో జగన్ ప్రభుత్వం ఒంటెద్దుపోకడలకు పోతోందని రామకృష్ణ విమర్శించారు.

భారీగా తగ్గిన బంగారం డిమాండ్!

భార‌త్‌లో ఆభరణాలకు డిమాండ్ ఎక్కువ. అందుకే ప్ర‌తి ఏడాది దాదాపు 800 నుండి 900 టన్నుల బంగారాన్ని భార‌త్ దిగుమతి చేసుకుంటుంది. లాక్ డౌన్ కారణంగా పసిడి వినియోగం తగ్గింది. దాంతో జనవరి-మార్చి క్వార్టర్‌లో బంగారం దిగుమతులు 55% తగ్గాయి. ఈ ఏడాది మన దేశంలో పసిడి వినియోగం గత ఏడాదితో పోలిస్తే 50% తగ్గనుందని ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యువెల్లరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్ తెలిపారు. గత ఏడాది 690.4 టన్నుల పసిడి వినిమయం ఉండగా, ఈసారి వినియోగం మూడు దశాబ్దాల కనిష్ఠ స్థాయికి చేరుకోవచ్చునని అంచనా వేస్తున్నారు. వినియోగం 1991 నాటి 350 టన్నుల నుండి 400 టన్నుల మధ్య పడిపోవచ్చునని అంచనా వేస్తున్నారు. పండుగలు, పెళ్లిళ్ల సీజన్ సమయంలో లాక్ డొన్ కొనసాగుతోంది. ప్రస్తుతం బంగారం కొనలేని పరిస్థితులు. బంగారానికి కీలకమైన ఇలాంటి సీజన్‌లో లాక్ డౌన్ ఉండటంతో కొనుగోళ్లు క్షీణించాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంలో జెమ్స్ అండ్ జ్యువెల్లరీ ఎగుమతులు 11 శాతం పడిపోయి 35.8 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయ‌ని ఆల్ ఇండియా జెమ్ అండ్ జువెలరీ కౌన్సిల్ చైర్మన్ అనంత పద్మనాభ‌న్ తెలిపారు.

6,000 కోట్ల ఆదాయం కోల్పోయిన ఏపీ సర్కార్

కరోనా వైరస్ ప్రభావం ఆంధ్ర ప్రదేశ్ ఆదాయానికి భారీగా గండి కొట్టింది. ఆబ్కారీ శాఖలో రూ.1500 కోట్లు, వాణిజ్యశాఖలో రూ.4500 కోట్ల రూపాయల ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోయింది. అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అబ్కారీ వాణిజ్య పన్నుల శాఖామాత్యులు కె.నారాయణస్వామి ఈ విషయాలను వెల్లడించారు. ఆదాయం కోల్పోయినప్పటికీ, తమ ప్రధమ ప్రాధాన్యం ప్రజారోగ్యమేనని ఆయన స్పష్టం చేశారు.  లాక్ డౌన్ సమయంలో చాలా చోట్ల బార్లకు సంబంధించిన స్టాక్ ను బయట అధికరేట్లకు అమ్ముతున్నారన్న వార్తల నేపథ్యంలో అన్ని బార్లలో, షాపుల్లో స్టాక్ ను తనిఖీ విస్తృతం చేయాలని దిశానిర్ధేశం చేశారు. ఎక్కడైనా అవకతవకలు జరిగినట్లు తన దృష్టికి వస్తే చర్యలకు ఆదేశిస్తామన్నారు. నాటుసారా, ఎన్డీపీఎల్ పై ప్రత్యేక దాడులు నిర్వహించే దిశగా సరిహద్దు ప్రాంతాల్లో నిఘా పెంచాలని ఆదేశించారు.   లాక్ డౌన్ సమయంలో 2791 కేసులు, 2849 మంది వ్యక్తులను అరెస్ట్ చేశామని అధికారులు తెలిపారు. సుమారు 22 వేల లీటర్ల ఐడీని సీజ్ చేశామని వెల్లడించారు. 2100 కేసులు ఐఎమ్ఎల్, 1500 కేసులు బీర్లు, 1457 కేసులు ఎన్డీపీఎల్ సీజ్ చేశామన్నారు. అదే విధంగా 665 వెహికిల్స్ ను సీజ్ చేశామని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ షాపుల్లో సీసీ కెమెరాలు పెట్టాలని సూచించామన్నారు. ఐడీని నియంత్రించేందుకు పీడీ కేసులు కూడా పెట్టమని చెప్పామన్నారు. బార్లలో అవకతవకలు జరిగితే బార్ లైసెన్స్ రద్దు చేయడానికైనా వెనకాడబోమన్నారు. అదే విధంగా బైండ్ ఓవర్ అమౌంట్ ను పెంచామని చెప్పామన్నారు.  బార్లలో దొంగతనంగా మద్యం అమ్ముతున్నారని వచ్చిన కథనాల్లో వాస్తవం ఉందని, తమ దృష్టికి రాగానే వెంటనే వాటిపై చర్యలు తీసుకున్నామన్నారు. ఎక్సైజ్, రెవెన్యూ శాఖలు కలిసి విచారణ చేపడుతున్నామన్నారు. ఇప్పటికే ఒక సీఐని, ముగ్గురు ఎస్సైలను, ఒక కానిస్టేబుల్ ను సస్పెండ్ చేశామని వివరించారు. శాఖాపరమైన విచారణ చేసిన అనంతరం అవకతవకలకు పాల్పడినట్లు తమ దృష్టికి వస్తే ఉద్యోగాలు తొలగించడానికైనా వెనకాడబోమని హెచ్చరించారు.

