సెప్టెంబర్ నాటికి వాక్సిన్ సిద్ధం! ఆక్స్ ఫర్డ్ వర్శిటీలో ట్రయల్స్!
posted on Apr 19, 2020 @ 1:17PM
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ విడుదల చేసిన వివరాల ప్రకారం, ప్రపంచంలో 70కి పైగా రీసెర్చ్ సంస్థలు కరోనా వాక్సిన్ తయారీ కోసం శ్రమిస్తున్నాయి. వీటిల్లో ఆక్స్ ఫర్డ్ తో పాటు మోడెర్నా, ఇన్నోవియో, కాన్సినో సంస్థలు మాత్రమే వాక్సిన్ ను క్లినికల్ ట్రయల్స్ స్థాయికి తీసుకుని వెళ్లాయి.
ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తున్న కరోనా వైరస్‌ను నియంత్రించడానికి వ్యాక్సిన్ కోసం పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ దిశగా ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల బృందం పురోగతి సాధించింది. వ్యాక్సిన్ పరిశోధనలను లీడ్ చేస్తున్న ప్రొఫెసర్ సారా గిల్బర్ట్ వచ్చే సెప్టెంబర్ నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ కోసం ప్రయత్నిస్తున్న అత్యున్నత స్థాయి శాస్త్రవేత్తల బృందానికి సారా నేతృత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం వ్యాక్సిన్ అభివృద్ధి పరిచే దశలో తాము పురోగతి సాధిస్తున్నామని తెలిపారు.
మానవులపై ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం అయ్యాయి. వైరస్ పాజిటివ్ కేసులు అధికంగా ఉన్న చోట దీన్ని పరీక్షించి ఫలితాలను బేరీజు వేస్తున్నారు. మేలో వాక్సిన్ పనితీరుపై స్పష్టమైన అవగాహన వస్తుంది.
"వాక్సిన్ ట్రయల్స్ దశలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ దశ చాలా ముఖ్యం. వచ్చే నెల రెండో వారం తరువాత లేదా చివర్లో ఈ వాక్సిన్ కారణంగా మానవ శరీరంలో కరోనా రోగ నిరోధక శక్తి పెరుగుతుందని తేలితే, నా ఉద్దేశంలో మనం సక్రమంగా నడుస్తున్నట్టే. ఆపై ఆగస్టులోనే విజయాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయి" అని ఆక్స్ ఫర్ట్ యూనివర్శిటీలో మెడిసిన్ ప్రొఫెసర్ జాన్ బెల్ తెలిపారు. వాక్సిన్ అభివృద్ధి కోసం కోట్లాది రూపాయల నిధితో యూకే బిజినెస్ సెక్రటరీ అలోక్ శర్మ ప్రకటించిన టాస్క్ ఫోర్స్ లో బెల్ కూడా సభ్యుడిగా ఉన్నారు.