ట్రాక్టర్ సాయం పొందిన రైతు 2009 లో ఎమ్మెల్యే గా పోటీ చేశాడు!
posted on Jul 27, 2020 @ 2:05PM
చిత్తూరు జిల్లా మదనపల్లె సమీపంలోని మహల్ రాజు పల్లెకు చెందిన ఓ రైతు కుటుంబానికి సోనూ సూద్ ట్రాక్టర్ సాయం చేసిన సంగతి తెలిసిందే. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇద్దరు ఆడపిల్లలు ఎద్దులకు బదులుగా నాగలి లాగుతూ పొలం దున్నుతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఇది చూసి చలించిపోయిన సోనూ సూద్.. 24గంటల్లోనే వారికి ట్రాక్టర్ అందించారు. దీంతో, లీడర్ల నుంచి సామాన్యల వరకు అందరూ సోనూ సూద్ ని ప్రశంసిస్తున్నారు.
అయితే, ఇప్పుడీ వ్యవహారంలో అనూహ్య ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ట్రాక్టర్ సాయం పొందిన వీరదల్లు నాగేశ్వరరావు కుటుంబం ఏటా వ్యవసాయం చేసే కుటుంబం కాదని తెలుస్తోంది. సమీప పట్టణంలో నివాసం ఉంటూ ప్రస్తుతం లాక్ డౌన్ సమయంలో ఉపశమనం కోసం ఊరికి వచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే తమకున్న పొలంలో వ్యవసాయం మొదలుపెట్టారు. పొలం దున్నడానికి ఎడ్లు లేకపోవడం గానీ, ఆర్థిక సమస్యలుండి గానీ అలా చేయలేదని, కేవలం కొత్త అనుభూతి కోసమే ఇలాంటి పని చేశారని ఆ ఊరి వాసులు చెబుతున్నారు. అయితే, ఊహించని రీతిలో మలుపు తీసుకుని ఇది సంచలనంగా మారిందని అంటున్నారు.
వీరదల్లు నాగేశ్వరరావు అనే ఆయన వ్యవసాయం చేసే వ్యక్తి కాదని.. ఉద్యోగాలు, చిన్న చిన్న వ్యాపారాలు చేశారని తెలుస్తోంది. అంతేకాదు, స్థానికంగా అంతో ఇంతో పేరున్న వ్యక్తని సమాచారం. వీరదల్లు నాగేశ్వర రావు గతంలో 2009 ఎన్నికల్లో లోక్ సత్తా పార్టీ తరపున మదనపల్లి బరిలో దిగారు. పౌర హక్కుల సంఘం ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేసారు. అలాంటి వ్యక్తిని ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న రైతుగా ఎందుకు చిత్రీకరించారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
సోనూ సూద్ లాక్ డౌన్ ప్రారంభమైన దగ్గర నుంచి ఎందరికో సాయం చేస్తున్నారు. అదే క్రమంలో ఈ వార్తకి కూడా చలించిపోయి సాయం చేశారు. కానీ ఇప్పుడు కొత్త ట్విస్ట్ వెలుగులోకి రావడంతో.. సోషల్ మీడియాలో, మీడియాలో ప్రచారం చేసిన వారిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆ సాయాన్ని అర్హులకి చెందేలా చూడాలని సామాన్యులు కోరుతున్నారు. మరోవైపు, నాగేశ్వర రావు కుటుంబం కూడా తాము ఇలా జరుగుతుందని ఊహించలేదని, ఆ ట్రాక్టర్ ని పంచాయతీకి ఇస్తామని చెప్పినట్లు తెలుస్తోంది.