కువైట్ క్షమాభిక్షతో లాభ‌ప‌డ‌నున్న 40 వేల మంది భార‌తీయులు!

కువైట్‌లో 40 వేల మంది భార‌తీయులున్నారు. వీరిలో 25 వేల మంది వ‌ద్ద ఇండియ‌న్ పాస్‌పోర్ట్ లేదు. వీరికి ఎంబ‌సీ ద్వారా తాత్కాలిక పాస్‌పోర్ట్, ఎమ‌ర్జ‌న్సీ స‌ర్టిఫికెట్ ఇస్తున్నారు. దీని కోసం కువైట్ ఐదు దీనార్లు అంటే మ‌న ఇండియాకు చెందిన 1,233 రూపాయ‌లు వ‌సూలు చేయాల‌ని నిర్ణ‌యించారు. అయితే కేంద్ర విదేశాంగ స‌హాయ మంత్రి వి.ముర‌ళీధ‌ర‌న్ ట్వీట్ చేస్తూ ఈ ఫీజును ర‌ద్దుచేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. కువైట్ ప్ర‌క‌టించిన క్ష‌మాభిక్ష ద్వారా 40 వేల మంది భార‌తీయుల‌కు ప్ర‌యోజ‌నం చేకూర‌నుంది. అయితే ఇందులో 10 వేల మంది వ‌ర‌కు తెలుగువారు వున్న‌ట్లు అక్క‌డి తెలుగు సంఘాలు తెలుపుతున్నాయి. ఎలాంటి జరీమానాలూ లేకుండా దేశం విడిచి వెళ్ళేందుకు వీలుగా కువైట్‌ ప్రభుత్వం క్షమాభిక్షను ప్ర‌క‌టించింది. అయితే కువైట్‌ ప్రభుత్వం ప్రకటించిన క్షమాభిక్షను దక్కించుకునేందుకు పెద్దయెత్తున భార‌తీయులు లైన్ల‌లో నిల‌బ‌డ్డారు. ఫర్వానియా మరయు జిలీబ్‌ ప్రాంతాల్లో రెండు క్షమాభిక్ష కేంద్రాల్ని భారతీయుల కోసం మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌ ఏర్పాటు చేసింది. ఏప్రిల్‌ 20 వరకు క్షమాభిక్ష అభ్యర్థనల్ని ఈ సెంటర్స్‌ స్వీకరిస్తాయి. ఉదయం 8 గంటల నంచి 2 గంటల వరకు ఇందుకు అనుమతినిస్తున్నారు. పురుషులు: 1. ఫర్వానియా గవర్నరేట్‌ - ఫర్వానియా ప్రైమరీ స్కూల్‌ - గర్ల్స్‌, బ్లాక్‌ 1, స్ట్రీట్‌ 76 2. జిలీబ్‌ అల్‌ షుయోఖ్‌, నయీమ్ బిన్‌ మసౌద్‌ స్కూల్‌ - బాయ్స్‌, బ్లాక్‌ 4, స్ట్రీట్‌ 250 మహిళలు: 1. ఫర్వానియా గవర్నరేట్‌ - అల్‌ ముథాన్నా ప్రైమరీ స్కూల్‌ - బాయ్స్‌, బ్లాక్‌ 1, స్ట్రీట్‌ 122 2. జిలీబ్‌ అల్‌ షుయోక్‌, రుఫైదా అల్‌ అస్లామియా - గర్ల్స్‌, బ్లాక్‌ 4, స్ట్రీట్‌ 200 చెల్లుబాటయ్యే పాస్‌పోర్టులు వున్న భారతీయులు, ఆయా కేంద్రాల్ని బ్యాగేజ్‌తో సందర్శించాల్సి వుంటుంది. అక్కడ ఏర్పాటు చేసే షెల్టర్స్‌లో తదుపరి ఇన్‌స్ట్రక్షన్స్‌ వరకు వుండేందుకు వీలుగా వెళ్ళాల్సి వుంటుందని ఇండియన్‌ ఎంబసీ పేర్కొంది. వాలీడ్‌ డాక్యుమెంట్స్‌ లేనివారు (మహిళలు, పురుషులు), ఫర్వానియా ప్రైమరీ స్కూల్‌ - గర్ల్స్‌, బ్లాక్‌ 1, స్ట్రీట్‌ 76 వద్ద కేంద్రాన్ని సందర్శించాల్సి వుంటుంది బయో మెట్రిక్‌ ఐడెంటిఫికేషన్‌ కోసం. ఇలాంటివారు ఎలాంటి బ్యాగేజీ తీసుకురావాల్సిన అవసరం వుండదు. వారికి ప్రస్తుతం అక్కడ ఎలాంటి షెల్టర్‌ ఏర్పాటు చేయరు. వాలంటీర్ల ద్వారా ఇసి కోసం దరఖాస్తు చేసుకున్నవారు పై కేంద్రాల్ని సందర్శించాల్సిన అవసరం లేదు. ఇసి పూర్తయ్యాక, దరఖాస్తుదారుల్ని సంబంధిత వాలంటీర్లే సంప్రదిస్తారు. జ‌న‌ర‌ల్‌గా గ‌ల్ఫ్ దేశాల్లో ప్ర‌త్యేక ప‌రిస్థితుల్లోనే క్ష‌మాభిక్ష ప్ర‌క‌టిస్తారు. స‌డ‌న్‌గా కువైట్ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం చాలా మంది తెలుగువాళ్ళ‌ల్లో ఆంధ్ర‌కు చెందిన వారే కువైట్‌లో ఎక్కువ‌గా వున్నాట్లు తెలుగుసంఘాలు తెలుపుతున్నారు.

