ఈ మేక ధర లక్ష పైనే
posted on Jul 27, 2020 @ 7:04PM
మార్కెట్ లో అజ్మీర్ రకం మేకలు
బక్రీద్ పండుగ వచ్చిందంటే చాలు వేలసంఖ్యలో మేకలు, గొర్రెలు, పొట్టేళ్ల తలలు తెగిపడాల్సిందే. ప్రతి ఏటా హైదరాబాద్ నగరానికి బక్రీద్ సందర్బంగా వేల సంఖ్యలోనే మేకలు, గొర్రెలు , పొట్టేళ్ళు వస్తాయి. ఏడాది పాటు పెంచిన తమ మేకలను, గొర్రెలను అమ్ముకోవడానికి పట్టణం దారి పడతారు. అయితే ఇన్ని రోజుల సంగతి వేరు ఈ ఏడాది సంగతి వేరు. కరోనా కారణంగా అన్ని పండుగలు ఇంటికే పరిమితం అయ్యాయి. బంధు మిత్రులతో చేసుకునే బక్రీదు కూడా ఎలాంటి విందు లేకుండానే గడిచిపోతుందేమో అన్న దిగులు చాలామందిలో ఉంది. అయితే కొంతమంది ఆధునిక పద్ధతిలో ఆన్ లైన్ లో మేకలను, గొర్రెలను అమ్ముతున్నారు. ఢిల్లీ, ముంబాయి లాంటి పెద్ద నగరాల్లో ఆన్ లైన్ లో అమ్మకాలు బాగానే ఉన్నాయట.
బక్రీద్ సందర్భంగా హైదరాబాద్, సికింద్రాబాద్ మార్కెట్ లో అందుబాటులో ఉన్న అజ్మీర్ రకం మేక ల రేటు లక్ష రూపాయల వరకు పలుకుతుంది. వీటిని ప్రత్యేకంగా బక్రీద్ కోసమే తెప్పించారు. అమ్మో అన్ని డబ్బులా అనకండి. దాదాపు వందల కిలోల బరువు ఉండే ఈ మేకలకు మంచి డిమాండే ఉందని అమ్మకందారులు అంటున్నారు. రసాయనాలు కలవని బలమైన ఆహారం ఇవ్వడం వల్లనే ఈ మేకలు బలిష్టంగా, ఆరోగ్యంగా ఉన్నాయని అంటున్నారు. ఆర్గానిక్ ఫుడ్ వైపు మొగ్గు చూపుతున్న ప్రజలు ఈ ఆర్గానిక్ మేకలను కూడా ఎక్కువగా కొంటున్నారట.