రాసుకో సాంబా.. ఆ ఐఏఎస్ చెపితే, సి.ఎం జగన్ ఎస్ అన్నట్టే...
posted on Apr 18, 2020 @ 7:46PM
* కొరివితో తల గోక్కోవటమంటే ఆ ఐ ఏ ఎస్ కు మహా సరదా !
* ఇప్పుడు సౌత్ కొరియా మోడల్ అంటూ, సి.ఎం. ముందు నాద స్వరం ....
* విభేదించిన సీనియర్ ఐ ఏ ఎస్ లు...
* చీఫ్ సెక్రెటరీ నీలం సాహ్నీ 'మౌన రాగం'
రాసుకో సాంబా... ఏపీ సర్కారు స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించి కొత్తగా షెడ్యూల్ విడుదల చేయబోతోంది.. ఇహ మనకి చేతి నిండా పనే... ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన శనివారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ అంశంపై విస్తారం గా చర్చలు నడిచినట్టు సమాచారం.. కరోనా ఉద్ధృతి మధ్య, దక్షిణ కొరియా జాతీయ అసెంబ్లీలోని 300 సీట్లకు ఎన్నికలు పూర్తి చేసుకుందనే విషయాన్ని సీఎంవో అధికారులు జగన్మోహన్ రెడ్డికి తీసుకెళ్ళినట్లు ఆంగ్ల పత్రిక పరచురించిన కథనాన్ని ఈ సమావేశంలో ఒక ఔత్సాహిక ఐ ఏ ఎస్ అధికారి ప్రస్తావించినట్టు, దానిపైన సుదీర్ఘంగా చర్చజరిగినట్టు, అయితే, ఒకరిద్దరు సీనియర్ ఐ ఏ ఎస్ అధికారులు మాత్రం ఈ సమయం లో స్థానిక ఎన్నికలకు వెళ్లడం అంత అభిలషణీయమైన నిర్ణయం కాదన్నట్టూ-అభిజ్ఞ వర్గాల భోగట్టా. అయితే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మదిని అమితంగా ఆకట్టుకున్న ఆ ఐ ఏ ఎస్ మాత్రం, శాయశక్తులా ఆ సౌత్ కొరియా విత్తనాన్ని ఆయన మెదడులో బలంగా నాటడం వల్ల, అతి త్వరలోనే స్థానిక ఎన్నికల కొత్త షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు ప్రస్ఫుటం గా కనిస్పిస్తున్నాయి. ఈ విషయం లో చీఫ్ సెక్రెటరీ నీలం సాహ్నీ మాత్రం పెదవి విప్పలేదని, కరోనా కట్టడి మాత్రమే ప్రభుత్వ ప్రాధాన్యంగా ప్రస్తుతానికి ఉండాలని ఆమె సూచించినట్టు, అందుకు ఇద్దరు రిటైర్డు ఐ ఏ ఎస్ లు మద్దతు తెలిపినట్టు వెలగపూడి సమాచారం.
మూడు రాజధానుల ప్రతిపాదనను బలంగా ఏడ్వొకేట్ చేసిన ఆ ఔత్సాహిక ఐ ఏ ఎస్ అధికారి తీసుకున్న పలు వివాదాస్పద నిర్ణయాల వల్ల , తర్వాత ప్రభుత్వం పలు సందర్భాల్లో హై కోర్టు నుంచి అక్షింతలు వేయించుకునే పరిస్థితి ఏర్పడిందని సచివాలయం వర్గాలు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నాయి. కరోనా కారణంగా ఒక పక్క ముఖ్యమంత్రి నివాసం సైతం బఫర్ జోన్ నుంచి రెడ్ జోన్ లోకి వెళ్లిన విషయాన్ని ఉటంకిస్తున్న సీనియర్ ఐ ఏ ఎస్ లు మాత్రం -స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విషయం లో దూకుడు పనికి రాదనే అభియోరాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొత్త ఎస్ఈసీగా నియమితులైన కనగరాజు నియామకంపై హైకోర్టు స్టే ఇవ్వనందున ఎస్ఈసీకి కొత్త షెడ్యూల్ ఇచ్చే సర్వాధికారాలు ఉంటాయంటూ ఆ ఔత్సాహిక ఐ ఏ ఎస్, ముఖ్యమంత్రిని మెస్మరైజ్ చేసిన తీరు చూస్తుంటే, మరో వివాదాన్ని ఏపీ సర్కార్ తొందర్లోనే కొని తెచ్చుకునేట్టు కనిపిస్తోంది.