మోదీకే ఎదురెళ్తున్న కేసీఆర్!

కేంద్రం తాజాగా విడుదల చేసిన లాక్ డౌన్ కు సంబంధించిన మార్గదర్శకాలను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయకూడదు అన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది . కెసిఆర్ ఈనెల మొదటిలోనే తెలంగాణలో కేసుల సంఖ్య తగ్గిపోతుంది అని అంచనా వేశారు. అయితే ఢిల్లీ జమాత్ సంఘటన తర్వాత అంచనాలకు భిన్నంగా హైదరాబాద్ తో పాటు మరిన్ని జిల్లాల్లో ఎక్కువ మొత్తంలో పాజిటివ్ కేసులు తెర మీదకి వచ్చాయి. నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలు మరియు లాక్ డౌన్ మినహాయింపులను తెలంగాణలో అమలు చేయకూడదని కేసీఆర్ భావిస్తున్నారు. ఇప్పటికే భారత ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా క్షీణించిన పరిస్థితిలో కేంద్ర ప్ర‌భుత్వం వైరస్ ప్రభావం లేని ప్రాంతాల్లో ఏప్రిల్ 20 వ తేదీన లాక్ డౌన్ నిబంధనలను పాక్షికంగా సడలిస్తున్నామంటూ మార్గదర్శకాల‌ను జారీచేసింది. ఇప్పటికే అత్యవసర సేవల కు మొదటి నుండి లాక్ డౌన్ కు మినహాయింపులు ఇవ్వగా ఇప్పుడు దీనికి తోడుగా మరిన్ని సేవలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నంలో కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాలు కొందరిలో హర్షం వ్యక్తం చేశాయి . అయితే ఈ నెల 20 నుండి అమల్లోకి రానున్న ఈ మార్గదర్శకాలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు పెద్దగా రుచించలేదు. అయితే ప్ర‌ధాని మోడీ తో సంబంధం లేకుండా తెలంగాణతో సహా మరో నాలుగు రాష్ట్రాలు వచ్చే నెల 30 వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తున్న‌ట్లు ప్రకటించుకున్నారు. ఆ త‌రువాత ప్ర‌ధాని మే 3 వ‌ర‌కు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

త్వ‌ర‌లో క‌రోనా స‌హ‌జ స్వ‌భావాన్ని కోల్పోతుంది!

ప్రస్తుతం కాలసర్పదోషం ప్రపంచాన్ని వెంటాడుతోంది. గ్రహ పరిస్థితుల కారణంగా కరోనా కంట్రోల్ కావడం లేదు. మే 5 తర్వాత పరిస్థితి అదుపులోకి వస్తుందని విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి శుభ‌వార్త చెప్పారు. ఈ వైరస్ ప్రభావం సంవత్సరాల తరబడి ఉండదని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. కరోనాతో మ‌న‌ దేశానికి అంతగా చేటు జరగదని స్వామీజీ అన్నారు. కరోనా వైర‌స్ గురించి నైరాశ్యం వద్దు. మ‌న దేశం ఇలాంటి ఎన్నో విపత్కర పరిస్థితులను చూసిందని స్వామీజీ అన్నారు. ఏప్రిల్ 24 నుంచి దుష్ట గ్రహాల ప్రభావం తగ్గుముఖం పడుతుంది. మే 5 తర్వాత పరిస్థితి అదుపులోకి వస్తుందని స్వరూపానందేంద్ర ఆశాభావం వ్య‌క్తం చేశారు.. ఈ కరోనా వైరస్ ప్రమాదకరమే అయినా భగవంతుని కృపతో దాని ప్రభావం తగ్గుతుందని స్వామీ చెప్పారు. విశాఖ శారదాపీఠంలో రాజశ్యామల అమ్మవారి ఉపాసన చేస్తున్నామని...కరోనా ప్రభావాన్ని నివారించేందుకు జపాలు, హోమాలు, యజ్ఞ యాగాదులు నిర్వహించామని స్వామి తెలిపారు. ఈ సమయంలో భగవంతుని నామస్మరణే ప్ర‌జ‌ల్ని కాపాడుతోంది. అదే రక్షణ. లాక్ డౌన్ సమయంలో ఆధ్యాత్మిక జీవితాన్ని గడపండి. పిల్లల్లో ఆధ్యాత్మిక చింతన పెంచండి అని స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి పిలుపునిచ్చారు.

లాక్ డౌన్ ఎత్తేసే వరకూ అన్న ప్రసాదం అందిస్తాం: టీటీడీ చైర్మన్

* వెంటిలేటర్లు వెంటనే తెప్పించండి * రెండు రోజుల్లో 500 బెడ్లు సిద్ధం కావాలి * లాక్ డౌన్ ఎత్తేసే వరకూ అన్న ప్రసాదం అందిస్తాం * కోవిడ్  ఆసుపత్రిని పరిశీలించిన టీటీడీ ఛైర్మన్  వైవీ.సుబ్బారెడ్డి కోవిడ్ బాధితుల చికిత్స కోసం కేటాయించిన శ్రీ పద్మావతి వైద్య కళాశాల ఆసుపత్రిలో రెండు రోజుల్లో వెంటిలేటర్లతో సహా మొత్తం 500 బెడ్లు సిద్ధం చేయాలని టీటీడీ చైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి  స్విమ్స్  డైరెక్టర్, వైస్ ఛాన్సలర్ డాక్టర్ వెంగమ్మను ఆదేశించారు. ఈ విషయం గురించి ఆయన జిల్లా కలెక్టర్ భరత్ నారాయణ గుప్తాతో మాట్లాడారు. ఈ రోజు ఉదయం ఆయన కోవిడ్ ఆసుపత్రిని పరిశీలించారు. వెంటిలేటర్లు, సిబ్బందికి పీపీఈ కిట్లు, మాస్కులు, సానిటైజర్ల అందుబాటు గురించి అధికారులను ఆడిగితెలుసుకున్నారు. అనంతరం సుబ్బారెడ్డి విలేకరులతో మాట్లాడారు.                500 బెడ్లతో కోవిడ్ ఆసుపత్రి  రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశం మేరకు పద్మావతి వైద్యకళాశాల ఆసుపత్రిని కోవిడ్ ఆస్పత్రిగా ఏర్పాటు చేశామన్నారు.  ముందుగా అంచనా వేసి ముందుజాగ్రత్త చర్యగా ఇక్కడ 500 బెడ్లు ఏర్పాటు చేశామన్నారు. ఇందులో 110 వెంటిలేటర్లు , 390 బెడ్లు ఉంటాయన్నారు. ఇక్కడ వైద్య పరికరాలు, ఇతర కిట్ల కొనుగోలు కోసం టీటీడీ దాదాపు 20 కోట్లు జిల్లా కలెక్టరుకు అందించిందన్నారు.    అన్న ప్రసాదం పంపిణీ కొనసాగిస్తాం లాక్డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్న వలస కూలీలు, పేదలకు తిరుపతి, పరిసర ప్రాంతాల్లో రోజుకు 1.40 లక్షల మందికి అన్న ప్రసాదం అందిస్తున్నామన్నారు. ఇప్పటిదాకా 26 లక్షలకు పైగా ఆహార పొట్లాలు పంపిణీ చేసినట్లు ఛైర్మన్ చెప్పారు. లాక్డౌన్ ఎత్తేసే వరకూ అన్న ప్రసాదాల పంపిణీ కొనసాగిస్తామని తెలిపారు.     మూర్ఛవ్యాధి వారికి ఇంటికే మందులు స్విమ్స్ ద్వారా రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో సుమారు 250 మంది మూర్ఛ వ్యాధి రోగులకు ప్రతినెలా మూడో ఆదివారం ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. లాక్డౌన్ వల్ల వీరు ఇబ్బంది పడకుండా వారి గ్రామాలకే పీహెచ్ సీల ద్వారా మందులు పంపాలని డైరెక్టర్ వెంగమ్మను ఆదేశించారు. ఆర్ఎంఓ డాక్టర్ కోటిరెడ్డి, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్,  కోవిడ్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్లు భార్గవ్, రాంచరణ్ , ప్రజాసంబంధాల విభాగం డీడీ వెంకట్రామిరెడ్డి, పీఆర్ఓ రాజశేఖర్ పాల్గొన్నారు.

జి.20 దేశాల్లో భారత్ బెస్ట్! ఆర్బీఐ గవర్నర్

ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం నెలకొంది. అయినా భారత ఆర్థిక పరిస్థితి మిగతా దేశాల కంటే బాగుంది. ప్రపంచ వ్యాప్తంగా దేశాల వృద్ధి రేటు తిరోగమనంలో ఉంటే, G20 దేశాల్లో భారత్ ఎక్కువ వృద్ధి రేటు నమోదు చేస్తుందని IMF వెల్లడించిన‌ట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు.  ఆర్‌బిఐ భారత ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావాన్ని ఎప్పటికి అప్పుడు సమీక్షిస్తోంది.  క్వారంటైన్‌లో ఉండి సేవలు అందిస్తున్న ఉద్యోగులకు, కరోనా ఉద్యోగులకు సేవలు చేస్తున్న డాక్టర్లకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కృత‌జ్ఞ‌త‌లుతెలిపారు. 1930 నాటి సంక్షోభాన్ని ఇప్పుడు కరోనా గుర్తు చేస్తోంది. ప్రపంచ మార్కెట్లు ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి. స్థూల ఆర్థిక వ్యవస్థ క్షీణించిందని శక్తికాంత దాస్ చెప్పారు. లాక్ డౌన్ తర్వాత వ్యవస్థలోకి రూ.1.20 లక్షల కోట్లు విడుదల చేశారు. జీడీపీలో 3.2 శాతం ద్రవ్యాన్ని అందుబాటులోకి తెచ్చారు.  బ్యాంకుల్లో సరిపడా ద్రవ్యం అందుబాటులో ఉంది.  2020 ఏడాదిలో భారత వృద్ధి రేటు 1.9 శాతం ఉంటుందని ఐఎంఎఫ్ అంచనా వేసిందని శక్తికాంత దాస్ చెప్పారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో మన వృద్ధి రేటు 7.4 శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. కరోనా కారణంగా చిన్న, మధ్యతరహా పరిశ్రమలు భారీగా దెబ్బతిన్నాయని శక్తికాంత దాస్ చెప్పారు. ఎలాంటి పరిస్థితులను అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఖరీఫ్‌లో 36 శాతం ధాన్యం ఉత్పత్తి పెరిగింది. ఏప్రిల్‌లో ఆహార ఉత్పత్తుల ధరలు 2.3శాతం పెరిగాయి. ఆటోమొబైల్‌ పరిశ్రమలో ఉత్పత్తి, అమ్మకాలు తగ్గాయి. విద్యుత్‌ వినియోం బాగా తగ్గింది. బ్యాంకుల కార్యకలాపాలు సాఫీగాసాగుతున్నాయి.  లాక్‌డౌన్‌ వల్ల ప్రపంచ జీడీపీకి 9 ట్రిలియన్‌ డాలర్ల నష్టం'' అని శక్తికాంత దాస్‌ వివరించారు.